
దేశంలోని పుణ్యక్షేత్రాలలో అమరకంటక్ ప్రముఖమైనది. దేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. దీనిని 'తీర్థరాజం' అని కూడా పిలువబడుతున్నది. యాత్రాస్థలాలకు రాజు అని కూడా అంటుంటారు. మధ్యప్రదేశ్ -ఛత్తీస్ ఘర్ సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆగ్నేయభాగంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది.
అమరకంటక్ చుట్టూ సాత్పూరా , మైకల్ పర్వత శ్రేణులు నెలకొని ఉన్నాయి. పురాణాల్లో అమరకంటక్ ను రిక్ష పర్వతం అని పేర్కొనబడినది. హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రంగా అమరకంటక్ 12కిలోమీటర్ల చుట్టుకొలతతో అలరారుతోంది. మహత్తరమైన నర్మదా మరియు సోనె నదులు ఇక్కడ ఆవిర్భవిస్తాయి. కాళిదాసు తన మేఘసందేశం రచనలో అమరకంటక్ ను అమరకూటంగా పేర్కొనబడినట్లు చెబుతారు.
అమర్ కంటక్ హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నది జన్మ స్థలం. ఇది మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో కలదు. ఉవెత్తున ఎగిసి పడే జలపాత అందాలతో, అద్భుత శిల్పకళ లతో ఉట్టిపడే దేవాలయాలతో అమర్ కంటక్ అలరారుతున్నది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది.

పురాణ గాథల ప్రకారం
శివుడు త్రిపురను దహించివేసినప్పుడు మూడు నిప్పులలో ఒకటి అమరకంటక్ లో పడింది. అది వేలాది శివలింగాలుగా మారిపోయాయి. వాటిలో ఒక శివలింగం ఇప్పటికీ జ్వాలేశ్వర్ లో పూజింపబడుతున్నది.
PC: : R Singh

స్వర్గప్రాప్తి
అమరకంటక్ ను సందర్శించిన శివుని ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించే వారికి స్వర్గప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. అలాగే అమరకంటక్ పర్వతాన్ని అధిరోహించిన వారికి పది మార్లు అశ్వమేధయాగం చేసినంత ఫలం లభిస్తుందని పద్మపురాణం ఆది కాండంలో తెలుపబడినది. భక్తులు పవిత్రమైన నర్మదా నదిలో మునిగి జ్వాలేశ్వరుని సందర్శిస్తారు.
PC: Mani M

నర్మదా నది:
మన దేశంలో ఉన్న పుణ్యనదులలో నర్మదానది 5వ స్థానంలో ఉంది. ఎక్కువగా ఈ నది గురించి హైందవ పురాణాలు, రామాయణం, మహాభారతాలలో నర్మాదానది ప్రస్థావన ఉంది.

నర్మదా నది:
నర్మదానదిలో లభిస్తున్న రాళ్ళను చాలా వరకు శివలింగాలుగా భావిస్తూ పూజిస్తున్నారు. ఈ రాళ్లను బణలింగాలు అంటారు. అవి సాధారణంగా స్థూపాకారంలో శివలింగాకృతిలో ఉంటాయి. జోహిలాకు చెందిన జ్వాలవంతి, మహానది, అమోద్ నదులు అమరకంటక్ పీఠభూమిలో ఆవిర్భవించాయి.

అమరకంటక్ నర్మదా నది జన్మస్థానం
అమరకంటక్ నర్మదా నది జన్మస్థానం అయినందున ఇక్కడ భక్తులు విశేష భక్తిశ్రద్దలతో పూజలు జరుపుతారు. అమరకంటక్ పర్యటన సందర్భంగా యాత్రికులు కపిలధార, కల్చూరి ఎరా, నర్మదా ఖండ్ ఆలయాలను సందర్శిస్తారు.

వింధ్య పర్వత రాజు
పురాణ గాధ పాపపరిహారార్థం పురూరవుడు తపస్సు చేస్తే.. శివుడు ప్రత్యక్షమై ‘నర్మదను దివి నుంచి భువికి పంపిస్తాను. మరి, నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచే వారెవర'ని ప్రశ్నిస్తాడట. వింధ్య పర్వత రాజు తన కుమారుడైన అమర్ కంటక్ అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మదా నదీమతల్లి దివి నుండి భువికి వచ్చిందని ఓ పురాణ గాథ.
PC:Wikimedia.

