Search
  • Follow NativePlanet
Share
» »కొండ‌వీడు రాజ‌సాన్ని చూసొద్దాం రండి!

కొండ‌వీడు రాజ‌సాన్ని చూసొద్దాం రండి!

కొండ‌వీడు రాజ‌సాన్ని చూసొద్దాం రండి!

తెలుగునాట కొండవీడు ప్రాంతానికి ఓ చారిత్రక నేపథ్యం.. గుర్తింపు ఉన్నాయి. అలనాటి రెడ్డిరాజుల రాచరిక వైభవానికి, చారిత్రక శిల్ప సంపదకు నిలువెత్తు నిదర్శనమే కొండవీడు కోట. చుట్టూ కొండలు.. పచ్చని చెట్లు.. పురాతన ఆలయాలు.. అద్భుత శిల్పాలు.. అపురూప కట్టడాలు.. ఇలా ఎటుచూసినా సువిశాల ప్రాంతంలో ప్రకృతి అందాల మాటున దోబూచులాడుతోంది కొండవీడు కోట. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేవలం 30 కిలో మీటర్ల దూరంలో ఉండటంతో ఈ ప్రాంతాన్ని కుటుంబసమేతంగా సందర్శించేందుకు పర్యాటకులు ఉత్సాహన్ని చూపుతున్నారు. ఆ కొండవీడులో దాగి ఉన్న ఆ చారిత్రక విశేషాలు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ కోస్తాతీరంలో ఉన్న కోటలలో కొండవీడు గిరిదుర్గం ప్రముఖమైనది. గుంటూరు జిల్లా కేంద్రానికి 28 కిలోమీటర్ల దూరంలో గుంటూరు నరసరావుపేట, గుంటూరు- చిలకలూరిపేట రహదారులకు మధ్యలో ఉంది. కొండవీడు కోటను చేరటానికి ఫిరంగిపురం, బోయపాలెం నుంచి కూడా మార్గాలున్నాయి. కొండవీడు అంటే, కొండల్లో నిర్మించిన నగరం అని అర్థం. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ ప్రాంతం పూర్వం కుండినపురం, గోపీనాథపురం అలాగే, కుతుబ్షాహీల పాలనలో మూర్తజానగర్గాను పిలవబడింది. 13-14 శతాబ్దాలలో కొండవీటి, రెడ్డిరాజుల రాజధానిగా ఉంది. కొండవీటి రాజుల్లో మొదటివాడైన ప్రోలయ వేమారెడ్డి కోట నిర్మాణం ప్రారంభించాడు. అతని కుమారుడు అనవోతారెడ్డి పరిపాలనా కాలంలో కోటను శత్రుదుర్భేద్యంగా మలిచి, నిర్మాణాన్ని పూర్తిచేశాడు. రెడ్డిరాజులలో చివరివాడైన రాచవేమారెడ్డి తర్వాత ఈ కోట ఒరిస్సా గజపతులు, కన్నడరాజులు, కుతుబ్షాహీలు, ఫ్రెంచ్వారు చివరిగా 18వ శతాబ్దంలో ఇంగ్లీష్ వారు ఆక్రమించారు.

పైకి చేరుకునేందుకు

పైకి చేరుకునేందుకు

కొండవీడు పైభాగానికి చేరుకోవాలంటే రెండు మార్గాలున్నాయి. మొదటిది కొండవీటి దుర్గానికి పశ్చిమ దిక్కులో ఉన్న 'కోట' గ్రామం నుంచి మెట్లదారి. రెండవ మార్గం కోటకు తూర్పుభాగంలో 'పుట్టకోట' లేదా కొత్తపాలెం గ్రామం నుంచి మొదలవుతుంది. ఈ గ్రామం నుంచి కోటవరకూ రోడ్డు మార్గంలో ప్ర‌యాణం ఎంతో ఆహ్లాదక‌రంగా ఉంటుంది. అంతేకాదు, కొండ దిగువ నుంచి కొండ మీద‌కు వెళ్లే ఆరు కిలోమీట‌ర్ల దారితోపాటు కోట లోప‌ల రెండున్న‌ర కిలోమీట‌ర్ల వాకింగ్ ట్రాక్‌లో న‌డ‌క ప్ర‌కృతితో మ‌మేక‌మ‌య్యేలా చేస్తుంది. 1700 అడుగుల ఎత్తయిన కొండల్లో నిర్మించిన గిరిదుర్గానికి చేరుకుంటే చుట్టూ రక్షణగోడ, మధ్యమధ్యలో బురుజులు సందర్శకులను కనువిందు చేస్తాయి. తారా బురుజు, నెమళ్ల బురుజులు ఇక్కడ ప్రసిద్ధి చెందినవి.

