Search
  • Follow NativePlanet
Share
» »అంత‌రిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహ‌రిద్దామా..!

అంత‌రిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహ‌రిద్దామా..!

నింగిలోకి రెక్క‌లు విచ్చుకున్న‌ పక్షిలా ఎగిరిపోవాలని.. మిరుమెట్లుగొలిపే నక్షత్రాల మధ్య చేరిపోవాలని.. చందమామను అందుకోవాలని.. ఇలా పిల్లలకు చిన్నప్పుడు ఆకాశంలో చందమామను చూపెట్టి.. అమ్మ పెట్టే గోరుముద్దలు తింటూనే ఆశలు ఫైల్ చేసుకుని ఉంటారు.

రాకెట్స్ గురించి తెలుసుకున్నాక శాస్త్ర-సాంకేతిక పరిశోధనలకు కేంద్ర బిందువుగా ఉన్న షార్‌కు వెళ్లి చూడాలనే కోరికనూ పెంచుకుని ఉంటారు. అంతేకాదు, పిల్లల బుర్రల్లో బోలెడన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి.. రాకెట్ ఎక్కడ తయారవుతుంది? శాటిలైట్‌ను ఎలా కంట్రోల్ చేస్తారు? ఎక్కడి నుంచి చేస్తారు? అసలు షార్ లోపల ఏముంది?... ఇలాంటి ఎన్నో ప్రశ్నల చిట్టాలతో.. షార్ లోపలకు రయ్యిన దూసుకుపోయింది జ‌న‌విజ్ఞాన వేదిక ఆధ్వ‌ర్యంలోని మా బృందం. ఒక్కరోజులో వారి ఆశలకు రెక్కలు తొడిగి.. అంతరిక్ష ప్రపంచపు మూలమూలల్నీ కనులారా వీక్షించేందుకు.. ప్రభుత్వ పాఠశాలల్లోని రెండు వందల మందికిపైగా ఉపాధ్యాయులు, విద్యార్థులతో సాగిన మా ' శ్రీహరికోట అంతరిక్ష విజ్ఞాన యాత్ర ' అనుభవాలు మీకోసం..!

అంత‌రిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహ‌రిద్దామా..!

అంత‌రిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహ‌రిద్దామా..!

అల్లంత దూరాన.. నిప్పులు కక్కుతూ నింగికి ఎగిసే రాకెట్ ప్రయోగాలు.. కౌంట్ డౌన్ మొదలైతే చాలు ఉత్కంఠగా ఎదురుచూపులు. అంతరిక్షంలో అబ్బురపరచే అద్భుత విజయాలు.. ఐదు తరాల వాహక నౌకలతో కొనసాగుతోన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రస్థానం గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇస్రో విజయాలలో సింహభాగాన్ని కైవసం చేసుకున్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉండడం గర్వించదగ్గ విషయం.

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ అంతరిక్షకేంద్రం షార్ ప్రవేశద్వారం వద్ద హై సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ తనిఖీలయ్యాకే లోపలికి వెళ్లడానికి అనుమతి. అక్కడి నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల ముందుకు వెళ్లాం. దేశంలోని ఏకైక ఉపగ్రహ ప్రయోగ కేంద్రంగా పేరొందిన షార్ పచ్చని ప్రకృతి అందాల మధ్య ప్రశాంతగా కనిపించింది. రోడ్డుకు కుడివైపున బ్రహ్మప్రకాశ్ హాల్ ఎదురైంది. అందులోకి వెళ్లేముందు మా దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల్ని అక్కడి సిబ్బందికి అప్పగించి వెళ్లాలి. అలా అప్పగించాకే హాలులోకి అనుమతించారు.

ఒక్క వీడియోతో ఇస్రో చ‌రిత్ర‌..

ఒక్క వీడియోతో ఇస్రో చ‌రిత్ర‌..

