Search
 • Follow NativePlanet
Share
» »చారిత్ర‌క నిర్మాణాల సిరి.. ర‌త్న‌గిరి!

చారిత్ర‌క నిర్మాణాల సిరి.. ర‌త్న‌గిరి!

చారిత్ర‌క నిర్మాణాల సిరి.. ర‌త్న‌గిరి!

అనంతపురం జిల్లాలో చారిత్రక రాతి నిర్మాణాలకు కొద‌వే లేదు. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగ్గది రత్నగిరి. అటు క‌ర్ణాట‌క‌కు, ఇటు ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దు ప్రాంతంలోని మడకశిర, రోళ్ల ప్రాంతంలో ఉంది. ప్రధానంగా రత్నగిరి కోటలో అంతఃపుర భవనం చారిత్రక వైభవ ఘట్టాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంతటి గొప్ప చరిత్ర కలిగిన రత్నగిరి ప్రాంతాన్ని మిత్రులతో కలిసి న్యూ ఇయ‌ర్ రోజున సందర్శించేందుకు ముందుగానే ప్ర‌ణాళిక వేసుకుని మా ప్రయాణాన్ని మొదలుపెట్టాం.

అనంతపురం నుంచి రత్నగిరిని చేరుకునేందుకు బస్సులు అందుబాటులో ఉంటాయి. దాంతో బస్సు ప్రయాణాన్నే ఎంచుకుని, ఉదయాన్నే బయలుదేరాం. ఆ.. అనంత రత్నగిరి వైభవ విశేషాలు తెలుసుకునేందుకు మా మ‌న‌సు ఇవ్విళ్లురిందంటే న‌మ్మండి. అనంతపురం నుంచి పెనుకొండ‌, మడకశిర మీదుగా రోళ్లకు ఐదు కిలోమీటర్లు ప్రయాణించి, రత్నగిరి చేరుకున్నాం. ఈ శ‌త్రుదుర్భేక్ష‌మైన‌ కోటను కొండ శిఖరాగ్రాన అన్నివిధాలా సురక్షితమైన ప్రదేశంలో నిర్మించారు.

ఆత్రుతగానే కోటవైపు మా అడుగులు పడ్డాయి. ప్రస్తుతం పైకప్పు కూలిపోయి, రాతి గోడలతో శిథిలావస్థలో కనిపించింది. ఈశాన్యంలో లోతట్టు నిర్మాణంలో నేలమాళిగను నిర్మించారు. ఇది ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. చుట్టూ రాళ్లగుట్టలతో నిండిన ఆ ప్రదేశం నిర్మానుష్యంగా కనిపించింది. కోట చుట్టూ ఎత్తయిన బురుజులు, గజశాలలు, రాతి ఏనుగులు నిర్మాణాలు, కల్యాణిబావులు, మంటపాలు, పురాతన కట్టడాలతో గల ఈ రత్నగిరి క్షేత్రం రాయలసీమకే తలమానికంగా నిలుస్తోందని క‌ళ్లారా చూస్తేగాని మాకు అర్థ‌మ‌వ్వ‌లేదు.

మా కళ్లను మేమే నమ్మలేకపోయాం

మా కళ్లను మేమే నమ్మలేకపోయాం

రత్నగిరికి 1900 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. రత్నగిరి సంస్థానాన్ని మొదటి రాజుగా తిమ్మప్పనాయక పాలించారని చరిత్ర చెబుతోంది. క్రీస్తు శ‌కం 1799లో ఇక్కడికి వచ్చిన కర్ణాటక ప్రాంతం మైసూరు శ్రీరంగపట్టణం టిప్పుసుల్తాన్ రాజు రత్నగిరికి 'ముస్తాఫాబాద్' అని నామకరణం కూడా చేశారు. అలనాటి రాజుల పాలనకు గుర్తుగా ఎన్నో దేవాలయాలు, భవనాలు, కోట ముఖద్వారాలతోపాటు రెండువైపులా రాతి ఏనుగులు, కల్యాణి బావులు నిర్మించారు. రాజులు నిర్మించిన శత్రు దుర్భేద్యమైన కోటలు, రాణులు స్నానం ఆచరించడానికి ప్రత్యేకంగా నిర్మించిన ఈత కొలనులు, కొండ పైకి ఎక్కేందుకు బండపై చెక్కిన

మెటికెలు ఇలా ఒక్కొక్కటిగా చూస్తుంటే మా కళ్లను మేమే నమ్మలేకపోయాం. ప్రత్యేకంగా శత్రువుల రాకను పసిగట్టి రాజును, సైనికులను అప్రమత్తం చేసేందుకు ఏర్పాటు చేసిన స్థలం, రాణి నివసించేందుకు ఏర్పాటు చేసిన విశాలమైన భవంతి, శత్రువులు ప్రవేశించడానికి వీలుకాకుండా కొండపైన చుట్టూ 35 అడుగుల ఎత్తులో ప్రహరీ.. ఇవన్నీ చూశాక.. 'అద్భుతం' అనకుండా ఉండలేకపోయాం.

అబ్బురపరిచే రాతిబురుజు

అబ్బురపరిచే రాతిబురుజు

ఈ గిరిలో ఎత్తయిన రాతి బురుజు మరో ఆకర్షణ. ఆ బురుజులోనే ఒక విశాలమైన గది ఉంది. అప్పట్లో బురుజు పైకి ఆ గది లోపలి నుంచి మాత్రమే ఎక్కేందుకు వీలుగా దారిని ఏర్పాటు చేసుకున్నారు. అంటే, అంతఃపుర వాసులు మాత్రమే ఆ బురుజుపైకి ఎక్కగలరు. ఇతరులు వెళ్ళడానికి అవకాశమే లేదు. అంతేకాదు, అందులో గది ఉన్న విషయం ఇతరులకు తెలియడానికి వీలులేకుండా దాని ద్వారాన్ని అంతఃపురం లోపలికే ఏర్పాటు చేశారు.

