Search
  • Follow NativePlanet
Share
» »పాలరాతి అందాల సమ్మోహనం.. దిల్‌వారా జైనమందిర సముదాయం

పాలరాతి అందాల సమ్మోహనం.. దిల్‌వారా జైనమందిర సముదాయం

పాలరాతి అందాల సమ్మోహనం.. దిల్‌వారా జైనమందిర సముదాయం

మన దేశంలోని చారిత్రకంగా పాలరాతి శిల్పశైలిలో అద్భుతమైనది తాజ్మహల్ మాత్రమే అని చాలా మంది భావన. అయితే, అందుకు ధీటుగా అలరారుతున్న అపురూప నిర్మాణం దిల్‌వారా. ఇది జైన మందిరాల సముదాయం అయినప్పటికీ మతాలకు అతీతంగా ప్రపంచ కళా సౌందర్యాన్ని కాంక్షించేవారందరికీ ఆహ్లాదం కలిగిస్తోంది. రాజస్థాన్ అనగానే కనిపించే ఎడారి ఇసుక తెన్నెలకు దూరంగా నిర్మించిన అలనాటి పాలరాతి శిల్పకళా సంపద విశేషాలను తెలుసుకుందాం.

రాజస్థాన్‌లోని మౌంట్ ఆబూలో ఉంది పాలరాతి అందాలతో సమ్మోహనం చేసే దిల్‌వారా జైనమందిర సముదాయం. ఇవి మొత్తం ఐదు మందిరాలు. ఈ దిల్‌వారా మందిర సముదాయం లోపలకు కెమెరాలు, మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. అత్యంత క్రమశిక్షణతో నిబంధనలను పాటిస్తున్నారు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది. లోపల ప్రధాన మందిరం వసారాలోకి ప్రవేశించగానే ఒక్క సారిగా అక్కడున్న శిల్పకళా సృజనను చూసి విస్మయం చెందాం. మాటలలో వర్ణించలేని అనుభూతిని, ఎవరైనా ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే. అక్కడి శిల్పకళా చాతుర్యానికి వొళ్లంతా కళ్లు చేసుకొని చూసినా సమయం సరిపోదంటే నమ్మండి. అక్కడున్న శిల్పాలను, వాటి నిర్మాణ సౌందర్యాన్ని చూసి అసంకల్పితంగానే ఔరా అనాల్సిందే.

రమణీయ శిల్పలావణ్యం

రమణీయ శిల్పలావణ్యం

ప్రతి రెండు స్థంభాల మధ్యన పాలరాతి తోరణాలను ఎంతో రమణీయంగా మలిచారు. అవన్నీ వేటికవే ప్రత్యేకమైన డిజైన్లతో తయారుచేశారు. ఆ పాలరాతి తోరణాలు చూస్తే చాలు, కళాకారుల ప్రతిభను పొగడడానికి పదాలు దొరకవంటే నమ్మండి! ఒకటా రెండా కొన్ని వందల సంఖ్యలో అలాంటి శిల్పాలు ఉన్నాయి. అక్కడ పై కప్పు నిండా, వసారాకున్న స్తంభాలకు, ప్రధానపీఠం చుట్టూ ఎన్నెన్నో శిల్పాలున్నాయి. ప్రధాన మందిరం, మందిర పీఠం (గర్భగుడి) మాత్రమే కాకుండా దాని చుట్టూ కొన్ని అడుగుల దూరంలో మూడు వైపులా ఉన్న పెద్ద వసారాలకు కొన్ని వందల స్థంభాలు ఉన్నాయి. ఆ స్థంభాలకు, ఆ వసారాలకు ఉన్న పై కప్పులు కూడా శిల్పాలతోనే మలిచారు. ఒకదానిని మరో దానితో పోల్చడం చాలా కష్టమైన పనే సుమా!

నిర్మాణం వెనుక

నిర్మాణం వెనుక

జైనమతంలోని తీర్ధంకరులను పూజించేందుకు ఈ మందిరాలను నిర్మించారు. ఇవి మొత్తం ఐదు మందిరాలు. వీటిని దశలవారీగా క్రీ.శ.11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకూ నిర్మించారు. కొన్ని వేలమంది శిల్పులు, శ్రామికులు వీటిని రూపొందించారు. అప్పట్లో ఈ ఐదు మందిరాల నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు ఎనభైకోట్ల రూపాయలపై మాటే. ఈ దిల్‌వారా జైనమందిర సముదాయంలో తీర్థంకరుల విగ్రహాలు 72, జైనమునుల విగ్రహాలు 360 ఉన్నాయి. ఇవి కాక యక్షిణుల విగ్రహాలు 24, సాలబంజికల విగ్రహాలు వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రధానమందిరంలో 57 తోరణాలున్నాయి. ఈ సముదాయంలో తొలిమందిరాన్ని క్రీ.శ 1031లో గుజరాత్‌ను పాలించే చాళుక్యరాజు మొదటి భీమదేవుని ప్రధానమంత్రి విమల్షాహ నిర్మించాడు.

దీనికి ప్రాంగణాన్ని పృథ్వీపాల్, మిగిలిన మందిరాలను వస్తుపాల్, తేజ్పాల్, మాండ్లిక్ అనేవారు నిర్మించారని గైడ్ ద్వారా తెలిసింది. ఇక్క‌డి ప్రతి శిల్పమూ అపురూపం.. అద్భుతంగానే కనిపిస్తాయి. ఇక్కడకు వచ్చిన ఎవరైనా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరిచిపోయి ఈ శిల్ప కళాసంపదను చూస్తూ మరో లోకంలోకి వెళ్లిపోతారని అనడంలో ఏమాత్రమూ అతిశయోక్తి లేదు.

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు ప్రతీరోజూ రైలుమార్గం ద్వారా చేరుకోవచ్చు. అహమ్మదాబాద్ నుంచి రాజస్థాన్ లోని అబూరోడ్ స్టేషన్‌ను ట్రైన్‌లో చేరుకోవాలి. అక్కడ నుంచి మౌంట్ అబూకి వాహనాల సౌకర్యం ఉంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఈ మందిరాలు తెరిచే ఉంటాయి. సందర్శన ఉచితం. అయితే ఫొటోలు, వీడియోలు తీయడాన్ని పూర్తిగా నిషేధించారు. పర్యాటకులకు అనువైన ధరల్లోనే అబూ రోడ్‌లోనూ, మౌంట్ అబూలోనూ వసతి సౌకర్యాలు లభిస్తాయి.

Read more about: jainism mount abu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X