Search
  • Follow NativePlanet
Share
» »ఆహ్లాద‌భ‌రిత విహారం.. అసోం ప‌ర్యాట‌కం!

ఆహ్లాద‌భ‌రిత విహారం.. అసోం ప‌ర్యాట‌కం!

ఆహ్లాద‌భ‌రిత విహారం.. అసోం ప‌ర్యాట‌కం!

వన్యప్రాణుల విడిది కేంద్రంలో విహారం.. విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. పురాతన నిర్మాణాలు సోయగం.. అసోం పర్యాటకం! అక్కడ వేసే ప్రతి అడుగులోనూ ప్రకృతిసిద్ధమైన మరో ప్రపంచపు అనుభూతి కలుగుతుంది. మనసును దోచే స్థానికుల చేతి నుంచి జాలువారిన కళాకృతులు అదనపు ఆకర్షణ. శీతాకాల‌పు అందాల‌ను పరిచయం చేస్తూ.. మైమరపించి, ఆహ్లాదమైన విహార అనుభూతుల్ని చేరువ చేసిన అసోం పర్యాటక అనుభవాలు మీకోసం..

మా ఈశాన్య భారత పర్యటనలో భాగంగా మొదటగా అసోం రాష్ట్రంలోని గువాహటిలో అడుగుపెట్టాం. ఈ రాష్ట్రంలో కేవలం గువాహటి, కజిరంగా ప్రాంతాలు మాత్రమే చూశాం. తొలిరోజు ప్రసిద్ధమైన కామాఖ్య ఆలయాన్ని సందర్శించాం. హిందూమత ప్రకారం 51 శక్తి పీఠాల్లో ఒకటైన శక్తి పీఠం ఇది. గువాహతి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం నీలాచల్ కొండలపై ఉంది. పది మహావిద్యాలకు అంకితమివ్వబడిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి.

త్రిపురసుందరి, మాతంగి, కమలాలు ఈ ప్రధాన ఆలయం లోపల కనిపించగా, మిగతా ఏడు అవతారాలు ఇక్కడికి చుట్టుపక్కలే ఉన్నాయి. 8వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలంలో అనేకసార్లు నిర్మించబడి, ఆధునికీకరణకు నోచుకుంది. ఈ దేవాలయ నిర్మాణశైలిని సాధారణంగా నీలాచల్‌రకం అని పిలుస్తారు. ఈ నిర్మాణంలో ఒక శిలువ ఆకార ఆధారంపై అర్ధ గోళాకార గోపురం ఉంటుంది. ఏటా అంబువాసి పండుగ సందర్భంగా కామాఖ్య దేవత ఉత్సవాలు నిర్వహింపబడతాయి. ఉపాసకులు ప్రతి ఉదయం ఇక్కడ అర్పించటానికి మేకలను వెంటపెట్టుకొని వస్తారు. ఆలయ ప్రాంగణంలో అనేక మేకలను చూశాం.

ఏనుగు సఫారీ..!

ఏనుగు సఫారీ..!

అసోంకు గర్వకారణమైన కజిరంగా నేషనల్ పార్కు చేరుకున్నాం. ఇది అంతరించిపోతున్న ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకు నిలయం. 2006లో దీనిని టైగర్ రిజర్వ్ గా ప్రకటించారు. ఈ పార్క్ సుమారు 430 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. పార్క్ లోపల మావటి ద్వారా ఏనుగు మీద సవారీ కజిరంగా నేషనల్ పార్క్ ప్రత్యేక ఆకర్షణ. మేం ఉదయం ఆరు గంటలకే పార్క్ దగ్గరకు చేరుకొని, సవారీకి వెళ్ళాం.

రైనోలను అతి దగ్గరగా చూడటానికి ఈ సవారీ సహాయపడుతుంది. ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతూ కనువిందు చేశాయి. చెట్ల మధ్యలో వెళ్తూ అడవిలో తిరగడం ఓ అద్భుతమైన అనుభూతి. అడవి దున్నలు, అడవి పందులు, జింకలు, అనేక రకాల పక్షులు ఈ సవారీలో కనిపించాయి. చూడటానికి మన పెంపుడుకోడిలాగే ఉన్నా, పక్షిలా ఎగరగలిగే అడవికోడిని చూశాం. మధ్యాహ్నం జాతీయ పార్క్ చూడటానికి జీప్ సఫారీ బుక్ చేసుకొని వెళ్ళాం.

