Search
  • Follow NativePlanet
Share
» »కోన‌సీమ‌లో దాగిన కొన్ని ప‌ర్యాట‌క అందాల‌ను చూసొద్దామా?!

కోన‌సీమ‌లో దాగిన కొన్ని ప‌ర్యాట‌క అందాల‌ను చూసొద్దామా?!

కోన‌సీమ‌లో దాగిన కొన్ని ప‌ర్యాట‌క అందాల‌ను చూసొద్దామా?!

బంగాళాఖాతంలో విశిష్ట గోదావరి సంగమించే సుందర ప్రదేశం అన్నా చెల్లెల గట్టు! సూర్యాస్తమయ సమయంలో ఇక్కడి అద్భుత దృశ్యం గురించి మాటల్లో చెప్పడం కాస్త కష్టమే. అంతర్వేది వద్ద ఈ రెండింటి సంగమం కారణంగా సముద్రాన్ని అన్నగా.. గోదావరిని చెల్లిగా.. విశ్వసిస్తారంతా! అంతర్వేదిలో ఉన్న ప్రముఖ పురాతన ఆలయాల సందర్శనకు వచ్చే ప్రతి ఒక్కరూ అన్నా చెల్లి గట్టును తప్పకుండా చూడాల్సిందే! కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప మిగిలిన రోజుల్లో ఇక్కడ పర్యాటకుల తాకిడి పెద్దగా కనిపించదు. ఆ కోనసీమ అందాల విశేషాల‌ను మ‌న‌సారా ఆస్వాదిద్దాం పందండి!

రెండు రోజులు విహారానికి టైం దొరికింది. ఇంక ఏమాత్రం ఆల‌స్యం చేయ‌లేదు. రెండు రోజుల్లో కోనసీమలో దాగిన కొన్ని చారిత్రక ప్రదేశాలతోపాటు పర్యాటక ప్రాంతాలను చుట్టేసేందుకు మా మిత్ర బృందంతో ప్రణాళిక వేశాం. సొంత వాహ‌నంలో అయితేనే స‌మ‌యం క‌లిసొస్తుంద‌ని మా మిత్రుని కారును సిద్ధం చేశాం. మా బృంద స‌భ్యుల‌కు చిన్నప్పటి నుంచి సముద్రతీర ప్రాంతంపై ఉన్న ఆపేక్ష కారణంగా ఈ పర్యటనలోనూ సాగరతీరం ఉండేలా చూసుకున్నాం. మంచుకురిసే వేళ‌లో ఏంతో ఆహ్లాదంగా మా ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టాం.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ద‌ర్శ‌నం..

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయ ద‌ర్శ‌నం..

ముందుగా విజయవాడ నుంచి బయలుదేరి దగ్గరలోని శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు ఆలయాన్ని సందర్శించుకున్నాం. శ్రీ‌కాకుళం అంటే ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీ‌కాకుళం జిల్లా కాదండోయ్‌. ఇక్క‌డ విజ‌య‌వాడ‌కు ద‌గ్గ‌ర‌లోని శ్రీ‌కాకుళం. అక్కడి నుంచి మోపిదేవి, మంగినపూడి, అంతర్వేది, యానాం, ద్రాక్షారామం వంటి ప్రాంతాలు మా ప్ర‌యాణ‌పు జాబితాలో ఉన్నాయి. ఉదయం తొమ్మిది గంటలకే శ్రీకాకుళం, మోపిదేవి దర్శనం అయిపోయింది. మోపిదేవి ఆల‌యానికి వెళ్లడం ఇదే తొలిసారి. ఆ ఆల‌య చరిత్ర తెలుసుకున్నాం. అక్కడి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్న తరువాత నేరుగా మచిలీపట్నం మీదుగా మంగినపూడి బీచికి చేరుకున్నాం. ఈ మధ్యలోనే పురాతన చల్లపల్లి రాజుల కోటను చూశాం. అక్కడ ఉండే సింహాల ప్రతిమలు ఎంతో ఆకర్షణీయంగా కనిపించాయి.

