Search
  • Follow NativePlanet
Share
» »పురాత‌న ఆల‌య స‌ముదాయ‌ ప్రాంగ‌ణం.. హేమావ‌తి!

పురాత‌న ఆల‌య స‌ముదాయ‌ ప్రాంగ‌ణం.. హేమావ‌తి!

పురాత‌న ఆల‌య స‌ముదాయ‌ ప్రాంగ‌ణం.. హేమావ‌తి!

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం హేమావతి. 8వ మరియు 10వ శతాబ్దాల మధ్య హేమావతి పల్లవుల రాజధాని. పల్లవుల పాలనలో ఈ పట్టణాన్ని హెంజేరి అని పిలిచేవారు. పురాత‌న నిర్మాణాల‌కు ఇక్క‌డి ప‌రిస‌ర ప్రాంతాల‌ను కేంద్రంగా చెప్పొచ్చు. చారిత్రక నేప‌థ్యం ఉన్న హేమావ‌తిలో ప‌ర్య‌టించేందుకు చాలామంది ప‌ర్యాట‌కులు ఆస‌క్తి చూపుతారు.

హేమావతిలో కొన్ని ఆకర్షణీయమైన పురాత‌న‌ దేవాలయాలను చూడొచ్చు. హేమావతి పట్టణానికి సమీపంలో ఒక పెద్ద కోట శిథిలాలు త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డ్డాయి. అద్భుతమైన శిల్పకళను కలిగి ఉన్న ఈ కోట చుట్టూ అనేక దేవాలయాలు ఉన్నాయి. అందులో సిద్దేశ్వర ఆలయం, దొడ్డేశ్వర ఆలయం, విరూపాక్షేశ్వర ఆలయం మరియు మల్లేశ్వర ఆలయం ప్ర‌సిద్ధిగాంచాయి.

ఈ ఆలయ సముదాయం దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. ఈ ఆలయాలలో దొడ్డేశ్వర స్వామి దేవాలయం అత్యంత ఆకర్షణీయమైనది. దీని నిర్మాణ శైలి భ‌లే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. ఇక్క‌డి విగ్రహాల తయారీలో ఉపయోగించిన‌ రాయి లోహంలా పాలిష్ చేయబడి, కొట్టినప్పుడు లోహపు శబ్దం వస్తుంది.

నందికి నైవేధ్యంగా అర‌టిప‌ళ్లు..

నందికి నైవేధ్యంగా అర‌టిప‌ళ్లు..

గర్భగుడి లోపల ఆరు అడుగుల ఎత్త‌యిన‌ శివలింగాన్ని ప్రతిష్టించారు. నల్ల గ్రానైట్‌తో చేసిన భారీ నంది విగ్రహం ప్రవేశ ద్వారం వద్ద ద‌ర్శ‌న‌మిస్తుంది. 8వ శతాబ్దంలో ప్రతిష్ఠించబడిన నంది విగ్రహాలలో ఒకటైన బలే బసవ విగ్ర‌హం అందంగా క‌నిపిస్తుంది. అంతేకాదు, స్వామికి బదులుగా అరటిపండ్లను నంది ఆశీర్వాదం కోసం నంది నోటి వద్ద ఉంచుతారు.

ఈ ఆలయంలో కొన్ని అద్భుతమైన కళాఖండాలు ఉన్నాయి. ఆలయ గోడలు అనేక కళాత్మక శిల్పాలు మరియు చిత్రాలతో అలంకరించబడ్డాయి. స్తంభాలపై రామాయణం మరియు మహాభారత ఇతిహాసాలు నుండి సంగ్ర‌హించిన‌ దృశ్యాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని భారీ స్తంభాలు సంద‌ర్శ‌కుల‌ను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ ఆలయం పల్లవ మరియు చోళ శిల్పకళ యొక్క అద్భుతమైన సేకరణకు సాక్షిగా నిలిచింద‌నే చెప్పాలి.

సూర్యకిరణాలు ముఖానికి తాకేలా..

సూర్యకిరణాలు ముఖానికి తాకేలా..

సిద్దేశ్వర స్వామి ఆలయంలో శివుడు సిద్దేశ్వరుడిగా, ధ్యాన భంగిమలో ద‌ర్శ‌న‌మిస్తాడు. ఈ విగ్రహం ఐదు అడుగుల ఎత్తులో ఎంతో గంభీరంగా క‌నిపిస్తుంది. సూర్యాస్తమయం సమయంలో సూర్యకిరణాలు అన్ని కాలాల్లో భగవంతుని ముఖాన్ని తాకే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఏటా మహా శివరాత్రి సందర్భంగా సిద్దేశ్వర ఆల‌యం ఎంతో అందంగా అలంక‌రించ‌బ‌డుతుంది. శివరాత్రి మరుసటి రోజున ఇక్క‌డ ఏర్పాటు చేసే అగ్ని గుండం పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తుంది. అగ్ని గుండంలో వేల కిలోల సాంబ్రాణి కర్రలు సమర్పిస్తారు.

పండుగ సమయంలో హేమావతి వీధుల్లో సాంబ్రాణి పొట్లాలను విక్రయించే కనీసం 200 దుకాణాలు వెలుస్తాయి. రైతులు పంటల‌కు తెగుళ్లు మరియు కాలానుగుణ సమస్యల నుండి రక్షణ కోసం దేవతను ఆశీర్వదించ‌మ‌నేందుకు గుండంలో సాంబ్రాణితో పాటు విత్తడానికి సిద్ధంగా ఉంచిన వేరుశెనగ మరియు ఇతర విత్తనాలను అందజేస్తారు.

చారిత్ర‌క ఆస‌క్తి ఉండే ప‌ర్యాట‌కులు..

చారిత్ర‌క ఆస‌క్తి ఉండే ప‌ర్యాట‌కులు..

ఆలయ ప్రాంగణంలో పురావస్తు శాఖ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ విగ్రహాలు మరియు పురాతన శిల్పాలు భద్రపరచబడ్డాయి. వీటిని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి చారిత్ర‌క ఆస‌క్తి ఉండే ప‌ర్యాట‌కులు వ‌స్తూ ఉంటారు.

హేమావ‌తి మడకశిర నుండి 36 కిలోమీట‌ర్లు, హిందూపురం నుండి 70 కిలోమీట‌ర్లు, అనంతపురం నుండి 156 కిలోమీట‌ర్లు, హైదరాబాద్ నుండి 513 కిలోమీట‌ర్లు, విజయవాడ నుండి 627 కిలోమీట‌ర్లు మరియు బెంగుళూరుకు 158 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది.

Read more about: hemavathi town
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X