Search
  • Follow NativePlanet
Share
» »తెలుగు రాష్ట్రాలలో చారిత్రక కట్టడాలు !!

తెలుగు రాష్ట్రాలలో చారిత్రక కట్టడాలు !!

భారత దేశాన్ని స్వాతంత్ర్యం రాక పూర్వము అనేక రాజవంశాలు పరిపాలించారు. రాజులు, రాజ్యాలు, రాజ వంశాలు భూ గర్భంలో కలిసిపోయినా ... వారి ప్రస్థావన లేక పోయినా ... వారు నిర్మించిన కట్టడాలు, కోటలు వారి జ్ఞాపకార్థం అవి ఇంకా నిలిచే వున్నాయి. అవి ఆనాటి చరిత్రను, నాగరికతను, అనాటి జనజీవనాన్ని, ఆర్థిక స్థితిగతులకు సాక్ష్యాలుగా ఇంకా మిగిలే వున్నాయి. కొన్ని పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో వుండగా మరికొన్ని ఎటువంటి ప్రోత్సాహం లేకుండా అలానే ఉన్నాయి. ఇంకొన్ని ముష్కరుల దాడిలో కొట్టుమిట్టాడుతున్నాయి ఎందుచేత అనగా అలనాటి రాజులు, రాజ్యాలు ఆనాటి సంపదను ఇంకా ఈ కోటలలో, రాజ భవనాలలో దాచి ఉంటారని, వాటిని దొంగలించటానికి ఈ చారిత్రక కట్టడాలను శిధిలపరుస్తున్నారని చరిత్రకారులు విశ్లేషిస్తున్నారు.

మన తెలుగు రాష్ట్రాలలో కోటలకు, రాజ భవనాలకు కొదువలేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఎన్నో అద్భుత కళాఖండాలు మన తెలుగు రాష్ట్రాల సొంతం. ఇక్కడున్న ప్రసిద్ధ చారిత్రక కట్టాడాలు మన దేశానికే తలమానికం. ఇవి విజ్ఞాన భాండాగరానికి, సాంస్కృతిక సంపదకు చిహ్నాలు. అంతేకాదు వీటిని పరిరక్షించడం, భావి తరాల వారికి అందించడం ఒక భారతీయ పౌరుడిగా మన నైతిక హక్కు. మన రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా చూడవలసిన చారిత్రాత్మక కట్టడాలు ఒకసారి గమనించినట్లయితే ....

ఆదిలాబాద్ కోట

ఆదిలాబాద్ కోట

అదిలాబాద్ ఒక చారిత్రక కోటని కలిగి ఉంది. ఇది ఆనాటి చారిత్రక సంఘటనలను గుర్తుకుతెస్తుంది. ఇది అదిలాబాద్ నగరానికి కూతవేటు దూరంలో కలదు. ఈ కోట కాస్త శిధిలావస్థ దశలో ఉన్నది అయినప్పటికీ ఇక్కడికి పర్యాటకులు తరచూ వస్తుంటారు. సాయంత్రం వేళలో కోట చుట్టూ ప్రక్కల ప్రజానీకం ఈ కోటను నిత్యం సందర్శిస్తుంటారు. ఈ కోటని అప్పటి బీజాపూర్ సుల్తానులు కట్టించినారు. ఇది అప్పటి బీజాపూర్ సుల్తానుల కట్టడాలకి చారిత్రక నిదర్శనం.

Photo Courtesy: Nishant88dp

ఎలగందల్ కోట

ఎలగందల్ కోట

కరీంనగర్ జిల్లాలో, జిల్లా ముఖ్య పట్టణమైన కరీంనగర్ కి 15 కి. మీ. దూరంలో ఉన్న ఎలగందల్ గ్రామంలో ఈ పురాతనమైన కోట ఉంది. ఎత్తైన కోట గోడలు, అగడ్తలు, బలమైన చెక్క తలుపులు, వంకర టింకర దారులు, రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతోంది. కాకతీయలు, బహమనీయులు, కుతుబ్‌షాహీలు, మొగలలు, ఆసఫ్‌జాహీలు దీనిని పాలించారు. మానేరు నదీతీరంలో తాటిచెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపధ్యంలో యలగందల్ కోట నిర్మించబడి ఉంది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన్ సరస్సు 1774లో జాఫర్ ఉద్దౌలా చేత నిర్మించబడింది. ఇక్కడి చారిత్రాత్మకమైన కొండపై గల కోటలో శ్రీనరసింహస్వామి ఆలయం ఉంది.

Photo Courtesy: Naveen Gujje

ఉదయగిరి కోట

ఉదయగిరి కోట

నెల్లూరు జిల్లాలో వున్న ఈ ఉదయగిరి కోట కు దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. దీనిని పల్లవులు, చోళులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, ఢిల్లీ సుల్తానులు, చివరకు ఆంగ్లేయులు కూడ ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి. పోరు మామిళ్ల శాసనాన్ని బట్టి కడప మండలమంతా ఉదయగిరి పాలనకింద వున్నట్లు తెలుస్తుంది. ముస్లిం పాలకులలో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ వాడిన ఖడ్గం ఈ నాటికీ ఉదయగిరి లో వున్నది. ఆ తర్వాత ఈ దుర్గం ఆంగ్లేయుల వశమైంది. ఆంగ్లేయుల పాలనలో డైకన్ దొర కలెక్టరు గా వున్నప్పుడు రాజ మహల్ సమీపంలో అద్దాల మేడను ఇంకా అనేక భవనాలను నిర్మించాడు.

