Search
  • Follow NativePlanet
Share
» »పెద్ద పులిని ద‌గ్గ‌ర‌గా చూడాలంటే.. ర‌ణ‌తంబోర్ వెళ్లాల్సిందే!

పెద్ద పులిని ద‌గ్గ‌ర‌గా చూడాలంటే.. ర‌ణ‌తంబోర్ వెళ్లాల్సిందే!

పెద్ద పులిని ద‌గ్గ‌ర‌గా చూడాలంటే.. ర‌ణ‌తంబోర్ వెళ్లాల్సిందే!

చిన్నతనంలో పులులు అంటే అడవుల్లోని గుహాల్లో ఉంటాయని తెలుసుకున్నాం.. ఆ అందాల మృగాన్ని సర్కస్ బోనులో బంధించి ఉండగా చూసుంటాం.. కానీ, అదే జంతువు మనముందు గంభీరంగా తిరుగుతూ ఉంటే.. దానిని దగ్గరగా చూస్తే.. ఎలా ఉంటుంది?! అలా అడవిలోని సహజమైన ప్రకృతి నడుమ టైగర్ ను దగ్గరగా చూడడం అదో అద్భుతమైన అనుభవం. అలాంటి అనుభూతిని పొందడానికే పర్యాటకులు వన్యప్రాణుల అభయారణ్యానికి బయలుదేరుతుంటారు. అందులో భాగంగా మేమంతా కనులారా వీక్షించిన రణతంబోర్ నేషనల్ పార్క్‌, టైగర్ ప్రాజెక్ట్ విశేషాలు మీకోసం!

రాజస్థాన్లోని సవై మధోపూర్ జిల్లాలో ఉంది రణతంబోర్. నాలుగు పర్వతాలు గుమిగూడిన ప్రాంతంలో ఈ నేషనల్ పార్కును ఏర్పాటు చేశారు. ఇక్కడ పెద్దపులులు, ఎలుగుబంట్లు, సాంబార్ చీతల్, నీల్ ఇంకా చాలా వన్యప్రాణులు ఉన్నాయి. ఈ నేషనల్ పార్కు 275 చదరపు కిలోమీటర్ల కోర్, 392 చదరపు కిలోమీటర్ల బఫర్ జోన్ గా విభజించబడింది. ఈ పార్కులో జంగిల్ (ఆడవి) సఫారి పరంగా ఎనిమిది జోన్లుగా విభజించబడ్డాయి. దీనిని ఆనుకొని మాన్సింగ్, కైలే దేవి అనే మరో రెండు ఇతర నేషనల్ పార్కులు (అభయారణ్యాలు) ఉన్నాయి. వీటినే వర్త్ మాలా, ఆరావళి పర్వతమాలా జంక్షన్ అని పిలుస్తారు. వీటికి దక్షిణాన చంబల్ నది పూర్తి శోభతో ప్రవహించడం కనులారా చూడవచ్చు. అందుకే ఈప్రాంతం ఏడాది పొడవునా ఆకుపచ్చగా ఉంటుందని అర్థమైంది.

వన్యప్రాణుల ఆవాసం

వన్యప్రాణుల ఆవాసం

అక్కడి సిబ్బంది మాటల ప్రకారం రణతంబోర్ టైగర్ రిజర్వ్ లో 55కు పైగా పులులు ఉన్నాయి. వాటితోపాటు చిరుత, గీతల హైనాలు, సాంబార్ జింకలు, నల్లమచ్చల జింకలు, మనుబోతులు, సాధారణమైన లేదా హనుమాన్ లంగూర్, వానరం, నక్క, అడవి పిల్లి, ఎలుగు బంటి, భారతీయ అడవి ఎలుగుబంటి, కృష్ణజింక సాధారణ తాటి పునుగు లేదా ఈత పిల్లి, గబ్బిలాలు, ఎడారిపిల్లులు, నక్క ఎలుక ఇలా అన్ని జంతువులు ఉన్నాయి.