ఆశ్చ‌ర్య‌ప‌ర‌చే వాట‌ర్ మేనేజ్‌మెంట్

ఆశ్చ‌ర్య‌ప‌ర‌చే వాట‌ర్ మేనేజ్‌మెంట్

అంత ఎత్తులో ఉన్న గిరిదుర్గంలో ఏడాది పొడ‌వునా నీటి ల‌భ్య‌త కోసం మూడు చెరువులు, ఒక కోనేటిని త‌వ్వించారు. ఆధునిక యంత్రాలు లేని రోజుల్లో వ‌ర్ష‌పు నీటిని వృథా పోనివ్వ‌కుండా గొప్ప వాట‌ర్ మేనేజ్‌మెంట్ విధానాన్ని అనుస‌రించిన తీరు ఆశ్చ‌ర్య‌కరంగా అనిపిస్తుంది అంతేకాదు రెండు కొండ‌ల‌ను క‌లుపుతూ రెండు వంద‌ల అడుగులకుపైగా వెడ‌ల్పు ఉన్న రెండంత‌స్థుల తూర్పు ద్వారం అల‌నాటి నిర్మాణ కౌశ‌లానికి ద‌ర్ప‌ణంగా చెప్ప‌వ‌చ్చు. కొండ దిగువ‌న చుట్టూ 37 ఎక‌రాల విస్తీర్ణంలో కంద‌కం ఉండేద‌ట‌. కొండ‌మీద ప‌డిన వ‌ర్ష‌పు నీరంతా ఇందులోకి చేరే విధంగా నిర్మాణం చేప‌ట్టారు. కోట‌లోప‌ల‌కు ఎవ్వ‌రూ దొంగ‌త‌నంగా ప్ర‌వేశించ‌కుండా కంద‌కంలో మొస‌ళ్లు పెంచేవార‌ట‌.

విహారంతోపాటు విజ్ఞానం..

విహారంతోపాటు విజ్ఞానం..

కొండ పైనుంచి చూస్తే చుట్టూ కనిపించే ప్రకృతి అందాలను గురించి మాటల్లో చెప్పలేం. ఒంపుసొంపులు తిరిగే ఆ కొండకోనలు పర్యాటక ప్రేమికులకు మరిచిపోలేని అనుభవాలను అందిస్తాయనడంలో సందేహం లేదు. కొండపై సుమారు రెండు వంద‌ల‌ ఎకరాల మైదాన ప్రాంతం, ఆరు దేవాలయాలు, ఆయుధాగారం, గుర్రపుశాలలు, ఆయుధశాల, నేతికొట్టు, బావులు, చెరువులు, మసీదులు వంటి చారిత్రక సంపదలున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మూడు చెరువుల గురించి. అవి పుట్టలమ్మ, ముత్యాలమ్మా, వెదుళ్ళ చెరువులు. ఇవేగాక యాభై రకాల ఔషధ మొక్కలకు ఈ కొండలు నిలయం. ఇక్క‌డ వంద‌ల యేళ్ల‌నాటి వెదురు చెట్ల‌కు వెదురు బియ్యం పండుతోంది. అందుకే ఇక్క‌డి పిల్ల‌ల విహారం విజ్ఞానాన్ని చేరువ‌చేస్తుంది. కొండవీడు రాజుల కాలంలో విద్యాధికారిగా పనిచేసిన ప్రముఖ కవి శ్రీనాధుడు తన చాటువులలో 'అమరావతికి సరిజోడు కొండవీడు' అని పేర్కొన్నాడంటే ఈ కోట ఘనత ఎలాంటిదో అర్థమవుతుంది.

