Search
  • Follow NativePlanet
Share
» »మనకు తెలియని ఏడు రహస్యాలు !!

మనకు తెలియని ఏడు రహస్యాలు !!

By Venkatakarunasri

భారతదేశంలో తొలినుంచి అనేక విషయాలు ఎంతో నిగూఢమైనవిగా కనిపిస్తుంటాయి. అవి ప్రకృతికి సంబంధించినవి కావచ్చు, నాటి చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించే సౌధాలు కావచ్చు, శిల్పాలు కావచ్చు, తటాకాలు కావచ్చు... మనలను ఆశ్చర్యచకితులను చేస్తాయి. వాటిని ఎలా నిర్మించారో వివరించడం సాధ్యం కాదు. ఇవి ఊహలకు ఎంతమాత్రం అందవు. ఎన్ని రకాలుగా ఆలోచించినా సరైన సమాధానం లభించదు. మనిషి మేధస్సుకు అర్థం కాని చిక్కుముడులు అవి. అలాంటి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

అయస్కాంత పర్వతం

అయస్కాంత పర్వతం

ఇదొక వివరించ సాధ్యం కాని అద్భుతం. సాధారణంగా కొండపైకి ఎక్కాలంటే ఎంతో కష్టపడాలి. ఒకవేళ ఆ కొండ మీదకు రోడ్డు వేసి కారులో వెళ్లమన్నా కారు నెమ్మదిగా పైకి వెళుతుంది. ఎంతో ఇంధనం వృధా అవుతుంది. కాశ్మీర్‌ లోని లడక్‌ ప్రాంతంలో లేహ్ సమీపంలో ఉన్న ఈ కొండ మాత్రం మిగిలిన కొండల్లాగా కాదు. తన దగ్గరకు వచ్చే వారిని ఎంతో ఆప్యాయంగా పలుకరించి, తనే స్వయంగా తీసుకువెళ్లిపోతుంది. అంటే, ఈ కొండ మీదకు కారులో వెళ్లాలనుకునేవారు హాయిగా ఇంజన్‌ను ఆఫ్‌ చేసి స్టీరింగ్‌ పట్టుకుని కూర్చుంటే చాలు. ఇనుపముక్కను అయస్కాంతం ఆకర్షించినట్లు కారును పైకి లాక్కుంటుంది. సహజసిద్ధంగా ఏర్పడిన అయస్కాంత తత్వమున్న ఈ కొండపైకి వెళ్లేవారు దీనిలోని అయస్కాంత శక్తికి అబ్బురపోతారు.

Photo Courtesy: Nadine Spielmann / Amit Rawat

గురుత్వాకర్షణకే సవాల్‌

గురుత్వాకర్షణకే సవాల్‌

లక్నో లోని ఒక ప్యాలెస్‌ గురుత్వాకర్షణకే సవాల్‌ గా నిలిచింది. ఈ ప్యాలెస్‌ ను 18వ శతాబ్దిలో అప్పటి రాజు నవాబ్‌ అస్‌ ఉద్‌ దౌలా నిర్మింపజేశారు. అత్యద్భుతమైన వాస్తును ఈ భవనంలో చూడవచ్చు. ఈ భవనంలోకి ప్రవేశించిన వారు అక్కడి సెంట్రల్‌ హాల్‌లోనుంచి బైటికి రావడానికి ఇష్టపడరు. ఎంతమంది ఆ హాల్‌లోకి ప్రవేశించినా, పురాణాల్లోని పుష్పక విమానంలో మాదిరిగా మరొకరికి చోటు ఉన్నట్లు కనిపిస్తుంది. 50 మీటర్ల పొడవుతో ఉండే ఈ హాల్‌ పైకప్పు కనీసం మూడంతస్తుల ఎత్తులో ఉంటుంది. ఈ హాల్‌ మొత్తాన్ని ఎక్కడా ఒక్క స్తంభం కూడా లేకుండా నిర్మించారు. స్తంభాలు లేకుండా, అంత ఎత్తులో పైకప్పుతో అంత పెద్ద హాల్‌ ఎలా నిర్మించారనేది ఆశ్చర్యం కలిగించే అంశమే. ఇంటర్‌లాకింగ్‌ విధానంలో ఇటుకలను పేర్చి ఈ హాల్‌ను నిర్మించారు.

Photo Courtesy: Sudeep Bansal

శనివార్‌వాడ కోట

శనివార్‌వాడ కోట

చారిత్రక చిహ్నంగా మిగిలిన వాటిలో శనివార్‌వాడ కోట ఒకటి. ఈ కోటను 1746లో నిర్మించారు. 1818 వరకూ ఈ కోట పీష్వా రాజుల ఆధీనంలో, తరువాత ఆంగ్లేయులపరమైంది. నాశనం కాకుండా మిగిలిన భాగాలను ప్రస్తుతం పర్యాటక ప్రదేశాలుగా నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని పూణెలో ఉన్న ఈ కోట గురించి స్థానికులలో అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కోటను పాలించిన వారి వంశంలోని ఒక యువరాణి హత్యకు గురైంది. ఆమె ఆత్మ ఇప్పటికీ ఆ కోటలో తిరుగాడుతుంటుందని స్థానికులు చెబుతారు. రాత్రి వేళల్లో బిగ్గరగా, కీచుమనే అరుపులు చాలా భయానకంగా వినవస్తుంటాయని వారు అంటారు. కోటను సందర్శించడమే కాకుండా, రాత్రి వేళల్లో వినవచ్చే అరుపులను వినడానికి ఇక్కడ ఉండాలని స్థానికులు చెబుతుంటారు. నమ్మశక్యం కాని ఇలాంటి విషయాలను పక్కన ఉంచి కోటను చూడటానికి చాలామంది వెళుతుంటారు.