Photo Courtesy: YVSREDDY

గండి కోట

గండి కోట

కడప జిల్లాకే తలమానికం గండికోట. మూడు వైపులా కొండలు, ఒక వైపు అగాధం. లోయలో ఒదిగి ప్రవహించే పెన్నా నది వయ్యారం అపురూప, అద్భుత దృశ్యకావ్యం ఈ గండికోట. క్రీస్తు శకం 23వ శతాబ్దంలో కాకరాజు నిర్మించిన గండికోట ప్రకృతి వైపరిత్యాలకు తట్టుకొని నేటికీ ఠీవిగా నిలబడింది. 40 అడుగుల సింహద్వారం, ఏనుగులతో సైతం ఢీకొట్టించినా చెక్కుచెదరని తలుపులు, దానికున్న ఉక్కు కవచాలు కోట పటిష్టతకు నిలువుటద్దంగా ఉన్నాయి. గండికోటలో మరో అద్భుతం ధాన్యాగారం. పది మీటర్ల ఎత్తున 12 స్తంభాలతో నిర్మించిన భారీ కట్టడం ఇది. ఈ ధాన్యాగారాన్ని నింపి.. కరువు కాటకాలు, యుద్ధం వచ్చినప్పుడు ఆహార కొరత నుంచి కాపాడుకునేవారు. కఠినమైన రాతికి శిల్పులు వెలకట్టలేని శిల్ప సంపదను భావితరాలకు అందించారు. కోటలోని ఆలయాల్లోని శిల్పకళ కాకతీయ, విజయనగర శిల్పకళాకృతులను పోలి ఉంటాయి. గండికోటను చూసేందుకు వెళ్లేవాళ్లు ఖచ్చితంగా కత్తుల కోనేరును చూస్తారు. నాటి సైన్యం యుద్ధం చేసిన తరువాత కత్తులకు అంటిన రక్తాన్ని కోనేటిలో కడిగేవారని చెప్పుకుంటారు.

Photo Courtesy: Harish Aluru

అంకాళమ్మ కోట

అంకాళమ్మ కోట

అంకాళమ్మ కోట మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న నల్లమల అడవులలో ఉంది. ఈ అటవి ప్రాంతంలో ప్రవహించే కృష్ణానది మధ్యలో ద్వీపకల్పంలా విస్తరించి ఉన్న భూభాగంలో 600 అడుగుల ఎత్తులో కొండ మీద 20 ఎకరాల స్థలంలో ఈ కోటను నిర్మించారు. ఈ కోటను 16 వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కోట శిథిలావస్థలో ఉన్నా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటంతో పర్యాటకులకు కనువిందు చేస్తూ అలరారుతూ ఉంది. ఈ కోటలో కాళికాలయం, ఆంజనేయ స్వామి విగ్రహం, శివలింగం, పురాతన బావి ఉన్నాయి. ఇక్కడి కాళికాదేవికి అంకాళమ్మ అని పేరు. ఆమె పేరు మీదుగానే ఈ కోటకు అంకాళమ్మ కోట అని పేరు వచ్చింది.

Photo Courtesy: mygoal

ఆదోని కోట

ఆదోని కోట

ఆదోని పట్టణం కూర్ణూల్ జిల్లాకి సుమారుగా 100 కి. మీ. దూరంలో ఉన్నది. సాంప్రదాయం ప్రకారం ఆదోని క్రీ.పూ.1200లో బీదరు రాజు భీంసింగ్ పాలనలో చంద్ర సేనుడు స్థాపించాడు. కోటలో 4వేల మంది ఆశ్వికదళము, 8 వేల సైనికుల పదాతిదళము ఉండేది. ఔరంగజేబు యొక్క సేనానులు గట్టి పట్టుతో ఆదోనిపై దాడిచేసి దాన్ని వశపరచుకొని బీజాపూరు సుబాలో భాగంగా మొఘల్ సామ్రాజ్యంలో కలిపారు. బసాలత్ జంగ్ ఆదోనిని రాజధానిగా చేసుకొని స్వతంత్రరాజ్యాన్ని స్థాపించే ప్రయత్నం చేశాడు. హైదర్ అలీ రెండుసార్లు ఆదోని కోటను ముట్టడించటానికి విఫలయత్నం చేశాడు. ఆ మరు సంవత్సరం చుట్టుపక్కల ప్రాంతలనన్నింటినీ నేలమట్టంచేశాడు కానీ ఆదోని కోట వశం కాలేదు. టిప్పూ సుల్తాన్ నెలరోజులపాటు కోటపై ముట్టడి చేసి వశపరచుకొని కొల్లగొట్టాడు.

