Search
  • Follow NativePlanet
Share
» »అందుకే.. కూర్గ్‌ను భార‌తదేశ‌పు స్కాట్లండ్ అని పిలుస్తారు!

అందుకే.. కూర్గ్‌ను భార‌తదేశ‌పు స్కాట్లండ్ అని పిలుస్తారు!

అందుకే.. కూర్గ్‌ను భార‌తదేశ‌పు స్కాట్లండ్ అని పిలుస్తారు!

మా బృందానికి పుస్తకాలను ఎక్కువగా చదవటం అలవాటు. అలా చదివేటపుడు ఆ దృశ్యాలను ఊహించుకుంటూ మా మనసుతో విహంగ వీక్షణం చేసేవాళ్లం. నిజానికి, ఒక ప్రదేశం గురించి వెయ్యిసార్లు వినటం కంటే ఒక్కసారి దాన్ని చూడటం ఉత్తమం అంటారు. అది అక్షరాలా నిజం. అందుకే, కొత్త ప్రదేశాలు, వాటి ప్రయాణాల గురించి తెలుసుకోవడంతోపాటు వాటిని చూసి రావటం హాబీగా పెట్టుకున్నాం. ప్రకృతిని ఆస్వాదిస్తూ.. గడిపే ప్రతిక్షణం జీవితంలో మర్చిపోలేని మధుర జ్ఞాపకమే కదా! అలాంటి జ్ఞాపకాల మణిహారమే భారతదేశపు స్కాట్లండ్‌గా పేరొందిన కూర్గ్.. ఆ ప్ర‌యాణ‌పు అనుభ‌వాలు మీకోసం..

ఓ సాయంత్రపు కాఫీ కబుర్లలో మా మిత్ర‌బృందం రొటీన్‌కు భిన్నంగా ఉండేలా ఎక్కడికైనా వెళ్లి రీఫ్రెష్ కావాలనుకున్నాం. ముందుగా పాండిచ్చేరి వెళ్లాలనుకున్నాం. కానీ కొన్ని అనుకోని సమస్యలు ఎదురుకావటంతో మేమందరం మైసూర్‌కు 118 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న కూర్గ్‌కే ఓటేశాం. మొత్తం ఏడుగురం. ముందుగా చెన్నై తర్వాత మైసూర్‌కు టిక్కెట్లు బుక్ చేసుకున్నాం. చెన్నైకి చేరే సరికి ఉదయం ఐదు గంటలైంది. మైసూర్ వెళ్లే ట్రైన్ రాత్రి 9 గంటలకు ఉందని తెలుసుకున్నాం. టిఫిన్ తినే సమయం కావటంతో దగ్గర్లోని ఒక హోటల్‌కు వెళ్లాం. అంతా అయిపోయి బిల్ కట్టే సమయానికి తెలిసింది, మేం 21 రకాల ఫుడ్ ఐటమ్స్ టేస్ట్ చేశామని. మాకే ఆశ్చర్యమేసింది. నెయ్యి దోశ, మసాలా దోశ, పొంగల్, సాంబార్ వడా, రవ్వ దోశ, ఉతప్పం.. ఇలా చాలా రుచుల‌ను లాగించేశాం. మరుసటి రోజు ఉదయం ఏడు గంటలకు మైసూర్ చేరుకున్నాం.

అది భారతదేశపు స్కాట్లండ్‌..

అది భారతదేశపు స్కాట్లండ్‌..

