
మీ ఇష్టం.. ఈ స్వీట్ ఇప్పుడు తినకపోతే ఏడాది వరకూ ఆగాల్సిందే!
సీజనల్ ఫ్రూట్స్‌లానే సీజనల్ స్వీట్స్ కూడా ఉంటాయని మీకు తెలుసా.. ఇప్పుడు అలాంటి తియ్యని రుచిని అన్వేషించి.. ఆస్వాదించడం కోసం మేం చేసిన ప్రయాణపు ముచ్చట్లు మీతో పంచుకోబోతున్నాం. విశాఖ తీరం నుంచి ఐదు గంటల బైక్ రైడ్ తర్వాత ఇచ్చాపురంలో మేం టేస్ట్ చేసిన ధనుర్మాస చిక్కీల విశేషాలు మీకోసం.
సంక్రాంతి అంటే ఉత్తరాంధ్ర పండగ అంటారు. మరీ ముఖ్యంగా ఇక్కడి సంప్రదాయ రుచుల ఘుమఘుమలు ఈ మాసమంతా పలకరిస్తాయి. అయితే, కేవలం ధనుర్మాసంలో మాత్రమే అందుబాటులో ఉండే ఓ తియ్యని స్వీట్ గురించి మేం విన్నాం. అది కూడా ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే తయారు చేస్తారు అంటే ఆశ్చర్యం అనిపించింది. దీనిని ధనుర్మాస చిక్కీలు లేదా నెయ్యి చిక్కీలు అంటారట.
ఆ మాటలు విన్న తర్వాత మా బృందం ఎలాగైన ఆ రుచిని మనసారా ఆస్వాదించాలని నిర్ణయానికి వచ్చింది. విశాఖ నగరం నుంచి ఇచ్చాపురానికి ఐదు గంటల సమయం పడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా బైక్‌లపై మా రైడ్‌ను మొదలుపెట్టాం.

తెల్లని ముత్యాలను కూర్చినట్లు..
అనుకున్నట్లుగానే మా జర్నీ సాఫీగా సాగిపోయింది. జాతీయ రహదారిపై బైక్ రైడ్ అనుభవం మాటల్లో చెప్పడం కాస్త కష్టమే. చివరిగా మా గమ్యస్థానం ఇచ్చాపురం చేరున్నాం. అక్కడి ఏ షాపులో చూసినా తెల్లని ముత్యాలను కూర్చినట్లు నోరూరించే చిక్కీలు కనిపించాయి. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా చెక్కీలను టేస్ట్ చేశాం. తియ్యని ఆ రుచి మా జర్నీ అలసటను పటాపంచలు చేసింది.
ధనుర్మాసం రావడంతో ఈ చిక్కీలు అందరి ఇళ్లల్లో వేడుకలు తీసుకొస్తాయని స్థానికులు విశ్వసిస్తారు. వరి కోతలు కోసాక, కొత్త ధాన్యాన్ని దంచి వాటి పాలతో ఈ చిక్కీలు చేస్తారని చెప్పుకొచ్చారు ఓ పెద్దాయన. ఈ పాలకు, పేలాలు, పంచదార పాకాన్ని కలిపి... వేర్వేరు ఆకృతుల్లో వీటిని తయారుచేస్తారట. ఇందులో మంచి పోషకాలుంటాయి. అంతేగాక కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం పప్పులతో అలంకరిస్తారు.

ధనుర్మాస చిక్కీల కంటే తియ్యగా..
ఆ మాటలు విన్న తర్వాత ఈ చిక్కీల ప్రత్యేకతను మరింతగా తెలుసుకోవాలని మా బృంద సభ్యుల్లో ఆసక్తి నెలకొంది. ఆ వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నాం. సంక్రాంతి పర్వదినాన ఇంటికొచ్చిన ఆడపడుచులకు, పెళ్లైన ఆడపిల్లలకు వీటిని సారెగా, స్నేహితులు, ఇంటిచుట్టుపక్కల వాళ్లు వాయినంగా ఇస్తారట. ఈ నెలంతా ఆడవాళ్లు వీటి తయారీ నుంచి ఉపాధి పొందుతారని అక్కడివారు చెప్పుకొచ్చారు. పెళ్లయిన ఆడ పిల్లలను పండగకి పుట్టింటికి పిలవటానికి వెళ్లినప్పుడు ఇవి ఇచ్చి ఆహ్వానిస్తారు.
స్నేహితులు, ఆత్మీయులు వీటిని ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకొని అందులోని పంచదార, పేలాలు ఎలా కలిసి ఉంటాయో.. అలానే అందరూ కలిసి ఉండాలని ఆశిస్తారు. వీటి ధర రూ. 25 నుంచి రూ. 300 వరకు ఉంటుంది. ఇవి కేవలం నెలరోజులు మాత్రమే దొరుకుతాయని వివరించారు. ఆప్యాయంగా వారు చెప్పుకొచ్చిన ఆ మాటలు ధనుర్మాస చిక్కీల కంటే తియ్యగా అనిపించిందంటే నమ్మండి.
నిజానికి, పల్లి చిక్కీ లాంటివి ఏ కాలంలోనైనా దొరుకుతాయి. కానీ ధనుర్మాసంలో మాత్రమే దొరికే ఈ చిక్కీలను అస్సలు మిస్సవ్వకూడదని ఫిక్స్ అయ్యాం. ఇవి కేవలం నెలరోజులు మాత్రమే దొరుకుతాయి కదా! మళ్లీ తినాలంటే సంక్రాంతి వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే. ఆలస్యం చేయకుండా అందరం ఓ డజను చెక్కీలను కొనుగోలు చేసి, తిరుగు ప్రయాణం అయ్యాం. మరెందుకు ఆలస్యం ధనుర్మాస చిక్కీల రుచిని ఆస్వాదించేందుకు మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి.