» »ట్రెక్కింగ్ యాత్రలకి కేరాఫ్ సందాక్ఫు!!

ట్రెక్కింగ్ యాత్రలకి కేరాఫ్ సందాక్ఫు!!

Posted By:

ట్రైన్‌ లో ప్రయాణం... అతి దగ్గరగా కదిలే నీలిమేఘాలు... సూర్యోదయాలూ, సూర్యాస్తమయాలు అద్భుతంగా ఉంటాయక్కడ. బంగారు వర్ణంలో మెరిసే ఉదయభానుడి మొదటి కిరణాల మధ్య నుండి వెండి కొండలను చూడడం మరో అద్భుత సుందర దృశ్యం. రంగు రంగుల పూలు, పిల్ల గాలులతో కూడిన ప్రశాంత వాతావరణంలో అలా ఆలా... నడిచి వెళ్తుంటే.... మనల్ని మనం మైమరచిపోతాం. ఈ అనుభూతులతో కూడిన అందాలు సుందర సందాక్ఫు లేదా సందాక్‌ఫూ సొంతం.

పశ్చిమ బెంగాల్‌లోని సందాక్ఫు ఆ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3636 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. అక్కడికి వచ్చేవారు ట్రెకింగ్‌ చేయడమంటే బాగా ఇష్టపడతారు. నడవలేని వారికి వాహనాలు కూడా ఉంటాయి. ఈ ట్రెక్‌లో చాలా భాగం ఇండో-నేపాల్‌ అంతర్జాతీయ సరిహద్దులో, కొంతభాగం నేపాల్‌లో జరుగుతుంది. ఈ ట్రెక్కింగ్ యాత్ర వివిధ ప్రాంతాల గుండా బయలుదేరి చివరగా సందాక్ఫు చేరుకుంటుంది. అలా వెళుతున్నప్పుడు ఏ ఏ ప్రాంతాలు తగులుతాయి?? ఎలా మనం చివరగా సందాక్ఫు చేరుకొని అక్కడి అందాలను ఆస్వాదించగలమో ఒకసారి లుక్ వేద్దాం పదండి.

ఎలా చేరుకోవాలి??

ఎలా చేరుకోవాలి??

విమానాశ్రయం
బాగ్దొగ్ర ఏర్‌పోర్ట్ న్యూ జల్‌పారుగురికి 50 కి .మీ .దూరంలో ఉన్నది. ఇక్కడికి ఢిల్లీ, కలకత్తా మరియు గౌహతి తదితర ప్రాంతాల నుంచి విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
రైలు మార్గం
న్యూ జల్పాయిగురి రైల్వే స్టేషన్ ని కలిగి ఉంది. ఇది నిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్. దేశంలోని వివిధ నగరాలైన చెన్నై, ఢిల్లీ, కలకత్తా, గౌహతి తదితర ప్రాంతాల నుంచి రైళ్లు వస్తుంటాయి. ఇది ఒక రైల్వే జంక్షన్ కూడానూ!!
రోడ్డు మార్గం
ఈ ప్రాంతానికి రోడ్డు సదుపాయం బాగానే ఉంది. కలకత్తా ప్రాంతం నుంచి ఇక్కడికి బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం బాగానే బస్సులు నడుపుతుంటుంది. ఈ ప్రాంతానికి సమీప పట్టణాల నుంచి కూడా బస్సులు నడుపుతారు. ట్యాక్సీల సదుపాయం కూడా కలదు.

Photo Courtesy: Superfast1111

స్టీమ్‌ ఇంజన్‌తో నడిచే రైలు

స్టీమ్‌ ఇంజన్‌తో నడిచే రైలు

న్యూ జల్పాయిగురి నుండి డార్జిలింగ్‌ వెళ్లే దారిలో (65 కి.మీ దూరంలో) సుఖియాపొక్రి అనే ఊరు వస్తుంది. అక్కణ్నుండి మనేరు భంజంగ్‌ ఆరు కిలోమీటర్ల దూరం. బయల్దేరిన కొద్దిసేపటికే సిలిగురి అనే ఊరు వస్తుంది. అక్కణ్ణుండి డార్జిలింగ్‌కి టారుట్రైన్‌లో వెళ్తే బావుంటుంది. అదేనండీ... స్టీమ్‌ ఇంజన్‌తో నడిచే రైలు. ఈ రైళ్లు ఇలా ఎత్తైన ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తాయి. కొన్ని చోట్ల టారుట్రైన్‌ వెళ్లే రోడ్డు, బస్సు రోడ్డు పక్కపక్కనే వస్తుంది.