Photo Courtesy: Inzexet

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజు

కొండారెడ్డి బురుజుగా కూడా పిలిచే కర్నూల్ కోట కర్నూల్ నగరంలో ఎంతో ముఖ్యమైన ప్రాంతం. విజయనగర రాజు అచ్యుత దేవరాయలు నిర్మించిన ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ అయిన ఈ కోట నగర౦ నడిబొడ్డున ఉంది. ఈ అద్భుతమైన కట్టడం లో మిగిలిన భాగం కొండ రెడ్డి బురుజు మాత్రమే. ఈ కోటలో ఉన్న కారాగారంలోనే కొండ రెడ్డి తుది శ్వాస వదలడం వలన ఈ స్తంభానికి ఆయన పేరు పెట్టారు. ఈ కోట చాల వరకు శిధిలావస్థలో ఉన్నప్పటికీ, కొన్ని భాగాలు ఇంకా బలంగా ఉన్నాయి. వీటిలో ఒకటి ఎర్ర బురుజు. ఈ బురుజు క్రింది భాగంలో రెండు చిన్న పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇవి ఎల్లమ్మ తల్లికి చెందినవి.ఈ కోటలో అనేక అధ్భుతమైన శాసనాలు,చెక్కడాలు ఉన్నాయి.

Photo Courtesy: RaghukiranBNV

గుత్తి కోట

గుత్తి కోట

అలనాటి రతనాల సీమగా పిలువబడే నేటి రాయలసీమలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన గుత్తిలోని కట్టడం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. కర్నూలు, అనంతపురము జిల్లాల సరిహద్దులో గుత్తి పట్టణానికి తూర్పు దిశలో 300 మీటర్ల ఎత్తున కొండలపై నిర్మించిన గుత్తి కోట శతాబ్దాల చరిత్రకు ప్రతీకగా, మూడు వైపులా భారీ విస్తీర్ణంలో కోటను నిర్మించారు. క్రీస్తు పూర్వం రెండువేల ఐదు నుంచి తొమ్మిది వందల వరకు గుత్తి దుర్గంలో జన నివాసాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గుర్రాలు, ఏనుగులు నీరు తాగడానికి పెద్ద బావి ఉంది. కోటలో హిందూ రాజులు నాట్యశాలగానూ, మహమ్మదీయుల మసీదుగానూ ఉపయోగించే రంగమండపం ఉంది. దుర్గంలో మంచినీటికి 101 బావులు ఏర్పాటు చేశారు.

Photo Courtesy:Imrx100

చంద్రగిరి కోట

చంద్రగిరి కోట

తిరుపతికీ చంద్రగిరి పాలకులకూ అవినాభావ సంబంధం ఉండేది. తిరుమల ఆలయంలో నైవేద్య ఘంటికా రావాన్ని విన్న తర్వాతనే చంద్రగిరి పాలకులు ఏ ఆహారాన్ని అయినా ముట్టేవారట. అలనాటి చంద్రగిరి వైభవాన్ని కనులారా చూడాలంటే... అక్కడ ప్రతిరోజూ జరిగే లైట్‌ అండ్‌ సౌండ్‌ షోకు వెళ్ళాల్సిందే. విజయ నగర రాజుల చరిత్రలో చంద్రగిరి ఓ ప్రముఖ స్థానం వహించింది. కృష్ణదేవరాయల విడిదికేంద్రంగా అలరారిని ఈ కోట... ఇప్పటికీ పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తూ... చరిత్ర సాక్ష్యంగా నిలుస్తోంది. కృష్ణదేవరాయలు తిరుమల దర్శించినప్పుడు ఇక్కడే విడిదిచేసేవారు. రాజమహల్‌లో మొదటి అంతస్తును మ్యూజియంగా మార్చారు. రెండవ అంతస్తులో సింహాసనాలతో కూడిన అప్పటి దర్బారు లేదా సభా దృశ్యాన్ని చూడచ్చు. మూడవ అంతస్తులో అప్పటి కోట నమూనా, ప్రజల జీవనవిధా నం లాంటివి ప్రదర్శన కొరకు ఉంచారు. ఇదే అంతస్తులో రాజప మ్రుఖుల గదులు కలవు.

Photo Courtesy:Priyan Nithya

పెనుగొండ కోట

పెనుగొండ కోట

పెనుగొండ కోట అనంతపురం జిల్లాలో కలదు. ఈ కోట అంతపురం - బెంగళూరు జాతీయ రహదారి మధ్యలో కలదు. ఈ కోటను మొదటగా హోయసలలు పాలించారు. శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో పెనుగొండ వారి రాజ్యానికి రెండవ రాజధానిగా వర్థిల్లినది. అదేవిదంగా వారికి ఇది వేసవి విడిదిగా కూడ సేవలందించింది. పెనుకొండ కోట బుక్కరాయుడు కట్టించిన ఈ కోటలో ఎన్నో పురాతన శాశనాలు ఉన్నాయి. ఇందులోని కట్టడాలు శత్రుదుర్బేద్యంగా ఉంటాయి. యెర్రమంచి గేటులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది. విజయనగరపు రాజులు యుధ్ధానికి వెళ్ళేముందు ఇక్కడే పూజలు జరిపేవారట. పెనుకొండ లొ 365 దేవాలయాలు కలవు. వీటిని కృష్ణదేవరాయలు నిర్మించాడు.

