Search
  • Follow NativePlanet
Share
» »ప‌చ్చ‌ని ప‌ర్యాట‌క రంగ‌వ‌ల్లి.. పాల‌వెల్లి!

ప‌చ్చ‌ని ప‌ర్యాట‌క రంగ‌వ‌ల్లి.. పాల‌వెల్లి!

ప‌చ్చ‌ని ప‌ర్యాట‌క రంగ‌వ‌ల్లి.. పాల‌వెల్లి!

జీవనది గోదావరి పరవళ్లు తొక్కుతున్న కోనసీమ ప్రాంతంలో పర్యటిస్తే ఆ అనుభూతి చిరకాలం గుర్తుండిపోయేదే. అక్కడి పల్లె అందాలు మాటల్లో వర్ణించలేనివి. అఖండ గోదావరి నది వైనతేయ, గౌతమి, వశిష్ట పాయలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సముద్రంలో కలుస్తున్న ప్రకృతి రమణీయ ప్రాంతం ఇది. మరీ ముఖ్యంగా వశిష్ట గోదావరి తీరంలోని కోనసీమ అందాల మధ్య హోయలొలుకుతూ సాగే గోదావరి ప్రవాహం పరిశీలిస్తే కిన్నెరసాని నడక ఈ నదీ ప్రవాహం చూసే నేర్చుకున్నదేమో అనిపిస్తుంది. అలాంటి గోదావరి పరీవాహంలో దాగి ఉన్న కోనసీమ ప్రకృతి అందాలను మ‌న‌సారా ఆస్వాదిద్దాం!!

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి చేరువగా యలమంచిలి లంక గ్రామంలో పాలవెల్లి రిసార్ట్స్ ఏర్పాటు చేశారు. శీతాకాలం వ‌చ్చిందంటే చాలు ఇది పర్యాటకులను ఎంత‌గానో ఆకర్షిస్తోంది. గోదావరి తీరాన్ని ఆనుకుని, అన్ని వసతులతో ఏర్పాటు చేసిన ఈ రిసార్ట్స్‌లో ఎక్కడా పట్టణ, నగర వాతావరణం కనిపించదు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి ఒడిలో సేద‌తీరేందుకు తాపత్ర‌య‌ప‌డే ప‌ర్యాట‌కుల విడిది కేంద్రం పాల‌వెల్లి రిసార్ట్స్ అన‌డంలో సందేహమే లేదు. ప్రత్యేకంగా కొబ్బరి, తాటి కలపతో నిర్మించిన పలురకాల వసతి గదులు చూపరులను కనువిందు చేస్తాయి.

పాండ్ విల్లా, కోనసీమ విల్లా, ఎర్త్ విల్లా, మండువా లోగిలి, మందువా డీలక్స్ వంటి పేర్లతో ఇక్కడ పర్యాటకులకు అనువైన ఎయిర్ కండీషన్‌తో కూడిన విడిది ఏర్పాట్లు కూడా ఉన్నాయి. వశిష్ట కాంప్లెక్స్ పేరుతో నిర్మించిన విడిది ప్రకృతి రమణీ యతకు చిరునామాగా కనిపిస్తుంది. ఇక ఇంద్రావతి పేరుతో అచ్చంగా తెలుగు వంటకాల తోపాటు ఉత్తర, దక్షిణ భారతదేశ రుచికరమైన వంటకాలతో అందరినీ నోరూరించేలా ఉంటాయి. తెలుగింట గోదావ‌రి జిల్లాల రుచుల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.

సమావేశాలకు అనువైన స్థలం

సమావేశాలకు అనువైన స్థలం

ఈ రిసార్ట్స్ మరో ప్రత్యేకత కనిపిస్తుంది. సమాగమం పేరుతో ముఖ్యమైన సమావేశాలు, సభ పేరుతో మరో సమావేశ మందిరం నిర్మించారు. సుందర ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంతమైన సమావేశాలకు ఇది అనువైన స్థలంగానే చెప్పొచ్చు. నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈతకొలను పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. స్వ‌చ్ఛ‌మైన నీటిపై తేలియాడుతూ గ‌డిపే క్ష‌ణాలు జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతుల‌ను చేరువ చేస్తాయి. ఎటు చూసినా ప‌చ్చ‌ద‌నం క‌మ్మేసిన‌ట్లు నిటారైన కొబ్బ‌రి చెట్ల మ‌ధ్య కుటుంబ సమేతంగా విడిది చేసేందుకు ఈ రిసార్ట్స్ మంచి ఎంపిక.

