Search
  • Follow NativePlanet
Share
» »ప‌ర్యాట‌కుల‌ను క‌నువిందు చేసే కోవ‌ళ‌మ్ తీరం..

ప‌ర్యాట‌కుల‌ను క‌నువిందు చేసే కోవ‌ళ‌మ్ తీరం..

ప‌ర్యాట‌కుల‌ను క‌నువిందు చేసే కోవ‌ళ‌మ్ తీరం..

కేరళ పేరు వినగానే సముద్రతీరం ఆ తీరం దాపుల్లో పచ్చనిపొలాలతో కొండలనడుమ కొబ్బరి, అరటి చెట్లు గుర్తుకొస్తాయి. ఆయుర్వేదం, చందన్ చెట్లు, సుగంధద్రవ్యాలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఈ రాష్ట్రం. ఈ ప్రాంతాన్ని పర్యాటక దృష్టితో వచ్చే సందర్శకులు సముద్రతీరాన్ని ఆస్వాదించకుండా వెళ్ళలేరు. బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్ వీటన్నింటిని వీక్షించడానికి రెండు కళ్లూ సరిపోవంటే నమ్మండి! చల్లగా పాదాలను పలకరిస్తూ దోబూచులాడే సముద్రపు కెరటాలను మనసారా తాకాలంటే కేరళలోని కోవళమ్ బీచ్ ను చూడాల్సిందే.

కోయంబత్తూరు నుంచి రాత్రి రైలు ప్రయాణం చేసి ఉదయాన్నే కేరళ చేరుకున్నాం. పచ్చని పంటపొలాలు, లెక్కలేనన్ని జలాశయాలతో ప్రకృతి ఆహ్వానం పలికిన అనుభూతి కలిగింది. రాజధాని త్రివేండ్రం, తిరువనంతపురం నుంచి సుమారు 16 కిలోమీటర్ల దూరంలోనే కోవళమ్ బీచ్ ఉంది. అక్కడికి ఏటా దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. తిరువనంతపురంలోని రైల్వేస్టేషన్లో ట్రైన్ దిగాక, అక్కడి నుంచి కోవళమ్ బీచ్ కు బస్‌లో వెళ్లడానికి సిద్ధమయ్యాం. ఆ రోడ్డంతా రద్దీగా ఉంది. ప్రయాణం మొదలయ్యాక క్రమక్రమంగా రద్దీ తగ్గుతూ వచ్చింది.

kovalam1-23-1482478454-1663581015.jpg -Properties

రోడ్డుకు ఇరువైపులా కొబ్బరిచెట్లు, అరటిచెట్లు మా బస్సునే ఫాలో అవుతున్నట్లు అనిపించింది. ఆ చెట్లు ఎక్కడా రావడం మానలేదు. అలా అరగంట ప్రయాణం తర్వాత కోవళమ్ బస్ స్టాండ్ చేరుకున్నాం. అక్కడికి కూతవేటు దూరంలో ఉన్న సముద్రం తీరానికి కాలి నడకన వెళ్ళాం. కనుచూపుమేరలో ఎగిసిపడుతూ సముద్రపు కెరటాలు కనిపించాయి. దారి మధ్యలోనే హోటల్స్, దుకాణాలు చాలా ఉన్నాయి. మేం విడిది చేయాల్సిన హోటల్ సముద్రానికి దగ్గరగానే ఉంది. మాకు కేటాయించిన రూమ్ బాల్కనీలోంచి సముద్రపు చల్లగాలిని ఆస్వాదించాం.

photo-91-175810-31-1663580996.jpg -Properties

గోవా బీచ్ కు తీసిపోదు

సమయం వృథా చేయకూడదనే నిర్ణయానికి వచ్చి, సముద్ర తీరం వైపుగా పరుగులు పెట్టాం. చెప్పులు లేకుండా కాళ్లతో సముద్రంలో నడుస్తూ ఉంటే ఆ ఆనుభూతి మాటల్లో చెప్పలేం. ఆ ఇసుక తెన్నుల మాటున దాగిన ఆ తీరపు సౌందర్యాన్ని చూడగానే నాకు గోవా బీచ్ గుర్తుకొచ్చింది. పర్యాటకులను, విదేశీయులను ఆకర్షించడంలో గోవా కంటే కేరళ ఏం తీసిపోదని ఈ బీచ్ ను చూస్తే అర్థమైపోతుంది.

వాస్తవానికి హావా బీచ్, లైట్స్ బీచ్, సముద్ర బీచ్ అని కోవళమ్ బీచ్ మూడు భాగాలుగా విభజించబడి ఉంది. హావా, లైట్ హౌస్ బీచ్ రెండూ ఎదురెదురుగానే ఉంటాయి. హోరెత్తే శబ్దాలతో, దగ్గరగా వచ్చి వెళ్తున్న అలలు మమల్ని మైమరింపజేశాయి. అక్కడి నుంచి వచ్చాక హోటల్లోనే భోజనం చేశాం. ఇక్కడ హోటల్స్ లో మీల్స్ చాలా ఖరీదనే చెప్పాలి. దానికంటే బయట తక్కువ ధరకే రుచికరమైన భోజనం దొరుకుతుందని స్థానికులే చెప్పారు.

kovalam coast

అదో విహంగ వీక్షణం!

లైట్ హౌస్ బీచ్ లోని చివర్లో టవర్ ఉంది. దానిపేరే ఈ ప్రాంతానికి లైట్ హౌస్ బీచ్‌గా పెట్టారు. తీరం ఆరంభం నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపించింది. దానికి చేరువగా అడుగులు వేసే కొలదీ ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థమవుతుంది. సందర్శకులు టవర్ పైకి వెళ్లడానికి పురాతనమైన మెట్లు ఉన్నాయి. అలా భయం భయంగా పైకి వెళ్ళాం. చివరకు చేరుకున్నాక అక్కడున్న కిటికీలగుండా సముద్రపు గాలి జోరుగా వీస్తోంది. ఆ ఉప్పుగాలి శరీరాన్ని తాకగానే భయం పటాపంచలై కేరింతలు మొదలయ్యాయి.

టవర్‌పై వీచే గాలి కారణంగా చలి ఎక్కువగా ఉంటుంది. అక్కడి గాలి తీవ్రత హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు ఉన్నంతగా అనిపిస్తుంది. 118 అడుగుల ఎత్తు ఉన్న ఈ లైట్ హౌస్ పైకి ఎక్కి కోవళమ్ బీచ్ మొత్తాన్ని వీక్షించాం. నిజంగానే అదో విహంగ వీక్షణం అనిపించింది. అలా బీచ్ అందాలు సమయం తెలియకుండా వీక్షించాం. సాయంత్రం అవ్వగానే అలల సవ్వడి మా చెవులకు వినసొంపుగా వినిపించింది. సముద్రమంతా చీకటి అల్లుకుంది. అందుకే, కేరళ రాష్ట్రంలోని పర్యటన‌లో ఈ కోవళమ్ బీచ్‌కు ప్రత్యేక స్థానం ఇవ్వాల్సిందే!!

Read more about: kerala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X