Search
  • Follow NativePlanet
Share
» »తిరుమ‌ల‌లో దాగిన జ‌ల‌పాతాల స‌వ్వ‌డులు..

తిరుమ‌ల‌లో దాగిన జ‌ల‌పాతాల స‌వ్వ‌డులు..

తిరుమ‌ల‌లో దాగిన జ‌ల‌పాతాల స‌వ్వ‌డులు..

చిత్తూరు జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తుకొచ్చే విషయం తిరుమల. కానీ, ఆ తిరుమల కొండల మాటున దాగిన ఎన్నో సహజసిద్ధ ప్రకృతి అందాలు చాలామందికి తెలియదు. ఈ సీజన్‌లో ఇక్కడి ప్రాంతమంతా జలపాతాల పరవళ్లతో పర్యాటకులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అందుకే తిరుపతికి దగ్గరగా ఉన్న కొన్ని జలపాతాలా విశేషాలు మీకోసం..

హైద‌రాబాద్‌కు చెందిన మా మిత్ర‌బృందం తిరుపతి చుట్టుపక్కల ఉండే జలపాతాల గురించి అన్వేషించాల‌నుకుంది. అయితే, తిరుపతి గురించి ఎవ్వరిని అడిగినా ఆలయం గురించి తప్ప ఇంకేం లేనట్లు మాట్లాడుతూ వ‌చ్చారు. అయితే, తిరుపతిలో స్థానికంగా ఉన్న ఓ మిత్రుడు మాత్రం అక్క‌డి ప్రకృతి అందాలను మాకు చూపించేందుకు ఆహ్వానం ప‌లికాడు. ఒక్క క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా మా సొంత వాహ‌నంలో తిరుప‌తికి బయలుదేరాం. అక్క‌డికి వెళ్లాక‌ ముందుగా పుత్తూరు మార్గంలోని మూలకోనకు వెళ‌దామ‌ని నిర్ణయించుకున్నాం. అలా ఉదయం ఎనిమిది గంటలకు మా ప్రయాణం మొదలైంది.

మూలకోన జలపాతం

మూలకోన జలపాతం

మార్గం మధ్యలో టిఫిన్ తినడానికి తిరుచానూరులోని రోడ్డు పక్కన ఆగాం. ఓ చిన్న హోటల్లో గుడ్డు దోశలు తిన్నాం. వాటి రుచి చూసిన మేమంతా తిరుపతిలో ఫుడ్డు... లడ్డూ కంటే బాగుందే అనుకుంటూ మాలోమేమే స‌ర‌ద‌గా న‌వ్వుకుంటూ ప్ర‌యాణాన్ని కొన‌సాగించాం. అక్కడ నుంచి పూడి రోడ్డు గుండా వడమాలపేట చేరుకున్నాం. అక్కడ ఆగి, మసాలా సోడాలు తాగాం. అక్కడికి మేం చేరుకోవాల్సిన మూలకోన ఓ 23 కిలోమీటర్లు ఉండటంతో తొందరగా బయలుదేరాం. సరిగ్గా గంటలో మూలకోనకు చేరుకున్నాం.

రాళ్లు, రప్పలు ఎక్కువగా ఉండటంతో రెండు కిలోమీటర్లు కాళ్లకు పని చెప్పాల్సి వచ్చింది. దారిపొడవునా పెద్దపెద్ద వృక్షాలు దర్శనమిచ్చాయి. వాటి ఆకారం చూడగానే అవతార్ సినిమాలోని చెట్లు మదిలోకొచ్చాయి. కనుచూపుమేరా పచ్చదనం ఆవహించడంతో సిటీకే ప‌రిమితం అయిన మేమంతా ఒకింత ఆశ్చర్యంలో మునిగిపోయాం. ఆ చెట్లపై గుంపులుగా ఉన్న కోతులు హాలీవుడ్ సినిమాల్లో హీరోల్లా స్టంట్స్ చేస్తున్నాయి. వాటిని చూడగానే ఈ కోతులకు పీటర్ హెయిన్స్ ఏమన్నా ట్రైనింగ్ ఇచ్చాడా? అని మా మిత్రులు చలోక్తులు విసిరారు. ఇంకొంచెం లోపలికి వెళ్లగానే ఇళయరాజా సంగీతంలాంటి శబ్దం వినపడింది. అది ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న మూలకోన జలపాత శబ్ధమని అర్థమైంది.

అక్కడికి దగ్గరలోనే పురాతన శివలింగం ఉన్న ఆలయాన్ని సందర్శించాం. అక్కడున్న వానర సైన్యాలు మమ్మల్ని గ్రహాంతరవాసులను చూసినట్లు వింతగా చూడసాగాయి. అనంతరం ముందుకెళ్లి జలపాతంలో స్నానం చేయడంతో మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. అక్కడ ఉన్న ప్రవాహంలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంది.

కైలాసకోన

కైలాసకోన

అక్కడినుంచి అడవి మార్గం గుండానే కైలాసకోనకు బయలుదేరాం. ఈ దారిలోనూ వానర విన్యాసాలు భలే కనువిందు చేశాయి. అక్కడకు 25 కిలోమీటర్లు ఉండటంతో మధ్యలో పుత్తూరు దగ్గర రూ.60 ఇచ్చి, మంచి శాకాహార భోజనం చేశాం. అక్కడి నుండి బయలుదేరి, కైలాసకోన వద్దకు చేరుకున్నాం. అది చిన్న మెటల్ రోడ్డు. ఆ దారిలో షేర్ ఆటోలు ఎదురుగా రావటంతో వెళ్లడానికి కొంత ఇబ్బంది కలిగింది. అక్కడకు చేరుకోగానే ఏపీ టూరిజం గెస్ట్ హౌస్ దర్శనమిచ్చింది.