సుఖియాపొక్రి

సుఖియాపొక్రి

సుఖియాపొక్రి వెళ్లే రోడ్డు పక్కనున్న కొండలు... వాటిని తాకుతూ వెళ్లే మేఘాలు... చూపరులకు అద్భుత దృశ్యాన్ని కళ్లముందు ఆవిష్కరింపజేస్తాయి. కదిలే మేఘాల మధ్య తేయాకు తోటలను చూసినవారు ఆ ప్రదేశమంతా ఆకుపచ్చ తివాచీ పరిచారా అనుకోకుండా ఉండలేరు. అక్కణ్ణుండి మనేరుభంజంగ్‌కు వెళ్లే దారిలో వచ్చే వాహనాలన్నింటినీ సరిహద్దు కమెండోలు తనిఖీ చేసి వివరాలు రాసుకుంటారు. ఆవిధంగా నడవాలనకునేవారు ముందుగా న్యూ జల్పాయిగురి చేరుకుని అక్కడ్నుండి మనేరు భంజంగ్‌కు చేరుకోవచ్చు.

Photo Courtesy: Dhurjati Chatterjee

సందాక్ఫు

సందాక్ఫు

మనేరుభంజంగ్‌ నుండి 31 కి.మీ వెళ్తే సందాక్ఫు వస్తుంది. అడుగడుగునా రాళ్లు... చిన్న చిన్న మలుపులతో నిండిన ఆ రహదారిలో మామూలు వాహనాలు ప్రయాణించలేవు. అందుకే నడవలేనివారు బ్రిటీష్‌ కాలంనాటి లాండ్‌రోవర్‌ వాహనాల్లో వెళ్తుంటారు. ఆ దారంతా ఏటవాలుగా ఉంటుంది. నడిచి వెళ్లేవాళ్లు రెండు కి.మీ దూరంలో ఉన్న ఛిత్రే అనే ఊళ్లో బస చేస్తారు. ఈ దారికి ఇరువైపులా ఏపుగా పెరిగిన పైన్‌ వృక్షాలు కనువిందు చేస్తాయి. ఇక్కడి నీళ్లపైపులు చెట్లపై నుండి వేలాడుతూ టెలిఫోన్‌ కేబుల్‌ వైర్లను తలపిస్తాయి.

Photo Courtesy:sandakphu

ఛిత్రే

ఛిత్రే

ట్రెకింగ్‌ చేసేవారు సేదతీరడానికి ఛిత్రే అనే గ్రామంలో చిన్న షెడ్డుల్లాంటి నిర్మాణాలున్నాయి. వీటిని ట్రెకర్స్‌ హట్స్‌ అంటారు. ప్రభాతవేళ అక్కణ్ణుండి ఎదురుగా ఉన్న కొండ ఎక్కిచూస్తే కాంచన్‌జంగ శిఖరం అద్భుతంగా కనిపిస్తుంది. అప్పుడే ఉదయిస్తున్న సూర్య కిరణాలు పడి ఆ శిఖరం గులాబీ రంగులో మెరిసిపోతుంది. ఆ దృశ్యాన్ని చూడాల్సిందే కానీ వర్ణించలేం.

Photo Courtesy: rainbow

టోంగ్లు చేరుకునే దారిలో

టోంగ్లు చేరుకునే దారిలో

ఇక తర్వాత మజిలీ 9 కి.మీ. దూరంలో ఉన్న టోంగ్లు. అక్కడికి చేరుకునే దారిలో రోడోడెండ్రాన్‌ పూలు కనిపిస్తాయి. ఇవి తెలుపు, గులాబీ, ఎరుపు రంగుల్లో చాలా అందంగా ఉంటాయి. ఇవి ఎక్కువగా ఏప్రిల్‌, మే నెలల్లో పూస్తాయి. ఇక్కడ మరో సుందర దృశ్యం గురించి చెప్పుకోవాలి. ఆ చుట్టుపక్కల ఏ రంగు పూల చెట్లు ఉంటాయో ఆ ప్రదేశమంతా అదే రంగు నిండిపోయి కనువిందు చేస్తుంది.

