Search
  • Follow NativePlanet
Share
» »ట్రెక్కింగ్ ప్రియుల స్వ‌ర్గ‌ధామం.. జీవ్‌ధ‌న్ ఫోర్ట్‌!

ట్రెక్కింగ్ ప్రియుల స్వ‌ర్గ‌ధామం.. జీవ్‌ధ‌న్ ఫోర్ట్‌!

చ‌రిత్ర‌పుట‌ల్లోకి తొంగి చూస్తూ రాచ‌రిక స్థితిగ‌తులు గూర్చి మేం ఇప్పుడు ప్ర‌స్థావించ‌ద‌లుచుకోలేదు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి సోయ‌గాల మధ్య మాన‌వ నిర్మిత అందాల‌ను తెలియ‌జేయాలనుకుంటున్నాం. అందుకే, ఛ‌త్ర‌ప‌తి శివాజీ కోట‌గా చెప్పుకునే మ‌హారాష్ట్ర‌లోని జీవ్‌ధ‌న్‌ కోట ట్రెక్కింగ్‌కు బ‌య‌లుదేరాం. శివాజీ సైనికుల శిక్ష‌ణ ఈ కోట‌లోనే తీసుకునేవారట‌! ముందే చెప్పిన‌ట్లు చ‌రిత్ర జోలికి వెళ్లద‌లుచుకోవ‌డం లేదు లేండి. ఈ ప్రాంతంలో కాలుమోపిన స‌మ‌యంలో మా అనుభూతులు మాత్ర‌మే చెబుతాం. మ‌రెందుకు ఆల‌స్యం వ‌ర్షాకాలంలో ట్రెక్కింగ్ ప్రియుల స్వ‌ర్గ‌ధామంగా చెప్పుకునే జీవ్‌ధ‌న్ కోట‌కు వెళ‌దాం ప‌దండి.

naneghat peak junnar

ప‌చ్చ‌ద‌నానికి తోడు పొగ‌మంచు..

మ‌హారాష్ట్ర‌లోని జున్నార్‌ నుంచి ముప్ఫై కిలోమీట‌ర్ల దూరంలో ఉంది జీవ్‌ధ‌న్ కోట‌. ఇక్క‌డికి చేరుకునేందుకు ఎలాంటి ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ ఉండ‌దు. ప్ర‌యివేట్ వెహిక‌ల్స్‌లో ఇక్క‌డికి చేరుకోవాల్సి ఉంటుంది. మిత్రుల వాహ‌నాలు అందుబాటులో ఉండ‌టంతో మేం మా వాహ‌నాల్లోనే బ‌య‌లుదేరాం. ముందుగా నాని ఘ‌ట్ అనే ప్ర‌దేశానికి చేరుకున్నాం. అక్క‌డి నుంచి రెండు కిలోమీట‌ర్లు కాలిన‌డ‌క‌న ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆ మాట విన‌గానే ఎందుకో ఆలోచించాం. కానీ అంత దూరం వ‌చ్చిన త‌ర్వాత ముందుకు వెళ్లాల్సిందే క‌దా! వ‌ర్షాకాలంలో ఒంట‌రిగా ఇక్క‌డ ట్రెక్కింగ్ చేయాల‌నుకోవ‌డం చాలా ప్ర‌మాద‌కరం. స్థానిక గైడ్ ల స‌హ‌కారంతో వెళితే మంచిది. నిత్యం కొండ‌పై నుంచి నీరు వ‌స్తూనే ఉంది. దారి మొత్తం చాలా రిస్క్‌గా అనిపించింది. అలా కొండ‌పైకి కొంత దూరం వెళ్లిన త‌ర్వాత రాతితో నిర్మించిన మెట్ల‌దారి క‌నిపించింది. నాచుప‌ట్టిన ఈ మార్గంలో ముందుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ఈ ప్ర‌యాణం చాలా ప్ర‌మాద‌కరంగా ఉంటుంద‌ని, ప్ర‌తి అడుగూ చాలా జాగ్ర‌త్త‌గా వేయాల‌ని సూచించారు. ఓ వైపు భ‌యం మ‌రో వైపు జీవితంలో మేం చేసే సాహసం గుర్తుండి పోతుంద‌నే ఆశ మ‌మ్మ‌ల్ని ముందుకు న‌డిపించాయి. అలా, పైకి వెళ్లే కొల‌దీ ప‌చ్చ‌ద‌నానికి తోడు పొగ‌మంచు చుట్టేసింది. చిన్న చిన్న జ‌ల‌పాతాల‌ను దాటుకుంటూ వెళుతుంటే, ఆ ప్ర‌కృతి అందాలు మా అల‌స‌ట‌ను ప‌టాపంచ‌లు చేశాయి.

