India
Search
  • Follow NativePlanet
Share
» »పశ్చిమ కనుమల నేల‌పై మెరిసిన‌.. న‌క్ష‌త్ర కోట‌!

పశ్చిమ కనుమల నేల‌పై మెరిసిన‌.. న‌క్ష‌త్ర కోట‌!

చారిత్ర‌క నిర్మాణాలు ఎప్పుడూ మ‌న‌ల్ని ఆక‌ర్షిస్తాయి. వంపులు తిరిగే రాతి ఆకృతులు మ‌న‌సు దోచేస్తాయి. న‌క్ష‌త్ర ఆకారంలో ఉన్న కోట గురించి ఇప్పుడు మ‌నం మాట్లాడుకోబోతున్నాం. నిజానికి, ఆకాశంలో మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాన్ని చూడాలంటే తలెత్తి చూస్తే చాలు.

అదే, నేల మీద ఉన్న ఈ నక్షత్రాన్ని చూడాలంటే మాత్రం ఆకాశంలో విహరించాల్సిందే. మ‌రి, ప్ర‌కృతి ఒడిలో సేద‌దీరుతున్న‌ నక్షత్రకోటతోపాటు పశ్చిమ కనుమల ప్రకృతి విన్యాసాలన్నీ ఆస్వాదించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా..

పశ్చిమ కనుమల నేల‌పై మెరిసిన‌.. న‌క్ష‌త్ర కోట‌!

పశ్చిమ కనుమల నేల‌పై మెరిసిన‌.. న‌క్ష‌త్ర కోట‌!

చూసేందుకు న‌క్ష‌త్ర ఆకారంలో ఉండే ఈ పురాత‌న కోట క‌ర్ణాట‌క‌లోని హ‌స‌న్ జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రానికి 45 కిలోమీట‌ర్ల‌ దూరంలో మల్నాడు రీజియన్, సక్లేశ్‌పురా పట్టణానికి దగ్గరలో ఉన్న స్టార్‌ఫోర్ట్‌ అసలు పేరు మంజారాబాద్‌ కోట. మంజు అంటే కన్నడలో మంచు అని అర్థం. ఎప్పుడూ మంచు తెర కమ్మినట్లే ఉంటుంది ఇక్కడి వాతావరణం.

ఇది మైసూరు పాలకుల వేసవి విడిదిగా ఉండేది. ఈ కోటలో పెద్ద ఆయుధాగారం ఉండేదని ఇప్పుడున్న ఆనవాళ్లు చెబుతుంటాయి. మైసూర్‌ కోట నుంచి ఈ కోటకు రహస్య మార్గం ఉండేదని స్థానిక కథనం. ఎనిమిది కోణాల నిర్మాణం ఇది. ఈ కోట నిర్మాణ శైలి ఆద్యంత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తుంది. నిజానికి దీనిని ఎనిమిది రెక్కల పద్మం ఆకారం అనే చెప్పాలి. అయితే మూలలు కోసుగా కోణాకారంలో ఉండడంతో నక్షత్రకోటగా వాడుకలోకి వచ్చింది. ఆ ఆకార‌మే కోట పేరుగా ప్రాచుర్యం పొందింది.

కోట గోడ‌ల్లో ప్ర‌తిధ్వ‌నిస్తూ..

కోట గోడ‌ల్లో ప్ర‌తిధ్వ‌నిస్తూ..

నిత్యం ఈ ప్రాంతం ప‌ర్యాట‌కుల‌తో కిట‌కిట‌లాడుతుంది. అందుకు కార‌ణం కోట నిర్మాణ‌శైలి ఒక్క‌టే అని చెప్ప‌లేం. ఎందుకంటే, ఏడాది పొడ‌వునా ఇక్క‌డ చ‌ల్ల‌దం క‌మ్మేస్తుంది. ఈ చ‌ల్ల‌ద‌నానికి ప‌శ్చిమ క‌నుమ‌ల ప‌చ్చ‌ద‌నం కూడా కార‌ణంగా చెప్పొచ్చ‌. అంతేకాదు, ఈ కోట సందర్శన పెద్ద సాహసం అనే చెప్పాలి. నాచు ప‌ట్టిన మార్గం గుండా వేసే ప్ర‌తి అడుగూ చాలా జాగ్ర‌త్త‌గా వేయాల్సి ఉంటుంది. అందుకే ఎక్కువ‌గా యువ‌త ఇక్క‌డికి వెళ్లేందుకు మొగ్గుచూపుతారు.

వారి కేరింత‌ల స‌వ్వ‌డులు నిత్యం ఇక్క‌డి కోట గోడ‌ల్లో ప్ర‌తిధ్వ‌నిస్తూ ఉంటాయ‌నంటే ఆశ్చ‌ర్య‌పోవ‌క్క‌ర్లేదు. ప‌చ్చ‌ద‌నపు పొర‌లు కోట గోడ‌ల‌కు అందంగా అమ‌ర్చిన‌ట్లు క‌నిపించే నాచు సైతం చూప‌రుల‌ను అక‌ట్టుకుంటుంది.

ఘుభాలించే ప్ర‌కృతి ప‌రిమళాలు..

ఘుభాలించే ప్ర‌కృతి ప‌రిమళాలు..

నిజానికి, సక్లేశ్‌పురా నుంచి ఈ కోటకు ప్రయాణం మొదలైనప్పటి నుంచి కాఫీ గింజల పరిమళం సంద‌ర్శ‌కుల‌కు ఉత్సాహాన్నిస్తుంది. గుబురుగా నేల‌పై ప‌రిచిన‌ట్లు క‌నిపించే కాఫీ తోట‌ల మ‌ధ్య‌లో వంపులు తిరుగుతూ ద‌ర్శ‌న‌మిచ్చే దారులు భ‌లే ఆక‌ట్టుకుంటాయి. ఆకాశాన్నంటుతున్న పోక చెట్లు మీ ప్రయాణం కూడా ఆకాశం వైపేనని గుర్తు చేస్తాయి. యాలకుల చెట్లు వాతావరణాన్ని సుగంధభరితం చేస్తుంటే మిరియాల గుత్తులు ఒకింత ఘాటు వాసనతో ఊపిరితిత్తులకు ఆరోగ్యాన్నిస్తుంటాయి. చల్లటి వాతావరణంలో గొంతు గరగర అనిపిస్తే రెండు మిరియాలను నమిలితే పర్యటన ఆరోగ్యంగా ముందుకు సాగుతుంది. మధ్యలో చిన్న చిన్న నీటి కాలువలు పాదాలను కడుగుతుంటాయి. కొండల్లో ప్రవహించే స్వచ్ఛమైన నీరు చల్లగా పాదాలను స్పృశిస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతుంది.

ఈ హిల్‌స్టేషన్‌ను ఊటీతో పోలుస్తారు. ఊటీ సంపన్నుల పర్యాటక క్షేత్రం అయితే ఇది పేదవారి పర్యాటక ప్రదేశమని చెబుతారు. మాన‌సిక ప్ర‌శాంత‌తోపాటు ప‌ర్యాట‌క ఆహ్లాదాన్ని త‌క్కువ ఖ‌ర్చుతో పొందాలంటే న‌క్ష‌త్ర కోట ప్ర‌యాణం స‌రైన ఎంపిక‌. మ‌రెందుకు ఆల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

Read more about: sakleshpur hasan karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X