రూముల వివరాలు తెలుసుకోవడానికి మిత్రులు ఆసక్తి చూపడంతో లోపలికి వెళ్లి విచారణ చేశాం. రూముల అద్దె రోజుకు 500 రూపాయల నుంచి ఉన్నాయని వారు తెలిపారు. అయితే, ప్రస్తుతం అవి అందుబాటులో లేవని చెప్పారు. అనంతరం ముందుకు వెళ్లగానే 20 అడుగుల జలపాతం కనువిందు చేసింది. అక్కడున్న కొలనులు ఎంతో ఆహ్లాదభరితంగా ఉన్నాయి. వాటిలోకి దిగడానికి ఇబ్బంది లేకపోయినా మిత్రులు ఉత్సాహం చూపకపోవడంతో (అప్పటికే స్నానం చేసి ఉండటం వల్ల) అక్కడ ఉన్న ప్రకృతి అందాలను గంటసేపు ఆస్వాదించాం.

గెస్ట్ హౌస్ ఎదురుగా ఉన్న ఉద్యాన‌ వనం పిల్లలు ఆడ‌డానికి అనువుగా ఉంది. దాని విస్తీర్ణం చాలా ఎక్కువ ఉందని అక్కడివారు చెప్పారు. దానిలో కొంతసేపు సేద తీరిన అనంతరం 3.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాం. ఆ రహదారి ఖాళీగా ఉండటంతో స్పీడుగా వెళ్లడానికి ప్రయత్నించాం. మధ్యలో కుంభకోణం ఫిల్టర్ కాఫీ ఉండటంతో మిత్రులకు రుచి చూపించడానికి అక్కడ ఆగాం. ఒక్కో కాఫీ ఇరవై రూపాయలు. వెంటనే ఆరు కాఫీలు ఆర్టర్ ఇచ్చాం. అవి రావడానికి 10 నిమిషాలు పట్టింది. వాటిని తాగగానే బృంద‌స‌భ్యులు అక్కడ అమ్ముతున్న కాఫీ పౌడర్‌ను కొనుక్కునేందుకు మొగ్గు చూపారు. దాని ధర రూ.180 రూపాయలు. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి తడకు వద్దకు చేరుకున్నాం.

సదాశివకోన

సదాశివకోన

తడకు కుడివైపుగా వెళ్తే సదాశివకోన వస్తుందని అక్కడి వారు చెప్పడంతో చూసి వెళ్లాల్సిందే అని మేమంతా పట్టుబట్టాం. నేరుగా బయలుదేరి సదాశివకోనకు ఐదు కిలోమీటర్ల దూరంలోని కొలను వద్ద మా వాహ‌నాన్ని పార్క్ చేశాం. అక్కడ నుంచి నడిచి మాత్రమే వెళ్లాలని తెలిసి నిరుత్సాహంగానే అటువైపుగా అడుగులు వేశాం.

దారిపొడవునా కనిపించిన ప్రకృతి అందాలు మా అలసటను పోగొట్టాయి. అక్కడున్న రెండు జలపాతాల్లో ఒక జలపాతం చెట్టు వేర్లలోనుండి దూకడం ఆశ్చర్యానికి గురి చేసింది. మరో జలపాతం కొండల్లో నుంచి దూకుతూ కనువిందు చేసింది. అక్కడ నుంచి తిరిగి రావడానికి మనసు అంగీకరించలేదంటే నమ్మండి! అయిష్టంగానే అక్కడనుంచి బయలుదేరి, ఏర్పేడు మార్గంలోని పాపానాయుడుపేట వద్దనున్న గుడిమల్లంకు చేరుకున్నాం.

అది ప్రాచీన దేవాలం..

అది ప్రాచీన దేవాలం..

గుడిమల్లంలో అతి ప్రాచీనమైన పరశురామేశ్వర దేవాలయం ఉంది. అలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడాలేదని అక్కడే ఉన్న పురావస్తుశాఖ బోర్డులో కనబడుతుంది. ఆ దేవాలయ ప్రత్యేకత గురించి స్థానికులు వివిధ రకాల కథలుగా చెప్పారు. అక్కడ ఉన్న ప్రతి విషయం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

దేవాలయ సందర్శన అనంతర బయలుదేరి 24 కిలోమీటర్లు ప్రయాణించి, తిరుపతికి చేరుకున్నాం. మా మిత్రుల కళ్లలోకి చూడగానే అలసటతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించామన్న సంతృప్తి కనపడింది. దీంతో స్థానిక మిత్రుడు ఇంకా చిత్తూరు జిల్లాలో ఉబ్బలమడుగు, కైగల్, మరికొన్ని జలపాతాలు ఉన్నాయి చూద్దామా అని అడిగాడు. అందుకు మేమంతా ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా చూస్తాం.. అంటూ తిరుమలకు బయలుదేరాం. మ‌రెందుకు ఆల‌స్యం తిరుమ‌ల‌కు మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

Read more about: tirumala chittoor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X