jivdhan fort

మ‌రో ప్ర‌పంచంలో ఉన్నామా అనిపించేలా

బండ‌ల మ‌ధ్య జాలువారే నీటిని దాటుకుంటూ చిన్న సందుల గుండా తాళ్ల సాయంతో ముందుకు వెళ్లాం. అలా రెండు కిలోమీట‌ర్ల మేర కాలిన‌డ‌కన వెళ్లిన త‌ర్వాత మేం చేరుకోవాల్సిన గ‌మ్య‌స్థానం ప్ర‌త్యక్షం అయ్యింది. కోట ద్వారంగా చెప్ప‌బ‌డే క‌ళ్యాణీ గేట్ ముందుగా తార‌స‌ప‌డింది. న‌ల్ల‌ని రాతితో నిర్మించిన ఎత్త‌యిన ఆ కోట గోడ‌లు ఎంతో ఆక‌ర్షించాయి. సుమారు 3754 అడుగుల ఎత్తులో మాన‌వ నిర్మిత కోట‌, ఆ నిర్మాణ శైలి మేం మ‌రో ప్ర‌పంచంలో ఉన్నామా అనిపించేలా చేశాయి. ఆ గోడ‌ల‌పై సైతం నీరు నిత్యం వ‌స్తూనే ఉంటుంద‌ట‌. అలా లోప‌ల‌కు వెళ్ల‌గానే సువిశాల‌మైన ప‌చ్చ‌నిపైరులా మైదానం మాకు ఆహ్వానం ప‌లికింది. అక్క‌డి కొండ అంచుకు చేరుకున్నాం. నిట్ట‌నిలువుగా ధ్వ‌జ స్థంభంలా క‌నిపించే వాన‌ర్‌లింగ్ అనే స‌హ‌జసిద్ధ‌మైన రాతి ఆకారం ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించింది. అలాగే మేం న‌డ‌క మొద‌లు పెట్టిన నానీ ఘాట్ ఇక్క‌డి వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఆ అందాల‌ను మాట‌ల్లో వ‌ర్ణించ‌డం క‌ష్ట‌మే క‌నులారా వీక్షించాల్సిందే!

junnar fort

అక్క‌డి నుంచి ఒక అర‌గంటపాటు ముందుకు నడిచిన త‌ర్వాత అక్క‌డ ఒక అండ‌ర్ గ్రౌండ్‌లో రాతి నిర్మాణం క‌నిపించింది. ఛ‌త్ర‌ప‌తి శివాజీ కాలంలో నిర్మించిన పెద్ద అండ‌ర్ గ్రౌండ్ స్టోరేజ్ రూమ్‌ దానిని ధాన్య కోట్ అంటారట‌. అలాగే, జీవ‌ద‌ని మాత ఆల‌యం కూడా ఉంది. అక్క‌డే కాసేపు సేద‌దీరాం. ఇక్క‌డికి ట్రెక్‌కి వెళ్ల‌ద‌లిచేవారు అవ‌స‌ర‌మైన ఆహారంతోపాటు ఫ‌స్ట్‌యిడ్ కిట్‌ను మ‌ర్చిపోవ‌ద్దు.

Read more about: jivdhan fort junnar maharashtra
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X