Photo Courtesy: Chittichanu

సిద్ధవటం కోట

సిద్ధవటం కోట

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని , కడప నుంచి భాకరాపేట మీదుగా బద్వేలు వెళ్ళే మార్గంలో పెన్నా నది ఒడ్డున సిద్ధవటం ఉంది. కడప నుంచి ఇక్కడికి 20 కి.మీ. దూరం. ఇక్కడ మధ్యయుగం నాటి కోట ఒకటి ఉంది. దక్షిణం వైపు పెన్నా నది, మిగిలిన మూడు వైపుల లోతైన అగడ్తతో శతృవులు ప్రవేశించేందుకు వీలు కాని రీతిలో ఈ కోట నిర్మించబడింది. కోటకు పడమట, తూర్పున రెండు ద్వారాలున్నాయి. ముఖద్వారం ఇరువైపులా ఆంజనేయుడు, గరుత్మంతుడు శిల్పాలు ఉన్నాయి. పశ్చిమ ద్వారం ఇరువైపులా నాట్య భంగిమలో అందమైన శిల్పాలు ఉన్నాయి. కోటలో సిద్ధవటేశ్వరస్వామి ఆలయం, ఎదురుగా నంది విగ్రహం ఉన్నాయి. తూర్పు ద్వారానికి సమీపంలో బిస్మిల్లా షావలి దర్గా ఉంది. టిప్పు సుల్తాన్ కాలంలో దీన్ని నిర్మించారు. ప్రక్కనే మసీదు ఉంది. మసీదుకు తూర్పుగా కోటగోడలో సొరంగ మార్గాన్ని ఏట్లోకి నిర్మించారు.

Photo Courtesy: Lalithamba

కొండపల్లి కోట

కొండపల్లి కోట

కొండపల్లి కోటను కొండవీటి రెడ్డి రాజ్య స్థాపకుడైన ప్రోలయ వేమారెడ్డి 14 వ శతాబ్దంలో నిర్మించినట్లు భావిస్తున్నారు. దీనిలో మూడంతస్తుల రాతి బురుజు ఉంది. ఇక్కడి విరూపాక్ష దేవాలయ సమీపంలో చక్కని పిక్నిక్‌ ప్రదేశం కలదు. కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం. రాజ్మహల్ గోడలపై ఉన్న కళాఖండాలను, నాటిని తీర్చిదిద్దిన కళాకారుల ప్రతిభను మెచ్చుకోకుండా ఉండలేం... దర్బారు నిర్వహించే రాజమహల్, రాణి, పరివారం నివాసముండే రాణీమహల్, అబ్బురపరిచే నర్తనశాల నిర్మాణం, నేటి రైతు బజార్లను తలపించే అంగడి, నేరగాళ్లను ఉంచే కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం... ఇదంతా ఒక కొండపైనే ఉన్నాయి.

Photo Courtesy:Srini vas

కొండవీడు కోట

కొండవీడు కోట

కొండవీడు, గుంటూరు జిల్లా, యడ్లపాడు మండలానికి సమీప గ్రామము. ఇక్కడ ఒక పురాతన కోట కలదు. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. కొండవీడు కోటను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత కట్టడంగా గుర్తించింది.

Photo Courtesy: Kishoresreenidhi

గుర్రంకొండ కోట

గుర్రంకొండ కోట

గుర్రంకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. గుర్రంకొండ కడప మరియు బెంగళూరు రహదారిలో గలదు. గుర్రంకొండ ఒక పర్యాటక ప్రదేశం. శత్రుదుర్భేద్యమైన ఈ కోటను గోల్కొండ సుల్తానులు కట్టించారు. నిర్మాణశైలి మొత్తం మహమ్మదీయ శైలిలో ఉన్నది. ఈ కోట 500 అడుగుల ఎత్తున ఒక గొప్ప కొండ పై ఉన్నది. టిప్పూసుల్తాను ఇక్కడ నాణేలను ముద్రించేందుకు ఒక టంకశాలను కూడా ఏర్పాటుచేశాడు. ఈ కోటలో గల 'రంగిన్ మహల్' చూపరులకు ఆకట్టుకుంటుంది.గుర్రం కొండ దుర్గానికి పడమర వైపున ఉన్న మక్బరా (పవిత్ర సమాధి) దుర్గం మొత్తం మీద సందర్శకులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. నవాబు ఉపయోగించే గుర్రపు బగ్గీ కోసం నిర్మించిన పోర్టికో నేటికీ దృఢంగా, చెక్కు చెదరకుండా ఉంది.

