మ్యూజియం అంటే ఎంతో చారిత్రక సంపదను పదిలపరచే చోటు. పూర్వపు జీవన శైలిని భవిష్యత్తుకు పరిచయం చేసే చోటు. అలాంటి చోట వేసే ప్రతి అడుగూ మనల్ని ఆ చరిత్రలోకి నేరుగా తీసుకువెళుతుంది.
అలనాటి కళాఖండాలను చూసిన మన కనులు ఆ ప్రపంచాన్ని మన మనసుకు మరింత దగ్గర చేస్తుంది. ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయంలో మా బృందం మనసారా ఆస్వాదించిన క్షణాలు మీతో పంచుకుంటున్నాం.

ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయం గురించి తెలుసా!
మనం దేశములోని అన్ని రాష్ట్రాల్లోనూ మ్యూజియంలను చూస్తుంటాం. ప్రతిదానిలోనూ ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఉదాహరణకు కోల్‌కతాలోని 'ఇండియన్ మ్యూజియం'. దీనిని బ్రిటీషువారు 1814లో ఏర్పాటు చేశారు. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలా, ప్రతి మ్యూజియం గత చరిత్రను, అప్పటి రాచరికపు సంస్కృతిని, వస్తువులను భద్రపరచే స్థావరాలుగా నిలుస్తాయి. భోపాల్‌లోని మానవుని ఉనికి తెలిపే సంగ్రహాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనిని 1985లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ ఆవిష్కరించారు. దీనినే 'ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయం'గా వ్యవహరిస్తారు.
ఇటీవల మా బృందం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వెళ్ళినప్పుడు ఈ సంగ్రహాలయాన్ని సందర్శించాం. ఈ మ్యూజియం శ్యామలాకొండపై రెండు వందల ఎకరాల స్థలంలో ఏర్పాటుచేశారు. మొదటిగా మ్యూజియంలో ఉన్నత పదవిలో ఉన్న డాక్టర్ పాలూరి శంకరరావు (మానవ శాస్త్రవేత్త)ను కలుసుకున్నాం. ఆయన మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి మానవ శాస్త్రంలో డాక్టరేటు పొందారు. ఈ మ్యూజియంలో గత 20 సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఆయన ద్వారా సంగ్రహాలయ వివరాలను అడిగి తెలుసుకున్నాం.

విశిష్టత తెలుసున్నాం..
కొన్ని ప్రదర్శనలను ఆరుబయట విశాల ప్రదేశంలోను, మరికొన్ని మ్యూజియం లోపల ఏర్పాటుచేశారు. బయట ప్రదేశంలో కాశ్మీరు ప్రాంతంలోని లేహా(ఎహెచ్)లో నివసించే కొంక ప్రాంతపు ఇళ్ల నమూనాలను, రాజస్తాన్‌లోని కచ్ ప్రాంతపు ఎడారిలోని గృహాల నమూనాలను, ఉత్తరఖండ్‌లోని హిమాలయ ప్రాంతపు సిమ్లా కొండల్లోని గృహ సముదాయాలను, కేరళలోని స్నేక్ బోట్
ప్రాముఖ్యతను, తమిళనాడులోని మారుమూల గ్రామాల్లోని వారి గ్రామదేవతలు 'అయ్యనార్లు' రూపాలను, కొన్ని రాష్ట్రాల నుంచి తెచ్చిన కళా సంస్కృతి నమూనాలను చూపించి, వారి విశిష్టతను వివరించారు. కొన్ని ప్రాంతాల నుండి తెచ్చిన మొక్కలను, కొన్ని ఆలయ నమూనాలను ఆరుబయట చూడొచ్చు.

ఆలోచింపజేసే రాక్ ఆర్ట్..
లోపలకు వెళ్లాక, అడుగడుగునా మ్యూజియం నిర్మాణ శైలి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మొదటిగా ఆది మానవులు నివసించిన రాతిగుహ నమూనా దర్శనమిచ్చింది. ఆది మానవులు తెలియజేసిన కళల ద్వారా మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. దీనిని Prehistore rock art అంటారు.
వారి భావాలను ఈ రాక్ ఆర్ట్ ద్వారా వ్యక్తం చేసేవారట! ఇలాంటి రాతి కళలు భోపాల్‌కు దగ్గరలో ఉన్న భీం-బిట్కా (Bhimbetka) అనే కొండ ప్రాంతపు గుహలలో 700 పైగా ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. ఈ ప్రదేశం యునెస్కో హెరిటేజ్ ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఇలాంటి మ్యూజియం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల మానవ జీవన విధానాన్ని తెలుసుకోవచ్చని, ఇది దేశ ఐక్యతకు దోహదపడుతుందని డాక్టర్ రావు వివరించారు.

పలు విద్యా విధానాల కలయిక..
ఈ మ్యూజియంలో వివిధ విద్యా విధానాలు తెలిపే సెమినార్లు, వర్కుషాపులతో పాటు పలు సాంస్కృతిక మేళాలు తరుచూ జరుగుతుంటాయట! దూరప్రాంతాల నుంచి విద్యార్థులు, విద్యావేత్తలు వాటిలో పాల్గొంటారని ఆయన వివరించారు.
అక్కడి లైబ్రరీలో ఎన్నో పురాతన గ్రంథాలు ఉన్నాయి. ఈ మ్యూజియంకు అనుబంధంగా మైసూరు నగరంలో ఓ మ్యూజియం సేవలందిస్తోంది. ఈ సంస్థ ఏదో ఒక అంశంపై వివిధ రాష్ట్రాల్లో ఏటా సెమినార్లు, ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంది.