India
Search
  • Follow NativePlanet
Share
» »చారిత్ర‌క విశేషాల స‌మ్మేళ‌నం.. చింత‌ప‌ల్లి ప‌య‌నం!

చారిత్ర‌క విశేషాల స‌మ్మేళ‌నం.. చింత‌ప‌ల్లి ప‌య‌నం!

క‌నుచూపుమేర‌లో ఎగసి పడుతున్న సముద్రపు కెరటాలు... పరవళ్లు తొక్కే అలల మధ్య పడవల్లో మత్స్యకారులు సాహస విన్యాసాలు... కనువిందు చేసే తీరప్రాంత అందాలు, కల్మషంలేని మత్స్యకారుల జీవన విధానం... ఇసుకమేటలపై కుర్రకారు ఆటల కేరింతలు...

ప్రాచీన శిల్పకళా నైపుణ్యం.. దారి పొడవునా పచ్చదనం పలకరింపు.. చల్లటి పిల్లగాలుల గిలిగింత... ఇలా ఎన్నో ప్రత్యేకతలకు సమాహారం విజయనగరం జిల్లాలోని చింతపల్లి సాగర తీరం. మరెందుకు ఆలస్యం? ఆ ప్ర‌కృతి అందాల‌ను చూసొద్దాం పదండి!

చారిత్ర‌క విశేషాల స‌మ్మేళ‌నం.. చింత‌ప‌ల్లి ప‌య‌నం!

చారిత్ర‌క విశేషాల స‌మ్మేళ‌నం.. చింత‌ప‌ల్లి ప‌య‌నం!

మాకు దగ్గర్లోనే సముద్రతీరం ఉందని, ఆ మార్గం మధ్యలోనే చూడాల్సిన ప్రదేశాలు అనేకం ఉన్నాయని ఎప్పుడూ వినడమేగానీ చూడలేదు. ఆ కోరిక తీర్చుకునేలా సెలవు రోజును కాస్త ఆట విడుపుగా చింతపల్లి సముద్రతీరాన్ని చూడాలనిపించింది. వెంటనే మిత్రుల‌తో క‌లిసి టూర్ ప్లాన్ చేశాం. అంద‌రం కలిపి మొత్తం పదిమందిమి అయ్యాం.

రాను పోను 60 కిలోమీటర్ల దూరం. మార్గమధ్యలోగల కుమిలిలోని పురాతన ఆలయం, గోవిందపురంలోని గీతామందిరాన్నీ సందర్శించాలన్నది మా ప్లాన్. అనుకున్నదే తడవుగా మా సొంత కారులో ప్ర‌యాణాన్ని మొదలుపెట్టాం. అంతా కలిసి ఉదయం తొమ్మిది గంటలకే విజయనగరం ఆర్ అండ్ బి జంక్షన్‌కు చేరుకున్నాం. అక్క‌డి నుంచే కారులో పిల్లల కేరింతలు మొద‌ల‌య్యాయి. ఎలా వెళ్లాలో రూట్ మ్యాప్ ముందే సిద్ధం చేసుకోవ‌డంతో పావుగంటలోనే విజయనగరం పట్టణం దాటాం.

మ‌ట్టికోట ర‌హ‌స్యం..

మ‌ట్టికోట ర‌హ‌స్యం..

చుట్టూ మామిడితోటలు, పచ్చదనం తొణికిసలాడే పంటపొలాల నడుమ సువిశాలమైన ఆధునిక రహదారిలో గుణుపూరుపేట, ముంగినాపల్లి, చొల్లంగిపేట, చంపావతి నది దాటుకుంటూ సాగుతున్న మా ప్రయాణం ప్రారంభంలోనే అనుభూతిని ఇచ్చింది. 35 నిమిషాల్లోనే కుమిలి జంక్ష‌న్‌కు చేరుకున్నాం. అక్కడ మేమంతా టీ పిల్లలంతా కలిసి స్నాక్స్ తింటూ సరదాగా ముచ్చటించుకున్నాం. ఇంతలో పక్కనే ఉన్న 80 ఏళ్ల వృద్ధుడు. 'ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా...? కోట చూడ్డానికి వచ్చారా?' అని ప్రశ్నించాడు. ఆ మాట నోటి వెంబడి వచ్చిందో లేదో, ఇక్క‌డ కోట ఉందా? అని ఆశ్చ‌ర్యంగా అడిగాం. 'అవును విజయనగరం రాజులు మొదట ఇక్కడే. ఉండేవారు..." అని చరిత్ర చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిసింది. దాంతో మేం ఇక్కడ చూడాలనుకున్న పురాతన ఆలయాన్ని దాటుకుని, కుమిలి గ్రామానికి పడమర దిక్కుకు మా ప్రయాణం సాగించాం. ఊరికి సరాసరి కిలోమీటరు దూరంలోనే సుమారు రెండెకరాల విస్తీర్ణంలో నేలమట్టమైన మట్టిగోడలు కనిపించాయి.