ముందుగా అక్కడి నుంచి కుషాల్‌న‌గ‌ర్‌కు చేరుకున్నాం. కుషాల్‌న‌గ‌ర్ కూర్గ్‌కు బేస్ స్థావరం. అడవి దారిలో పచ్చని చిన్న చిన్న గ్రామాలు మాకు స్వాగతం పలికాయి. మూడు కొండలు ఎక్కిదిగాలి. మేం అక్కడికి చేరేసరికి ఉదయం 10 గంటలైంది. బ్రేక్‌ఫాస్ట్ పూర్తి చేశాం. మొత్తం 18 రకాల వంటకాలు ట్రై చేశాం. అక్కడే స్టే చేశాం. ఇక్కడ అన్ని రకాల వాహనాలూ అద్దెకిస్తారని, టాక్సీల కంటే అవే సౌకర్యవంతంగా ఉంటాయని స్థానికులు చెప్పారు. దాంతో మేం నాలుగు ఆక్టివా బైక్‌ల‌ను అద్దెకు తీసుకున్నాం. వాటికి ఒక్కో బైక్ కు రోజుకు 150 రూపాయలు. డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలు తీసుకున్నారు. అంతే ఇక మా ప్రయాణం, మా ఇష్టం. ఎలాంటి నియమ నిబంధనలూ లేవు. ట్రాఫిక్ హడావిడి అసలే లేదు. ప్రయాణాలంటే ఇష్టపడేవారికి ఇక్కడి ప్రకృతి అందాలు బాగా అలరిస్తాయనే చెప్పాలి. కూర్గ్ భారతదేశంలోని ఉత్తమ హిల్ స్టేషన్లలో ఒకటి. మైసూర్‌లోని కూర్గ్ అందాలను చూడటమే కానీ, వర్ణించటం సాధ్యం కాదని అప్పుడే అర్థమైంది. ఇక్కడి వాతావరణం, ప్రకృతి అందాలు అన్నీ స్కాట్లండ్‌ను పోలి ఉండటంతో భారతదేశపు స్కాట్లండ్‌గా పేరొందిందట!

దీనికి సందర్శకుల తాకిడి ఎక్కువే అని అక్కడి వాతావరణం చూస్తే తెలిసిపోతుంది. అక్కడ గ‌డిపిన‌ ప్రతి క్షణం మేం వేరే లోకంలో ఉన్నామా అనిపించింది.

నక్షత్రాలతో తనను తాను అలకరించుకున్న ఆకాశం

నక్షత్రాలతో తనను తాను అలకరించుకున్న ఆకాశం

కూర్గ్ అందాలకు అంతం లేదు. మాటల్లో వర్ణించలేక కళ్లతో అలా ఆస్వాదించాం. కాసేపు తిరిగిన తర్వాత మా స్టేయింగ్ పాయింట్‌ దగ్గరకు చేరుకున్నాం. కాసేపు విశ్రాంతి తర్వాత సమీపంలోని రెస్టారెంట్లో భోజనం చేశాం. కూర్గ్ లోని ఆహారం అందరూ తప్పక రుచి చూసి తీరాలి. తర్వాత మేం ఓ ప్రైవేట్ బ్యాక్ వాటర్ ప్లేస్‌కు వెళ్లాం. సమీపంలోని ఆనకట్ట నీటిని మేం ఉన్న ప్రాంతం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరానికి మళ్లించిన ప్రదేశం అది. మేం ప్రయాణించిన దారి చాలా ఇరుకైనది. చుట్టూ చెట్లతో నిండి ఉండి, మేమంతా పచ్చని గుహలోకి వెళ్లామా అన్న భావన కలిగించింది. ఆ ప్రకృతి అందాలకు మేం పరవశించిపోయాం.

మమ్మల్ని మరింత ఆకట్టుకుంది అక్కడి సూర్యాస్తమయం. అలా సూర్యుడు అస్తమిస్తూ తన అరుణ కాంతులను వెదజల్లుతుంటే, నీటిపైన పడుతున్న దాని ప్రతిబింబం నేనేమైనా తక్కువ తిన్నావా అంటూ ఇంద్రధనస్సులోని కాంతులతో సప్తరంగుల సూర్యుడిని చూపించింది. అలా దాని అందాలను కళ్లలో నింపుకొని, తిరిగి మా బసకు వచ్చాం. రాత్రికి క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకుని, అందరం ఆటపాటల్లో మునిగిపోయాం. అలా అలసిపోయి అందరం అక్కడే నిద్రపోయాం. మెల్లగా ఆకాశం నక్షత్రాలతో తనను తాను అలకరించుకోవటం మొదలుపెట్టింది. ఆ అలంకరణ పూర్తయ్యేసరికి ఆకాశం చూడముచ్చటగా తోచింది. ఇలాంటి అందాలెన్నో ఉదయం అయ్యేసరికి మిస్సయ్యామన్న భావన మనసులో ఓ మూల తొలిచేయసాగింది.

