Search
  • Follow NativePlanet
Share
» »హజో ... పవిత్ర పుణ్యక్షేత్రం !!

హజో ... పవిత్ర పుణ్యక్షేత్రం !!

గౌహతికి 32 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర నదీ తీరానికి చేరువలో ఉన్నది ఈ 'హజో' అనే ప్రాంతం. ఎక్కడెక్కడి భక్తజన సందోహంతో నిత్యం కళకళ లాడుతూంటుంది. ఇక్కడ ఒక మతం కాదు.. ఒక కులం కాదు - సర్వమత సారంతో తొణికిస లాడుతూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విరాజిళ్లుతున్నది. ఓవైపు హిందూత్వ భజనలు - మరోవైపు ఇస్లాం ప్రార్థనలూ - ఇంకోవైపు బౌద్ధమత ప్రభోధనలతో అలరారుతోంది. శతాబ్దాల చరిత్రని తనలో ఇముడ్చుకొన్న 'హజో'లో ఒక్కరోజు ప్రశాంతంగా గడిపితే చాలు ఇక ఈ జీవితం చరమాంకంలోకి వెళ్లిపోయినా ఫర్వాలేదు అంటారు ఆధ్యాత్మిక లోకాల్లో విహరించేవారు.ఈ ప్రాంతం అనేకానేక మసీదులతో.. దేవాలయాలతో- బౌద్ధ ఆరామాలతో నిరంతరం భక్తి భావం పిల్లతెమ్మెరల్లో దోబూచులాడుతూంటుంది.

హయగ్రీవ మహాదేవ ఆలయం

చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం మీదుగా ప్రయాణించి ఆలయ ప్రాంగణం చేరుకోవటంతో- అలసట కాస్తా కనుమరుగవుతుంది. ఎతైన మెట్ల దారిగుండా వెళితే కనుచూపు మేరలో హయగ్రీవ మహాదేవ ఆలయం. ఈ ఆలయం హిందువులకూ, బౌద్ధులకూ పవిత్ర క్షేత్రం. ఒరిస్సాలోని జగన్నాథ ఆలయాన్ని పోలినట్టు ఉండే ఈ ఆలయంలో విష్ణువు - బుద్ధుడు కొలువుతీరి ఉంటారు. ప్రతి ఏటా బౌద్ధమతానికి సంబంధించిన ఉత్సవాలతోపాటు ప్రధాన హిందూ పండుగలూ జరుగుతాయి. ఆ వాతావరణం ఒక్కసారి చూసి తీరాల్సిందే. ఎందుకంటే- బౌద్ధ సన్యాసులతో.. హిందూత్వ ప్రముఖులతో కిక్కిరిసి ఉండటం. సామాన్య ప్రజానీకానికి అదొక వేడుక. బుద్ధుడు ఇక్కడే నిర్వాణం పొందాడని బౌద్ధ మతస్థుల విశ్వాసం.

హయగ్రీవ మహాదేవ ఆలయాన్ని పూర్వం 'కాలాపహార్' అనే మహారాజు ధ్వంసం చేసినట్టు చరిత్ర కథనం. క్రీ.శ.1543 ప్రాంతంలో కోచ్ మహారాజు రఘుదేవ్ ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఆ ఆలయానికి సమీపంలోనే చిన్న దేవాలయం ఉంటుంది. దీన్ని అహోమ్ మహారాజు ప్రమథ సింగ్ నిర్మింపజేశాడు.

హజో...పవిత్ర పుణ్యక్షేత్రం!!

భక్తులతో కిక్కిరిసిన ఆలయం

Photo Courtesy: Jugal Bharali

భీమర్ చారియా

హయగ్రీవ మహాదేవ ఆలయానికి కొద్ది దూరంలో ఉందీ ప్రాంతం. పురాణేతిహాసాల ప్రకారం - పూర్వం పాండవులు తమ అజ్ఞాత వాసాన్ని ఇక్కడ గడిపారనటానికి దాఖలాలు కనిపిస్తాయి. ఇప్పటికీ అక్కడ పెద్ద రాతి పాత్రని చూడొచ్చు. ఆ పాత్రలో దిగటానికి మెట్లు కూడా ఉంటాయి. భీమసేనుడు ఈ పాత్రలో భుజించేవాడని కొందరు.. స్నానం చేసేవాడని కొందరు.. ఇలా వారివారి ఊహలకు తగ్గట్టు కథలు అల్లినప్పటికీ - పాండవులు ఇక్కడ నివసించారనేది మాత్రం స్పష్టం.

పోవ మక్కా

హజో అస్సాం ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశం. క్రీ.శ.12వ శతాబ్దంలో ఇరాక్ రాజు పిర్ ఘియాసుద్దీన్ అలియా ఇక్కడ ఒక మసీదు నిర్మాణాన్ని చేపట్టాడు. ఘియాసుద్దీన్ భారతదేశంలో పర్యటిస్తూ ఈ ప్రాంతం నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండటంతో.. ప్రార్థనలకు అనువుగా ఉంటుందని మసీదుకి రూపకల్పన చేశాడని అంటారు. ఆ తర్వాతి కాలంలో అంటే క్రీ.శ.1657లో మొగల్ రాజు షాజహాన్ నేతృత్వంలో మిర్ లుతుఫుల్లా-హి- షిరాజీ అనే వ్యక్తి ఈ మసీదుకి మరిన్ని మెరుగులు దిద్దాడు. ఇక్కడ ఘియాసుద్దీన్ సమాధిని చూడటమే కాకుండా- ఆయన ఇస్లాం మత వ్యాప్తికి ఎంతటి కృషి సల్పాడో సవివరంగా రాతిపై చెక్కబడింది. మక్కా నుంచి కొంత మట్టిని తెచ్చి ఈ మసీదు నిర్మాణంలో వాడారని ఒక కథనం. అందు చేతనే దీనికి పోవ మక్కా అని పేరు.

హజో...పవిత్ర పుణ్యక్షేత్రం!!

మసీద్ ముఖ చిత్రం

Photo Courtesy: Pearlblack15

'హజో' ప్రాంతం సకల కళలకు కొలవు. ఇక్కడ కుటీర పరిశ్రమలు లెక్కకు మించి ఉన్నాయి. వాటిలో ఇత్తడి వస్తువుల తయారీ ఒకటి. ఆనాటి రాజులూ పూర్వీకులూ వాడిన అనేక వస్తువులను ఇక్కడ ప్రదర్శనకి ఉంచారు.

చేరుకోవటం ఎలా?

విమాన మార్గం

న్యూఢిల్లీ నుంచీ కోల్‌కతా, ముంబై, చెన్నై, జోర్హత్, తేజ్‌పూర్, దిబూఘర్, దక్షిణ లఖింపూర్, సిల్‌చార్ ప్రాంతాల నుంచి గౌహతికి ఫ్లైట్ సర్వీస్ ఉంది. ఇక్కడి నుంచి హజో 17 కి. మీ. దూరంలో ఉన్నది.

రైలు సదుపాయం

హజోకి 23 కి. మీ. దూరంలో గౌహతి జంక్షన్ రైల్వే స్టేషన్ కలదు. ఈ జంక్షన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలచేత అనుసంధానించబడినది.

రోడ్డు మార్గం

గౌహతి నుంచి నిరంతరం హజోకి బస్సు సర్వీసులు నడపబడతాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X