పూసపాటి వంశీయులు 16వ శతాబ్ధంలో కుమిలి కేంద్రంగా విజయనగరం రాజ్యాన్ని పాలించారని, ఈ ఊరిపేరు అప్పట్లో కుంబిలాపురమని, మాకప్పుడే తెలిసింది. తొలుత ఇక్కడ మట్టికోట కట్టారని, ఆ తరువాత విజయనగరానికి మకాం మార్చారని స్థానికులు చెప్పారు. అప్పట్లో కోట చుట్టూ ఏర్పాటుచేసిన దీపాలంకరణతో ఈ ప్రాంతం ధగధగ మెరిసిపోయేదట!

మతసామరస్యానికి ప్రతీక!

మతసామరస్యానికి ప్రతీక!

ఆ చరిత్ర నెమరు వేసుకుంటూనే కుమిలి అంతర్భాగంగా ఉన్న పురాతనమైన శ్రీ మహంకాళి గణపతి ఆలయాన్ని దర్శించాం. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ కట్టడం ప్రాచీన శిల్పకళా నైపుణ్యానికి అద్దం ప‌డుతోంది. రాతి గోడలు, స్తంభాలు, రాతి శిల్పాలు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. సుమారు 12 ఆలయాలు గల ఈ ప్రాంగణంలోని ఓ మండపం మతసామరస్యానికి ప్రతీకగా కనిపించింది. ఏసుక్రీస్తు, మసీదు, రామమందిరం, బుద్ధుడు, యోగివేమన శిల్పాలు ఒకదాని పక్కన మరొకటి అమర్చి ఉన్నాయి. అప్పటి రాజులు శు త్రువులను ఎదుర్కొనేందుకు అన్ని మతాలను ఐక్యం చేసేవారని స్థానిక పురోహితుడు వివరించాడు. అక్కడ రెండు గంటలకు పైగా గడిపేశాం.

అప్పటికి సమయం 11:30 గంటలు దాటుతోంది. అక్కడి నుంచి నేరుగా గోవిందపురంలోని గీతా మందిరానికి బయలుదేరాం. చోడమ్మ అగ్రహారం, పోరాం తదితర గ్రామాలను దాటుతుండగా రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఊళ్లు, పంటపొలాల్లో రైతుల జీవనశైలిలో శ్రమజీవన సౌందర్యం కనిపించింది. 20 నిమిషాల వ్యవధిలోనే మా ప్రయాణ మార్గంలో ఉన్న విశాఖ నుంచి క‌ల‌క‌త్తా వెళ్లే రహదారికి చేరుకున్నాం. రోడ్డుపక్కనే వాహనాన్ని ఆపి, అందరం కలిసి కొబ్బరి బోండాలు తాగాం. సమీపంలోని ఆగ్రహారానికి చెందిన ఈ కొబ్బరిబోండాలు భలే రుచిగా ఉన్నాయి.

గీతా మందిరం అందాలు..

గీతా మందిరం అందాలు..

అక్కడి నుంచి మరో 20 నిమిషాల్లో గీతా మందిరానికి చేరుకున్నాం. రథం లాగుతున్నట్టుగా గుర్రాలు, రధంపై కృష్ణార్జునుల శిల్పాలు, కుడివైపు నంది విగ్రహం ఆధునిక శిల్పకళా నైపుణ్యానికి అద్దం పట్టాయి. సుమారు రెండెకరాల విస్తీర్ణంలో వివిధ చోట్ల ప్రతిష్టించిన శిల్పాలు మహాభారతంలోని పలు సన్నివేశాలను విశదీకరించాయి. అప్పటికే సమయం ఒంటిగంట కావస్తుండడంతో మనసంతా భోజనం వైపు లాగుతోంది.