కానీ ఏనుగు సఫారీ అంత బాగా అనిపించలేదు. పులులకు ప్రఖ్యాతిగాంచిందిగానీ, పులి ఎక్కడా కనిపించలేదు. కజిరంగాలో అక్కడి జానపద కళా రూపాల సాంస్కృతిక కార్యక్రమాలు దగ్గరలోనే ప్రతి సాయంత్రం జరుగుతూ ఉంటాయి. వెదురు, కొయ్యతో చేసిన అద్భుతమైన కళాఖండాలు రోడ్డు మీదే అమ్మకానికి పెట్టి ఉన్నారు. అక్కడి నుంచి తిరిగి గువాహటికి వస్తూ దారిలో తేయాకు తోటల్లో విహరించి, ఫొటోలు తీసుకున్నాం. అక్కడి శ్రామిక మహిళలతో మాటలు కలిపాం. వారానికి 875 రూపాయలు కూలీ ఇస్తారట! పొద్దున ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ పని చేయాల్సి ఉంటుందన్నారు.

కనువిందుచేసే పీకాక్ దీవి!

కనువిందుచేసే పీకాక్ దీవి!

గువాహటిలో మరో ప్రధాన ఆకర్షణ అసోం స్టేట్ జూ, బొటానికల్ గార్డెన్. 130 హెక్టార్ల మేరకు విస్తరించిన ఈ జూలాజికల్ గార్డెన్ వృక్ష, జంతుజాలాలతో పాటు వివిధ అరుదైన జీవుల స్థావరం. ఈ జూకి ఆనుకుని ఉన్న బొటానికల్ గార్డెన్ గువాహటి సహజమైన అందాలకు వన్నె తెచ్చింది. తెల్లపులి, చిరుత, ఎర్ర పాండాలు ఈ జూలో స్వేచ్ఛగా జీవిస్తున్నాయి.

ఈ జూ ప్రధాన ఆకర్షణ ఒక కొమ్ము కలిగిన భారతీయ ఖడ్గ మృగాలు, రెండు కొమ్ములు కలిగిన ఆఫ్రికన్ ఖడ్గ మృగం. ఇక్కడి జంతువులు బోనుల్లో ఉండకుండా స్వేచ్ఛగా పరిసరాల్లో జీవిస్తాయి. 44 కంటే ఎక్కువ రకాల ఆర్చిడ్‌లు ఇక్కడ గమనించవచ్చు. బ్రహ్మపుత్రా నది ఒడ్డున సేదతీరిన గువాహటి అనేక సహజ సౌందర్యాలతో శోభిల్లుతోంది. బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న పీకాక్ దీవి ప్రపంచంలో మనుషులు నివాసమున్న అతి చిన్న దీవిగానూ పేరు పొందింది.

ఈ ద్వీపంపై ఉన్న ఉమానంద ఆలయం అద్భుతమైన నిర్మాణశైలితో గువాహటి నగరానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ ఆలయం చేరటానికి బ్రహ్మపుత్ర నది మీద లాంచీలో వెళ్ళాలి. ప్రయాణ సమయం 20 నిముషాలు, అంతకుముందు లాంచీ దాకా ఒక అర కిలోమీటరు దూరం నడవాలి. ఆ దారిలో ఓ నదీపాయ దాటటానికి సన్నటి బల్లమీద నుంచి వెళ్ళాలి. ఈ ఆలయం ఉన్న చిన్ని కొండను భస్మాచల్ లేదా భస్మకూట అంటారు. ఈ శిల్పాలు అస్సామీ శిల్పకళకు అద్దం పడతాయి. భారతదేశంలోని అత్యాధునికమైన ప్లానెటోరియంలలో ఒక ప్లానెటోరియం గువాహటి నగరంలోని ఎంజి రోడ్డులో ఉంది.

