Search
  • Follow NativePlanet
Share
» » ప‌ర్యాట‌క పాల‌కోవా... అందాల గోవా!

ప‌ర్యాట‌క పాల‌కోవా... అందాల గోవా!

ఎటువైపు చూసినా అన్నివైపుల నుంచి వినిపించే సముద్రపు అలల సవ్వడులు.. తీరం మీదుగా వీచే పిల్లగాలుల అల్లరి కేరింతలు.. సముద్ర తీరపు అందాలను మించిన చారిత్రక కోటల నిర్మాణశైలి. పర్యాటకానికే రాజధానిగా పేరొందిన గోవా అందాలు గురించి ఇలా ఎంత చెప్పినా తక్కువే! అందుకే ప్రకృతి సోయగాల ప‌ర్యాట‌క పాల‌కోవా... గోవా తీర‌పు అందాల‌ను చూసొద్దాం రండి!!

goa activities

బెంగళూరులోని మడివాలా నుంచి సాయంత్రం 6.30కి గోవా వెళ్లేందుకు స్లీపర్‌ బస్సులో బయలుదేరాం. ఎన్‌ హెచ్‌ 48 మీదుగా సాగింది మా ప్రయాణం. ఉదయం ఎనిమిది అయ్యేసరికి గోవా చేరుకున్నాం. ప్రధానంగా గోవా అందాలు చూడాలంటే రెండు భాగాలుగా విభజించుకోవాలి. అవి నార్త్‌ గోవా, సౌత్‌ గోవా. ఈ రెండు ప్రాంతాలలోనూ పేరొందిన బీచ్‌లు ఉన్నాయి. మేం నార్త్‌ గోవాలోని మపుసా బస్టాండ్‌లో దిగాం. బస్టాండ్‌కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న 'ఓషియ‌న్‌ వ్యూ రిసార్ట్స్‌'లో విడిది చేసేందుకు రూమ్‌ను ముందుగానే బుక్‌ చేసుకున్నాం. అక్కడికి వెళ్ళేందుకు ఆటో అయితే మూడు వందలు, టాక్సీ అయితే ఐదు వందలు అవుతుందన్నారు. పది కిలోమీటర్లకు అంత చార్జీనా? అనుకుంటున్నారా, ఎంతయినా గోవా కదా! ఇద్దరమే ఉండటంతో మేం ఆటోలో వెళ్లేందుకే మొగ్గు చూపాం. అంజునా బీచ్‌ ఒడ్డున ఉంది మా రిసార్ట్స్‌. మొత్తం చెక్కతో నిర్మించిన రిసార్ట్స్‌ మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. మాకు కేటాయించిన గదిలోంచి చూస్తే బీచ్‌ వ్యూ అదిరిపోయిందంటే నమ్మండి! అలా బీచ్‌ అందాలను చూస్తుండగానే టిఫిన్‌ వచ్చింది. గోవాలో ఎక్కువగా నార్త్‌ ఇండియన్‌ ఫుడ్‌ దొరుకుతుంది. అప్పటికే అలసిపోయి ఉండటంతో ఓ గంట విశ్రాంతి తీసుకున్నాం.

goa activities

ప్రకృతి ఒడిలో హాయిగా..!

సరిగ్గా పదకొండు గంటలకు రిసార్ట్స్‌ నుంచి బయటకు వచ్చాం. గోవాలో ట్రాన్స్‌పోర్ట్‌ చాలా ఖరీదు. అయితే ఇతర పర్యాటక ప్రాంతాలలో లేని ఓ మంచి సదుపాయం ఇక్కడ ఉంది. అదే రెంటెడ్‌ వెహికల్స్‌. అడుగడుగున ఈ వెహికల్స్‌ దర్శనమిస్తాయి. హైరేంజ్‌ స్పోర్ట్‌ బైక్‌ మొదలుకుని చిన్న మోపెట్‌ వరకూ అన్నీ అందుబాటులో ఉంటాయి. బైక్‌ రెంట్‌కు తీసుకునేందుకు డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరి. గుర్తింపు కార్డు జిరాక్స్‌ను యజమానులకు అందించాల్సి ఉంటుంది. రోజులో ఏ సమయంలో బైక్‌ తీసుకున్నా ఉదయం తొమ్మిది గంటలకు రోజు పూర్తయినట్లు లెక్కిస్తారు. మేం యాక్టివాను తీసుకున్నాం. ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలోని 'బాగా' బీచ్‌లో పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెప్పారు. దాంతో 'బాగా' బీచ్‌కు బయలుదేరాం.

goa adventurers

శిథిలావస్తలో ఉన్నప్ప‌టికీ...

జనావాసాల మధ్యగుండా ఉన్న ఆ చిన్న రోడ్డుపొడవునా శుభ్రత ఆశ్చర్యం కలిగించేలా ఉంది. 'బాగా' తీరంలో కొంతసేపు సేదతీరాం. అక్కడికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న చపోరా ఫోర్ట్‌కు బయలుదేరాం. అక్కడ సూర్యాస్తమయం చాలా బాగుంటుందని కొందరు చెప్పారు. వారి మాటలు నూటికి నూరు శాతం నిజమని అక్కడికి వెళ్లాక తెలిసింది. సముద్రంలోకి చొచ్చుపోయినట్లు శిథిలావస్తలో ఉన్న ఆ కోట నిర్మాణం మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది. ఆ చల్లని సాయంత్రపువేళ శతాబ్దాల చారిత్రక విశిష్టతగల కోట అందాలు అక్కడి ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తాయి. కోటలోపలికి సాయంత్రం ఐదు గంటల తర్వాత అనుమతి ఉండదు. మా ప‌ర్య‌ట‌నలోని మ‌రిన్ని అనుభ‌వాలు రెండో భాగంలో...!

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X