
ఆహ్లాదాన్ని పంచే ముంబయి క్వీన్స్ నెక్లెస్.. మెరైన్ డ్రైవ్!
ముంబయిలోని మెరైన్ డ్రైవ్‌ను అధికారికంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ అని పిలుస్తారు. ఎగసిపడే అలలకు ఎదురొడ్డి.. అడ్డుగా నిలిచిన మూడు కిలోమీటర్ల కాంక్రీట్ రహదారి మెరైన్ డ్రైవ్. ఈ ముచ్చటగొలిపే ప్రదేశాన్ని సోనాపూర్ అని కూడా పిలుస్తారు. ఇది నగరానికి దక్షిణ భాగంలో ఉంది. తీరాన్ని తాకుతూ.. ఉత్తరం వైపును కలుపుతూ.. మలబార్ పర్వత శ్రేణుల దిగువన ఉన్న ఈ అందమైన రహదారి ఇంగ్లీష్ అక్షరం C ఆకారాన్ని పోలి ఉంటుంది.
మెరైన్ డ్రైవ్ అనేది సిటీ ఆఫ్ డ్రీమ్స్‌కి నిర్వచనమని చెబుతారు. ముంబయి నగరం ఈ తీరం లేకుంటే అసంపూర్ణంగా ఉంటుందని చెప్పొచ్చు. ఈ ప్రదేశపు సహజసిద్ధ మాయాజాలం మొత్తం ముంబయి నగరానికి వెలుగులు పంచుతూ ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులను ఇటువైపుగా నడిపిస్తోంది. మెరైన్ డ్రైవ్ పర్యాటకంగా మంచి ప్రజాదరణ పొందింది. చాలా మంది ప్రయాణికులు తమ విహారయాత్ర కోసం ముంబయి చేరుకున్న వెంటనే మెరైన్ డ్రైవ్‌లో దిగుతారు.
ఈ అందమైన పర్యాటక ప్రదేశాన్ని క్వీన్స్ నెక్లెస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, భారీ తీరప్రాంతం వెంబడి మెరిసే వీధిలైట్లు రాత్రిపూట అద్భుతమైన ముత్యాల గొలుసులా కనిపిస్తుంది. సాయంత్రం అయిందంటే, తీరప్రాంతంలోని నేలపై పరచిన సొగసైన నెక్లెస్ వాస్తవిక చిత్రాన్ని కనులారా వీక్షించవచ్చు. ఈ మెరైన్ డ్రైవ్‌ను స్థానికులతోపాటు పర్యాటకులు ప్రతిరోజూ సందర్శిస్తూ ఉంటారు.

అందమైన సూర్యాస్తమయ దృశ్యం
నిత్యం ఒత్తిడిలో గడిపే ఈ నగర జీవితం నుండి కాసింత విశ్రాంతి తీసుకోవడానికి మరియు స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడానికి ఇక్కడకు చేరుకుంటారు. ఈ ప్రదేశంలోని నివాసితులు తమ రోజువారీ నడక, జాగింగ్ మరియు కొన్ని సాధారణ వ్యాయామాలు చేయడానికి ఉదయం మరియు సాయంత్రం ఇక్కడకు వస్తుంటారు. పర్యాటకులు ఈ తీరప్రాంతపు సహజ అందాలను అనుభవించడంతోపాటు ఫోటోగ్రఫీలో మునిగిపోతారు. ఎగసిపడే సముద్రపు అలల శబ్దాలు మనసును ప్రశాంతతకు చేరువచేస్తాయి. ఇక్కడి అందమైన సూర్యాస్తమయ దృశ్యం గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రశాంతతను చేరువ చేసేలా సూర్యుడు సేదదీరేందుకు సముద్రంలో కలిసిపోతున్నాడా అనేలా ఉంటుంది ఈ సుందర దృశ్యం.

అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్..
నగరంలోని కొన్ని స్థానిక ఆహార పదార్థాలను ఆస్వాదించడానికి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు. సమీప స్టాల్స్‌లో నోరూరించే స్ట్రీట్ ఫుడ్‌ని తప్పకుండా రుచి చూడాల్సిందే. వడ పావ్, పావ్ భాజీ, మిసల్ పావ్, కీమా పావ్, సెవ్ పూరీ, భేల్ పూరి, బటాటా వడ, శాండ్‌విచ్, రగ్దా పట్టీస్, బైదా రోటీ, కంద పోహా, ఫ్రాంకీ, దబేలీ మరియు పానీ పూరీ ఇలా చెప్పుకుంటూపోతే స్ట్రీట్ ఫుడ్‌లో ఉన్న అన్ని రెసిపీలు ఇక్కడ లభిస్తాయి. అందుకే స్థానికులు కుటుంబసమేతంగా సాయంకాలపు వేళ ఇక్కడ వాలిపోతారు. స్థానికులు కూడా ఈ ప్రశాంతమైన వాతావరణంలో రాత్రిపూట సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. ఇక్కడికి దగ్గరలోనే గేట్‌వే ఆఫ్ ఇండియా, ఛత్రపతి మహారాజ్ వాస్తు సంగ్రహాలయం వంటి ఆసక్తికరమైన ప్రదేశాలు ఉన్నాయి.

మెరైన్ డ్రైవ్‌కి ఎలా చేరుకోవాలి
మెరైన్ డ్రైవ్ ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 22.3 కిలోమీటర్ల దూరంలో ఉంది. ముంబై విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత, గమ్యస్థానానికి చేరుకోవడానికి లోకల్ రైలు లేదా టాక్సీని అందుబాటులో ఉంటాయి. రైలు ఎక్కితే, మెరైన్ లైన్ రైల్వే స్టేషన్‌కి చేరుకోవడానికి సుమారు గంట సమయం పడుతుంది, అక్కడి నుండి మీరు ఆటో లేదా క్యాబ్‌లో మీ గమ్యస్థానానికి చేరుకోవచ్చు.