Search
  • Follow NativePlanet
Share
» »అర‌కులోని ఆకుప‌చ్చ‌ని లోకంలో.. ఆనందాల ప‌ర‌వ‌ళ్లు!

అర‌కులోని ఆకుప‌చ్చ‌ని లోకంలో.. ఆనందాల ప‌ర‌వ‌ళ్లు!

అర‌కులోని ఆకుప‌చ్చ‌ని లోకంలో.. ఆనందాల ప‌ర‌వ‌ళ్లు!

ప్రకృతి మలచిన పర్యాటక ప్రదేశాలలో అరకు ఎప్పుడూ ప్రత్యేకమే. మండు వేసవైనా.. మంచు తుంపరులు కురిపించే శీతాకాలమైనా సీజన్ కు అనుగుణంగా రూపాంతరం చెందుతుంది ఈ ప్రాంతం. మ‌రీ ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో అరకు ప్రయాణం తియ్యని అనుభూతుల సమ్మేళనమనే చెప్పాలి. ఇక్కడ అడుగుపెడితే చాలు, ఎక్కడలేని ఉల్లాసం పొంగుకొస్తుంది. మేఘాల్లో తేలియాడాలని, నీటిలో ఈదులాడాలని, కొండల అంచులను తాకాలనే ఉద్వేగం మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

చివరకు అరే... అప్పుడే టూర్ అయిపోయిందా..? ఇక వెనక్కు వెళ్లిపోవాలా?! అన్న దిగులు వెలితిగా మిగిలిపోతుంది. మనసుకు సర్దిచెప్పుకుంటూ మరోసారి వద్దాంలే అంటూ వెళ్లే వారే ఎక్కువగా తారసపడతారు. పచ్చని ప్రకృతి ఒడిలో సహజసిద్ధంగా పుట్టుకొచ్చిన చాపరాయి, పాడేరు, వాటిని కలుపుతూ వెళ్లే ఘాట్ రోడ్డు ప్రయాణపు అనుభవాలు మీ కోసం!

మా బృందంతో చేసిన ఈ పర్యటన ఎంతో ఆనందంతోపాటు మనసుకు చెప్పలేని ఉల్లాసాన్ని అందించింది. విశాఖపట్నం నుంచి సొంత వాహనంలో ప్రారంభమైన మా పర్యటన అనంతగిరి, అరకు, చాపరాయి, డుంబ్రిగుడ, పాడేరు, డల్లాపల్లి మీదుగా మళ్లీ విశాఖకు చేరుకుంది.

లోయల అందాలను ఆస్వాదిస్తూ..

లోయల అందాలను ఆస్వాదిస్తూ..

విశాఖ నుంచి ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరి అనంతగిరి ఘాట్‌పైకి చేరుకునేసరికే మా బృందంలో ఉత్సాహం ప్రారంభమైపోయింది. అప్పుడే చల్లగాలి ఆహ్వానం పలకడంతో కారు అద్దాలను దించేసి, చుట్టుపక్కల కొండలు, లోయల అందాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగాం. కొండ ఒంపులగుండా పచ్చని ప్రకృతి అందాలను మాటల్లో వర్ణించడం కాస్త కష్టమే. చివరకు అరకుకు చేరుకుని, కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత నేరుగా మూడు గంటలకే చాపరాయి దగ్గరకు వెళ్లాం. రెండు నెలల క్రితం కన్నా కొద్దిగా నీటి ప్రవాహం తగ్గినప్పటికీ... పర్యాటకులు మాత్రం ఇసుక వేస్తే రాలనంతగా కనిపించడం చూసి చాలా ఆనందమేసింది.

ఆరంభంలోనే అక్కడ గిరిజన మహిళలు చేస్తున్న ధింసా నృత్యం చూసి మా బృందంలోని ఇద్దరు వారి అడుగుల్లో అడుగులు కలిపారు. గిరిజనుల నృత్యాన్ని ఆస్వాదిస్తూ చాలాసేపు అక్కడే గడిపాం. అది మాలో కొత్త హషారును కలిగించింది. మాలో మిగిలినవారు మాత్రం మిత్రుల నృత్యాన్ని చూస్తూ, వీడియోలు తీస్తూ బయట నుంచే ప్రోత్సహించారు. అనంతరం జలకాలాటలకు సిద్ధమయ్యాం.

