Search
  • Follow NativePlanet
Share
» »అద్బుత రాతి నిర్మాణ గుట్ట‌... పాండ‌వుల మెట్ట‌!

అద్బుత రాతి నిర్మాణ గుట్ట‌... పాండ‌వుల మెట్ట‌!

By Chandra Mohan

వేల సంవత్స‌రాల చ‌రిత్ర ఉన్న దేశం మ‌న‌ది. ఈ చ‌రిత్ర‌కు సాక్ష్యాలు దేశ‌మంత‌టా వివిధ క‌ట్ట‌డాలు విశేషాల రూపంలో క‌నిపిస్తూనే ఉంటాయి. త‌వ్వ‌కాల్లోనూ దొరుకుతూనే ఉంటాయి. వాటిని ప‌దిలప‌రుచుకోవాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైనా ఉంది. కొన్ని చోట్ల పేరుకి పురావ‌స్తు శాఖ అనేది ఉన్నా ఎంతో పురావ‌స్తు సంప‌ద నిర్ల‌క్ష్యానికి గురై అంత‌రించి పోతోంది. అదే విదేశీయులైతే త‌మ పురావ‌స్తు సంప‌ద‌ను కాపాడుకోవ‌డ‌మే కాదు. వాటిని ప‌ర్యాట‌క ప్ర‌దేశాలుగా అభివృద్ధి చేసి ఆదాయాన్ని కూడా పొందుతూ ఉంటారు. నిర్ల‌క్ష్యానికి నిద‌ర్శ‌నంగా నిలిచి, సిక్కోలు సిగ‌లో దాగిన పురాత‌న అవ‌శేషాల‌లో పాండ‌వుల మెట్ట మీద ఉన్న శిలా నిర్మాణం ఒక‌టి. ఈ చారిత్ర‌క నిర్మాణం గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం!

కొత్త‌రాతియుగంలో మ‌నిషి గుంపులు గుంపులుగా సంచార జీవ‌నం సాగించేవారని చ‌రిత్ర ద్వారా తెలుసుకున్నాం. ఈ ఆదిమ తెగ‌లు త‌మ‌ గుంపులో ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే వారికి పున‌ర్జ‌న్మ ఉంటుంద‌ని భావించేవారు. శ‌వాన్ని ఆకులు నార‌ల‌తో చుట్టేవారు. ఆ త‌ర్వాత పెద్ద మ‌ట్టి కుండ‌లో దానిని పెట్టి భూమిలో పాతిపెట్టేవారు. దానిపై పెద్ద‌పెద్ద రాళ్ల‌తో ప్రాకారాల‌ను నిర్మించేవారు. వీటినే పురావ‌స్తు శాస్త్ర‌వేత్త‌లు రాక్ష‌స‌గుళ్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఈ రాక్ష‌స గుళ్లు ఉన్న ప్ర‌దేశాల‌ను పురాత‌న మాన‌వ ఆవాసాలుగా ప‌రిగ‌ణిస్తారు. శ్రీ‌కాకుళం జిల్లా కేంద్రానికి 15 కిలోమీట‌ర్ల దూరంలో ఆముదాల‌వ‌ల‌స మండ‌లంలోని చిట్టివ‌ల‌స గ్రామానికి ద‌గ్గ‌ర‌లో ఉన్న పాండ‌వుల మెట్ట కూడా స్టోన్హెంజ్ లేదా రాక్ష‌స‌గుళ్లు లాంటిదే. అక్క‌డికి ద‌గ్గ‌ర‌లోని సైలాడ‌లో సంగ‌మ‌య్య‌కొండ‌పైన కూడా ఇలాంటి నిర్మాణాలే ఉన్నాయి. క‌ర్నూలు జిల్లా శంఖ‌వ‌రంలో గొర్రె ఆకారంలో న‌ల్గొండ జిల్లా ఏలేశ్వ‌రంలో ఏనుగు ఆకారంలో విశేష నిర్మాణాలు ఉన్నాయి.

