
గోవా పర్యటనలో మా రెండో రోజు... ఉదయం బైక్‌పై నోవెల్ ఎవియేషన్ మ్యూజియానికి వెళ్లాం. లోపల ఏర్పాటు చేసిన ఐఎన్‌ఎస్ విక్రాంత్, ఐఎస్‌ఎస్ విరాట్ మోడల్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. తర్వాత దగ్గరలోని 'కోటిగో వైల్డ్‌లైఫ్ సాంక్చురీ'కి చేరుకున్నాం. అక్కడి పక్షులు, జంతువులు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సిటీ లైఫ్‌నుంచి ప్రకృతి ఒడిలోకి వచ్చినట్లు అనిపించింది. దగ్గరలోని కాలంగూట్ బీచ్‌కు వెళ్లాం. అక్కడ జ్యువెలరీ మార్కెట్ ఎంతో సందడిగా కనిపించింది. ముఖ్యంగా ఫంకీ జ్యువెలరీ ఎక్కువ. చాలా మోడల్స్‌లో తేలికైన లోహపు ఆభరణాలతోపాటు బరువైన లోహపు ఆభరణాలు ఉన్నాయి. వెదురు, చెక్కతో చేసిన నెక్లెస్‌లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. వాటితోపాటు లెదర్ గూడ్స్, దుస్తులు కూడా ఉన్నాయి. అయితే, గోవాలో ఏ వస్తువు కొనాలన్నా పర్సుకు పనిచెప్పాల్సిందే అని అర్థమైంది. కళ్లు చెదిరేలా ఉన్నాయి అక్కడి ధరలు.

లెక్కలేనన్ని తీరపు అందాలు...
నార్త్‌గోవాలో కాలంగూట్ బీచ్‌తోపాటు వాగేటర్ బీచ్, సింఖోరిమ్ బీచ్, మిరామర్ బీచ్‌లు పర్యాటకులను సేదదీరుస్తుంటాయి. గోవా పర్యటనలో తరచూ గుర్తొచ్చే బీచ్‌లను కొద్దిసేపు పక్కన పెడితే, లెక్కలేనన్ని ఆలయాల గూర్చి చెప్పుకొచ్చారు. సమయం తక్కువగా ఉండటంతో మేం వాటన్నింటినీ చూడలేకపోయాం. ఇక్కడ పురాతన చర్చిల జాబితా కూడా ఎక్కువే. ప్రతి చర్చి నిర్మాణ శైలీ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంది. ఇక కోటల జాబితాలో చపోరా ఫోర్ట్‌తోపాటు అగుడా ఫోర్ట్, లైట్ హౌస్ ఆఫ్ ఫోర్ట్ అగుడా, కాబో డి రామ్ ఫోర్ట్, శివాజీ ఫోర్ట్, తిరాకోల్ ఫోర్ట్‌లు పేరుగాంచాయి. గోవాలో ఇంకా చూడాల్సినవి అర్వాలేం గుహలు, మాండవి బ్రిడ్జి, మ్యూజియం, నేత్రావళి జలపాతం, కళా ఆకాడమీలు. గోవా ప్రకృతి ప్రేమికులతోపాటు పక్షి ప్రేమికులకు కనువిందు చేసే ప్రదేశం అనడానికి నిదర్శనం సలీం అలీ బర్డ్ సాంక్చురీ. ప్రముఖ ఆర్నిథాలజిస్టు సలీం ఆలీ పేరునే దీనికి పెట్టారట!

సరికొత్త రుచుల సమ్మేళనం..
సరికొత్త రుచులు ఆస్వాదించేవారికి గోవా పర్యాటకం కేరాఫ్ అడ్రస్ అని అర్థమైంది. సముద్రపు చేపలతో తయారు చేసిన కూరలు ఇక్కడి ప్రత్యేకం. కొబ్బరి, మసాలా దినుసులు, జీడిమామిడి, మిర్చి వంటి ద్రవ్యాలతో తయారు చేసే రుచికరమైన వంటకాల ఘుమఘుమలు నోరూరించాయి. ముఖ్యంగా జీడిమామిడి, కొబ్బరి కల్లు నుంచి తయారు చేసిన 'ఫెన్నీ' అనే పానీయం ఇక్కడి ప్రత్యేకత. బెబింకా గోవా సంప్రదాయ వంటకం. ఇది భోజనం తర్వాత తీసుకునే డెజర్ట్. మైదా, చక్కెర, నెయ్యి, కోడిగుడ్డు సొన, కొబ్బరిపాలతో చేస్తారు. దీని తయారీ గురించి ఓ చెఫ్‌తో మాట్లాడి తెలుసుకున్నాం. మొదటగా పిండిని ఏడు నుంచి 16 పొరలుగా చేసి ఒవెన్‌లో ఉడికించాలి. తర్వాత బాదం పలుకులతో గార్నిష్ చేయాలి. అంతే, గోరువెచ్చటి బెబింకాను ఐస్‌క్రీమ్‌తో సర్వ్ చేస్తే ఆ రుచేవేరు. ఇది పది రోజుల వరకూ తాజాగా ఉంటుందట! ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా మా నోటికి పనిచెప్పాం.

ఎక్కడ విడిది చేయాలి?
గోవాలో సందర్శకులు విడిది చేసేందుకు చాలా హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. మన బడ్జెట్‌ను బట్టీ రోజుకు వెయ్యి నుంచి లక్ష రూపాయల వరకూ ఖరీదైన రూమ్‌లు అద్దెకు దొరుకుతాయి. సీజన్‌లో అయితే ఈ రేట్లు నాలుగైదు రెట్లు పెరుగుతాయని అక్కడివారు చెబుతున్నారు. అలాగే ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు మంచి ప్యాకేజీ ఆఫర్స్‌కూడా ఉంటాయట! మరెందుకు ఆలస్యం, ఇక మీ ప్రయాణాన్ని మొదలుపెట్టండి..!