Photo Courtesy: vivek

బెల్లంకొండ కోట

బెల్లంకొండ కోట

గుంటూరు జిల్లాలో గుంటూరు-పొందుగల రహదారి పక్కన సత్తెనపల్లికి 19 కి మీల దూరంలో పచ్చని పరిసరాలలో అందమైన ప్రకృతి సౌందర్యంలో ఒదిగి పోయిన ఒక పల్లెటూరు బెల్లంకొండ. బెల్లంకొండ రైల్వే స్టేషను గుంటూరు మాచర్ల రైలు మార్గంలో ఉంది. కొండవీటి రెడ్డి రాజులు నిర్మించిన కోట ఈ ఊరిలోని ప్రముఖ ఆకర్షణ. దుర్గంలోని ముఖ్యమైన స్థలాలను కలుపుతూ ఒకే రాతిలో కట్టిన గోడ, వాయవ్యం లోను, నైరుతి లోను నిర్మించిన బురుజులు కోట లోని ముఖ్యాంశాలు. 1511 లో శ్రీ కృష్ణదేవ రాయలు అప్పటివరకు గజపతుల ఆధీనములో ఉన్న బెల్లంకొండ దుర్గమును స్వాధీనం చేసుకున్నాడు. విజయనగర సామ్రాజ్యము పతనమయ్యేవరకు బెల్లంకొండ రాయల పాలనలోనే ఉన్నది.

Photo Courtesy:Ignatio, C.

కోయిలకొండ కోట

కోయిలకొండ కోట

కోయిలకొండ కోట మహబూబ్ నగర్ జిల్లాలో కలదు. ఒకప్పటి ఆంధ్రరాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన 7 గిరిదుర్గాలలో ఇది ఒకటి . కొండపై వెలిసిన దుర్గం కాబట్టి కోవెలకొండ అని పేరు. కోవెల అనగా దేవాలయం. కోయిలకొండ గ్రామానికి దక్షిణ దిశలో ఎత్తయిన గుట్టపై కోటను నిర్మించారు. చరిత్ర ప్రకారం 14 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడైన అళియరామరాయలు కాలంలో వడ్డెరాజులు ఈ కోటను నిర్మించారు. తర్వాత ఈ కోట వెలమ రాజుల హస్తగతమైంది. ఈ కోటను ప్రస్తుతం కీలగుట్ట గా పిలుస్తారు. కోట చుట్టూ శ్రీరామకొండ, వీరభద్రస్వామి, వడెన్న దర్గాలు కలవు.

Photo Courtesy: koil

కౌలాస్ కోట

కౌలాస్ కోట

కౌలాస్, నిజామాబాదు జిల్లా, జుక్కల్ మండలానికి చెందిన గ్రామము. జుక్కల్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కౌలస్ కోట హైదరాబాదు నుండి 180 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి - నాందేడ్ రహదారిపై ఉన్నది. కౌలాస్ లో కాకతీయుల కాలం నాటి పురాతన కోట ఒకటుంది. నాటి పురాతన కోట ని 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. చుట్టూ దట్టమైన అడవి, క్రింద నది ఉండటంతో ఇక్కడి ప్రకృతిదృశ్యం అమెజాన్ అడవిని తలపిస్తుంది. కౌలాస్ కోటకు 57 బురుజులున్నాయి. కోట లోపల అనేక ఆలయాలు, దర్గాలు ఉన్నాయి. కోట ద్వారాలపై చెక్కిన అలంకరణలు, హృద్యంగా చెక్కబడిన హిందూ దేవతాశిల్పాలు కోట యొక్క ఆకర్షణలు. 500 మీటర్ల మేరకు విస్తరించి ఉన్న తామరపూల చెరువు మరో ఆకర్షణ.

Photo Courtesy: devanand

ఖమ్మం కోట

ఖమ్మం కోట

ఖమ్మం కోట ఖమ్మం నగరంలో కలదు. ఖమ్మం కోటను క్రీ.శ. 950 సంవత్సరంలో కాకతీయ రాజుల పాలనలో ఉన్నపుడు నిర్మాన్ని ప్రారంభించారు. అయితే, ఈ కోట వారి కాలంలో పూర్తి కాలేదు, ముసునూరి నాయక్ లు, వెలమ రాజులు ఈ కోట నిర్మాణాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. 1531 లో కుతుబ్ షాహీల పాలనలో నూతన భవంతులు, గదులతో ఈ కోట మరింత అభివృద్ది చెందింది. హిందూ, ముస్లింల నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ ఈ కోట, దీని నిర్మాణంలో ఇద్దరి శైలి, పాలకులు ప్రమేయం ప్రభావితం చేసింది. నేడు ఈ కోట ఉనికి 1000 సంవత్సరాలు పూర్తి చేసి గర్వంగా నిలబడి ఉంది. ఇది తెలంగాణ అలాగే ఖమ్మం చరిత్రలో గొప్ప స్థానాన్ని పొందిన ప్రధాన పర్యాటక ప్రదేశం.

