Search
  • Follow NativePlanet
Share
» »సోలాంగ్ లోయలో పారాగ్లైడింగ్ అనుభ‌వాలు మీకోసం

సోలాంగ్ లోయలో పారాగ్లైడింగ్ అనుభ‌వాలు మీకోసం

సోలాంగ్ లోయలో పారాగ్లైడింగ్ అనుభ‌వాలు మీకోసం

సోలాంగ్ లోయ యొక్క అందాలు సంద‌ర్శ‌కులను మంత్రముగ్దులను చేస్తాయి. శిఖ‌రాగ్రాన‌ ఎత్త‌యిన‌ చెట్లతో కూడిన విశాలమైన ప‌చ్చ‌ని మైదానం ఎంతో క‌మ‌నీయంగా ఉంటుంది. ఈ ప్రాంతం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లోని కులు లోయ ఎగువ‌న ఉంది. మ‌నాలీకి ద‌గ్గ‌ర‌గా ఉన్న ఓ ప‌ర్యాట‌క ఆక‌ర్ష‌ణ సోలాంగ్ లోయ‌. పారా చూటింగ్‌, పారాగ్లైడింగ్‌, స్కేటింగ్ వంటి క్రీడ‌ల‌కు ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. ఇక్క‌డి గొండోలాలో మా బృందం పారాగ్లైడింగ్ అనుభ‌వాలు మీకోసం.

హిమాచ‌ల్ ప‌ర్వ‌త శిఖ‌రాల్లో పారాగ్లైడింగ్ అనేది అద్భుతమైన సాహస క్రీడలలో ఒకటి. పక్షుల్లా గాలిలో ఎగురుతున్న ఆ అనుభూతిని మించింది ఏదీ లేదు. మీరు జీవితంలో ఒక్కసారైనా పొందాలనుకునే ప్రత్యేకమైన అనుభవాలలో ఇది ఒకటి. పారాగ్లైడింగ్ ఖచ్చితంగా కొంచెం ప్రమాదకరమైన క్రీడే అయిన‌ప్ప‌టికీ సోలాంగ్‌లోని ఆపరేటర్లు చాలా సమర్థవంతంగా ఉండ‌టం వ‌ల్ల ఇది సుర‌క్షితం అనే చెప్పాలి. పైలట్‌లు అత్యంత అనుభవజ్ఞులైన సభ్యులు. వారు పారాగ్లైడింగ్‌ను కేవలం ఉద్యోగంగానే కాకుండా అభిరుచిగా కూడా ఆస్వాదిస్తారు.

adventureinsummer-sollang valley

లాంచింగ్ ప్ర‌క్రియ క‌ఠినంగా..

పారాగ్లైడింగ్ అనేది కొంచెం ఖరీదైన క్రీడ‌గా కూడా చెబుతారు. దీనికి సీజ‌న్ బ‌ట్టీ వెయ్యి నుంచి 3500 రూపాయ‌ల వరకు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. పారాగ్లైడింగ్ ప్రారంభమయ్యే గొండోలా ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్లే స‌మ‌యంలోనే రైడ్ కోసం డ‌బ్బులు చెల్లించాలి. గొండోలా రైడ్ ఒక అద్భుతమైన అనుభవం. ఆ క్ష‌ణాలు రానేవ‌చ్చాయి. మేం ముగ్గురం పారాగ్లైడింగ్‌కి వెళ్లేందుకు సిద్ధ‌మ‌య్యాం. మాలో ఒక్కొక్కరితో ఒక్కో డ్రైవర్ ఉన్నాడు. గొండోలా నుండి దిగిన తరువాత, మేం కొంత దూరం నడిచి, పారాగ్లైడింగ్ ప్రారంభమయ్యే ప్రదేశానికి చేరుకున్నాం. మేం హెల్మెట్ వంటి అన్ని భద్రతా పరికరాలను ధరించాం.

అయితే, పారాగ్లైడింగ్‌లో ప్రారంభం ఒక్కటే కాస్త కఠినమైన భాగంగా చెప్పొచ్చు. ఎందుకంటే మీరు మీ పైలట్‌తో పూర్తి వేగంతో కొండ అంచు వైపు పరుగెత్తాల్సి ఉంటుంది. దీనినే లాంచింగ్ అంటారు. ఈ ప్రక్రియలో, మీరు ముందుకు వెళుతూ.. నేల‌ను విడిచి ఆకాశంలోకి ప్రవేశిస్తారు. అలా మా బృందం ఒక్కొక్క‌రిగా భ‌యాన్ని వ‌దిలి ఆకాశంలోకి విజయవంతంగా ఎగ‌ర‌గలిగాం.

sollangvalley

మాట‌ల్లో చెప్ప‌డం కాస్త క‌ష్ట‌మే..

ఆ తర్వాతి ఇరవై నిమిషాలు మా జీవితంలోని అద్భుతమైన క్షణాలుగా మిగిలిపోయాయి. ఇది అక్షరాలా పక్షి వీక్షణలా ఉంటుంది. గాలిలో తూలుతూ విహ‌రిస్తున్న మాకు లోయ మొత్తం కనిపించింది. మేం ఎత్త‌యిన చెట్ల కొమ్మలను, దూరంగా మంచుతో కప్పబడిన పర్వతాలను చూడ‌గ‌లిగాం. అది పక్షికి ఎలా అనిపిస్తుందో మాకూ అలానే అనిపించింది. మొత్తం లోయ ప్రాంతం ప‌చ్చ‌ని తివాచీ ప‌రిచిన‌ట్లు క‌నిపించింది. నేల‌పై ఉన్న తోటి ప‌ర్యాట‌కులు చీమ‌లైపోయారు, అక్క‌డి ఇళ్లు న‌క్ష‌త్రాలుగా మారిపోయాయి. ఇలా చెప్పుకుంటూపోతే, ఆ మనోహరమైన అనుభవాన్ని మాటల్లో చెప్పడం నిజంగా చాలా కష్టం.

మ‌ళ్లీ నేల‌పై అడుగుమోప‌డం ఇష్టం లేక‌పోయినా త‌ప్ప‌క మోపాల్సి వ‌చ్చింది. అయితే, అలా నేల‌పైకి తిరిగి రావడం కూడా కొంచెం గమ్మత్తైన భాగ‌మ‌నే చెప్పాలి. ల్యాండింగ్‌కు ముందు మీరు స్వింగ్‌లో ఉన్నట్లే మీ రెండు కాళ్లను ముందుకి తీసుకురావాలి. ల్యాండింగ్ కొంచెం కఠినంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులూ ఎదుర‌వ్వ‌కుండా చూసుకోవడానికి ఇది. అయితే, సురక్షితంగా ల్యాండ్ చేయడంలో సహాయం చేయడానికి ఎల్లప్పుడూ అక్కడ అనుభ‌వ‌జ్ఞులైన ట్రైనీలు అందుబాటులో ఉంటారు. మా బృందం పారాగ్లైడింగ్ అనుభ‌వాలు జీవితంలో మ‌ర్చిపోలేని క్ష‌ణాలుగా మిగిలిపోతాయి.

Read more about: solang valley manali
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X