Search
  • Follow NativePlanet
Share
» »ఆమ‌దాల‌వ‌ల‌స సంగమేశ్వర జాతరకు మీరూ బ‌య‌లుదేరండి మ‌రి!

ఆమ‌దాల‌వ‌ల‌స సంగమేశ్వర జాతరకు మీరూ బ‌య‌లుదేరండి మ‌రి!

ఆమ‌దాల‌వ‌ల‌స సంగమేశ్వర జాతరకు మీరూ బ‌య‌లుదేరండి మ‌రి!

సంక్రాంతి అంటేనే గ్రామీణ ప్ర‌జ‌ల పండ‌గ‌. ఈ సంద‌ర్భంగా సంప్ర‌దాయ‌క కార్య‌క్ర‌మాలు ఏ ప‌ల్లెలో చూసినా తార‌స‌ప‌డ‌తాయి. ఆత్మీయ ప‌ల‌క‌రింపుల క్ష‌ణాలకు నిద‌ర్శ‌నం సంక్రాంతి. అలాంటి పండ‌గ వాతావ‌ర‌ణం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోనూ ఏటా ప‌ల‌క‌రిస్తూ ఉంటుంది. సంక్రాంతి సంద‌ర్భంగా ఇక్క‌డ జ‌రిగే మూడు రోజుల జాత‌ర ఏడాది మొత్తంగా గుర్తిండిపోయేలా ఘ‌నంగా జ‌రుపుతారు. ఆ జాత‌ర విశేషాల‌ను తెలుసుకుందాం రండి!

శ్రీ‌కాకుళం జిల్లా ఆమ‌దాల‌వ‌ల‌స‌ మండలం గాజులపల్లివలసలో సంగమేశ్వర జాతర ఏటా సంక్రాంతిని పుర‌ష్క‌రించుకుని ఘనంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై.. సంగమేశ్వర స్వామికి మొక్కులు చెల్లించడం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ప‌చ్చ‌ని ప్ర‌కృతి సోయ‌గాల మ‌ధ్య సాగే ఈ ప‌య‌నం జీవితంలో మ‌ర్చిపోలేని ఎన్నో అనుభ‌వాలను చేరువ చేస్తుంది.

భోగీ మ‌రుస‌టి రోజున ప్రారంభ‌మై మూడు రోజుల‌పాటు ఇక్క‌డ‌ సాగే జాత‌ర‌ను తిల‌కించేందుకు దూర‌ప్రాంతాలకు వ‌ల‌స వెళ్లేవారు త‌ప్ప‌నిస‌రిగా వాలిపోతారు. ఈ మూడు రోజులూ ఎటు చూసినా జ‌న‌సంద్రమే ప‌ల‌క‌రిస్తుంది. తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే గుడారాల్లో చిరు వ్యాపారులు కుటుంబ‌స‌మేతంగా ఇక్క‌డే విడిది చేస్తారు. యువ‌త కేరింత‌ల న‌డుమ జాత‌ర క‌న్నుల‌పండుగ‌గా జ‌రుగుతోంది.

చారిత్ర‌క నేప‌థ్యం ఉంది..

చారిత్ర‌క నేప‌థ్యం ఉంది..