సేద దీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు

సేద దీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు

కొబ్బరితోటల నడుమ ప్రత్యేకంగా నిర్మించిన ఎసి గదులతోపాటు సూట్ రూముల్లో గడపడానికి ఇక్కడకు దూర ప్రాంతాల నుంచి పెద్ద పర్యాటకులు వస్తూంటారు. ఈ వసతి గదుల్లో విడిది చేసేవారిలో ఇద్ద‌రికి ఉద‌యం అల్పాహారం, కాఫీ, టీ ఉచితంగా అందించేవారు. ఎల్సెడి టివిలు, ఇన్ డోర్, అవుట్ డోర్ ఆటలు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. పిల్లలు స్వేచ్ఛగా ఆటలు ఆడుకుని, సేద దీరేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

గోదావరి చెంతనే రోప్‌వేపై సరదా నడక, విల్లంబులు చేతపట్టి బాణాలు సంధిం చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, రోప్ స్కేటింగ్, పెద్ద గాలిబుడగలో నీటి కొలనులో సరదా గొలిపే నడక, క్యారమ్స్, చెస్ వంటి పలురకాల ఆటలు ఇక్కడికి వచ్చే వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇక్క‌డ పిల్ల‌ల‌కు కోసం ప్ర‌త్యేక‌మైన ఏర్పాట్లు చేస్తున్నారు. టెక్నాల‌జీకి సంబంధించి ఆట‌ల‌ను ప‌రిచ‌యం చేసేందుకు కూడా అవ‌కాశం లేక‌పోలేదు.

మరో హైలెట్ ఎసి బోట్లో షికారు

మరో హైలెట్ ఎసి బోట్లో షికారు

రిసార్ట్స్ చెంతనే గోదావరిలో ప్రత్యేకంగా తయారు చేసిన ఎసి బోటు పర్యాటకుల మనసులు దోచేందుకు సిద్ధంగా ఉంటుంది. ఇంటిని తలపించే విధంగా తయారుచేసిన ఈ బోటులో రిసార్ట్స్ నుంచి తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది వరకూ ప్రయాణించొచ్చు. ఇందుకు ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

యలమంచిలి లంక ప్రాంతం నుంచి మొదలైన ఈ బోటు ప్రయాణం యలమంచిలి, చించినాడ, ఏనుగువానిలంక, బాడవ గ్రామాల సరిహద్దులు దాటి, నరసాపురం పట్టణం మీదుగా సాగుతుంది. ఈ బోటుపై సుమారు 18 కిలోమీటర్ల మేర గోదావరిలో ప్రయాణించే అవకాశం ఉంది. బోటులో ప్రత్యేకంగా ఎసి రూమ్, ఆడియో, వీడియో వసతులు ఏర్పాట్లు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆటపాటలతో సాగే ఈ బోటు ప్రయాణపు అనుభూతి వర్ణనాతీతం.

లాహిరి.. లాహిరి.. లాహిరిలో

లాహిరి.. లాహిరి.. లాహిరిలో

గోదావరి నీటి గలగలలు.. మధ్యలో సంప్రదాయ రీతిలో మత్స్యకారులు సాగించే చేపల వేట ప‌ర్యాట‌కుల చూపుతిప్పుకోనీయ‌వు. ఇక్క‌డ సాగే సంప్ర‌దాయ చేప‌ల వేట త‌మ కెమేరాల్లో బంధించేందుకు ఔత్సాహికులు పోటీప‌డ‌తారు. అరుదైన చేప‌ల‌ను ఈ ప్ర‌యాణంలో చూసే అవ‌కాశం లేక‌పోలేదు. అంతేకాదు, గోదావరి మధ్యలో వేసిన ఇసుక దిబ్బలు, వాటిపై ఏపుగా ఎదిగిన వివిధ రకాల ఫలవృక్షాలు, ఇసుక తెన్నెలు దాటుకుంటూ అంతర్వేది వైపు ఈ బోటు పరుగులు పెడుతోంది. చుట్టుప‌క్క‌ల గ్రామాల ప్ర‌జ‌ల ఆత్మీయ ప‌ల‌క‌రింపులు మ‌న‌సును ఉల్లాస‌ప‌రుస్తాయి. అలా లాహిరి.. లాహిరి.. లాహిలో అంటూ సాగే ఈ బోటు ప్ర‌యాణం మ‌న‌సును హ‌త్తుకునేలా ఉంటుంది.

చేరుకునే మార్గం

చేరుకునే మార్గం

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణానికి రైలు, రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటే అక్కడి నుంచి యలమంచిలి మండలం మేడపాడు మీదుగా కట్టుకాలువ గ్రామ కూడలికి రోడ్డుమార్గం ద్వారానే చేరుకోవాలి. అక్కడి వరకు ఆర్ టిసి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడి నుంచి యలమంచిలి లంక గ్రామంలోకి సొంత వాహనాల్లో లేదా మనం ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న వాహనాల్లో వెళ్లొచ్చు. ఈ గ్రామ శివారు గోదావరి నది ఒడ్డున కొబ్బరితోటల్లోకి వస్తే ఈ రిసార్ట్స్‌కు చేరుకున్నట్లే.. పాలకొల్లు నుంచి రిరిసార్ట్స్‌కు చేరుకోవాలంటే 15 కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించాలి.

Read more about: palavelli resorts palakollu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X