విలక్షణమైన గోపురం, ఏటవాలు గోడలు ఈ ప్లానెటోరియం ప్రత్యేకత. జపనీస్ గోటో జిఎక్స్ పరికరాన్ని సందర్శకుల సౌకర్యార్థం ఇక్కడ సంస్థాపించారు. అంతరిక్షం గురించిన రహస్యాలను చూడడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. సైన్స్ సెమినార్లకు, వర్క్, షాపులకు ఈ ప్లానెటోరియం వేదికగా నిలుస్తుంది.

భిన్నమైన ఆహారపు అలవాట్లు!

భిన్నమైన ఆహారపు అలవాట్లు!

అసోం సంస్కృతీ, సంప్రదాయాల నిలయం అసోం స్టేట్ మ్యూజియం. దిఘలిపుఖురి ట్యాంక్‌కి దక్షిణ చివరి భాగంలో ఉన్న ఈ మ్యూజియంలో పురావస్తు శాస్త్రం, శిలాశాసన శాస్త్రం, నాణేల సేకరణ శాస్త్రంతో పాటు ఐకనోగ్రాఫీకి సంబంధించిన కళాఖండాలు ఉన్నాయి. కమరుప అనుసంధాన్ సమితి (అసోం రీసెర్చ్ సొసైటీ) వారిచే 1940లో ఈ మ్యూజియం నిర్మితమయింది. ప్రాచీన ఆసోమీ నాణేలకు, గిరిజన కళలకీ, శిల్పాలకీ అలాగే సాంప్రదాయ వస్త్రాలకు ఈ మ్యూజియం ప్రసిద్ధి చెందింది.

రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలను ప్రోత్సహించడానికి ఈ మ్యూజియం హస్తకళలు, చేనేత ప్రదర్శనలను నిర్వహిస్తుంది. ఉత్తర భారతదేశపు అలవాట్లకు భిన్నంగా అసోం, మేఘాలయ రెండు రాష్ట్రాలలోను వరి అన్నం ప్రధానమైన ఆహారం. బియ్యపు పిండితో చేసిన పితాస్ అనబడే రకరకాల కేకులు అసోమీయులకు ఇష్టం. రెండు రాష్ట్రాల్లోను 'మోమోస్' ప్రఖ్యాత వంటకం. వెజ్, నాన్ వెజ్ ఉడికించినవేగాక వేయించిన మోమోస్ ఇష్టంగా తింటారు.

ఈ రాష్ట్రాల ప్రజలకు ప్రధానంగా మాంసాహారమే ఇష్టం. మేఘాలయలో పంది మాంసం ఆహారంలో భాగం కాగా, అసోంలో రకరకాల చేపలు ఇష్టమైన ఆహారం. పంది మాంసంతో చేసే 'జాడో' అనే వంట మేఘాలయ ప్రజలకు చాలా ఇష్టం. షిల్లాంగ్ నగరంలో బజార్లు తిరిగినపుడు పంది మాంసం కూడా విస్తృతంగా అమ్మడం చూశాం.

చివరగా వచ్చేటపుడు గువాహటిలో ప్రాగ్జ్యోతిక ఎంపోరియంలో అసోం హస్తకళలకు సంబంధించిన వస్తువులు, బొమ్మలు కొన్నాం. మేఘాలయ, అసోం స్మృతులను నెమరేసుకుంటూ విమానాశ్రయానికి వెళ్తుండగా దారిలో ప్లకార్డులు పట్టుకొని, కాలేజీ అమ్మాయిలు ప్రదర్శన చేస్తుండటం చూశాం.

మ‌హిళ‌ల‌పై దాడుల‌కు వ్య‌తిరేకంగా వారు ర్యాలీ చేస్తున్నారు. భిన్న సంస్కృతులు, భిన్న ఆచారాలు, భిన్న ఆలోచనలు అందరినీ కలిపి ఉంచేది మనమంతా మనుషులమనే వసుధైక భావనే కదా! ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలను, సంస్కృతిని కాపాడుకుంటూ, ఎదుటి వారి సంస్కృతిని గౌరవించడంలోనే కదా వైవిధ్యం ఉండేది. భిన్నత్వంలో ఏకత్వ భావనను కాపాడుకోగలిగేది. ఎన్నో అనుభ‌వాల‌ను మూటుగట్టుకుని ఆ అనుభ‌వాల‌ను మీతో పంచుకున్నందుకు సంతోషంగా ఉంది.

Read more about: assam guwahati
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X