సంద‌ర్సించాల్సిన‌ ప్రదేశాలు

సంద‌ర్సించాల్సిన‌ ప్రదేశాలు

కోట గ్రామంలో కత్తులబావి లేక చీకటి కోనేరుగా పిలువబడే ఒక పెద్ద ఆలయం ఉంది. పూర్తిగా రాతి కట్టడమైన ఈ నిర్మాణ శిల్పసంపద ఆద్యంతం చూపరులను కట్టిపడేస్తుంది. దీనిని గోపినాథ ఆలయం అని అంటారు. కొండవీటి కైఫియత్ ప్రకారం దీనిని కత్తుల బావి అనడానికి ఒక కథనం ఉంది. రెడ్డిరాజుల వారసులందరినీ ఒక బ్రాహ్మణ మంత్రి విందుకు ఆహ్వానించి, ఈ దేవాలయ గర్భగుడిలో పథకం ప్రకారం తవ్విన కత్తులబావిలో పడి, చనిపోయేటట్లు చేశాడని కథనం. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఉన్న నిర్మాణాలన్నింటిలో ఇది విశిష్టమైన కట్టడం. అద్భుతమైన శిల్పసంపద ఈ దేవాలయం సొంతం. వెన్నముద్ద గోపాలకృష్ణ దేవాలయం కోటకు నైరుతి దిశలో చంఘీఖాన్ పేట గ్రామంలో ఉంది. అరుదైన వెన్నముద్ద బాలకృష్ణుని విగ్రహం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

ఆల‌యాల‌కు నిల‌యంగా..

ఆల‌యాల‌కు నిల‌యంగా..

మూలాంకురేశ్వరి ఆలయం గుంటూరు నుంచి కొండవీడుకు వెళ్ళే దారిలో పేరేచర్ల ఫిరంగిపురం ఊళ్ల మధ్యలో ఉన్న అమీనాబాద్ గ్రామంలో ఉంది. ఈ గ్రామంలో రెడ్డి రాజులు ఈ ఆలయ దేవతను కులదేవతగా పూజించేవారు. దీనిని రెడ్డిరాజు అనవేమారెడ్డి కాలంలో నిర్మించారని శాసనాధారం బయటపడింది. ఇవేకాకుండా గణేశ్వరపాడు గ్రామ పరిధిలో చిన్న కొండ మీదనున్న వినాయకుడి విగ్రహం, కొండవీడు గ్రామంలో ఉన్న నరసింహస్వామి ఆలయం, రామలింగేశ్వరస్వామి ఆలయాలు చూడదగినవి.

ఇక్క‌డికి కుటుంబస‌మేతంగా వ‌చ్చేవారు పిల్ల‌ల‌తో గ‌డిపేందుకు చిల్డ్ర‌న్ పార్క్ అందుబాటులో ఉంది. ఇక్క‌డ ట్రెక్కింగ్‌, హైకింగ్ లాంటివి చేసేందుకు చాలా అనువుగా ఉంటుంది. సెల‌వు రోజుల్లో ఇక్క‌డికి వెళితే ప‌ర్యాట‌కుల తాకిడి కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. ఇక్క‌డి ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాలు సంద‌ర్శ‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. అంతేకాదు, కోట‌ను ప‌రిర‌క్షించ‌డంలో భాగంగా కోట‌కు వెళ్ల కొండ దిగువ నుంచి ధూమ‌పానం, మ‌ద్య‌పానం నిషేధించారు. అల‌నాటి ఈ అద్భుత నిర్మాణం నేడు చాలా వ‌ర‌కూ శిథిలావ‌స్థ‌కు చేరింది. అయినా అల‌నాటి క‌ట్ట‌డాలు.. ప్ర‌కృతి అందాలూ.. నేటికీ ఆహ్లాదాన్ని పంచుతాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌రెందుకు ఆల‌స్యం కొండ‌వీడుకు మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

Read more about: kondaveedu nasaravupet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X