Photo Courtesy: Shashank.u

గద్వాల కోట

గద్వాల కోట

గద్వాల కోట మహబూబ్ నగర్ జిల్లాలోని కోటలన్నిటిలోకి ప్రసిద్ధిచెందినది. ఇది గద్వాల పట్టణం నడి బొడ్డున ఉంది. ఈ కోటను రాజా పెద్ద సోమభూపాలుడు క్రీ.శ.1662లో నిర్మించాడు. ఇది వలయాకారంలో ఉన్న మట్టికోట. కోట బయటి వైపు ఎత్తైన పెద్ద పెద్ద బురుజులతో మట్టితో నిర్మించబడింది. వీటిలో మూడు ఆలయాలు చెప్పుకోదగినవి. వాటిలో ప్రధానమైనది. గద్వాల సంస్థాన ప్రభువుల ఇలవేల్పైన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం. ఇది మిగిలిన ఆలయాలకు మధ్యలో ఉండి, ఎత్తైన వేదిక మీద నిర్మించబడి ఉంది. ఈ ఆలయానికి ఇరువైపుల మరో రెండు ఆలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శివాలయం. ఈ ఆలయాలలోని శిల్పాలు ఆకట్టుకుంటాయి. ఈ మూడు అలయాలు ఒకే ఆవరణలో ఉన్నాయి. గద్వాల కోటలో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన కొండవీటి రాజా అను తెలుగు చిత్రం షూటింగ్ జరిగింది.దాదాపు నెలరోజులకు పైగా గద్వాల కోటలో సినిమా చిత్రీకరణ జరిగింది. కోట చుట్టూ ఉండిన కందకంలో, కోటలోపలి బావి దగ్గర ఫైటింగ్‌లు, కోటలోపల ఆలయ సముదాయంలో "అంగాంగ వీరాంగమే" పాట చిత్రీకరణ జరిగింది. దాదాపు సినిమా చివరి ఘట్టాలన్నీ కోటలో చిత్రీకరించబడినవే.

Photo Courtesy: Gadwal Fort

గోల్కొండ ఫోర్ట్

గోల్కొండ ఫోర్ట్

హైదరాబాద్ నగరానికి 11 కిలో మీటర్ల దూరంలో ఉన్న గొల్కండ ఫోర్ట్ లేదా గొల్ల కొండ ఫోర్ట్ ఉన్నది. 15 వ శతాబ్దంలో గోల్కొండ ఎంతో కళకళ లాడేది, కానీ ఇప్పుడు శిధిలమవుతున్న పురాతణ వైభవం మాత్రమే కనిపిస్తుంది. 1512 నుండి నగరాన్ని పాలించిన ఖుతుబ్ షా వంశీకుల చేత గోల్కొండ ఫోర్ట్ నిర్మించబడినది. ఈ ఫోర్ట్ కున్న ముఖ్యమైన లక్షణం శబ్ద లక్షణ శాస్త్రం. ఈ ఫోర్ట్ వరండాలో నిలుచుని మీరు చప్పట్లు కొడితే ఆ శబ్దం ప్రధాన రహదారి నుండి 91 మీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశానికి స్పష్టంగా వినబడుతుంది. ఒక రహస్య సొరంగ మార్గం ఈ గోల్కొండ ఫోర్ట్ ని చార్మినార్ తో కలుపుతుందని నమ్ముతారు. అయితే, ఎటువంటి ఆధారాలు ఈ సొరంగ మార్గం గురించి దొరకలేదు.

Photo Courtesy: Smkeshkamat

ఘనపురం ఖిల్లా

ఘనపురం ఖిల్లా

ఘనపురం ఖిల్లా మహబూబ్ నగర్ జిల్లాలోని గిరి దుర్గాలలో ఒకటి. ఇది వనపర్తికి సమీప మండలం మరియు కేంద్రమైన ఖిల్లాఘనపురంలో ఉంది. కాకతీయుల సామంతులు నిర్మించిన ఈ కోట ఎత్తైన రెండు కొండల మీద నిర్మించబడి చూపరులను ఆకట్టుకుంటుంది. ఈ కోటలో రాజమందిరం, మంత్రుల నివాసాలు, సైనికుల స్థావరాలు ఉన్నట్లు అక్కడి ఆధారాల ద్వారా తెలుస్తుంది. కోటలోకి ప్రవేశించడానికి వరుసగా మూడు ముఖద్వారాలు ఉన్నాయి. ప్రతి ముఖద్వారం దగ్గర కాపలా కాసే సైనికులకు గదులు నిర్మించారు. అక్కడే అతిథులు ఎవరైనా వస్తే విశ్రాంతి తీసుకోవడానికి విశ్రాంతి గదులు కూడా ఉండినట్లు తెలుస్తుంది. శత్రువులపై దాడికి ఈ కోటలో అత్యంత ఎత్తులో ఫిరంగిని ఏర్పాటుచేశారు. దీని కొరకు ప్రత్యేకంగా సైనిక విభాగం ఉండినట్లు తెలుస్తుంది.

Photo Courtesy: ghanapuram

చంద్రఘడ్ కోట

చంద్రఘడ్ కోట

మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల కు వాయువ్యాన 20 కిలోమీటర్ల దూరంలో, ఆత్మకూరు పట్టణానికి పశ్చిమాన 12 కిలోమీటర్ల దూరంలో, జూరాల ప్రాజెక్ట్ కు ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో చంద్రఘడ్ గ్రామానికి ఉత్తరదిశలో ఎత్తైన మీద రెండు అంచెలుగా ఈ కోటను నిర్మించారు. చుట్టు పక్కల పది కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ నుండి చూసినా ఈ కొండ, కొండ మీది కోట కనిపిస్తాయి. ఈ కోట మొత్తం నిర్మాణమంతా రాతితోనే ఉండటం విశేషం. ఈ నాటికి చెక్కుచెదరని రాతికట్టడం చూపరులను ఆకట్టుకుంటుంది. కోట లోపల శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయం ఉంది. అలయం చుట్టూ 8 ఊట బావులున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికీ స్వచ్ఛమైన నీటి ఊటతో తాగునీరును అందిస్తున్నాయి.

