Search
  • Follow NativePlanet
Share
» »ర‌హ‌స్యాల నిల‌యం... గుత్తికొండ బిలం!

ర‌హ‌స్యాల నిల‌యం... గుత్తికొండ బిలం!

ప్రకృతి ఒడిలో దాగిన రహస్యాలు తెలుసుకునేందుకు సుదూర ప్రాంతాలకే వెళ్లనవసరం లేదు. రాష్ట్ర కేంద్రానికి చేరువలో ఉన్న గుత్తికొండ బిలానికి వెళితే చాలు. చారిత్రక ఆనవాళ్లకు.. ప్రకృతి శోభాయమానానికి ప్రతీకగా నిలుస్తోంది.. చారిత్ర‌క నిల‌యం ఈ పర్యాటక ప్రాంతం. చుట్టూ ఎత్తయిన కొండలు ఓవైపు... పరవళ్లు తొక్కే కృష్ణా జలాల సవ్వడులు మరోవైపు.. ఈ ప్రదేశాన్ని సందర్శనీయ ప్రాంతంగా పర్యాటకులకు పరిచయం చేస్తున్నాయి. ఇరుకైన సొరంగ మార్గాల్లో మేం వేసిన అడుగుల అనుభవాలు మీ కోసం!!

విజయవాడ నుండి గుత్తికొండ బిలం వెళ్లేందుకు వాహనంలో బయలుదేరాం. గుంటూరు నరసరావుపేట మీదుగా సుమారు 130 కిలోమీటర్లు ప్రయాణం. నరసరావుపేట - మాచర్ల రోడ్డులో కొంత దూరం ప్రయాణించిన తర్వాత మా టూర్లో అసలైన ఎంజాయ్‌మెంట్‌ కనిపించింది. రోడ్డుకు ఇరువైపులా గుబురుగా పెరిగిన చింతచెట్లు భలే కనువిందు చేశాయి. చుట్టూ పచ్చని పంట పైరు... సన్నని రోడ్డు మార్గంలో దూసుకుపోతోన్న తోటి వాహనాలు ఒకింత ఆసక్తిని రేకెత్తించాయి. అలా సుమారు ఎనిమిది కిలోమీటర్ల తర్వాత గుత్తికొండ గ్రామం బోర్డ్ కనిపించింది. అక్కడే మా వెహికల్ నిలిపి, గుహలను ఎలా చేరుకోవాలో అక్కడి ఓ పిల్లాడిని అడిగాం. మా బృందాన్ని చూసి ఏమనుకున్నాడో తెలియదు కానీ, రూట్ చాలా వివరంగా చెప్పుకొచ్చాడు. ఊర్లోకి వెళ్లకుండా ముందే ఉన్న మెటల్ రోడ్డు గుండా వెళ్లాలని సూచించాడు.

gothikondacaves

స్వచ్ఛ‌మైన నీటి కళకళలు...

అదే మార్గంలో రెండు కిలోమీటర్లు ముందుకు వెళ్ళాం. ఓ ఎత్తయిన మట్టి గుట్ట ఎదురైంది. దానిపైకి బండిని పోనిచ్చాం. అక్కడే పరవళ్ళు తొక్కుతూ స్వచ్చమైన నీటితో కళకళలాడుతోంది బుగ్గా డ్యాం రిజర్వాయర్ ఎన్ ఎస్ పి రైట్ కెనాల్. చుట్టూ ఎత్తయిన కొండలు.. పచ్చని ప్రకృతి అందాలు మా బృందాన్ని బండి దిగేలా చేశాయి. ఆ చ‌ల్ల‌ద‌నానికి అక్కడే కాసేపు సేదదీరాం. కాలువలోని నీటిని చేరేందుకు రెండు వైపులా మెట్లను నిర్మించారు. అయితే ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల అందులోకి దిగే సాహసం చేయలేదు. అయితేనేం ఆ అనుభూతులు నిండిపోయేలా సెల్‌ఫోన్లకు పని చెప్పాం. కెనాల్‌కు అవ‌త‌లివైపు కిలోమీట‌ర్ దూరంలో మేం చేరుకోవాల్సిన గుత్తికొండ బిలం మాకు సాద‌ర ఆహ్వానం ప‌లుకుతున్న‌ట్లు క‌నిపించింది.

gothikondacaves

మ‌న‌సుల్లో మ‌రింత నాటుకుపోయేలా.....

మొత్తానికి కొండ ద‌గ్గ‌ర‌కు చేరుకున్నాం. చుట్టూ ప‌చ్చ‌ద‌నం క‌మ్మేసిన ప్ర‌కృతి అందాలు మ‌న‌సుకు హాయిని క‌లిగించాయి. అక్క‌డ మొత్తం ఏదో తెలియ‌ని ఆధ్యాత్మిక చింత‌న క‌లిగిన వాతావ‌ర‌ణం. అక్క‌డ ఆశ్ర‌మంతోపాటు ఆల‌యాల‌తో నిండుగా క‌నిపించింది ఆ ప్రాంతం. కొండ‌పైకి వెళ్లేందుకు సిద్ధ‌మ‌వుతోన్న మా బృందానికి గుబురు పొద‌ల మ‌ధ్య ఓ నిలువెత్తు స్థూపం క‌నిపించింది. దాని గురించి తెలుసుకునేందుకు ప్ర‌య‌త్నించాం. ఆధ్యాత్మిక, ప‌ర్యాట‌క కేంద్ర‌మైన గుత్తికొండ బిలానికి క‌మ్యూనిస్టు ఉద్య‌మ‌ వేదికగా కూడా పేరుంద‌ని తెలిసింది. 1968లో పీపుల్స్ వార్ స‌మావేశాలు ఈ బిలంలోనే ర‌హ‌స్యంగా సాగాయ‌ట‌. త‌ర్వాత కాలంలోనూ ఈ బిలం అనేక ర‌హ‌స్య స‌మావేశాల‌కు వేదిక‌యింద‌ని, దానికి గుర్తుగానే ఈ స్థూపాన్ని ఏర్పాటు చేశార‌ని స్థానికులు చెబుతున్నారు. చుట్టూ కొండ‌లు ఉన్న‌ప్ప‌టికీ అంత‌టి పెద్ద స‌మావేశాలు అక్క‌డ ర‌హ‌స్యంగా జ‌రిగేందుకు అవ‌కాశాలు ఉన్నాయంటే మాకు న‌మ్మ‌శ‌క్యం కాలేదు. రిస్క్ అయినా స‌రే గుత్తికొండ‌ బిలంలోప‌ల‌కి వెళ్లాల‌నే కోరిక ఆ క్ష‌ణంలో మా బృంద స‌భ్యుల మ‌న‌సుల్లో మ‌రింత నాటుకుపోయేలా చేసింది. మ‌రిన్ని విశేషాలు రెండో భాగంలో....!

Read more about: vijayawada guthikonda
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X