Search
  • Follow NativePlanet
Share
» »ఎండాకాలంలో దక్షిణభారత శీతల ప్రదేశాలు !!

ఎండాకాలంలో దక్షిణభారత శీతల ప్రదేశాలు !!

గ్రీష్మం ఇంకా రాకముందే వసంతం ప్రారంభంలోనే సూర్యుని ప్రతాపం ఇంత తీవ్రంగా వుంటే మున్ముందు ఈ తాపాన్ని తట్టుకునేదెలా అని జనం భీతిల్లుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా శీతల పానీయాలను సేవిస్తూ, ఎవరి తాహతుకు తగ్గట్టుగా వారు ఏసీలు, కూలర్లు పెట్టుకుని సేదదీరుతున్నారు. అయినా అవన్నీ కృత్రిమమైన ఉపశమనాలేగానీ సహజ శీతల సమీరానికి సాటిరావు కదా అటువంటి ప్రకృతి సిద్ధమైన చల్లదనంలో వేసవిని వెళ్లదీయాలంటే శీతల తీరాలకి తరలివెళ్లాల్సిందే మరి. వేసవి విడుదులుగా పేరొందిన అలాంటి ప్రదేశాలు మన సువిశాల భారతదేశంలో అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు అనేకం వున్నా ఇప్పుడు మనం దక్షిణాది ప్రాంతాల్లోని కొన్నింటిపైనే దృష్టి సారిద్దాం.

ఫ్రీ కూపన్లు: థామస్ కుక్ వద్ద హాలిడే బుకింగ్స్ 3000 రూపాయల ఆఫర్ సాధించండి

ఊటీ

ఊటీ

వేసవి విడిది అనగానే దక్షిణాది వారికి తక్షణం స్ఫురించేది ఊటీనే. ఉదక మండలం అని కూడా పిలువబడే ఈ ప్రాంతం మన పొరుగు రాష్టమ్రైన తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఉంది. ఊటీకి వెళ్లాలంటే ముందుగా మనం చెన్నైకి చేరుకోవాలి. చెన్నై నుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటలకు ‘బ్లూ వౌంటేన్' అనే ఎక్స్‌ప్రెస్ బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9 గంటల కల్లా మెట్టుపాలెం స్టేషన్లో దించుతుంది. ఇక అక్కడ నుంచి హిల్ రైల్వేస్‌కి చెందిన రైలును ఎక్కాలి. ఆ తర్వాత కొండ కోనల్లో నుంచి సాగే ఆ ప్రయాణం ఎంతో ఆహ్లాదంగా వుంటుంది. 14 టనె్నల్స్ గుండా దారి పొడవునా ఎన్నో సుందర దృశ్యాలను వీక్షిస్తూ ...ఆ తర్వాత గమ్యస్థానమైన ఊటీ స్టేషన్‌ను చేరుకుంటాం. దానికి ఉత్తరాన బొటానికల్ గార్డెన్ ఉంది. ఆ తోటలో నడుస్తుంటే బటన్ రోజెస్ అడుగడుగునా స్వాగతం పలుకుతాయి. తోటకు లోపల అసంఖ్యాకమైన సుమబాలలు సప్త వర్ణాల్లో దర్శనిస్తాయి. ఇక్కడ ఏటా మే 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు ‘ఫ్లవర్ షో' నిర్వహిస్తారు. ప్రసిద్ధి చెందిన ఈ పూ ప్రదర్శన చూడడానికి పర్యాటకులు విశేషంగా తరలివస్తారు. అందులోను గులాబీ పూల సోయగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రైల్వే స్టేషన్‌కు దక్షిణం వైపున మినీ గార్డెన్స్, మరో ఫర్లాంగ్ దూరంలో సరస్సు వుంటాయి. ఇక్కడ బోట్‌షైర్‌తోపాటు, గుర్రపు స్వారీ చేసే వీలుంది. ఊటీలో చూడదగ్గ మరో ప్రదేశం పైకారా వాటర్ ఫాల్స్, ట్రాలీలలో రోప్‌వే మీదుగా చేరుకునే వీలుంది. ఎంతో ఏటవాలుగా వుండే ఈ ప్రదేశంలో ప్రయాణించాలంటే గుండెను చిక్కబట్టుకోవాల్సిందే. అయితే వేసవిలోనూ బాగా చలి వుంటుంది. అందుకుతగ్గ ఏర్పాట్లతో వెళ్లాలి.