Photo Courtesy: Naidugari Jayanna

దేవరకొండ కోట

దేవరకొండ కోట

దేవరకొండ, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాలో ఒక ముఖ్య పట్టణం. ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన కోట కలదు. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశము. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉన్నది. నల్గొండ, మహబూబ్ నగర్, మిర్యాలగూడ మరియు హైదరాబాదు నుండి రోడ్డు మార్గమున ఇక్కడ చేరవచ్చును. రెండవ మాదానాయుడు కాలంలోనే దేవరకొండ దుర్గం నిర్మాణం జరిగినట్లు చారిత్రాకాదారలనుబట్టి తెలుస్తున్నది. ఐదువందల ఎకరాల పైగా విస్తీర్ణం కలిగిన ఈ కోటలో కాలువలు, బావులు, సెలయేళ్ళు, కోనేరులు అందమైన భవనాలు, ఉద్యాన వనాలు వున్నాయి. ధాన్యాగారము, సైనిక శిభిరాలు, ఆలయాలు వున్నాయి.

Photo Courtesy:Talk2experts

దోమకొండ కోట

దోమకొండ కోట

దోమకొండ ప్రధాన రహదారి నుండి 7 కిలోమీటర్ల దూరములో, కామారెడ్డి నుండి 16 కిలోమీటర్ల దూరములో ఉన్నది. దోమకొండ కుతుబ్‌షాహీలు మరియు అసఫ్‌జాహీల పాలనలో సంస్ధానముగా ఉన్నది. దోమకొండ సంస్ధానపు రెడ్డి రాజులు 18వ శతాబ్ధంలో పూర్వం కోట ఉన్న స్థలం లోనే ఈ కోటను నిర్మించారు. కోటలోన మహాదేవుని ఆలయం ఉంది. కోట చుట్టూ చదరపు మరియు వృత్తాకార బురుజులు కట్టబడినవి. కోట లోపల రెండు మహల్లు మరియు దేవాలయ ప్రాంగణము ఉన్నవి. కోటలోని శివాలయము కాకతీయ శైలిని అనుకరించి ఆగమశాస్త్ర యుక్తముగా నిర్మించబడినది. ఈ కోట తెలంగాణా ప్రాంతపు సంస్థానాల యొక్క రక్షణ కట్టడాల శైలికి ఒక మంచి ఉదాహరణ.

Photo Courtesy:Sumanth Garakarajula

ధూళికోట

ధూళికోట

ధూళికోట అనగా మట్టికోట అని అర్థం. మెగస్తనీస్‌ పేర్కొన్న ఆంధ్రుల 30 దుర్గాల్లో కోటిలింగాల ఒకటి కాగా, మరొకటి ధూళికట్ట అని తెలుస్తోంది. ఇక్కడ తొలి చారిత్రక యుగపు దిబ్బ 18 హెక్టార్ల స్థలంలో విస్తరించి, భూమి కంటే 6 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టూ 3 నుంచి 5 మీటర్ల ఎత్తున మట్టి ప్రాకారముంది. గోడల చుట్టూ కందకాలున్నాయి. కోటకు నాలుగు దిక్కులా నాలుగు ప్రధాన ద్వారాలున్నాయి. దక్షిణ ద్వారానికిరువైపులా భటుల గదులున్నాయి. ఈ ద్వారానికి ఉత్తరాన కొన్ని రాజభవనాలు, ధాన్యాగారాలు, ఇతర నిర్మాణాలు, బావులు బయటపడ్డాయి. ఈ భవనాల అరుగులను ఇటుకలతో నిర్మించారు. ప్రవేశ ద్వారాల మెట్లనూ ఇటుకలతోనే కట్టారు.

Photo Courtesy: prathap

పానగల్ కోట

పానగల్ కోట

పానగల్‌ కోట మహబూబ్ నగర్ జిల్లా లోని గిరి దుర్గాలలో ప్రముఖమైనది. వనపర్తి నుండి కొల్లాపూర్‌ కు వెళ్ళేదారిలో వనపర్తికి 30 కిలోమీటర్ల దూరంలో పానగల్ సమీపంలో ఈ కోట కనిపిస్తుంది. ఈ కోటను సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తులో, ఐదు చదరపు మైళ్ళ వైశాల్యంలో పెద్ద పెద్ద బండరాళ్ళతో ఈ కోటను నిర్మించారు. ఇది 11 వ శతాబ్దిలో కళ్యాణి చాళుక్యుల సామంతులచే నిర్మింపబడినదని అంటారు. శత్రు దుర్బేధ్యమైన ఈ కోటలో 60 దాకా బురుజులు ఉన్నాయి. ఈ కోటలో ఒకే రాతిపై పెద్ద నడబావిని తవ్వించి దానికి రామ గుండం అని పేరు పెట్టారు. రామ గుండం రాతిపై దక్షిణం వైపు రెండు జతల పాదముద్రలు ఉన్నాయి. వీటికి సీతారాముల పాదముద్రలని పేరు. కోటలో నాటి రాజులు విరామ సమయాలు గడపడానికి, సరదాగా ఊగడానికి ఒక పెద్ద ఊయలను, దానికో ఆరామాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. దీనికి ఉయ్యాల మండపం అని పేరు.