సముద్రాన్ని అన్నగా.. గోదావరిని చెల్లిగా..

సముద్రాన్ని అన్నగా.. గోదావరిని చెల్లిగా..

మంగినపూడి బీచ్ చేరుకున్న తరువాత అక్కడ సముద్రాన్ని చూసీచూడగానే ఒక్కసారిగా మేమంతా బాల్యంలోకి వెళ్లిపోయాం. దాదాపు మూడు గంటలపాటు అక్కడే సందడి చేసి, మళ్లీ మా ప్రయాణాన్ని ప్రారంభించాం. సాయంత్రానికి అంతర్వేదికి చేరాం. అక్కడ ఒక వసతిగృహంలో గదులు తీసుకుని, మా లగేజీని భద్రపరిచి, వెంటనే సముద్ర తీరానికి పరుగులు తీశాం. అప్పటికి సాయంత్రం ఆరు గంటలైంది. గోదావరి నది అక్కడే సముద్రంలో కలుస్తుంది. దీనిని తప్పక చూడాలని స్థానికులు చెప్పారు. అంతర్వేది వద్ద ఈ రెండింటి సంగమం కారణంగా సముద్రాన్ని అన్నగా.. గోదావరిని చెల్లిగా.. విశ్వసిస్తారంతా! ఆ సంగ‌మం చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప‌ర్యాట‌కులు వ‌స్తూ ఉంటార‌ని అక్క‌డివారు చెప్పుకొచ్చారు.

సూర్యాస్తమయం అద్భుతం దృశ్యం!

సూర్యాస్తమయం అద్భుతం దృశ్యం!

మేం అక్క‌డికి చేరే సమయానికి సూర్యాస్తమయం అవుతుండడంతో ఎర్రని సూర్య కిరణాలు సముద్రం, నది అలలపై పడుతూ ఎక్కడా లేని అందాలను విరజిమ్ముతూ దర్శనమిచ్చాయి. ఆ అందాలను బయట నుంచే తిలకించిన తరువాత మళ్లీ మేం విడిది చేసిన హోటల్‌కు చేరుకున్నాం. ఆ సమయంలో నీటిలోకి వెళ్లడం ప్రమాదమని స్థానికులు హెచ్చరించడంతో మరోసారి ఉదయం వెళ్లాలని నిర్ణయించుకున్నాం. హోటల్లో డిన్న‌ర్ పూర్తి చేసుకుని, నిద్రలోకి జారుకున్నాం. మర్నాడు ఉదయం ఆరు గంటలకే సిద్ధమయ్యి, ముందుగా అంతర్వేది వెళ్లి, ఆలయాన్ని సందర్శించాం. భక్తుల రద్దీ పెద్దగా లేకపోవడంతో త్వరగానే దర్శనం అయిపోయింది. అక్కడి నుంచి మళ్లీ అన్నాచెల్లి గట్టుకు వెళ్లాం. అక్కడ మాతోపాటు మరికొన్ని కుటుంబాలు కనిపించాయి. వారితోపాటు మేమూ సంగమ ప్రాంతంలో ఫోటోలు తీసుకుంటూ చాలాసేపు గడిపాం. నది, సముద్రం కలిసే చోట జాగ్రత్తలు తీసుకుంటూ నీటిలో కాలక్షేపం చేశాం.