సినిమా హాలును త‌ల‌పించేలా ఉంది ఆ ప్ర‌దర్శ‌న‌శాల‌. లోప‌ల కూడా అనువ‌ణువూ క్షుణ్ణంగా త‌నికీ చేస్తూ, సిబ్బంది తార‌స‌ప‌డ్డారు. మేం బృందంగా ఉండ‌డంతో ఒకేసారి చెకింగ్ అయిపోయింది. అంతరిక్ష కేంద్రం ఆరంభం మొదలుకుని, దాని చరిత్ర, అందుకు కృషి చేసిన మహనీయుల వివరాలతో కూడిన పావుగంట నిడివిగల వీడియోను హాల్లో ప్రదర్శించారు. ఆ ఒక్క వీడియోతో ఇస్రో (షార్) చరిత్ర స్పష్టంగా అందరికీ అర్థమైంది. 1971 అక్టోబర్ 9న ఇక్కడ నుంచి రోహిణి సౌండ్ రాకెట్‌ను తొలిసారిగా ప్రయోగించారు.

విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ పేరిట షార్ పేరు 2002 సంవత్సరంలో 'సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం'గా మారింది. ఆ వీడియో చూస్తున్నంత సేపూ.. మేమంతా అప్ప‌టి రోజుల్లో.. వారికి తెలియ‌కుండా, ఆ రాకెట్ ప్ర‌యోగాల‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన‌ట్లు ఫీలైపోయాం.

ఫస్ట్ లాంచ్ ప్యాడ్

ఫస్ట్ లాంచ్ ప్యాడ్

అక్క‌డి నుంచి బయటకొచ్చాక అక్కడి నుంచి కొంతదూరం ప్రయాణం చేయాలి. మధ్యలో మళ్లీ తనిఖీలు ఉంటాయి. ఆ తర్వాత అందరం 'ఫస్ట్ లాంచ్‌ప్యాడ్‌' దగ్గరకు చేరుకున్నాం. గైడ్ చుట్టూ ఎంతో ఉత్సుకతతో చేరి, అతను చెప్పిన వివరాలను శ్రద్ధగా విన్నారు. ఆ వివరాల ప్రకారం ఇక్కడి నుంచి PSLV, GSLV ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించారు. అసెంబ్లింగ్, టెస్టింగ్‌తో పాటు ప్రయోగాలకూ ఇది వేదికగా ఉంది. ఇది 70 మీటర్ల ఎత్తుంటుంది. ఇప్పటిదాకా 575 సౌండింగ్ రాకెట్లనూ 42కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించారు. షార్లో ప్రస్తుతం రెండు లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయి. మొదటి వేదికను 1990ల్లో నిర్మించగా, రెండోది 2005లో ఉపయోగంలోకి వచ్చింది.

ప్రస్తుతం మూడో వేదిక నిర్మాణంలో ఉంది. దీన్ని మానవ సహిత ప్రయోగాలకు అనువుగా నిర్మిస్తున్నారని చెప్పుకొచ్చారు. "ప్రయోగ సమయంలో ఇక్కడి వాతావరణం ఎలా ఉంటుంది? దాని ప్రభావం ఎంత దూరం ఉంటుంది? ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు?" ఇలా బృందం కురిపించిన ప్రశ్నల వర్షానికి గైడ్ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఒక్కో ప్రశ్నకు సావధానంగా సమాధానాలు చెప్పుకొచ్చారు. ప్రయోగ సమయంలో రేడియేషన్ ప్రభావం ఐదు కిలోమీటర్ల వరకూ ఉంటుందని చెప్పగానే మేమంతా ఆశ్చర్యపోయాం. అంతేకాదు, ప్రయోగం సమయంలో ఉత్పత్తయ్యే వేడిని తట్టుకుని, లైవ్‌లో ప్రసారం చేసే అధునాతన సీసీ కెమెరాల అమరికను దగ్గరుండి మరీ చూపించారు. ఇక్కడికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంసిసి (మిషన్ కంట్రోల్ సెంటర్) కేంద్రం నుంచి శాస్త్రవేత్తలు రాకెట్ స్థితిగతులు పరిశీలిస్తారు.