మేం అనువాదకుల‌మ‌య్యాం

మేం అనువాదకుల‌మ‌య్యాం

మరుసటిరోజు ఉదయాన్నే 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, మడికెరి అని పిలిచే కూర్గ్ కేంద్రానికి చేరుకున్నాం. ఇంతలో మా బృంద స‌భ్యులు కన్నడ మాట్లాడటం కోసం పడుతోన్న కష్టాలను స్థానికులు గమనించారు. దాంతో అక్కడి ప్రజల్లో కొంతమంది మాపై అభిమానం చూపించి, మాకు కొన్ని కన్నడ మాటలు నేర్పించారు. అలా కొద్ది సమయంలోనే మాకు మేం అనువాదకుల‌మ‌య్యాం. మడికెరిలో మేం రాజాస్ సీటుకు వెళ్ళాం. అది చుట్టూ మేఘాలు, ఎత్త‌యిన‌ పచ్చని పర్వతాల గొలుసుతో కూడి ఉంది. అక్కడి నుంచి సూర్యాస్తమయాన్ని చూడటానికి కొడగు రాజులు ఇష్టపడేవారంట. అక్కడి నుంచి చుట్టు పక్కల అందాలను చూసి, పులకించిపోయాం.

కిలోమీటరు నడక తప్పనిసరి

కిలోమీటరు నడక తప్పనిసరి

రాజాస్ సీటుకు 22 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మండలపట్టికి మేం జీపులో వెళ్లాం. భూభాగం గరిష్ట స్థాయికి చేరుకున్నాం. మేం ప్రయాణం చేసిన రహదారి చాలా కఠినమైంది. వెళ్లేదారిలో జీప్ డ్యాన్స్ చేసిందనే చెప్పాలి. అలా ఓ అర‌గంట త‌ర్వాత మేం మా గ‌మ్య‌స్థానానికి చేరుకున్నాం. 1600 మీటర్ల ఎత్తులో మండల‌ప‌ట్టి శిఖరం ఉంది. శిఖర భాగానికి చేరాలంటే కిలోమీటరు నడక తప్పనిసరి. చిన్న

పిల్లలు క్రమం తప్పకుండా ఒకరి వెనకాల ఒకరు వెళు తున్నట్టు మేఘాలు అలా మా మీద నుంచి కదిలిపోతుంటే వాటి శ్రేణిని అలా చూస్తుండిపోయాం. అక్కడి నుంచి తర్వాత మేం అబ్బి ఫాల్స్‌కు వెళ్లాం. ఈ జలపాతంపై నీరు 70 అడుగుల ఎత్తు నుంచి పడుతోంది. కొంచెంసేపు అక్కడి నీళ్లలో కాళ్లు పెట్టి, ఆ నీటి చల్లదనాన్ని ఆస్వాదించాం. ఆ తర్వాత అక్కడి నుంచి మా బసకు చేరుకుని, తిరుగు ప్రయాణమయ్యాం. ఇంకా అక్కడ చూడాల్సినవి ఏనుగు సఫారి, తలకావరి, తడియాండమోల్ కోటలు, సరస్సులు, వన్యప్రాణుల అభయారణ్యం వంటివి చాలా ఉన్నాయి. ప్రకృతిని దగ్గరగా చూడాలనుకునే వారికి కూర్గ్ మంచి ఎంపిక.

మా ప్రయాణం చాలా సజావుగా సాగిందనిపించింది. అడుగడుగునా చెట్లు స్వాగతం పలికాయి. ఇలా ప్రయాణం చేస్తామ‌ని, మేం అస్స‌లు ఊహించలేదు. ఇది మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరిన్ని ప్రయాణాలు చేయాలనే ఆలోచనకు పునాది వేసింది. ఈ ప్రయాణపు జ్ఞాపకాలను మదిలో దాచుకుని, అలా ఇంటికి చేరాం. మరెందుకు ఆలస్యం.. మీరూ మీ ప్ర‌యాణాన్ని మొదలు పెట్టండి!!

Read more about: coorg mysore chennai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X