ఎందుకంటే, ఇక్కడి నీటి ప్రవాహమే అందుకు కారణమని చెప్పాలి. ఈ పార్కులో 272 రకాల పక్షులు ఉన్నాయి. ఒకవేళ మీరు పక్షి ప్రేమికులయితే రణతంబోర్‌ దుర్గ, యజమాని చెరువు, రాజ్ చెరువు, పదమ్ చెరువుల‌కు కచ్చితంగా వెళ్ళాల్సిందే! ఎందుకంటే ఇక్కడ మీకు అరుదైన పక్షిజాతులు తారసపడతాయి. వాటిలో మాకు కనిపించినవి వడ్రంగిపిట్ట, భారత బూడిద హస్ బిల్స్, కింగ్ ఫిషర్, కోయిల, చిలుక, ఆసియా ఫామ్ స్విప్ట్, గుడ్లగూబ, పావురం, గుల్, టెర్న్, గ్రేట్, బొచ్చు బార్బారా, ఈగల్స్, డార్టర్స్, చెరువు కాకులు, తుంపొడి పక్షి, రాజహంసలు, కంకణాలు, గూడబాతులు, కొంగలు, కాకులు, డ్రోంగోస్, పిచ్చుకలు, ఫించాతి బులల్, గోరింక, మొదలైనవి. ఈ అడవి 300 కంటే ఎక్కువ వన్యప్రాణులకు ఆవాసంగా నిలుస్తోంది.

అరుదైన వృక్ష సంపద

అరుదైన వృక్ష సంపద

ఇక్కడి అడవిలో సందర్శకులకు దారిపొడవునా ఎత్తయిన పెద్ద పెద్ద వృక్షాలు స్వాగతం పలుకుతాయి. తీక్షణంగా చూస్తే అవి ఆకాశాన్ని తాకుతున్నాయా?! అనేంతగా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ముఖ్యంగా మామిడి, చింత, ఆకేసియా, మర్రి, దక్, జెర్రీలు, వేప వృక్షాలు కనిపిస్తాయి. వీటి సంరక్షణ విషయంలోనూ పార్కు నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఇక్కడ మాకు ఇంకో విశేషం కనిపించింది. ఏపుగా పెరిగిన గడ్డి దుబ్బులు పరిసరాల అందాన్ని మార్చేశాయి. ఆ గడ్డి మాటు నుంచి పెద్దపులి దాహం తీర్చుకోవడానికి బయటికి వచ్చినప్పుడు మా కెమెరాలో క్లిక్ మనిపించేశాం. ఆ దృశ్యం జీవితాంతం గుర్తుండిపోతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. గ్రేట్ టైగర్ చాలా హుందాగా మనముందు వెళ్తుంటే అంత గంభీరమైన మృగాన్ని చూస్తు నివ్వెరపోవడం సహజం కదా! ఒక్కోసారి పొదలమధ్య నుంచి జీప్ ఒక్కసారిగా వెళుతుంటే, వేలాది చిలుకలు మాకు స్వాగతం పలికేలా ఎగురుతూ కనిపించాయి.

ఇలాంటి మధురమైన అనుభూతిని జీవితంలో ఎప్పుడూ అనుభవించి ఉండం. దట్టమైన చెట్ల మధ్య నుంచి వచ్చే సూర్యరశ్మి, జీపులో కుదురుగా కూర్చోనీయ కుండా వీచే వేగమైన గాలి, ఇలా ఎంత చెప్పినా తక్కువే. సందర్శకులు ఓ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ నేషనల్ పార్కు లోపలికి ప్రవేశించడానికి అటవీశాఖ అనుమతి తప్పనిసరి. అడవిలోకి జీప్‌లో వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయబడి ఉంటాయి. అటవీశాఖ వారు సీజన్ కు అనుగుణంగా ఈ పార్కులోకి సందర్శకుల ప్రవేశానికి అనుమతులు ఇస్తూ ఉంటారు. అయితే, వర్షాకాలంలో మూసివేసి ఉంటుంది.

పూర్తి రక్షణ

పూర్తి రక్షణ

ఈ జర్నీలో ఏ బోనులో నుంచి ఏ జంతువు బయటికి వస్తుందో అని భయపడనవసరం లేదు. ఎందుకంటే, అనుభవజ్ఞులైన డ్రైవర్ నిరంతరం ఇతర డ్రైవర్లతో కాంటాక్ట్‌లో ఉంటాడు. టైగర్ మూమెంట్స్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు సిబ్బంది డ్రైవర్‌తో ఫోన్లో మాట్లాడుతూ ఏ జంతువు ఏ ప్లేస్‌లో ఏం చేస్తుందో అనే సమాచారం ఇస్తారు. ఇక్కడి డ్రైవర్లు టైగర్లను వాటి పేర్లతో గుర్తుపడతారు. మా గైడ్ చెప్పిన దాని ప్రకారం.. టైగర్లు వాటికి కేటాయించిన ప్రాంతాల్లోనే అవి ఉంటాయి. ఒకవేళ ఒక టైగర్ ఇంకో టైగర్ ప్రాంతం దగ్గరికి వచ్చిందంటే ఆ రెండింటికీ యుద్ధం మొదలవుతుంది. అలా జరిగితే మాత్రం ఆ రెండింట్లో ఏదో ఒకటి మాత్రమే బతికుంటుంది.