చాప‌రాయి దగ్గ‌ర జాగ్ర‌త్త‌..

చాప‌రాయి దగ్గ‌ర జాగ్ర‌త్త‌..

మా బృందంలో ముగ్గురు మాత్రమే జలపాతాల్లోకి చేరిపోయి కేరింతలు, తుళ్లింతల మధ్య జలకాలాడటానికి ముందుకొచ్చారు. పైనున్న బండరాళ్ల మధ్యకు వెళ్లి.. అక్కడి నుంచి నీటి ప్రవాహంతోపాటు కిందకు జారడం, మళ్లీ పైకి వెళ్లడం.. ఇలా చివరకు టైమ్ చూస్తే ఐదున్నర అయిపోయింది. చాప‌రాయి దగ్గ‌ర‌ రాళ్లు బాగా నాచుపట్టి ఉంటాయి. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదం జ‌రిగితే పూర్తిస్థాయిలో వైద్యం దొర‌క‌డం చాలా క‌ష్టం.అందువ‌ల్ల ఈ రాళ్ల ద‌గ్గ‌ర చాలా జ‌గ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

అరకు కాఫీకి సాటి మ‌రేదీరాదు..

అరకు కాఫీకి సాటి మ‌రేదీరాదు..

ఆ రోజు రాత్రి అరకులోనే రోడ్లపై విహరించి, మళ్లీ వసతిగృహానికి చేరుకున్నాం. రాత్రి తొందరగానే నిద్రించి మరుసటిరోజు తెల్లవారుజామున ఐదు గంటలకే బయలుదేరి రోడ్లపైకి వచ్చిన మాకు చిత్రమైన దృశ్యాలు కనిపించాయి. వణికించే చలితో ప‌ది అడుగుల దూరంలో ఉన్న వారు కూడా కనిపించని దట్టమైన పొగమంచు మమ్మలి మంత్రముగ్ధులను చేసింది. మేం విదేశాల‌లో ఉన్న ఫీలింగ్ క‌లిగింది. చ‌లిని త‌ట్ట‌కునేందుకు వేసుకున్న స్వెట్ట‌ర్లు సైతం త‌డిచిముద్ద‌య్యాయి. ఆ ఆహ్లాద‌క‌ర‌మైన వాతావర‌ణాన్ని స్వ‌యంగా అనుభ‌వించిన‌వారికి గ‌ట్ట‌క‌ట్టే చ‌లి సైతం త‌లొంచాల్సిందే.

ఆ నీటి తుంప‌రుల‌ను ఆస్వాదిస్తూనే మధ్యలో అరకు కాఫీని స్ట్రాంగ్‌గా రెండేసి కప్పులు లాగించేశాం. అలాంటి చల్లని వాతావరణంలో సెగలు కక్కుతూ రుచికరమైన కాఫీని తాగుతుంటే ఆ ఫీలింగ్ మాటలకందదు. సువాసనలు వెదజల్లే అరకు కాఫీకి సాటి మరేదీ ఉండదనిపించింది. అలా దాదాపు రెండు గంటలపాటు మంచు తెరల్లో ఆనందాన్ని ఆస్వాదించి, తిరిగి గెస్ట్ హౌసు వెళ్లిపోయాం. కొద్దిసేపు విశ్రాంతి అనంతరం మా ప్రయాణం ప్రారంభమైంది.

పొగమంచు వెంటాడుతూనే ఉంది..

పొగమంచు వెంటాడుతూనే ఉంది..

