Search
  • Follow NativePlanet
Share
» »ఐదు న‌దుల సంగ‌మం.. పుష్ప‌గిరి క్షేత్రం!

ఐదు న‌దుల సంగ‌మం.. పుష్ప‌గిరి క్షేత్రం!

ఐదు నదులు ఒకే చోట కలిసే ప్రకృతి పలకరింపుల పర్యాటక కేంద్రం పుష్పగిరి. కడప జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఈ ప్ర‌దేశానికి ఏటా ఈ సీజన్‌లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుతం కుందు నది ప్రవహిస్తుండంతో సందర్శకులు అధికంగా తరలి వస్తున్నారు. పక్కనే ఆదినిమ్మాయిపల్లి ఆనకట్ట (డ్యాం) ఉండడం పర్యాటకులకు అదనపు ఆకర్షణ అనే చెప్పాలి.

ఐదు న‌దుల సంగ‌మం.. పుష్ప‌గిరి క్షేత్రం!

ఐదు న‌దుల సంగ‌మం.. పుష్ప‌గిరి క్షేత్రం!

ప్రకృతి అందాలు, నదీ జలాల గలగలలు, కొండల సోయగాలు స్వాగతాలు పలుకుతుంటాయి. పచ్చదనంతో నిండిన పురాతన ఆలయాల సముదాయం పుష్పగిరి పర్యాటక విశేషాలు ...

కడప జిల్లాలోని పుష్పగిరి క్షేత్రం ఈ సీజన్లో విహార విడిది కేంద్రంగా సందర్శకులకు ఆహ్వానం పలుకుతోంది. కడపకు అతి చేరువలోని ఈ ప్రదేశాన్ని చూడటానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచీ పర్యాటకులు వస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. కడప నుంచి 16 కిలోమీటర్ల దూరంలో పుష్పగిరి ఉంది. చంద్రమౌళీశ్వర లింగాలయం ఇక్కడ ప్రసిద్ధి. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమవైపు పక్కనే ఉన్న మార్గంలో వెళితే పుష్పగిరి చేరుకోవచ్చు. పుష్పగిరి వెళ్లే సందర్శకులు మధ్యలో ఆదినిమ్మాయపల్లి ఆనకట్ట (డ్యాం) చూడొచ్చు. ఇక్కడ పరవళ్లు తొక్కే కుందూ నదీజలాల మధ్య హాయిగా సేదతీరేందుకు ఎంతో అనువుగా ఉంటుంది. పుష్పగిరికి వల్లూరు నుంచి రెండు మార్గాలు ఉన్నాయి. నది ప్రవహించే సమయంలో చెన్నూరు నుంచి వస్తే నేరుగా కొండపై ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు.

చెక్కుచెదరని అలనాటి నిర్మాణ శైలి..

చెక్కుచెదరని అలనాటి నిర్మాణ శైలి..

పుష్పగిరి క్షేత్రం పుష్పగిరి గ్రామం నుంచి కిలోమీటరు దూరంలో ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రం అంటారు. నదుల కలయికను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి పర్యాటకులు కుటుంబ సమేతంగా వస్తుంటారు. కడపకు అతి సమీపంలో ఉన్నప్పటికీ ఇక్కడ సరైన విడిది, ఆహారం అందుబాటులో ఉండవు. ఎక్కువ శాతం ఈ ప్రాంతానికి వచ్చేవారు కడపలోనే వసతి ఏర్పాట్లు చేసుకుంటారు.

కొంతమంది పర్యాటకులు పుష్పగిరి గ్రామంలో ఉన్న అన్నదాన సత్రాన్ని ముందుగా సంప్రదించి, ఆహార ఏర్పాట్లు చేసుకుంటారు. పుష్పగిరి ప్రాంతాన్ని చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయల కాలంలో అభివృద్ధి చేసినట్లు చరిత్ర చెబుతోంది.

నేటికీ చెక్కుచెదరని అలనాటి నిర్మాణ శైలి ఆద్యంతం సందర్శకులను కట్టిపడేస్తుంది.

ఆధ్యాత్మిక చరిత్ర..

ఆధ్యాత్మిక చరిత్ర..

వీటితోపాటు కొండ మీద ఒకే ఆవరణలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణలోనే ఉమామహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షి మల్లేశ్వర ఆలయాలనూ చూడొచ్చు. ఇక్కడ ప్రతి అడుగులోనూ చరిత్ర తారసపడుతుంది అనడంలో సందేహం లేదు. పురాతన కట్టడాలతో అపురూపమైన రాతి శిల్పాలు క్రీస్తు పూర్వానికి చెందినవిగా చరిత్ర చెబుతోంది. ఆలయాలలో ప్రతిష్టించిన రాతి విగ్రహాలు ఎంతో నైపుణ్యతతో రూపుదిద్దారు. ఇక్కడి ప్రతి శిల్పం, ప్రతి కట్టడంలోనూ అలనాటి విశేషాలు కళ్ల ముందు కనిపించేలా రూపుదిద్దుకున్నాయి. వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలివైపుకు వెళ్ళలేం.

ఆధ్యాత్మిక చరిత్ర ఉన్నప్పటికీ ఎక్కువ శాతం పర్యాటకులు ఇక్కడి పకృతి అందాలను ఆస్వాదించేందుకు మొగ్గు చూపుతారు. ఐదు నదుల సంగమం కావటంతో నీటి పారుదల ఉంటుంది. ఆనకట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. ఆహ్లాద వాతావరణం ఉన్న పుష్పగిరి ప్రాంతాన్ని సంద‌ర్శించ‌డానికి ప్ర‌కృతి ప్రేమికుల‌తోపాటు చారిత్ర‌క క‌ట్ట‌డాల‌పై ఆస‌క్తి ఉన్న‌వారు ఈ సీజ‌న్‌లో త‌మ ప్ర‌యాణాన్ని మొద‌లుపెడ‌తారు

Read more about: kadapa puspagiri kshetra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X