Search
  • Follow NativePlanet
Share
» »మహాబలిపురం.. ఓ శిల్పకళా సౌందర్యం!

మహాబలిపురం.. ఓ శిల్పకళా సౌందర్యం!

మహాబలిపురం.. ఓ శిల్పకళా సౌందర్యం!

ప్రాచీన భారతీయశిల్పకళా నైపుణ్యాన్ని, ఆనాటి పల్లవ రాజుల ఘనమైన చారిత్రక కళా సంపదను తరతరాలుగా పర్యాటక లోకానికి పంచిపెడుతున్న రాతి గోపురాల సముద్ర తీర పట్టణమే మహాబలిపురం. బంగాళాఖాతపు నీటి అలల సవ్వడుల నుంచి రాతి నిర్మాణాల కళా సృజనాత్మకత వరకూ అందరినీ అలరించే మహాబలిపురం సంద‌ర్శ‌న‌లో మా అనుభ‌వాలు మీకోసం..

తమిళనాడులోని ప్రాచీన శిల్పాలు, గోపురాలకు నెలవైన మహాబలిపురాన్ని చూడాలన్న ఉద్దేశంతో మా మిత్ర‌బృందం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుని వాహనాల్లో బయలు దేరాం. సాయంత్ర సమయంలో ప్రయాణం మొదలు పెట్టాం. కాంచీపురం జిల్లాలో ఉన్న మహాబలిపురాన్ని పూర్వం 'మామల్లపురం'గా పిలిచేవారు. క్రీస్తుశకం 7వ శతాబ్ధం నుంచి 10 వ శతాబ్దం మధ్య కాలంలో ఈ ప్రాంతాన్ని పల్లవ రాజులు పాలించారు. ఆకాలంలో పేరెన్నిక కలిగిన ఓడ రేవు ఇది. పల్లవ రాజులు రెండవ రాజధానిగా ఉండేది. కంచి రాజధానిగా పాలించిన ఆనాటి పాలకులు విదేశీ నిపుణులను రప్పించి, స్వదేశీ శిల్పకళాకారుల సాయంతో సాగర తీరంలోని ఈ మహాబలిపురంలో అద్భుత రాతి కట్టడాలను నిర్మించారు. ఆ కళాత్మక హృదయం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందనే చెప్పాలి. ఇక్కడి ప్రసిద్ధ ఏకశిలా దేవాలయాల అద్భుత పనితనంతో ఎందరో శిల్పులు, నిపుణులు తమ సృజనాత్మకతని ఆవిష్కరించారు.

ఇది రాజుల కళల ఖజానా..

ఇది రాజుల కళల ఖజానా..

పల్లవుల పాలనలో వినూత్నమైన నిర్మాణ కళలు అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతం అనేక ఆలయాలకు అలాగే, రాతి గుహలకి స్థావరమైంది. నిజానికి, ఈ ప్రాంతాన్ని బహిరంగ మ్యూజియంగా పరిగణించవచ్చు. కేవలం ఒకే ఒక పెద్ద రాతి నుంచి నిర్మించిన ఆలయాలను ఇక్కడ గమనించవచ్చు. సముద్ర తీరంలో వెలసిన ఇక్కడి ఆలయం నుంచే యాత్రికుల సందర్శన మొదలవుతుంది. ముందుగా రెండు పెద్ద గోపురాలు పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తాయి. భారతీయ పురాణగాధలు, పాత్రలను తలపించే శిల్పాలను ఎన్నింటినో వాటిపైన చూడొచ్చు. అనేక దేవతలు, దేవుళ్ల విగ్రహాలతోపాటు పలువురు నృత్య కళాకారిణుల విగ్రహాలు, పెద్ద అంగలు వేసే ఏనుగుల భారీ శిల్పాలు వంటివి అన్నీ సందర్శకులను నిల్చున్నచోటే కట్టి పడేస్తాయి. అలాగే, అక్కడి చిన్నగోపురాలను చూడొచ్చు. ఈ ఆలయంలో ప్రధాన దేవతలుగా శివకేశవుల విగ్రహాలు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆలయం చుట్టూ అనేక నంది విగ్రహాలు బారులు తీరి సరిహద్దు గోడలా చెక్కారు. ఆలయం వెనుక ఓ పెద్ద రాతి సింహం, దానిపై ఒక సైనికుడు స్వారీ చేస్తున్నట్లు అద్భుతంగా మలిచారు. ఇది ఆనాటి సైనికుల స్థయిర్యాన్ని, ధైర్యాన్ని చాటిచెబుతుంది.