బయటివారికి అదొక బురుజులా మాత్రమే కనబడుతుంది. అంతఃపురం నైరుతిలో ఇటుకలతో కొన్ని కట్టుదిట్టమైన నిర్మాణాలను చూశాం. అప్పటి నిర్మాణ నైపుణ్యాలు మా బృందానికి ఒకింత ఆశ్చర్యం కలిగించాయి. లోపలకు వెళ్లాక అంతఃపుర భవనానికి నైరుతిలో ఉన్న ఓ చిన్న ద్వారం గుండా బయటికి వచ్చాం. రత్నగిరి కొండను చేరుకునేందుకు చుట్టూ ఉండే ఏడు చిన్న చిన్న కోటలను దాటాల్సి ఉంటుంది.

ఆహ్లాద‌క‌ర‌మైన వాతావర‌ణం..

ఆహ్లాద‌క‌ర‌మైన వాతావర‌ణం..

గ్రామంలో అక్కడక్కడా కనిపించే జైన దేవాలయాలను బట్టి చూస్తే రత్నగిరి ప్రాంతాల్లో జైనమతం విరాజిల్లినట్లు తెలుస్తోంది. అప్పటికే మధ్యాహ్నం కావడంతో భోజనాలకు సిద్ధమయ్యాం. రత్నగిరి ప్రాంతంలో సరైన వసతులు, భోజనశాలలు ఉండవని ముందే తెలియడంతో ముందుగానే అన్నీ పార్సిల్స్ తెచ్చుకున్నాం. రాతి నిర్మాణాలు కావడంతో బహుశా.. ఎండాకాలంలోనూ అక్కడి వాతావరణం చల్లగానే ఉంటుంది అనిపించింది. పూరి, పులిహోర అందులోకి రెండు, మూడు రకాల కర్రీలు, పప్పును మిత్రులతో ముచ్చటించుకుంటూ హాయిగా లాగించేశాం. చాలామంది పర్యాటకులు ముందుగానే ఇక్కడికి దగ్గరలో ఉన్న రోళ్ల లేదా దగ్గరలోని కర్నాటక ప్రాంతంలో విడిది, ఆహార సౌకర్యాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.

మరిన్ని చూడదగిన ప్రదేశాలు

మరిన్ని చూడదగిన ప్రదేశాలు

భోజనాల తర్వాత మళ్లీ మా కాళ్లకు పని చెప్పాం. కోట అంతఃపురానికి సమీపంలో నైరుతి దిశగా ఓ బండపై జత పాద ముద్రలు కనిపించాయి. వాటి దగ్గర శంఖచక్రాలు స్పష్టంగా చెక్కబడ్డాయి. దాంతో మా వారంతా అవి శ్రీ విష్ణుపాదాలు అని ఫిక్స్ చేశారు. వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినా, సాధ్యపడలేదు. అక్కడికి దగ్గరలోనే దాదాపు ఐదు అడుగుల లోతులో వలయాకారంలో గుంతను తవ్వి, దాని చుట్టూ ఇటుక, సున్నపు గారతో గోడను నిర్మించారు. అది గోపురాకారంలో ఉంది. దానికి ఉత్తర దిశగా ద్వారం ఏర్పాటు చేశారు. అది ఒక మనిషి మాత్రమే ప్రవేశించే విధంగా కనిపించింది.

అందులో పూర్వం నేతిని నిల్వ చేసుకొనేవారని, అందుకే దీనికి నేతి కోనేరుగా పేరొచ్చిందని కొందరి అభిప్రాయం. ఈ రాతి గుంతలో ఎప్పుడూ దాదాపుగా నేలమట్టానికి నీళ్లు ఉంటాయి. శిఖరాగ్రభాగంలో, ఎక్కువలోతు కూడా లేని రాతి గుంతలో అన్ని కాలాలలో నీళ్లు ఉండడం మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాదు, ఈ నీటిలో ఔషధ గుణాలున్నాయని, ఆ నీటిని సేవిస్తే మూత్రపిండాల్లోని రాళ్లు కరుగుతాయని స్థానికుల నమ్మకం. అయితే, మేం మాత్రం ఆ ప్రయత్నం చేయలేదు. అంతటి ప్రాముఖ్యత కలిగిన నేతి కోనేరును కొందరు అక్రమార్కులు నిధి అన్వేషణలో భాగంగా చాలా వరకూ ధ్వంసం చేశారు.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

చారిత్రక ఆధారాలకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న రత్నగిరి కోట పట్ల అధికారుల నిర్లక్ష్యానికి మేం చాలా బాధపడ్డాం. అలా సాయంత్రానికి అయిష్టంగానే తిరుగు ప్రయాణమయ్యాం. రోళ్ల మండల కేంద్రం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో గల కర్ణాటక ప్రాంతం మధుగిరి పట్టణానికి వెళ్లే మార్గంలో ఈ కోట ఉంది. జిల్లా కేంద్రం అనంతపురం నుంచి దాదాపు 160 కిలోమీటర్లు పెనుకొండ వయా మడకశిర నుంచి రోళ్ల మీదుగా కూడా రత్నగిరి చేరుకోవచ్చు. అటు కర్నాటక నుంచి ఈ ప్రాంతాన్ని చేరుకునేందుకు నిత్యం వాహనాలు అందుబాటులో ఉంటాయి. మ‌రెందుకు ఆల‌స్యం మీ ప్ర‌యాణాన్ని మొద‌లుపెట్టండి.

  Read more about: ratnagiri fort
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X