Photo Courtesy: Ylnr123

భువనగిరి కోట

భువనగిరి కోట

తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన భువనగిరి ఒక ముఖ్య పటణం. భువనగిరి లో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందినది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమదిత్య చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. భువనగిరికోట ప్రవేశద్వారం గోల్కొండకోటలోని ‘బాలాహిస్సార్' మొదటిద్వారం ఫతేదర్వాజా లాగే వుంటుంది. రెండోద్వారం గుళ్ళోని చౌకోటులెక్క వుంటుంది. మూడోద్వారం సాధారణం. నాలుగోద్వారం కూడా సామాన్యంగానే వుంది. పై ఎత్తుకి శిఖరానికి చేరినపుడు అక్కడ రాజభవనాలు, అంతఃపురం కనిపిస్తాయి. ఎత్తైనగోడలు, విశాలమైన గదులు, ఇస్లాం సంస్కృతి నిర్మాణశైలిలో వున్నాయి. పరిసరాలను పరిశీలిస్తే బారాదరికి ఉత్తరాన ఒక నల్లని నంది విగ్రహం వుంది. అంతదూరాన ఆంజనేయుని శిల్పం వుంది. రాజప్రాసాదాల కింద ఎన్నో అంతుతెలియని రహస్య శిలాగర్భ మార్గాలున్నాయి.

Photo Courtesy: Nikhilb239

మెదక్ కోట

మెదక్ కోట

మెదక్ కోట తెలంగాణ రాష్ట్రం లోని మెదక్ జిల్లా లో కలదు. ఇది రాష్ట్ర ముఖ్య పట్టనమైన హైదరాబాదు నగరానికి 100 కి.మీ దూరంలో ఉంటుంది. మెదక్ నగరానికి ఉత్తరాన మూడు వందల అడుగుల ఎత్తైన కొండపై 400 ఎకరాల్లో విస్తరించింది మెదక్ కోట. ఈ కోట సుమారు 12 వ శతాబ్దం నాటిది. ఈ కోటను కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు కాలంలో నిర్మించారని ప్రతీతి. ఈ కోటలో మూడు ముఖద్వారాలు ఉన్నాయి. వాటిలో "ప్రధాన ద్వారం", సింహద్వారం మరియు "గజ ద్వారం" . కుతుబ్ షాహి పాలకులు ఈ కోట లోపల దాన్యాగారాల గదులతో కూడిన ఒక మసీదును 17వ శతాబ్ద౦లో నిర్మించారు. ప్రస్తుతం ఈ కోటలో 17వ శతాబ్దానికి చెందిన 3.2 మీటర్ల పొడవైన ఒక ఫిరంగి ఉంది. ఈ కోట నుండి పర్యాటకులు సుందర దృశ్యాలతో బాటుగా పూర్తి పట్టణాన్ని స్పష్టంగా చూడవచ్చు.

Photo Courtesy:Fazilsajeer

రాజోలి కోట

రాజోలి కోట

రాజోలి, మహబూబ్ నగర్ జిల్లా, వడ్డేపల్లి మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము కర్నూలు జిల్లా సరిహద్దులో ఉన్నది. ఇక్కడ రాజుల కాలం నాటి కోట కలదు. ఇది రాజోళి కోట గా ప్రసిద్ధి చెందినది.

Photo Courtesy:C.Chandra Kanth Rao

వరంగల్ కోట

వరంగల్ కోట

వరంగల్ నగరంలోఅందరిని నిలువరించే ఆకర్షణలలో ఒకటి వరంగల్ కోట. దక్షిణ భారత దేశంలో శిల్ప కళకు ఉదాహరణ ఈ కోట. గణపతిదేవుడు 1199 వ సంవత్సరం లో కోట భవనం నిర్మాణం ఏర్పాటు చేసాడు మరియు 1261 వ సంవత్సరం లో అతని కుమార్తె రాణి రుద్రమ దేవి దానిని పూర్తి చేసింది. ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నది. ఈ కోట రెండు గోడలతో ఉన్న నాలుగు పెద్ద ప్రవేశ ద్వారాలను సంచి శైలిలో కలిగిఉన్నది. ఎవరైతే నిర్మాణ ఆసక్తి కలిగి ఉన్నారో, చరిత్ర మరియు పురాతన కట్టడాల మీద ఆసక్తి కలిగి ఉన్నారో ఈ కోటను సందర్శించి ఆ విజ్ఞానాన్ని పొందుతారు మరియు అన్ని వయస్సుల సందర్శకుల ఆదరణ పొందటంలో నిదర్శనంగా ఉంటుంది.

Photo Courtesy:abhinaba

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X