Search
 • Follow NativePlanet
Share
» »ప‌ల్లె అయినా.. ప‌ట్నం అయినా.. భోగి మంట వెల‌గాల్సిందే!

ప‌ల్లె అయినా.. ప‌ట్నం అయినా.. భోగి మంట వెల‌గాల్సిందే!

ప‌ల్లె అయినా.. ప‌ట్నం అయినా.. భోగి మంట వెల‌గాల్సిందే!

అంగరంగ వైభవంగా చేసుకునే మూడు రోజుల పండగలో మొదటి రోజు భోగి మంటలతో పండుగకు స్వాగతం ప‌ల‌క‌బోతున్నాయి తెలుగు రాష్ట్రాలు. తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ ఇప్ప‌టికే వెల్లువెత్తుతోంది. భోగభాగ్యాల భోగికి మంటలతో ప్రజలు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ప‌ట్ట‌ణం, ప‌ల్లె తార‌త‌మ్యం లేకుండా జ‌రుపుకొనే ఈ పండ‌గ ప్రారంభానికి మ‌రి కొన్ని గంట‌లే స‌మ‌యం ఉంది. తెలుగు ప్ర‌జ‌ల మ‌న‌సుదోచే భోగి విశేషాల‌ను తెలుసుకుందాం.

సంక్రాంతి సంబ‌రాలకు భోగితో స్వాగతం ప‌ల‌క‌డం సంప్ర‌దాయంగా వ‌స్తోన్న ఆచారం. హైద‌రాబాద్‌లాంటి భాగ్యన‌గ‌రాల్లో అపార్ట్‌మెంట్ క‌ల్చ‌ర్‌కు అనుగుణంగా పాత ఫ‌ర్నీచ‌ర్‌తో భోగిమంట‌లు వెలిగితే, మారుమూల ప‌ల్లెల్లో ముళ్ల క‌ల‌ప‌తో భ‌గ‌భ‌గ‌మండుతుంది. ఏ ఇంటిని చూసినా రంగవల్లులు, హరిదాసు కీర్తనలతో తెలుగు ముంగిళ్లు కళకళలాడుతాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భోగిమంటలు ద‌ర్శ‌న‌మిస్తాయి. కోలాటాలు ఆడుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. పల్లె వాతావరణం, తెలుగు సంస్క్రతి సంప్రదాయాలు, సంక్రాతి సంబరాలు, జాతీ సమైక్యత, ఆయా ప్రాంతాల‌ చరిత్రను తెలియజేసేలా మహిళలు విభిన్న ఆకృతులు, రంగుల్లో ముగ్గులను తీర్చిదిద్దుతారు.

Bhogi Festival

దైవ క్షేత్రాల్లో భోగి వెలుగులు..

ఏటా ఏపీలోని విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఘనంగా భోగి వేడుకలు నిర్వహిస్తూ వ‌స్తున్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది భోగి మంటలు వేసి పూజలు చేస్తారు. ఆలయాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి, భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో భోగీని ఆస్వాదిస్తారు. శ్రీశైలంలోనూ సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆలయం ఎదురుగా శాస్త్రోక్తంగా భోగి మంటలు వేసి పూజలు నిర్వ‌హించ‌డం ప‌రిపాటిగా వ‌స్తోంది. అదే రోజు సాయంత్రం రావణ వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనమిస్తారు. ఈ క్ష‌ణాల కోసం భ‌క్తులు ఎంత‌గానో ఎదురు చూస్తూ ఉంటారు.

అలాగే, తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వ‌హిస్తారు. ఉత్త‌రాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జ‌రుపుకొనే భోగీ పండ‌గ చూప‌రుల‌ను ఎంత‌గానో ఆక‌ర్షిస్తుంది. ఆవు పేడ‌తో చేసిన పిడ‌క‌ల‌ను భోగి మంట‌ల్లో వేస్తారు. గ్రామాల‌లో ఐక్య‌త‌ను చాటేలా అంద‌రూ ఓ చోట‌కు చేరి, ఈ పండ‌గ‌ను చేసుకుంటారు. భోగి భోగ‌భాగ్యాల‌ను క‌లిగించాల‌ని, ఏడాదంతా సుఖ‌శాంతులతో ఉండాల‌ని కోరుతూ భోగిమంట‌లు వేసుకుంటారు.

Bhogi Festival

ఆక‌ట్టుకునే కార్య‌క్ర‌మాలు..

సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆశిస్తారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ప్రత్యేక రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు విన్యాసాలు, జంగమ దేవరల మేలుకొలుపు పాటలు ఎంత‌గానో ఆకట్టుకుంటాయి. సంప్రదాయ వస్త్రాలు ధరించిన యువ‌తులు ప్రదర్శించే కోలాటాలు, కూచిపూడి నృత్యాలు చూప‌రుల‌ను ఎంత‌గానో అలరిస్తాయి. ప‌ట్ట‌ణ‌, గ్రామీణ స్థాయిలో నిర్వ‌హించే క్రీడల పోటీల‌కు ముగింపు ఈ రోజునే ఉంటుంది.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించి, విజేత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్క‌డ చూసినా ఇందుకు సంబంధించిన క‌టౌట్‌లే ద‌ర్శ‌న‌మిస్తాయి. భోగి మంట‌ల చుట్టూ చేరి, నృత్యాల‌ను చేస్తూ.. సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబించేలా సంద‌డి వాతావ‌ర‌ణాన్ని అందిస్తుంది భోగి. మ‌రెందుకు ఆల‌స్యం, మీరు కూడా కుటుంబ స‌మేతంగా భోగి పండుగ‌ను ఆస్వాదించేందుకు సిద్ద‌మ‌వ్వండి.

  Read more about: bhogi festival
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X