అతి పెద్ద రాతి కళాఖండాలు

అతి పెద్ద రాతి కళాఖండాలు

రాతితో నిర్మితమైన పలు ఆలయాలలో కృష్ణ మండపం చాలా పెద్దది. కృష్ణుని లీలా విన్యాసాలను గుర్తుకుతెచ్చే సన్నివేశాలు ఈ శిల్పాలలో దర్శనమిస్తాయి. కృష్ణునికి ఇష్టమైన వెన్నముద్దకు చిహ్నంలా భావించే ఓ పెద్ద బండను ఇక్కడ చూడొచ్చు. ఆనాటి శిల్పకళాకారుల పనితనాన్ని గొప్పగా చాటిచెప్పే రెండు అతిపెద్ద ధ్వజస్తంభాలు ఉన్నాయి. ప్రపంచంలోని చెప్పుకోదగ్గ అతిపెద్ద రాతి కళాఖండాలలో ఒకటిగా వీటిలో ఒకదానికి విశేష గుర్తింపు ఉంది. దాని పొడవు 31 మీటర్లు, ఎత్తు 9 మీటర్లు. ఈ రాతి కట్టడాల ఉపరితలం విభిన్న కళాత్మకతను సంతరించుకుంది. వీటిపైన సుమారు వందకు పైగా దేవతల విగ్రహాలు చెక్కి ఉన్నాయి. వాటిలో నాలుగు చేతుల దేవుళ్లు, నాగ దేవతలు, పక్షులు, మృగాలు వంటి విగ్రహాలెన్నో ఉన్నాయి. రెండు రాళ్లతో చెక్కిన ఏనుగుల విగ్రహాల గురించీ ప్రత్యేకించి చెప్పాలి. సజీవ ఏనుగులను తలపించే అసాధారణ పనితనం అడుగడుగునా మనల్ని మంత్రముగ్ధుల్నిచేస్తుంది.

ఐదు రధాలు, గుహాలయాలు

ఐదు రధాలు, గుహాలయాలు

మహాబలిపురం పట్టణానికి ఉత్తరంవైపు పెద్ద రాతి రథాలు ఐదు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక్కటీ ఒక్కో భారీ ఏకశిలా ఖండంగా రూపొందించడం విశేషం. మహాభారతంలోని పంచపాండవుల ఐదుగురి పేర్లు వీటికి పెట్టారు. ఇక సముద్రతీరానికి 400 మీటర్ల దూరంలో ఒక గ్రానైట్ కొండపైన గల గుహాలయాలు సందర్శించాం. వీటిలో ప్రముఖమైనది 'వరాహమండపం'. ఈ చిన్న గుహను చెక్కిన తీరు అనన్య సామాన్యం. దీని ధ్వజస్తంభాల వద్ద ఎంతో అందంగా చెక్కిన సింహాల విగ్రహాలు ఉన్నాయి. కేవలం నిర్మాణాత్మక సొబగులే కాకూండా ఇక్కడ చూడదగ్గ విశేశాలు అనేకం ఉన్నాయి. అందమైన తెల్లటి ఇసుక కలిగిన సముద్ర తీరం, సమృద్ధిగా కనిపించే కాసువారినా చెట్లు వీటితో పాటు ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభూతిని పర్యాటలకులు సొంత చేసుకోవచ్చు. స్థానిక షాపులలో హస్తకళానైపుణ్యం గల కళాకారులు తయారు చేసిన అధ్బుతమైన వస్తువులు లభిస్తాయి. యునెస్కో దీనిని ప్రపంచపర్యాటక స్థలాల్లో ఒకటిగా గుర్తించింది.

అంతర్జాతీయ ఖ్యాతి

అంతర్జాతీయ ఖ్యాతి

మహాబలిపురం డ్యాన్స్ ఫెస్టివల్‌గా పిలిచే వార్షిక వేడుకకు అంతర్జాతీయంగా ఖ్యాతి ఉంది. ఇది ఏటా డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా ప్రారంభమై కొత్త సంవత్సరంలోని మొదటి నెల జనవరి పొడుగునా అన్ని శనివారాలలోనూ కొనసాగుతుంది. ఈ వేడుకలు తమిళనాడు పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఫిబ్రవరి మొదటివారం వరకూ జరుగుతాయి. డిసెంబర్ వచ్చిందంటే చాలు మహాబలిపురం కొత్త అందాలను పులుముకుంటుంది. పర్యాటకులు రకరకాల నల్లరాతి, గ్రానైట్ విగ్రహాలు, సముద్ర గవ్వలు, పర్సులు, పెయింటింగులు తదితర కళాత్మక, అలంకరణ వస్తువులను కొనుగోలు చేయవచ్చు. విదేశీ యాత్రికులు ఎక్కువగా వస్తుంటారు, కాబట్టి వ్యాపారులు అధిక ధరలు డిమాండ్ చేస్తుంటారు. అందువల్ల షాపింగ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడి తీరప్రాంతంలో కొలువుండే అందమైన పడవలను అద్దెకు తీసుకుని బంగాళాఖాతంలోకి షికారుకు వెళ్లవచ్చు. అయితే ఇలాంటి సముద్రయాన సమయంలో లైఫ్ జాకెట్ ధరించడం మరిచిపోకూడదు.

ఎలా వెళ్లాలి?

ఎలా వెళ్లాలి?

మహాబలిపురానికి రైలు, రోడ్డు, విమాన మార్గాల ద్వారా సులభంగా చేరుకో వచ్చు. మహాబలిపురం నుంచి 50 కిలోమీటర్ల దూరంలో చెన్నై ఉంది. అక్కడి విమానాశ్రయం ఇక్కడికి సమీపంలోనే ఉంది. అతి సమీప రైల్వేస్టేషన్ చెంగల్పట్టు. ఇక్కడి నుంచి 29 కిలోమీటర్లు కాగా, చెన్నై నుంచి నేరుగా రైలులో అయితే 58 కి.మీ.దూరంలో ఉంది. మహాబలిపురానికి రోడ్డుమార్గంలో చెన్నై, పాండిచ్చేరి, కంచి, చెంగల్పట్టుల నుంచి బస్సు సౌకర్యాలు నిరంతరాయంగా ఉన్నాయి. టూరిస్టులు చెన్నై నుంచి టాక్సీలు అద్దెకు తీసుకుని వెళ్లవచ్చు.

Read more about: mahabalipuram tamil nadu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X