నేపాల్‌ సరిహద్దు

నేపాల్‌ సరిహద్దు

ఈ మార్గం చాలా చిన్నది. చిన్న చిన్న వాహనాలు మాత్రమే వెళ్లడానికి వీలవుతుంది. ఆ దారిలో వెళ్తే ఎక్కువ దూరం నడవాల్సి వస్తుంది. అందుకోసం కొంతమంది అంత దూరం నడవకుండా కొన్ని దగ్గర దారుల్లో వెళ్తుంటారు. అయితే అది చాలా ప్రమాదకరం. పొరపాటున వెళ్లారా... తిన్నగా నేపాల్‌ సరిహద్దు దాటి ఆ దేశంలో అడుగుపెడతారు. అది నేపాల్‌ అని తెలియడానికి అక్కడక్కడా సిమెంటు దిమ్మెలు కూడా ఉంటాయి. వాటిమీద మన దేశం వైపు భారత్‌ అనీ, మరొక వైపు నేపాల్‌ అనీ రాసుంటుంది. అంటే మనకు తెలియకుండానే నేపాల్‌లోకి వెళ్లిపోతామన్నమాట. అందుకే ఆ మార్గాల్లోకి ఎవరినీ వెళ్లనివ్వరు.

Photo Courtesy: Koustav2007

మేఘ్మా

మేఘ్మా

అలా ఘాట్‌ రోడ్డులో నడుస్తూ వెళ్తుంటే మేఘ్మా వస్తుంది. దీనికి గుర్తుగా సరిహద్దులోనే కమెండోల నివాస సముదాయం ఉంటుంది. ఇక్కడి బౌద్దుల గుడి చాలా బావుంటుంది. మేఘ్మా దారిపక్కన ఇండో-నేపాల్‌ సరిహద్దు రాయి కనిపిస్తుంది.

Photo Courtesy: Anirban Biswas

టోంగ్లు

టోంగ్లు

అక్కణ్ణుండి నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఒక పర్వతం అంచున టోంగ్లు అనే గ్రామం ఉంది.మరో విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడూ మేఘాలు దట్టంగా కమ్ముకుని ఉంటాయి. ఎంతగా అంటే ఎప్పుడు సూర్యోదయం అయిందో, ఎప్పుడు సూర్యాస్తమయమయిందో కూడా తెలియదు. పరిసరాలేవీ సరిగ్గా కనిపించవు. రెండు మూడు మీటర్ల దూరంలో ఏముందో కూడా అర్ధం కాదు. ఎక్కువగా మధ్యాహ్న సమయం తర్వాత మేఘాలు దట్టంగా ఆవరిస్తాయి. ఇక్కడ కనిపించే అద్భుత దృశ్యాల్లో సూర్యోదయం, సూర్యాస్తమయం ముఖ్యమైనవి. ఎక్కువగా మబ్బులు కమ్మేయడం వల్ల వీటి దర్శన భాగ్యం పర్యాటకులకు అరుదుగానే లభిస్తుందని చెప్పాలి. కొండల వెనుక నుండి మబ్బుల మధ్యలో అలా అలా పైకి వచ్చే ఉదయభానుడి తొలి వెలుగు కిరణాలు బంగారు వర్ణంలో ప్రకాశిస్తాయి. అవి కొద్దికొద్దిగా పైకి వస్తూ కాంచన్‌జంగ, పాండిమ్‌, జాను శిఖరాలమీద వెలుగులు విరజిమ్ముతాయి. కాంచన్‌జంగకు కుడివైపున పాండిమ్‌, ఎడమ వైపున జాను పర్వతాలు ఉంటాయి. ఈ మూడు శిఖరాగ్రాలు పడుకుని ఉన్న మనిషి ఆకారంలో కనిపిస్తాయి. జాను శిఖరం తలగాను, కాంచన్‌జంగ శరీరంగాను, పాండిమ్‌ కాళ్లలా కనిపిస్తాయి. స్థానికులు ఆ ఆకారాన్ని 'నిద్రిస్తున్న బుద్ధుడు' అని చెప్తారు.

Photo Courtesy: SANTU4799

సింగలీల నేషనల్‌ పార్కు

సింగలీల నేషనల్‌ పార్కు

అక్కణ్ణుండి 15 కి.మీ దూరంలో కాలాపొఖ్రి గ్రామం ఉంది. ఆ దారిలోనే నేపాల్‌లోని టుమ్లింగ్‌ వస్తుంది. అక్కడ చూడాల్సిన ప్రదేశం సింగలీల నేషనల్‌ పార్కు. ఈ పార్కుకు వెళ్లే దారిలో ఫెర్న్‌ మొక్కలు కనిపిస్తాయి. శీతాకాలంలో మంచు కప్పేసిన ఆ మొక్కలు... వేసవి ప్రారంభంలో మంచు కరగడం వల్ల తిరిగి కనిపిస్తాయి. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో చిగురించడం ప్రారంభిస్తాయి. మాగ్నోలియా చెట్లు పూలతో నిండి ఉంటాయి. ఈకాలంలో చూస్తే అసలు ఆ చెట్లకి ఆకులనేవి ఉంటాయా అనిపిస్తుంది. ఈ పార్కులో అక్కడక్కడా ఎర్ర పాండాలు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి జంతువులు కనిపిస్తాయి. ఈ కొండల్లో పుష్పించే రంగురంగుల పూల కోసం సుమారు 600 రకాల పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి. అవన్నీ ఈ పార్కుకు అదనపు అందాలే.

