Search
  • Follow NativePlanet
Share
» »మంచుకురిసే వేళ‌.. ఇది మ‌న్యం మెరిసే వేళ‌..

మంచుకురిసే వేళ‌.. ఇది మ‌న్యం మెరిసే వేళ‌..

మంచుకురిసే వేళ‌.. ఇది మ‌న్యం మెరిసే వేళ‌..

ఎటుచూసినా దట్టంగా కమ్ముకున్న పొగమంచు.. వ‌ర్ష‌పుధార‌లా కురుస్తున్న మంచు తుంపరులు.. శ్వేత వర్ణంలో మెరిసిసోయే మంచు దుప్పట్లు.. మలుపు తిరిగే కొండ అంచుల్లో కనువిందుచేసే అటవీ అందాలు.. ఓవైపు చల్లని గాలులు.. మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు. అంతా ప్రకృతి సోయగాలు, అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం చూడాలంటే విశాఖ మ‌న్యంలో అడుగుపెట్టాల్సిందే.

ఏటా డిసెంబర్ నెలలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విశాఖ మ‌న్యంలో మంచుతెర‌లు ముందుగానే ముంచుకొచ్చాయి. అతి కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుండ‌డంతో ఇక్కడి గ్రామాల్లో మంచు దుప్పట్లు మరింతగా పరచుకున్నాయి. గత కొద్ది రోజులుగా చింతపల్లి, లంబసింగి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకుల తాకిడి మరింత ఎక్కువైంది. అక్కడి మంచు అందాలను ఆస్వాదిస్తూ.. పర్యాటకులు పరవశించిపోతున్నారు. కాలిన‌డ‌క‌న శిఖ‌రాగ్రాల‌కు చేరుకుని, పొగ‌మంచును తాకే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఎటు చూసినా ప‌చ్చ‌ద‌నానికి తోడుగా సాగుతోన్న మంచుపొర‌ల‌ను చీల్చుకుంటూ ఫోటోల‌కు పోజులిస్తున్నారు.

ఈ భూతల స్వర్గాన్ని చూసేందుకు..

ఈ భూతల స్వర్గాన్ని చూసేందుకు..

ప్ర‌స్తుతం మారిన వాతావరణంతో అరకు, పాడేరు ప్రాంతాలు ఎక్క‌డ చూసినా ఇవే దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ ప్ర‌దేశం పచ్చని కొండలు, పంట పొలాలు.. భూమిని తాకినట్లుగా వస్తున్న మేఘాలతో ప్రకృతి రమణీయంగా మారింది. ఈ భూతల స్వర్గాన్ని చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. దట్టమైన పొగమంచు.. లేలేత భానుడి కిరణాల మధ్య పిల్లలు, పెద్దలు అరకు అందాలను ఎంజాయ్‌ చేస్తున్నారు. మ‌రోవైపు విశాఖ మ‌న్యం వ్యాప్తంగా చలి గాలులు అధికమయ్యాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అరకులోయ కేంద్ర కాఫీ బోర్డు వద్ద వ‌రుస‌గా 9.8 డిగ్రీలు, 6.8 డిగ్రీలకు ఉష్ణోగ్ర‌త‌లు పడిపోవడంతో చలి అధికమైంది. ఒక్కరోజు వ్యవధిలోనే 3 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గడంతో అరకు ప్రాంత వాసులు సైతం చలితో వ‌ణుకుతున్నారు.

వాతావ‌ర‌ణాన్ని మొబైల్ ఫోన్‌ల‌లో బంధించేందుకు..

వాతావ‌ర‌ణాన్ని మొబైల్ ఫోన్‌ల‌లో బంధించేందుకు..

పొగ మంచు దట్టంగా కురవడంతో పాటు చలి పెరగడంతో స్థానికులు, పర్యాటకులు వాతావ‌ర‌ణాన్ని ఆస్వాదిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు మంచు కమ్ముకుంటోంది. అలాగే పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 10 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 10.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో కూడా పొగ మంచు దట్టంగానే కురుస్తోంది. ప్ర‌కృతిసిద్ధ‌మైన ఈ వాతావ‌ర‌ణాన్ని త‌మ మొబైల్ ఫోన్‌ల‌లో బంధించేందుకు ప‌ర్యాట‌కులు పోటీప‌డుతున్నారు.

ఏపీ టూరిజంశాఖ ప్రత్యేకప్యాకేజీలు

ఏపీ టూరిజంశాఖ ప్రత్యేకప్యాకేజీలు

పర్యాటకంగా ప్రాముఖ్యం సంతరించుకోవడంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే విశాఖపట్నం నుంచి లంబసింగి ప్రాంతానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. లంబసింగితో పాటు, కొత్తపల్లి వాటర్ ఫాల్స్, పాడేరు పరిసర ప్రాంతాలను ఒకే రోజులో చూపించేవిధంగా ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. లంబసింగి అందాలను తెల్లవారుజామునే వీక్షించేందుకు ఏపీ టూరిజంశాఖ ప్రత్యేకప్యాకేజీల‌ను అందిస్తోంది. విశాఖ హరిత హోటల్ నుంచి రోజూ ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసింది. లంబసింగిలోనే పర్యాటకులు బసచేసి పాడేరు ప్రకృతి అందాలు, జలపాతాలు వీక్షించొచ్చు. మ‌రెందుకు ఆల‌స్యం.. విశాఖ మ‌న్యానికి పొగ‌మంచును చీల్చుకుంటూ మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

Read more about: visakhapatnam manyam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X