కీలకపాత్ర పోషించే ఎంసిసి..

కీలకపాత్ర పోషించే ఎంసిసి..

నిజానికి, రాకెట్ లాంచింగ్‌కు సంబంధించిన అంశంలో కీలకపాత్ర పోషించేది ఎంసిసి. కొండపై ఉన్న ఆ కేంద్రానికి అంతా చేరుకున్నాం. చెప్పులు, షూస్, సాక్సులతో లోపలకి ప్రవేశం లేదు. వాటిని బస్సులో విడిచి, లోపలకు వెళ్లాం. లోపల నాలుగు వరుసలలో ముఫ్పైకిపైగా కంప్యూటర్లు ఉన్నాయి. శాస్త్రవేత్తల లాంచిగ్‌ప్యాడ్‌పై ఉన్న రాకెట్ను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తారు. రాకెట్ తయారీలో లోపాలను సవరించి, తిరిగి ప్రయోగం మొదలుపెడతారు. అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ఎంసిసి కేంద్ర బిందువుగా పరిగణించవచ్చు.

అలాంటి ప్రదేశాన్ని నేరుగా చూడటమంటే ఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. విద్యార్థులైతే కళ్లు పెద్దవిగా చేస్తూ అక్కడి స్క్రీన్‌ను చూస్తూ ఉండిపోయారు. వివిఐపిలూ కూర్చొనే గ్యాలరీలు కూడా అక్కడే ఉన్నాయి. అక్కడ పనిచేసే ప్రతి విభాగానికి సంబంధించిన వివరాలు గైడ్ చెప్పుకొచ్చారు. ఆయన మాటలను మేమంతా శ్రద్ధగా పేపర్లపై రాసుకున్నాం. ఆ సందర్భంలో మా బృందాన్ని చూస్తే విజ్ఞానం విషయంలో ఎవ్వరైనా నిత్య విద్యార్థులనే మాట గుర్తుకొస్తుంది.

భౌగోళిక అంశాలపై.. స్పేస్ మ్యూజియం!

భౌగోళిక అంశాలపై.. స్పేస్ మ్యూజియం!

ఇక మేమంతా స్పేస్ మ్యూజియం దగ్గరకి వచ్చేసరికి విద్యార్థుల కళ్లల్లో ఒక్కటే ఆనందం. ఎందుకంటే, ఇక్కడ ఫొటోలు తీసుకునేందుకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి పేరుతో వివిధ రాకెట్ల నమూనాలు మ్యూజియం బయట కనిపించాయి. ఉపాధ్యాయులు, పిల్లలు మొబైల్ ఫోన్‌ల‌తో ఫొటోలకు ఇస్తోన్న ఫోజులు చూస్తే భలే గమ్మత్తుగా అనిపించింది. మ్యూజియం లోపల అంతరిక్షంలోని వెలుగుల లైట్ సెట్టింగ్‌తో రెండు వరుసలలో ఫోటోగ్యాలరీ ఉంది. భౌగోళిక అంశాలపై పూర్తిస్థాయి అవగాహన రావాలంటే ఈ మ్యూజియంలో అడుగుపెడితే సరిపోతుందేమో అనిపించింది.

గ్రహాలు, ఉపగ్రహాలు, క‌క్ష్యలు, శాటిలైట్స్ ఇలా ఒక్కో అంశంపై వివరణతో కూడిన ఫోటోలు తారసపడ్డాయి. పుస్తకాల్లో తాము చూడని ఎన్నో విషయాలు పిల్లలు ఇక్కడ చక్కగా అర్థంచేసుకునే వీలుంది. మరెందుకు ఆలస్యం ఆశల రెక్కలతో అంతరిక్ష కేంద్ర విహారానికి బయలుదేరండి..! మీ కోసం స్పేస్ ఎదురు చూస్తోంది.

Read more about: nellore sullurpeta sdsc shar isro
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X