Photo Courtesy: Lasse80

కాలాపొఖ్రి

కాలాపొఖ్రి

పార్కు కొండ దిగి నాలుగు కి.మీ నడిస్తే కాలాపొఖ్రి వస్తుంది. అక్కణ్ణుండి సందాక్ఫు ఆరు కిలోమీటర్ల దూరం. సందాక్‌ఫూ దగ్గరికి రాగానే చిన్న చిన్న మంచుగుట్టలు కనిపిస్తాయి. ఇక్కడ్నుండి చూస్తే మబ్బులు కమ్మేసిన హిమాలయాలు కనిపించీ కనిపించనట్లు బహు సుందరంగా ఉంటాయి.

Photo Courtesy: tranquillite

సందాక్ఫు

సందాక్ఫు

ప్రపంచంలోని ఎత్తైన మొదటి అయిదు శిఖరాల్లో నాలుగింటిని ఇక్కడి నుండే చూడొచ్చు! అంటే, మొత్తం 320 కి.మీ మేర మంచు కప్పేసిన హిమాలయ పర్వత సముదాయాన్ని ఈ ప్రాంతం నుండి చూడొచ్చన్నమాట. హిమాలయాల్లో మరే ప్రదేశంలోనూ ఇలా కనిపించదు. ఈ దృశ్యాల్ని ఎంతసేపు చూసినా ఇంకా చూడాలని అనిపిస్తుంది.

Photo Courtesy: solarshakti

సిరిఖోలా

సిరిఖోలా

అక్కడ్నుండి 12 కి.మీ వెళ్తే సిరిఖోలా వస్తుంది. ఈ దారి పొడవునా మాగ్నోలియా, రోడోడెండ్రాన్‌ పూలచెట్లు అందమైన రంగుల్లో కనువిందు చేస్తాయి. ఖోలా అంటే అక్కడి భాషలో నది అని అర్ధమట. నదిలోకెళ్లి అక్కడ ఉన్న పెద్ద పెద్ద రాళ్లమీద కూర్చుంటే ఏటి గలగలలు తప్ప మరే శబ్దం వినిపించదు. తిరుగు ప్రయాణం ఉదయాన్నే చేస్తే బావుంటుంది. ఎంచక్కా నదివెంట ప్రయాణిస్తూ మనేరుభంజంగ్‌ చేరుకోవచ్చు. అక్కణ్ణుండి న్యూ జల్పాయిగురి వెళ్లి ట్రైన్‌ మీద రావచ్చు. ట్రెకింగ్‌ కాస్త కష్టమనిపించినా శరీరానికి మంచి వ్యాయామం... మొత్తమ్మీద ఇదో అద్భుతమైన ప్రయాణం!

Photo Courtesy: Suvendra.nath

తినడానికి?

తినడానికి?

అక్కడి హోటళ్లలో అన్నం, గుడ్లు, రోటీలు, కూరలు అన్నీ దొరుకుతాయి. రుచిగా కూడా ఉంటాయి. ట్రెకర్స్‌ హట్‌లో నూడుల్స్‌, అన్నం, క్యారెట్‌ లేదా బంగాళదుంప కూర, రోటీలు ఇస్తారు.

Photo Courtesy: Biswarup Sarkar

జాగ్రత్తలు

జాగ్రత్తలు

ఎక్కడ పడితే అక్కడ నీటిని తాగడం మంచిది కాదు. అందుకే నీటిని శుభ్రం చేసే ట్యాబ్లెట్లు తీసుకెళితే మంచిది. ఇవి డార్జిలింగ్‌లో దొరుకుతాయి. ఉప్పు, గ్లూకోజ్‌ తప్పక వెంట తీసుకుపోవడం మరిచిపోకండి.

సూచనలూ.... సలహాలూ...

సూచనలూ.... సలహాలూ...

వాతావరణం ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం కనుక రెయిన్‌కోటు తప్పనిసరి. ట్రెకింగ్‌ చేసేవాళ్లు నీళ్లు ఎక్కువగా తాగాలి. మంచుమీద ఎక్కువగా ఆడకూడదు. అందరితో కలిసి కదలాలి.

Please Wait while comments are loading...