» »మంత్రముగ్ధులను చేసే - చైల్

మంత్రముగ్ధులను చేసే - చైల్

Written By: Venkatakarunasri

చైల్ .. పాటియాలా రాజు మహారాజా భూపిందర్ సింగ్ యొక్క వేసవి విడిది. బ్రిటీష్ వారు ఈయన్ను రాజ్య బహిష్కరణ చేసినప్పుడు, ఒక్కడే గుర్రం మీద స్వారీ చేస్తూ .. చేస్తూ చైల్ ను సమీపిస్తాడు. ఆ ప్రదేశాన్ని చూసిన రాజు అక్కడే తలదాచుకోవాలని అనుకుంటాడు. అప్పటి నుండి ఇదే ఆయనకు వేసవి విడిదిగా వస్తూ వచ్చింది. భూపిందర్ సింగ్ చైల్ లో ఉన్నప్పుడు ఒక అందమైన ప్యాలెస్ ను నిర్మించుకున్నాడు.

చుట్టూరా సుందరమైన దృశ్యాలు, అడవులు మరియు పర్వతాలు చైల్ యొక్క అందాల్ని మరింత రెట్టింపు చేస్తాయి. ఇవే రాజును కూడా ఆకర్షించాయి కాబోలు. అన్నట్లు చైల్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. సిమ్లా దీనికి సమీపాన గల ప్రధాన పట్టణం. అటు ఇటు ఒక 56 కి. మీ లు ఉంటుంది. సముద్ర మట్టానికి 2226 మీటర్ల ఎత్తులో కొండ పై నెలకొని ఉన్న ఈ అందమైన పర్వత ప్రాంతం మంత్రముగ్ధులను చేసే పిక్నిక్ స్థలాలను కలిగి ఉన్నది. మరి ఇంకెందుకు ఆలస్యం కొండ మీద ఎక్కి అక్కడున్న సుందర ప్రదేశాలను దృశ్యాల రూపంలో ఒక లుక్ వేద్దాం పదండి .. !

చైల్ ప్యాలెస్

చైల్ ప్యాలెస్

క్రీ.శ. 1891 వ సంవత్సరంలో భూపిందర్ సింగ్ చే నిర్మించబడ్డ చైల్ ప్యాలెస్ 70 ఎకరాల్లో విస్తరించి ఉన్నది. రాజ్ ఘర్ హిల్స్ పై ఉన్న ఈ ప్యాలెస్ చుట్టూ పైన్ వృక్షాలు, దేవదారు వృక్షాలు పర్యాటకులను కనువిందు చేస్తాయి.

చైల్ వైల్డ్ లైఫ్ సాన్చూరీ

చైల్ వైల్డ్ లైఫ్ సాన్చూరీ

పాటియాలా రాజులు మొట్ట మొదటిసారిగా ఈ వైల్డ్ లైఫ్ సాన్చూరీ ని వేటకై కేంద్రగా ఎంచుకున్నారు. తర్వాత ఇది ప్రభుత్వపరమైనది. సాన్చూరీ చుట్టూ దట్టమైన పైన్ వృక్షాలు, సింధూర వృక్షాలు, పచ్చిక బయళ్ళు ఉన్నాయి. హిమాలయన్ బ్లాక్ బీర్, ఎలుగుబంట్లు, రెడ్ డీర్, లంగూర్ మొదలగినవి ఇక్కడ చూడవచ్చు.

గురుద్వారా సాహిబ్

గురుద్వారా సాహిబ్

గురుద్వారా సాహిబ్ పాండవ హిల్స్ పై ఉన్నది. ఇది సిక్కుల మత కేంద్రం అయినప్పటికీ అన్ని మతాల ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. గురుద్వారా గోవా లోని చర్చివలే నిర్మాణాన్ని పోలి ఉంటుంది. చుట్టూ ప్రకృతి దృశ్యాలు మంత్రముగ్ధులను చేస్తాయి. కొండ మీదకు చేరుకోవటం ఒక అనుభూతి కూడా.

సిద్ద బాబా కా మందిర్

సిద్ద బాబా కా మందిర్

సిద్ద బాబా కా మందిర్ ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. భూపిందర్ సింగ్ రాజు ఈ ప్రదేశంలో ప్యాలెస్ ను నిర్మించాలని భావిస్తే .. కలలో ఒక సాధువు కనపడి ఈ ప్రాంతంలోనే ఆలయాన్ని నిర్మించాలని ఆదేశిస్తాడట. అందువల్ల రాజు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం చుట్టూ ఉన్న అందమైన పరిసరాలు పిక్నిక్ స్పాట్ వలె వ్యవహరిస్తున్నాయి.

క్రికెట్ గ్రౌండ్

క్రికెట్ గ్రౌండ్

బహుశా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎత్తైన క్రికెట్ మైదానంగా చైల్ లోని క్రికెట్ గ్రౌండ్ పేరొందింది. ఇది సముద్ర మట్టానికి 2444 మీటర్ల ఎత్తున ఉండి , చుట్టూ పైన్ మరియు దేవదారు వృక్షాలతో నిండి ఉన్నది. ఈ గ్రౌండ్ ప్రస్తుతం అక్కడే ఉన్న చైల్ మిలిటరీ స్కూల్ వారి ఆధ్వర్యం లో నడుస్తున్నది.

కాళీ కా టిబ్బా

కాళీ కా టిబ్బా

రాజమాత కాటేజ్ అయిన బ్లాసం అనే పేరుగల కొండ మీద కాళీ కా టిబ్బా మందిరం ఉన్నది. ఇందులో ప్రధాన దైవం కాళీ మాత. ఈ ఆలయం నుండి చుర్ధార్ పీక్ మరియు శివాలిక్ రేంజ్ పర్వతాల అద్భుతమైన వీక్షణలను గమనించవచ్చు.

సాధుల్పూల్

సాధుల్పూల్

సాధుల్పూల్ ప్రధాన పర్యాటక మజిలీ. ఇక్కడ పర్యాటకులు తరచూ వస్తుంటారు. ఇక్కడ నిర్మించిన వంతెన పర్యాటకులను అలరిస్తున్నది. చుట్టూ సుందర దృశ్యాలు తప్పక వీక్షించాలి.

చైల్ ఎలా చేరుకోవాలి ?

చైల్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం

చైల్ ప్రదేశానికి సమీపాన 63 కి. మీ ల దూరంలో జుబ్బార్ హతి విమానాశ్రయం కలదు. ఢిల్లీ, ముంబై, డెహ్రాడూన్, చండీఘర్ తదితర నగరాల నుండి ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానించబడింది. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి చైల్ చేరుకోవచ్చు.

రైలు మార్గం

చైల్ సమీపాన 36 కి మీ ల దూరంలో కల్కా రైల్వే స్టేషన్ కలదు. అలాగే 100 కి. మీ ల దూరంలో చండీఘర్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. ఇది దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో, పట్టణాలతో కలుపనడింది.

రోడ్డు / బస్సు మార్గం

సిమ్లా, చండీఘర్, ఢిల్లీ, డెహ్రాడూన్ వంటి ప్రాంతాల నుండి ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు చైల్ కు నడుస్తాయి.