Photo Courtesy: Rohit Mattoo

ద్రాస్‌ లోయ

ద్రాస్‌ లోయ

ఆసియాలో అతి శీతల ప్రదేశాల్లో ద్రాస్‌ లోయ రెండవది. జమ్ము కాశ్మీర్‌లోని కార్గిల్‌ జిల్లాలో ఈ లోయ ఉంది. సాధారణ కాలాల్లోనే ఇక్కడ చలిని భరించడం కష్టం. ఇక చలికాలం వస్తే చెప్పనవసరం లేదు. ఉష్ణోగ్రత మైనస్‌ 50 నుంచి మైనస్‌ 60 డిగ్రీల వరకూ పడిపోతుంది. ఎన్ని దుప్పట్లు కప్పుకుంటే ఆ చలిని తట్టుకోగలమో ఆలోచించండి. టైగర్‌ కొండలపైన పాకిస్తానీయులు చేసిన దుస్సాహసాల సమయంలో దాస్‌ లోయ ప్రముఖంగా వెలుగులోకి వచ్చింది. ఈ లోయనుంచి టైగర్‌ పర్వతాలను చూడవచ్చు.

Photo Courtesy: Narender Kumar Gautam

ధనుష్కోడి

ధనుష్కోడి

రామాయణ కాలంలో శ్రీరాముడు విభీషణుడికి పట్టాభిషేకం జరిపిన స్థలంగా ధనుష్కోడి ని చెబుతారు. రావణాసురుడిని చంపి, విజయం సాధించిన తరువాత రాముడు తన ధనుస్సును ఇక్కడి ఇసుకలో పెట్టాడని కథనం. హిందూమహాసముద్రం, బంగాళాఖాతం కలిసే ప్రాంతంలోని రామేశ్వరం వద్ద ధనుష్కోడి ఉంది. సముద్రం మధ్యలో ద్వీపంలా కనిపించే ఈ ప్రాంతంనుంచి శ్రీలంకకు రైలు మార్గం వేయడానికి ఆంగ్లేయుల కాలంలో యత్నాలు జరిగాయట. అయితే 1964లో సంభవించిన పెను తుపాను ఈ పట్టణాన్ని నాశనం చేసింది. అయినప్పటికీ మీటర్‌ గేజ్‌ రైల్వే మార్గం తాలూకు చిహ్నాలు ధనుష్కోడికి వెళ్లే రోడ్డు మార్గంలో ఇప్పటికీ చూడవచ్చు.

Photo Courtesy: Vinodh Venkatesan

నీటిలో ఏనుగు

నీటిలో ఏనుగు

ఇది మరొక అద్భుతం. సాధారణంగా సముద్రంలో ఈత కొట్టాలనే కోరిక చాలామందికి ఉంటుంది. అందులోనూ ముఖానికి ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని, సముద్రపు అడుగుభాగంలోకి వెళ్లి రావాలని అనుకుంటూ ఉంటారు. ఇలా వెళ్లే వారిని స్కూబా డైవర్స్‌ అంటారు. అండమాన్‌ నికోబార్‌ దీవులు స్కూబా డైవర్స్‌ను ఎంతో ఆకర్షిస్తుంటాయి. ఇక్కడి స్వచ్ఛమైన నీటిలో నేల కూడా పైకి కనిపిస్తుంటుంది. దీనితో స్కూబా డైవర్లు హాయిగా నీటి అడుగుకు వెళ్లి ఈత కొడుతూ ఆనందం పొందుతుంటారు. సరిగ్గా అలాగే ఒక ఏనుగు కూడా నీటి అడుగు వరకూ వెళ్లి హాయిగా ఈత కొడుతూ ఉంటుంది. రాజన్‌ అనే 59 సంవత్సరాల ఈ ఏనుగుకు స్కూబా డైవింగ్‌ అంటే మక్కువ. అందుకే తన తొండాన్ని అవసరమైనప్పుడు గాలి పీల్చుకోవడానికి వాడుకుంటూ నీటిలో జలకాలాడుతుంటుంది.

Photo Courtesy: andaman nicobar govt

వేలాడే రాతి స్తంభం

వేలాడే రాతి స్తంభం

పైన పేర్కొన్న వాటితో పాటుగా, ఆంధ్రప్రదేశ్‌ లోని లేపాక్షి లో ఉన్న వేలాడే రాతి స్తంభం కూడా ఒకటి. ఈ రాతి స్తంభం ఎలా వేలాడదీశారో ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే. సాధారణంగా స్తంభాలు నేలలో పాతి వాటిపైన కట్టడాలు నిర్మిస్తారు. దానికి భిన్నంగా ఈ స్తంభం మాత్రం చూరును పట్టుకుని వేలాడుతుంటుంది. నేలకు, స్తంభానికి మధ్య అతి సన్నటి ఖాళీ ఉంటుంది. ఈ మధ్యలోనుంచి పేపర్లు, దారం, వస్త్రాలను ఒకవైపు నుంచి తోసినప్పుడు అవి రెండవవైపునుంచి బైటికి వస్తుంటాయి. అంత బరువైన స్తంభం ఎలా వేలాడదీసారో ఎవరికీ అర్థం కాదు. అదీగాక ఇన్ని శతాబ్దాలుగా ఆ స్తంభం అలాగే వేలాడుతూ ఉండటం మరొక విచిత్రం.

Photo Courtesy: Trayaan

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more