ఎలాగూ చిన్నపిల్లలు కూడా ఉన్నారని పక్కనే ఉన్న విశాలమైన మామిడితోటలో కూర్చొని వెంట తెచ్చుకున్న పులిహోరా, బిర్యాని, చక్రపొంగలి తదితర వెరైటీలను షేర్ చేసుకుంటూ భోజ‌నం ఆరగించాం. తోటలో నేల చదునుగా, విశాలంగా, ఆహ్లాదకరంగా ఉండడంతో అక్కడే కాసేపు గడిపేశాం. పిల్లలూ ఎంచక్కా ఆడుకున్నారు.

అల‌ల నడుమ ప్రకృతి అందాలు!

అల‌ల నడుమ ప్రకృతి అందాలు!

అక్క‌డి నుంచి చింతపల్లి తీరానికి 2.30 గంటలకు మొదలైంది మా ప్రయాణం. ముందుకు వెళ్తున్న కొద్దీ కోనసీమను తలపించే కొబ్బరిచెట్లు, పచ్చదనంతో కప్పేసిన అరటితోటలు, చల్లటి పిల్లగాలులు ముందుకు సాగుతున్న కొలదీ మనసును దోచేస్తున్నాయి. భరిణికాం, కృష్ణాపురం తదితర మత్స్యకార గ్రామాలు దాటుకుంటూ చింతపల్లి సముద్ర తీరానికి చేరుకున్నాం. అల్లంత దూరంలో ఉండగానే సముద్రం, ఆకాశం కలగలిసిందా? అన్నట్టుగా కనిపించింది. తీరం లోపలకి ఆరకిలోమీటర్ మేర ఉన్న వంతెన సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. దూరంగా ఉండటంతో మేం అక్కడికి వెళ్లలేకపోయాం.

ఎగిసిపడుతున్న కెరటాలు, అలల సవ్వడికి మావాళ్ళు కేరింతలు కొట్టారు. సముద్రంలోనే పడిలేస్తున్న అలలపై మత్స్యకార పడవలు సుమారు ఐదారడుగులు పైకి కిందకి ఎగురుతూ కనిపించాయి. అప్పుడే తీరానికి చేరుతున్న మత్యకార బోటులో వింత వింత చేపలు కనువిందు చేశాయి. కానాగడతలు, గొరసలు, కొవ్వాడ, నెత్తళ్లు, రొయ్యలు ఈ తీరం ప్రత్యేకతలని మత్స్యకారులు తెలిపారు. ప్రశాంతమైన వాతావరణంలో కాసేపు అక్కడే ఉండిపోయాం.

చూడ‌ముచ్చ‌టి.. లైట్ హౌస్

చూడ‌ముచ్చ‌టి.. లైట్ హౌస్

తీరంలో ఎపి ఆధ్వర్యాన సుమారు రూ.కోటితో ఏర్పాటుచేసిన కాటేజీలు రా రమ్మంటున్నట్టుగా కనిపించాయి. సుమారు 15 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ కాటేజీలకు చుట్టూ అద్దాలు అమర్చారు. అక్కడి నుంచి సముద్రం మరింత విశాలంగా కనిపించింది. అనంతరం ఇక్కడికి కిలోమీటరు దూరంలో ఎత్తయిన కొండపైగల లైట్ హౌస్ వద్దకు చేరుకున్నాం. సుమారు నాలుగు అంతస్తుల్లో గుండ్రంగా ఉన్న దీన్ని 1840లోనే నిర్మించారట! ఆ తరువాత 1903, 1995లో పునర్నిర్మించారు. తీరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉండగానే తీరం దగ్గర్లో ఉన్నట్టుగా షిప్ నడిపేవారికి సిగ్నల్ ఇచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేశారు.

దీనిపైకి ఎక్కేందుకు అక్కడి సిబ్బంది అనుమతిచ్చినప్పటికీ దానికి తేనెపట్టు ఉండడంతో మేమే సాహసించ లేకపోయాం. ఇలా సాగిన మా ప్ర‌యాణం మ‌ర్చిపోలేని అనుభూతి నివ్వడంతో పాటు కొత్తకొత్త విషయాలు తెలుసుకునేలా చేసింది. మ‌రెందుకు ఆల‌స్యం మీ ప్ర‌యాణం మొదలుపెట్టండి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X