Search
  • Follow NativePlanet
Share
» »ఈశ్వరుడు 101 లింగములలో దర్శనమిచ్చిన క్షేత్రం !!

ఈశ్వరుడు 101 లింగములలో దర్శనమిచ్చిన క్షేత్రం !!

శ్రీరాముడు సీతాదేవి, హనుమంతులతో వనవిహారమునకై వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించారు.

By Mohammad

కీసర, కీసరగుట్ట లేదా కేసరిగిరి తెలంగాణ రాష్ట్రములోని మేడ్చల్ - మల్కాజ్ గిరి జిల్లాకు చెందిన ఒక మండలము. కీసర, రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి కేవలం 25 కి.మీ. దూరములో ఉంది. కీసర ఇక్కడ ఉన్న అతి పురాతన కీసరగుట్ట శివుని ఆలయమునకు ప్రసిద్ధి. "మహాశివరాత్రి" పండుగ రోజు ఆలయమును దర్శించుటకు రాష్ట్రము నలుమూలలనుండి భక్తులు వస్తుంటారు.

శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం యొక్క స్థలపురాణము

శ్రీరాముడు సీతాదేవి, హనుమంతులతో వనవిహారమునకై వచ్చి, ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ఆనందభరితుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి నిశ్చయించారు. ఈ విషయమై అరణ్య ప్రాంతములోని మహర్షులను సంప్రదించగా వారు సంతోషించి శివలింగ ప్రతిష్ఠాపన కోసం సుముహూర్తాన్ని నిర్ణయించారు.

అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని కాశీ క్షేత్రమునకు వెళ్ళి గొప్ప శివలింగమును తీసుకొని రావలసినదని ఆజ్ఞాపిస్తారు. ఆంజనేయుడు ఆకాశమార్గాన కాశీక్షేత్రానికి వెళ్ళగా, ఈశ్వరుడు నూటొక్క శివలింగముల రూపములో దర్శనమిచ్చాడు. అతడు పరమేశ్వరుని ప్రార్థించి నూటొక్క శివలింగములను తీసుకొని బయలుదేరాడు.

కీసరగుట్ట ప్రధాన ఆలయం గోపురం

కీసరగుట్ట ప్రధాన ఆలయం గోపురం

చిత్రకృప : J.M.Garg

ఇక్కడ మహర్షులు నిర్ణయించిన సుముహూర్తము సమీపిస్తుండగా శ్రీరాముడి పరమేశ్వరుని ప్రార్థింపగా ముహూర్త సమయమునకు ఈశ్వరుడు ప్రత్యక్షమై శివలింగ రూపమును ధరించాడు. శ్రీసీతారామచంద్రులు ఆ శివలింగమును ప్రతిష్ఠించి అభిషేకించారు. అందువలన ఈ స్వామికి "శ్రీరామలింగేశ్వరస్వామి" అని పేరు వచ్చింది.

తరువాత హనుమంతుడు 101 శివలింగములను తీసుకువచ్చి, అప్పటికే ప్రతిష్ఠ జరగడంతో ఆవేశముతో తాను తెచ్చిన శివలింగములను తోకతో విసిరివేసెను. ఆ శివలింగాలన్నీ పరిసర ప్రాంతములలో అక్కడక్కడా పడినవి. హనుమంతుని శాంతింపజేయుటకు ఈ క్షేత్రము ఆచంద్రతారార్కం అతని పేరుమీద 'కేసరి గిరి'గా ప్రసిద్ధిచెందుతుందని ఆశీర్వదించెను. హనుమంతుడు శాంతించి తాను తెచ్చిన శివలింగములలో ఒకదానిని స్వామివారి వామభాగములో ప్రతిష్ఠించాడు. అదే మారుతీ కాశీ విశ్వేశ్వరాలయము.

కీసరగుట్ట పై శివలింగాల వరుస

కీసరగుట్ట పై శివలింగాల వరుస

చిత్రకృప : Bhaskaranaidu

ఇక్కడ ఆలయంలో కొలువైన స్వామిని రాముడు ప్రతిష్ఠించాడు కావున రామలింగేశ్వర స్వామిగా పిలుస్తారు, భవానీ అమ్మవారు, శివ దుర్గా అమ్మవార్లు ఇక్కడ కొలువై భక్తుల కోర్కెలను తీరుస్తున్నారు. ఈ దేవాలయంలో లక్ష్మి నరసింహ స్వామి, శ్రీ సీతారాముల ఆలయాలు కూడా కొలువై ఉన్నాయి. శివరాత్రి రోజు ఇక్కడ నిర్వహించే ప్రత్యేక పూజలలో వేలాదిగా భక్తజనం పాల్గొంటారు.

ఈ గుట్ట కింది భాగంలో ఆశ్రమాలు, యోగ కేంద్రాలను ఏర్పాటు చేసారు, ప్రశాంత మైన వాతావరణంతో పాటు కొండ సువిశాలంగా ఉండటం, కాలుష్యానికి దూరంగా ఉండడం మూలంగా గుట్టపైకి చేరుకోగానే భక్తులు అలౌకిక ఆనందానికి లోనవుతారు, ఇది ఆధ్యాత్మిక కేంద్రం గానే కాకుండా మంచి ప్రకృతి రమణీయ ప్రాంతం కూడా, ఇక్కడ ఉన్న సహజ అందాలకు తోడు దేవాలయ శాఖ వారు మరిన్ని సోగబులను తీర్చిదిద్దారు. గుట్టపైన పర్యాటకులను ఆకర్షించడానికి భారి ఆంజనేయ విగ్రహాన్ని ఏర్పాటుచేసారు, వానాకాలంలో లేదా చలికాలంలో ఈ కొండపై నుండి చూస్తే పచ్చని ప్రకృతి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.

శిధిలమైపోయిన గుడి

శిధిలమైపోయిన గుడి

చిత్రకృప : SINGH.GAURAV85

ఆలయ దర్శన వేళలు : 6 am - 1 pm వరకు మరియు తిరిగి 3 pm - 7:30 pm వరకు.

వసతులు

తిరుమల... తిరుపతి దేవస్థానం వారు నిర్మించిన 26 గదుల ధర్మశాల ఉంది. ఆలయ కార్యాలయంలో సంప్రదించి అద్దెకు తీసుకోవచ్చు. పర్యాటకాభివృద్ధి సంస్థ వారు నిర్మించిన నిర్మించిన హరిత హోటల్ ఉంది. ఇందులో భోజనం మరియు వసతి సదుపాయం ఉంది. జిల్లా పరిషత్ వారు, ఆర్ అండ్ బి వారు నిర్మించిన గదులు కూడా ఉన్నాయి. ఆర్య వైశ్య నిత్యాన్నదాన సత్రం ఉంది. బ్రాహ్మణులకు నిత్యాన్నదాన పథకం కూడా ఉంది.

రవాణా సౌకర్యాలు

ఈ క్షేత్రం జంట నగరాలకు అతి సమీపంలో ఉంది. జంట నగరాలలోని సికింద్రాబాద్, ఇ.సి.ఐ.ఎల్., అఫ్జల్ గంజ్ నుండి చాల బస్సులు ఉన్నాయి. ప్రవేటు వాహనాలు కూడా ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X