అరకు, చాపరాయి మీదుగా పాడేరు వెళ్తున్న మమ్మల్ని తొమ్మిది గంటల వరకూ పొగమంచు వెంటాడుతూనే ఉంది. మధ్యలో రోడ్డుపైనే ఫొటోలకు మా మిత్రులు పోటీపడడం, పొగమంచును చీల్చుకుంటూ వచ్చేందుకు ప్రయత్నించడం, వాటిని చిత్రీకరించడంతోనే సమయం తెలియకుండా పోయింది. గుబురుగా అల్లుకున్న పచ్చని చెట్లు మంచు తెరల్లో మాయం కావడం, మరీ దగ్గరలో ఉన్న చెట్టు లీలగా మాత్రమే కనిపించడం, వాటి మధ్యలో మేం ఉండడం మరింత ఉత్సాహాని కలిగించింది. అలా మధ్య మధ్యలో ఆగుతూ చివరకు ఎత్తయిన ప్రాంతమైన దాల‌ప‌ల్లికి చేరుకున్నాం.

మధ్యలోనే ఒక చిన్న గ్రామంలో టిఫిన్ చేసేందుకు ఆగాం. అక్కడ మాకు దొరికిన ఇడ్లీ, దోసెలు చూసి ఆశ్చర్యపోయాం. అంత చిన్న గ్రామంలో వేడివేడిగా నోరూరించే ఐటమ్స్ దొరకడం ఒకింత ఆశ్చర్యం కలిగించింది. దాంతో ఒక్కసారిగా మేమంతా ఆకలితో ఆ హోటల్లోని టిఫిన్‌ల‌పై దాడి చేసినట్లు తిన్నాం.

గిరిజనులతో ముచ్చటిస్తూ..

గిరిజనులతో ముచ్చటిస్తూ..

ఇక మా ప్రయాణం పాడేరు మీదుగా దాలపల్లి చేరుకుంది. చుట్టూ ఎత్తయిన కొండలు, లోయలను ఆస్వాదిస్తూ, మధ్యలో గిరిజనులతో ముచ్చటిస్తూ ముందుకు సాగాం. అక్కడే ఓ యువకుడు మమ్మల్ని చూసి 'బాగున్నారా..?' అంటూ పలకరించడంతో ఆశ్చర్యపోయాం. ఎందుకంటే, అక్కడ మాకెవరూ తెలియదు. 'మేం నీకు తెలుసా?' అని ఆశ్చర్యంగా అడిగాం. కొన్ని నెలల క్రితం అదే దారిలో వెళ్తూ నాతో కొంచెంసేపు మాట్లాడారుగా!' అని బదులివ్వడంతో గత స్కృతులు గుర్తుకు వచ్చాయి. నిజమే అనుకుంటూ మరికొద్ది సేపు అతని కుటుంబంతో ముచ్చటించాం.

అంతటి చలిలోనూ అతని నెలల పసిపాపతో కాసేపు సరదాగా ఆడుకున్నాం. కల్మషంలేని ఆ గిరిజన కుటుంబం మమ్మల్ని వారి శ్రేయోభిలాషులుగా గుర్తించడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలా.. వారికి వీడ్కోలు చెబుతూ కొండ దిగువకు బయలుదేరాం. బండరాళ్లతో కూడిన కొండలు కనిపించడంతో అతి కష్టంమీద వాటిని అధిరోహించి, ఉల్లాసాన్ని మూటగట్టుకున్నాం. అలా అక్కడితో మా ప్రయాణం ముగించుకుని, తిరిగి విశాఖపట్నం చేరుకున్నాం.

మొత్తం మీద మా ప్రయాణం చలి, జలకాలాటలు, కొండకోనల మధ్య జీవితంలో మర్చిపోలేని ఎన్నో అనుభూతులను అందించింది. మరెందుకు ఆలస్యం, చల్లగాలిని ఆస్వాదిస్తూ మీరూ మీ అరకు ప్ర‌యాణాన్ని మొదలుపెట్టండి!! అన్న‌ట్లు ఈ టూర్ ప్లాన్ చేసేవారు న‌గ‌దు రూపంలో డ‌బ్బులు ప‌ట్టుకోవ‌డం మంచిది. కొన్నిసార్లు నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య‌ల వ‌ల్ల ఇక్క‌డి ఆర్థిక లావాదేవీలు స్తంభించే అవ‌కాశం ఎక్కువ‌.

Read more about: araku paderu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X