Photo Courtesy: Swaminathan

కొడైకెనాల్

కొడైకెనాల్

తమిళనాడులోనే మరో వేసవి విడిది కొడైకెనాల్. పడమటి కనుమలలో అతి ఎతె్తైన ప్రాంతంగా ఇది పేరొందింది. ఇక్కడి ఉష్ణోగ్రత 18 సెంటిగ్రేడ్ వుంటుంది. చెన్నై నుండి దాదాపు 600 కి.మీ దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని చేరుకోవడానికీ బస్సులు, రైళ్ల వంటి రవాణా సౌకర్యాలేగాక ప్రైవేట్ టాక్సీలు కూడా వుంటాయి. నక్షత్రపు ఆకారంలో వుండే సరస్సు, పుష్కరానికి ఒకసారి మాత్రమే పుష్పించే కురింజి మొక్కలు కొడైకెనాల్‌లో ప్రత్యేక ఆకర్షణ. కొండ ఆకారంలో సహజ సిద్ధంగా ఏర్పడిన రావి దిమ్మెల వరుస అబ్బుర పరుస్తుంది. కుంభకురైగా పిలువబడే చోట పర్వతారోహణం థ్రిల్లింగ్‌గా వుంటుంది. వందల ఎకరాల్లో విస్తరించి వున్న గోల్ఫ్ క్రీడా ప్రాంగణం, కొడై అందాలను దగ్గరగా వీక్షించే అవకాశాన్ని కల్పించే టెలీస్కోప్ హౌస్ కూడా ఇక్కడ వున్నాయి.

Photo Courtesy: Ahmed Mahin Fayaz

ఏర్కాడ్

ఏర్కాడ్

ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రదేశాలను సందర్శించడం కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావించే మధ్య తరగతి వారికి అందుబాటులో వుండే వేసవి విడిది ఏర్కాడ్. తమిళనాడులోని సేలంకి కేవలం ఒక గంట ప్రయాణ దూరంలో ఈ ప్రదేశం వుంది. సరస్సులు, దేవాలయాలు, సుందర వనాలు, ఎలుగుబంట్ల గుహలు ఇక్కడ చూడదగ్గవి.

Photo Courtesy: Thangaraj Kumaravel

మున్నార్

మున్నార్

కేరళ రాష్ట్రంలోని మున్నార్ హిల్ స్టేషన్ కూడా కొడైకెనాల్, ఊటీల్లాగా వేసవి విడిదిగా పేరొందింది. కొండ చరియల్లో అడుగడుగునా పచ్చని తోటలు కనువిందుచేస్తాయి. ఇక్కడ అత్తిరాపల్లి వాటర్‌ఫాల్స్ అదనపు ఆకర్షణగా వుంటుంది.

Photo Courtesy: Cropbot

హార్స్‌లీ హిల్స్

హార్స్‌లీ హిల్స్

చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి కేవలం 25 కి.మీ దూరంలో కొలువుదీరి వుంది. కొండపైన వివిధ రకాల వన్యప్రాణులు, సుందర విహంగాలు తారసపడి తన్మయత్వాన్ని కలిగిస్తాయి. ఈ పర్వత ప్రాంతంలోనే ఋషీ వ్యాలీగా ప్రసిద్ధిగాంచిన హరితవనం వుంది. సుప్రసిద్ధ తాత్వికవేత్త జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన ఆదర్శ విద్యా కేంద్రం ప్రశాంతతకు మారుపేరుగా ఇక్కడ సాక్షాత్కరిస్తుంది. తిరుపతి నుంచి కూడా ఇక్కడికి రవాణా సౌకర్యాలున్నాయి.

Photo Courtesy: suffering_socrates

అరకు వ్యాలీ

అరకు వ్యాలీ

మన రాష్ట్రంలో ప్రసిద్ధ ప్రదేశం అరకు వ్యాలీ. ఇది విశాఖ జిల్లాలో వుంది. ఇక్కడకు చేరుకోవాలంటే విశాఖపట్నం నుంచి దాదాపు 120 కి.మీ. ప్రయాణం. విశాఖ నుంచి బస్సు, రైలు వంటి రవాణా సౌకర్యాలున్నా అరకు అందాలను అడుగడుగునా అస్వాదించాలంటే రైలు ప్రయాణం తప్పని సరి. అరకు వాలీ అందమైన ప్రదేశమే కాక, అనేక కాఫీ తోటలకు కూడా పేరు గాంచినది. తాజా కాఫీ గింజల సువాసనలు వాలీ అంతా వ్యాపించి వుంటాయి. దేశం లో మొదటి సారిగా ఈ ఆర్గానిక్ కాఫీ తోటల పెంపకం సుమారు 2007 నుండి ఇక్కడ ప్రవేశ పెట్టారు.అరకు వాలీ సంవత్సవరం అంతా ఒక మోస్తరు వాతావరణం కలిగి వుంటుంది. శీతాకాలం మితమైన చలి తో వాతావరణం ఆహ్లాదం గా వుంటుంది. వేసవి లో వేడిగా వుండే ప్రదేశాల నుండి ఇక్కడకు వచ్చి చల్లదనాన్ని అనుభవిస్తారు. వాలీ సందర్శనకు శీతాకాలం అనువైనది. ఈ సమయం లో ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ వంటివి కూడా ఆచరించవచ్చు.

Photo Courtesy: Raj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X