Search
  • Follow NativePlanet
Share
» »సోమశిల నుంచి శ్రీశైలం.. బోటు ప్ర‌యాణాన్ని ఆస్వాదించండి!

సోమశిల నుంచి శ్రీశైలం.. బోటు ప్ర‌యాణాన్ని ఆస్వాదించండి!

సోమశిల నుంచి శ్రీశైలం.. బోటు ప్ర‌యాణాన్ని ఆస్వాదించండి!

కృష్ణా న‌దీ జ‌లాల‌పై ఊయ‌లాడుతూ.. చుట్టూ సహజ జలపాతాలు..అరుదైన వన్యప్రాణులు.. ఎత్తయిన కొండలు.. ప్రకృతి సోయగాలను తిలకిస్తూ పడవలో సాగే ప్రయాణం మాటల్లో ఎంత చెప్పినా తక్కువే. హొయలొలికే నీటి అలలు..రయ్యిన ఎగురుతూ విన్యాసాలు చేసే పక్షులు.. నీళ్లలో జలతారు మీనాల నృత్య సోయగాలు.. ప్రకృతి చెక్కిన రాతి శిల్పాలు.. అలా సోమ‌శిల నుంచి శ్రీ‌శైలం వ‌ర‌కూ సాగే బోటు ప్ర‌యాణం ప్ర‌కృతి ప్రేమికుల‌కు ఎంతో ఆహ్లాదాన్నిస్తుంది. ఓ గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. సోమశిల చక్కటి పర్యాటక సొబగులను సంతరించుకొని ఆకట్టుకుంటోంది. సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీలో ప్రయాణించేందుకు పర్యాటకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి అనుభ‌వాల‌ను పొందాలంటే ఈ బోటులో షికారు చేయాల్సిందే.

సోమశిల నుంచి శ్రీశైలం వరకు బోట్లలో ప్రయాణించేందుకు తెలంగాణ టూరిజం శాఖ అవ‌కాశాన్ని క‌ల్పిందించింది. రోజూ ఉదయం 9 గంటలకు బయలుదేరేలా ప‌లు ప్రాంతాల‌నుంచి ఆఫర్ల‌ను ప్ర‌క‌టించింది. సోమ‌శిల నుంచి శ్రీ‌శైలం అయితే సుమారు 90 కిలోమీట‌ర్ల మేర‌ ప్రయాణం సాగుతుంది. కొల్లాపూర్‌ సమీపంలోని సోమశిల నుంచీ అక్కమహాదేవి గుహకు వెళ్లొచ్చు. సోమశిల నుంచి కృష్ణానదిలో 85 కిలోమీటర్లు బోటులో ప్రయాణించాలి. అక్కడి నుంచి శ్రీశైలానికీ తీసుకెళ్తారు. టికెట్‌ ధర పెద్దలకు రూ.1,200, పిల్లలకు రూ.800. హైదరాబాద్‌ నుంచి కొల్లాపూర్‌కు బస్సులు ఉంటాయి. కర్నూలు నుంచి వనపర్తి మీదుగా కొల్లాపూర్‌కు చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సులు, ఆటోల్లో సోమశిలకు (9 కి.మీ.) వెళ్లొచ్చు.

akkamahadevicaves

అక్కమహాదేవి గుహలు ఆధ్యాత్మికతకు చిహ్నాలు..

నల్లమల అడవుల అందాలను దాటుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ బోటు ప్ర‌యాణం. మధ్యమధ్యలో వచ్చే చిన్నచిన్న దీవులు ఆకట్టుకోనున్నాయి. నల్లమల అడవులను చీల్చుకుంటూ ముందుకు సాగినట్లుంటే కృష్ణమ్మ అందాలు చూసేందుకు రెండు కళ్లు చాలవు. దట్టమైన అడవులు, అక్కడక్కడ సందడి చేసే వన్యప్రాణులను చూసేందుకు పర్యాటకులు ఎగబడతారు. చరిత్రకు చిరునామాగా నిలిచే ఆంకాలమ్మ కోట, శ్రీశైలం చేరుకుంటామనగా వచ్చే అక్కమహాదేవి గుహలు ఆధ్యాత్మికతకు చిహ్నాలు.

పాతాళగంగకు 16 కిలోమీటర్ల దూరంలో నిలువెత్తు గిరుల మధ్య ఉంటుందీ గుహ. దీని ఎదురుగా అందమైన శిలాతోరణం ఉంది. 30 అడుగుల ఎత్తులో 200 అడుగుల పొడవుతో.. 16 అడుగుల వెడల్పుతో ఉన్న రాతి తోరణాన్ని చూసిన ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే.. విశాలమైన గుహ కంటపడుతుంది. పొరలు పొరలుగా పరుచుకున్న గండశిలల మధ్య ఉంటుందిది. అందులో స్తంభాలపై అపురూప శిల్పాలు చూడొచ్చు. లోనికి వెళ్లడానికి సన్నని మార్గం ఉంటుంది.

srisaailam1

పక్షులు స్వాగత గీతాలు పలుకుతాయి..

పూర్తిగా వంగి పాకుతూ ముందుకు వెళ్తే.. సహజ సిద్ధంగా ఏర్పడిన శివలింగం కనిపిస్తుంది. ఈ పేరువెన‌క చాలా చ‌రిత్రే ఉంది. 12వ శతాబ్దంలో ఇదే గుహలో కర్ణాటకకు చెందిన శివభక్తురాలు అక్కమహాదేవి తపస్సు చేసిందని చెబుతారు. సమీపంలోని కదలీ వనంలో ఆమె శివైక్యం అయిందంటారు. ఆ మహాభక్తురాలి పేరిట దీనిని అక్కమహాదేవి గుహ అని పిలుస్తారు. ఇక్కడికి నదీ మార్గంలో వెళ్లాలి. పాతాళగంగ నుంచి మరబోట్లు ఉంటాయి. నదీ తీరం వెంట అక్కడక్కడా చిన్న చిన్న గుడిసెలు.. కనువిందు చేస్తాయి.

రకరకాల పక్షులు స్వాగత గీతాలు పలుకుతాయి. నది ఒడ్డు నుంచి గుహ వరకు మెట్ల మార్గం ఉంది. ఉభయ సంధ్యల్లో కృష్ణమ్మ సోయగాలు మనోహరంగా కనిపిస్తాయి. శ్రీశైలం చేరుకున్న తర్వాత మల్లన్న దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో సాక్షి గణపతి దర్శనం చేసుకొని డ్యాంసైట్‌ వద్ద శ్రీశైలం ప్రాజెక్టు అందాలు చూసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద సోమశిల నుండి శ్రీశైలం లాంచీ ప్రయాణం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది.

Read more about: somasila srisailam
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X