అత్యంత ప్రమాదకరమైన గట్టు

అత్యంత ప్రమాదకరమైన గట్టు

ఎంతో ఆహ్లాదకరంగా ఉండే అన్నాచెల్లి గట్టు అంతే ప్రమాదకరంగానూ కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో ఊహించని విధంగా లోతు ఉంటుంది. ఒక చోట కేవలం రెండు అడుగుల లోతు ఉంటే... పక్కనే అడుగు దూరంలోనే ఆరు అడుగుల లోతు ఉంటుంది. అదే ప్రమాదాలకు కారణం అంటూ స్థానికులు చెప్పడంతో మేం జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది. ఇదే ప్రాంతంలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో పర్యాటకులు మృత్యువాత పడినట్టుగానూ స్థానికులు మమ్మల్ని ముందుగానే హెచ్చరించారు. పోలీసు శాఖా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ హెచ్చరిక బోర్డులూ పెట్టింది. ఇక్కడ మరో రెండు గంటల పాటు గడిపిన త‌ర్వాత మా బృందంతో అక్కడి నుంచి నేరుగా యానాం బయలుదేరాం.

ఉవ్వెత్తున ఎగ‌సిప‌డే స‌ముద్ర‌పు కెర‌టాలు..

ఉవ్వెత్తున ఎగ‌సిప‌డే స‌ముద్ర‌పు కెర‌టాలు..

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో గోదావరి నదీ తీరం అందాలను కొద్ది సేపు ఆస్వాదించాం. మా ప్ర‌యాణంలో ఉవ్వెత్తున ఎగ‌సిప‌డి రాళ్ల‌ను తాకే స‌ముద్ర‌పు కెర‌టాల స‌వ్వ‌డులు ఎంతో ఆక‌ర్షించాయి. అక్క‌డి కొన్ని పురాత‌ణ నిర్మాణాలు మ‌మ్మ‌ల్ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. ఇదే స‌మ‌యంలో మా బృందంలోని కొందరు చేపల ఫ్రై చేయించుకోవడంలో బిజీ అయిపోయారు. అక్కడ చేపల ఫ్రై ఫేమస్ అని చెప్పారులెండి! అక్కడి నుండి నేరుగా ద్రాక్షారామం చేరాం. యానాం నుంచి కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ద్రాక్షారామంలో పురాతన ఆలయ నిర్మాణాన్ని తీక్షణంగా పరిశీలించి, లోపల దర్శనం చేసుకున్నాం. అనంతరం భోజనాలను పార్సిల్ చేయించుకుని, మార్గమధ్యంలో చెట్ల కింద విశ్రమించి, అక్కడే తిన్నాం..

కోనసీమ అందాలే అందాలు

కోనసీమ అందాలే అందాలు

మా జర్నీలో ఇవన్నీ ఒక ఎత్తయితే మార్గమధ్యంలో ఎదురయ్యే కోనసీమ అందాలు మరింతగా ఆకట్టుకున్నాయి. అంతర్వేది నుంచి ద్రాక్షారామం వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న పొడవాటి కొబ్బరిచెట్ల నీడ రహదారిపై తెరలా పరచుకుని, ఎండ తాపాన్ని అడ్డుకున్నట్లు కనిపించాయి. వాటి మధ్యలో గుండా మేం చేసిన ప్రయాణం ఎంతో సంతృప్తినిచ్చింది. మ‌రీ ముఖ్యంగా అక్క‌డి ప‌చ్చ‌ని వాతావ‌ర‌ణం మ‌మ్మ‌ల్ని మ‌రో ప్ర‌పంచ‌పు అంచుల‌కు తీసుకువెళ్లిన అనుభూతి క‌లిగింది. మా బృందంలో స్థానిక మిత్రుడు ఉండ‌డంతో తనకు తెలిసిన ప్రాంతాలను చూపిస్తూ, వాటి విశేషాలను వివరిస్తూ మాకు గైడ్ వ్యవహరించాడు. మొత్తానికి పర్యాటక స్థలాలు, ఆలయాలు, ప్రకృతి అందాలతో మా పర్యటన రెండు రోజులపాటు ఎంతో ఉత్సాహంగా సాగింది. ఈ మంచుకురిసే వేళ‌లో ఇలాంటి ఆహ్లాదకరమైన ట్రిప్ ప్లాన్ చేసుకునేవారికి ఈ మార్గం మంచి ఎంపిక!

Read more about: konaseema vijayawada
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X