ప‌ర్యాట‌క ప్ర‌దేశ‌మే కాదు.. ఆదాయ‌వ‌న‌రు కూడా

బ్రిట‌న్‌లోని స్టోన్హెంజ్ అనే స్మార‌క నిర్మాణం ఇటువంటి నిర్మాణాల‌లో ఒక‌టిగా గుర్తింపు పొందింది. ఇక్క‌డ పెద్ద‌పెద్ద పొడువాటి బండ‌రాళ్ల‌ను ప్రాకారాలుగా అమ‌ర్చారు. వీటిని విలువైన చారిత్ర‌క నిర్మాణాలుగా ప‌రిర‌క్షించి భ‌విష్య‌త్తు త‌రాల‌కు అందించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంది. ఈ ప్ర‌దేశాన్ని ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చిదిద్దింది. ఏటా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏడు ల‌క్ష‌ల మంది ప‌ర్యాట‌కుల‌ను ఇది ఆక‌ర్షిస్తోంది. అలాగే ద‌క్షిణ అమెరికా, పెరూలోని మ‌చు పిచ్చు అనే ప్ర‌దేశంలోని పురాత‌న నిర్మాణాన్ని ఏడాదికి మూడు ల‌క్ష‌ల‌మంది ప‌ర్యాట‌క ప్రేమికులు సంద‌ర్శస్తున్నారు. పోలండ్ లో కూడా బ్రిట‌న్లో ఉన్న‌ట్లే స్టోన్హెంజ్ ఉంది. అది కూడా ల‌క్ష‌లాది మంది ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. ఆ విధంగా వీటివ‌ల్ల ఆదాయంతో పాటు ఎంతోమందికి ఉపాధి ల‌భిస్తుంది.

నిర్ల‌క్ష్య‌పు నీడ‌లో పురాత‌న ఇంజ‌నీరింగ్ అద్భుతం ..

మ‌న‌దేశంలో మాత్రం భిన్న‌మైన ప‌రిస్థితి. పురాత‌న చ‌రిత్ర‌కు ఆన‌వాళ్లుగా ఉన్న ఎన్నో ప్రాంతాలు, నిర్మాణాలు ఆద‌ర‌ణ‌కు, భ‌ద్ర‌త‌కు నోచుకోవ‌డం లేదు. వాటిని ప‌ర్యాట‌క ప్ర‌దేశాలుగా అభివృద్ధి చేసి ఆదాయ వ‌న‌రులుగా మార్చే ప్ర‌య‌త్నం ప్ర‌భుత్వాలు చేయ‌డం లేదు. పాండ‌వుల మెట్ట బ్రిట‌న్‌, పోలండ్‌లోని స్టోన్హెంజ్‌ల‌కు, పెరూలోని మ‌చుపిచ్చుకు ఏ విధంగాను తీసిపోయేది లేదు. క్రీస్తుపూర్వం ప్ర‌పంచంలో ప‌లు చోట్ల జ‌రిగిన రాతి నిర్మాణాల సంస్కృతిలో భాగంగా దీనిని చెప్ప‌వ‌చ్చు. పాండ‌వుల మెట్ట ప్రాంతంలో ఐదు బండ‌రాళ్ల‌పైన పెద్ధ ప‌ల‌క ఆకారంలో ఉన్న రాయిని క‌ప్పుగా అమ‌ర్చారు.

దీనిని సూర్యుని ఆరాధించుకోవ‌డానికో, వేద‌శాల‌గానో, చికిత్సా ప్ర‌దేశంగానో ఉప‌యోగించి కూడా ఉండ‌వ‌చ్చ‌ని పురావ‌స్తు శాస్ర‌వేత్త‌లు ఊహించారు. పాండ‌వుల మెట్ట మీద ఉన్న శిలానిర్మ‌ణాన్ని పురాత‌న ఇంజ‌నీరింగ్ అద్భుతంగా పురావ‌స్తు నిపుణులు చెబుతున్నారు. ప్రాన్స్‌లోని లీ బెర్నాల్డ్ అనే గ్రామంలో ఇటువంటి శిలా నిర్మాణ‌మే ఉంది. తొమ్మిది నిలువు రాళ్ల‌మీద ఒక బండ‌రాయి ప‌రిచిన నిర్మాణం ఇది. ఇందుకు భిన్నంగా పాండ‌వుల మెట్ట వ‌ద్ద ఉన్న‌ది 36 నిలువు రాళ్ల‌మీద పెద్ద బండ‌రాయి ప‌రిచిన‌ది. క్రేన్లు మొద‌లైన‌వి లేని ఆ రోజుల్లో అంత‌పెద్ద బండ‌రాయిని చేర్చి క‌ప్ఫుగా ఎలా అమ‌ర్చారో ఊహిస్తేనే ఆశ్చ‌ర్యం. అంత‌క‌న్నా ఆశ్చ‌ర్యం ఇంత విలువైన పురాత‌న సంప‌ద గుర్తింపున‌కు ఆద‌ర‌ణ‌కు నోచుకోక‌పోవ‌డం. ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వాలు క‌ళ్లు తెరిచి ఇలాంటి అపురూప సంప‌ద‌ను కాపాడే ప్ర‌య‌త్నం చేయాలి.

Read more about: srikakulam andhra pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X