ఆశ్చర్యకరమైన విషయమేమంటే టైగర్లు వాటి ప్రాంతం కోసం చావడానికైనా సిద్ధపడతాయి. ఎక్కువగా ఇలాంటి పోరు ప్రాంతం గురించి, లేదా ఆడపులి గురించి జరుగుతుంటాయట! టైగర్స్ చెట్ల పై కానీ, రాళ్లపై కానీ అవి వాటి పంజా గుర్తులను వేస్తాయి. అంటే, ఆ ప్రాంతం దాని ఆధీనంలో ఉన్నట్లు, ఈ పార్కులో ఆడపులుల సంఖ్య బాగానే ఉంది. వీటిలో ఫిష్ టైగర్స్ ప్రసిద్ధమైనవి. ఇవి చాలా శక్తివంతమైన మృగాలు. ఇవి 12 అడుగుల పొడుపుగల ఎలిగేటర్ (మొసలి)ని అవలీలగా ఓడించగలవు.

నెమ‌లి నాట్యం చూస్తూ ఉండిపోయాం..

నెమ‌లి నాట్యం చూస్తూ ఉండిపోయాం..

ఈ పార్కును చూడడానికి ఇక్కడికి సంవత్సరం పొడవునా పర్యాటకులు వస్తూ ఉంటారు. ఎక్కువగా పులిపిల్లలను చూసేందుకు సందర్శకులు ఆసక్తి కనబరుస్తారట. నిజానికి మేం ఉదయం 6గంటలకు పార్కులో ప్రవేశించాం. తొమ్మిది గంటలకు పార్కునుంచి బయటికి రావాల్సి ఉంది. కానీ టైగర్స్ బయటికి రాలేదు. దాంతో ఎక్కువ సమయం లోపలే ఉండగలిగాం. అడవిలో జింకలు, కుందేలు, మనుబోతులు చాలానే ఉన్నాయి. నెమలి పురివిప్పి నాట్యం చేయడాన్ని అలా చూస్తూ ఉండిపోయాం. ఆ క్షణంలో ఫొటో విషయాన్నే మర్చిపోయాం. ప్రతిచోటా చెరువులు ఉన్నాయి. ఇందులో మొసళ్లను చూడొచ్చు. ఈ పార్కు 392 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అంతా చూడాలంటే మూడు నుంచి నాలుగు రోజులు పడుతుంది. పార్క్‌కు మళ్ళీ సాయంత్రం వెళ్ళాం. జోన్ -3 ప్రాంతం తంబోర్ కొండల మధ్య లోయలో ఉంది. కొద్ది కిలోమీటర్లు ప్రయాణించగానే పర్వతాల మధ్య సేదతీరుతూ మాకు పులుల గుంపు కనిపించింది.

నిశబ్దంగా మేం కొద్దిగా ముందుకు బయలుదేరాం. మా గైడ్ మాకు సైగలు చేస్తూ ఒకవైపు నుంచి చూడమని సలహా ఇచ్చారు. టైగర్ చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. పసుపురంగు గల శరీరంపై నల్లని, తెల్లని చారలు ఉన్నాయి. మేం పులిని చాలా దగ్గరి నుంచి చూశాం. టైగర్స్ చాలా శక్తివంతమైనవి. తెలివైనవి కూడా. వాటి చుట్టుపక్కలా ఏం జరిగినా వాటికి తెలిసిపోతుంది. ఒక్కసారిగా పులి మావైపు చూస్తు గంభీరంగా అరిచింది. మా గుండె వేగం పెరిగిపోయింది. అవి మర్చిపోలేని క్షణాలు. పులిని ఐదు అడుగుల దూరం నుంచి చూడటమంటే మాటలు కాదు కదా!

ఈ పార్కుకు ఎదురుగానే రణతంభోర్ కోట కూడా ఉంది. ఈ కోట హమీర్ దేవ్ చౌహన్ వైభవానికి ప్రతీకగా చెప్పుకుంటారు. నవంబర్ నుంచి మార్చి వరకు ఈ ప్రాంతం జర్నీ బాగుంటుంది. రణతంభోర్ ఫైవ్ స్టార్ హోటల్ల‌తోపాటు రిసార్ట్స్, కొన్ని సాధారణ హోటల్స్ కూడా ఉన్నాయి. లగర్జీ రిసార్ట్ ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడికి దగ్గరలో జయపూర్, కోటా విమానాశ్రయాలు ఉన్నాయి.

Read more about: ranthambore national park
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X