ఆమదాలవలస పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగమేశ్వర కొండ సంక్రాంతి వ‌చ్చిందంటే ఆత్మీయ ప‌ల‌క‌రింపుల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిపోతుంది. ఏటా వందలాది మంది సంక్రాంతికి జ‌రిగే జాత‌ర‌కు వ‌స్తూ ఉంటారు. ఈ సంగమేశ్వర కొండ ప్రాచీనకాలం నాటిది. ఈ కొండ చరిత్ర 12వ శతాబ్దానికి చెందినదని 1982లో సర్వే చేసిన పురావస్తు అధికారులు తేల్చి చెప్పారు. జైన, బౌద్ధ, శైవ ధర్మాలకు చెందిన ఆనవాళ్లు ఇక్కడ చూడవచ్చు. కొండ చివ‌రి భాగానికి ఎక్కేందుకు సాహ‌సోపేత‌మైన‌ ట్రెక్కింగ్ చేయ‌వ‌ల‌సి ఉంటుంది. ట్రెక్కింగ్‌పై ఆస‌క్తి ఉన్న‌వారికి ఇది స్వ‌ర్గ‌ధామంగా చెప్పొచ్చు. పై భాగం నుంచి చూస్తే చుట్టుప‌క్క‌ల క‌నిపించే ప్ర‌కృతి దృశ్యాన్ని మాట‌ల్లో వ‌ర్ణించడం క‌ష్ట‌మ‌నే చెప్పాలి.

కొండ గుహ‌లో ఇరుకైన మార్గంలో..

కొండ గుహ‌లో ఇరుకైన మార్గంలో..

కొండ‌పైన‌ గుహ‌లో కొలువైన సంగ‌మేశ్వ‌ర‌ స్వామిని దర్శించుకోవాలంటే 164 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. గ‌తంతో పోల్చుకుంటే ఆ మెట్ల మార్గాన్ని మెరుగుగా పున‌ర్‌నిర్మించారు. కొండ గుహ‌లో ఇరుకైన మార్గంలో లోప‌ల‌కు ప్ర‌వేశించి స్వామివారిని ద‌ర్శించుకోవాల్సి ఉంటుంది. ఇది నిజంగా సాహ‌సోపేతంగా అనిపిస్తుంది. కొండ ఫైబాగం నుంచి ఈ కష్టాన్ని మర్చిపోయేంతగా ప్ర‌కృతి సౌందర్యం కనిపిస్తుంది.

సంక్రాంతిని పుర‌ష్క‌రించుకుని కుటుంబ‌స‌మేతంగా వ‌చ్చేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. కొండ దిగువ భాగంలో ల‌భించే శ‌న‌గ‌లు, ఖ‌ర్జూరం కొనుగోలు చేసి, వాటిని ప్రసాదంగా పంపిణీ చేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. వ‌ల‌స జీవులకు కేంద్రంగా చెప్పుకునే ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లకు ఇలాంటి సంక్రాంతి జాత‌ర‌లు ఆత్మీయ ప‌ల‌క‌రింపుల వేదిక‌గా నిలుస్తాయ‌న‌డంలో సందేహ‌మే లేదు. మ‌రెందుకు ఆల‌స్యం మీరూ ఆమ‌దాల‌వ‌ల‌స సంగ‌మేశ్వ‌ర జాతర‌లో అడుగుపెట్టేందుకు ఇప్పుడే బ‌య‌లుదేరండి!

ఎలా చేరుకోవాలి?

ఎలా చేరుకోవాలి?

సంగ‌మేశ్వ‌ర కొండ‌కు వెళ్లేందుకు ముందుగా ఆమ‌దాల‌వ‌ల‌స టౌన్‌ను చేరుకోవాల్సి ఉంటుంది. శ్రీ‌కాకుళం హెడ్ క్వార్ట‌ర్‌కు ఇది ప‌ది కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఇక్క‌డ‌కు చేరుకునేందుకు నిత్యం బ‌స్సు, ఆటో స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి. రైలు మార్గంలో చేరుకోవాల‌నుకునేవారు శ్రీ‌కాకుళం రోడ్ రైల్వే స్టేష‌న్‌లో దిగాల్సి ఉంటుంది. ఇది ఆమ‌దాల‌వ‌ల‌స ప‌ట్ట‌ణంలోనే ఉంది. స‌మీప విమానాశ్ర‌యం విశాఖ‌ప‌ట్నంలో ఉంది. ఇక్క‌డి నుంచి విశాఖప‌ట్నం సుమారు 120 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది.

Read more about: sangameshwara jatara
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X