Search
  • Follow NativePlanet
Share
» »యానాం - పర్యాటక ప్రదేశాలు !!

యానాం - పర్యాటక ప్రదేశాలు !!

వైష్ణవాలయం వీధి (ర్యూ విషెను) లో ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా సహిత వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడి ప్రజలు చైడికుడి వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తారు.

By Mohammad

యానాం, పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతములోని ఒక జిల్లా మరియు ఆ జిల్లా యొక్క ముఖ్య పట్టణము. ఈ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో 30 చ.కి.మీ.ల విస్తీర్ణములో ఉంటుంది. 1954 లో ఫ్రాన్స్ నుండి భారతదేశానికి ఇవ్వబడినా ఫ్రెంచి యానామ్ గా గుర్తింపు వుంది. దీనికి 300 సంవత్సరాల చరిత్ర వుంది. ఫ్రెంచి మరియు తెలుగు సంస్కృతుల మేళవింపు యానాంలో కనిపిస్తుంది.

యానాం

చిత్రకృప : Bsskchaitanya

వేంకటేశ్వర స్వామి దేవాలయం

వైష్ణవాలయం వీధి (ర్యూ విషెను) లో ప్రసిద్ధి చెందిన అలివేలు మంగా సహిత వేంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడి ప్రజలు చైడికుడి వెంకన్న, మీసాల వెంకన్న అని పిలుస్తారు. ఈ దేవాలయంలో ఉన్న వేంకటేశ్వర స్వామి విగ్రహం ముఖం మీద మీసాలు ఉన్నాయి. అందువలన ఇక్కడ వేంకటేశ్వర స్వామిని మీసాల వెంకన్న అని పిలుస్తారు.

ఈ గుడిని 15 వ శతాబ్దంలో రాజమండ్రిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తూర్పు చాళుక్యులరాజులు సమయంలో కట్టించారు. ఈ దేవాలయం భారత దేశానికి స్వాతంత్ర్యం రావడానికి మునుపు బాల్యవివాహాలు నిషేధించడానికి పూర్వం, బాల్యవివాహాలకు వేదికగా ఉండేది. బ్రిటిషు వారి పరిపాలనలో రాజా రామ్మోహన రాయ్ వంటి సంఘసంస్కర్తల వలన శారదా చట్టం అమలులోకి వచ్చాక బాల్య వివాహాలు నిషేధించబడ్డాయి.

యానాం

చిత్రకృప : Bsskchaitanya

యానాం ఫ్రెంచ్ వారి పరిపాలన జరుపుతున్న సమయంలో ఈ దేవాలయం బాల్య వివాహాలకు ఎంత ప్రసిద్ధి చెందినదంటే ఇరుగుపొరుగు రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి బాల్యవివాహాలు జరిపించుకొనేవారు. ఇక్కడికి మద్రాసు రాష్ట్రం, హైదరాబాదు నుండి వచ్చి బాల్యవివాహాలు జరిపించుకొనేవారు. వందలకొద్ది వివాహాలు జరగడం వల్ల ఈ ఊరిని కళ్యాణపురం అని పిలిచేవారు.

మసీదు

1848 సంవత్సరంలో ఈ మసీదు (మస్జిద్) నిర్మాణానికి ఫ్రెంచ్ ప్రభుత్వం స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. అప్పుడు చిన్న మసీదుగా నిర్మితమైనది. తరువాత కాలంలో 1956 సంవత్సరంలో మసీదుకి పునరుద్ధరణ పనులు జరిగాయి. 1978 సంవత్సరంలో మసీదుని పూర్తిగా ధ్వంసం చేసి తిరిగి నిర్మించారు.

యానాం

చిత్రకృప : Bsskchaitanya

1999-2000 సంవత్సరానికి ఈ మసీదు చాలా ఉన్నత మసీదుగా తీర్చిదిద్దారు. ఒకే సమయంలో 200 మంది భక్తులు ఈ మసీదులో ప్రార్థన జరుపుకొనే అవకాశం ఉంది. రంజాన్, బక్రీద్ వంటి ముస్లిం పండుగలు చాలా జరుపబడతాయి. తల్లరేవు, కొలంక, శుంకరపాలెం నుండి కూడా భక్తులు వచ్చి ప్రార్థన జరుపుకొంటారు.

కాథలిక్ చర్చి/యానాం చర్చి

ఈ ఫ్రెంచి కతోలిక చర్చి ఫ్రెంచి పరిపాలనను గుర్తు చేస్తూ గుర్తింపుగా ఉంటుంది. దీనిని సెయింట్ ఆన్స్ కాథలిక్ చర్చి అని పిలుస్తారు. ఈ చర్చి ఐరోపా ఖండపు నిర్మాణశైలిలో నిర్మితమైనది. ఈ చర్చి నిర్మాణానికి కావలసిన సరంజామ, లోపలి సామాన్లు, అలంకరణ వస్తువులు ఫ్రాన్స్ నుండి దిగుమతి చేసుకొనబడినవి.

యానాం

చిత్రకృప : Klsateeshvarma

ఈ చర్చి ఆకర్షణ ఏమి అనగా ఈ చర్చికి దగ్గరలో మరో చిన్న కొండపై గుడి ఉన్నది, దీనిని కూడా ఫ్రెంచి పరిపాలకులు నిర్మించారు.

ఈ కొండ పై నున్న గుడి ప్రక్కన మరో కొండ పై చర్చిని ఆంగ్లేయ ఇంజినీర్లు నిర్మించారు. 1943 సంవత్సరంలో విలియమ్ అగస్టస్ అనే ఓడ తుఫాను వల్ల ఒక ఇసుక ద్వీపంలోకి చిక్కుకొని పోయింది. ఎంత ప్రయత్నం జరిపిన వెయ్యి టన్నులు ఉన్న ఈ ఓడని ఒడ్డుకి చేర్చలేక పోయారు. ఈ ఓడ అదే ప్రదేశంలో ఒక సంవత్సరం పాటు ఉంది. అప్పుడు అమెరికా నుండి ఇక్కడకి ఎంపికైన స్వైనీ అనే ఇంజనీరు మేరీమాతని ప్రార్థించాడు. ఆమె అనుగ్రహంతో ఆ ఓడ ఒడ్డుకి చేర్చబడింది కావున మేరిమాత గుర్తింపుగా ఈ చర్చిని కొండ మీద కట్టించారు. ఈ చరిత్ర అంతా కొండ మీద ఉన్న చర్చి గోడల మీద వ్రాయబడి ఉంది.

యానాం

చిత్రకృప : Bsskchaitanya

యానాం ఎలా చేరుకోవాలి ?

  • విమాన మార్గం : యానాం సమీపాన 60 కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి ఎయిర్ పోర్ట్ కలదు.
  • రైలు మార్గం : యానాం సమీపాన 26 కిలోమీటర్ల దూరంలో కాకినాడ రైల్వే స్టేషన్ కలదు.
  • రోడ్డు మార్గం : యానాం చేరుకోవటానికి కాకినాడ నుండి అనేక బస్సులు కలవు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X