నర్మదా నది
నర్మదా నది స్థానిక మైకల్ కొండల్లో పుట్టి వింధ్య సాత్పురా పర్వత శ్రేణుల మధ్య నుండి 1290 కిలోమీటర్ల మేర ప్రవహించి, అరేబియా సముద్రంలో ఐక్యమవుతుంటుంది. పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియాలో ఐక్యమయ్యే నదుల్లో నర్మదా, తపతి నదులు పేరెన్నికగన్నవిగా చెప్పవచ్చు.
PC: Yajuvendra Upadhyaya

నర్మదామాత గుడి
నర్మదానది పుట్టిన చోటనే నర్మదామాత గుడి వెలసింది. నర్మదామాత ఆలయం క్రీ. శ 10-11 వ శతాబ్దం మధ్యకాలంలో చేది రాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది.
PC: Uttam Kumar Chatterjee

ప్రతి శివరాత్రికి
ప్రతి శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ జాతరలు జరుగుతుంటాయి. శివరాత్రి ఇక్కడ జరిగే జాతరలలో పెద్దది. నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతిదేవితోపాటు శివుడు, సీతా రాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి.
Image Courtesy: Prithwiraj Dhang

ఆలయ ప్రాంగణంలో చెక్కిన రాతి ఏనుగుబొమ్మ
నర్మదామాతను దర్శించే ముందు ఆలయ ప్రాంగణంలో చెక్కిన రాతి ఏనుగుబొమ్మ ఉంటుంది. ఆ ఏనుగుబొమ్మ కాళ్ల మధ్యనుంచి దూరి ఒక వైపు నుండి మరో వైపునకు వెళ్ళాలి. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే ఇక్కడ ఎక్కువగా ఆశ్రమాలు కూడా ఉన్నాయి.
PC: LRBurdak

ఆధ్యాత్మక కేంద్రాలు
నర్మదామాత ఆలయానికి దగ్గర్లో శ్రీ శంకరాచార్య ఆశ్రమం, బర్ఫానాశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్ జైన్ మందిరం, మాయికీ బగియా గా వ్యవహరించే దేవతావనం, యంత్ర మందిరం తదితర ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. యంత్ర మందిరానికి దగ్గర్లోనే సోనే నది పుట్టిన స్థలం, రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతాలనూ వీక్షించవచ్చు. ఇలా దేశంలో ప్రముఖ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.
Image Courtesy: Prithwiraj Dhang

కపిల ధార జలపాతం ఓంకార శబ్దంతో
కపిలధార అమర్ కంటక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే కపిల ధార అనే జలపాతం ఉన్నది. నర్మదానది కపిల ధార వద్ద ఒక లోయగుండా ప్రవహిస్తుంటుంది. 100 అడుగుల ఎత్తు నుంచి దూకే కపిల ధార జలపాతం ఓంకార శబ్దంతో దూకుతుంటుందని, ఆ నాదం వినేందుకే చాలామంది పర్యాటకులు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు.
Image Courtesy: Khochchore

అమర్ కంటక్ ఎలా చేరుకోవాలి ?
వాయు మార్గం
బిలాస్పూర్ విమానాశ్రయం(117 కి. మీ) అమర్ కంటక్ కు సమీపాన ఉన్నది.
రైలు మార్గం
పేంద్ర రోడ్డు(17 కి. మీ) అమర్ కాంటక్ కు సమీపాన ఉన్నది. ఇదేకాక అమర్ కంటక్ కు సమీపాన కరొంజి అనే మరో రైల్వే స్టేషన్(245 కి. మీ) కలదు. ఇక్కడి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రైళ్లు వస్తుంటాయి.
బస్సు / రోడ్డు మార్గం
అమర్ కంటక్ కు అనుప్పూర్(48 కి. మీ) నుండి రెగ్యూలర్ బస్సులు, టాక్సీ లు లభ్యమవుతాయి. షాదోల్, ఉమారియా, బిలాస్పూర్ , జబల్పూర్, రేవా ప్రాంతాల నుండి కూడా బస్సు సర్వీసులు నడుస్తాయి.
చిత్ర కృప : buddha13684