
బయోడైవర్సిటీ హెరిటేజ్ జాబితాలో చేరిన అరిట్టపట్టి
తమిళనాడులోని అరిట్టపట్టిలో మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. అరిట్టపట్టి ప్రాంతం సుమారు 250 జాతుల పక్షులతో పాటు అనేక జాతుల వన్యప్రాణులకు నిలయంగా పేరుగాంచింది. ఇది సహజ సిద్ధమైన నీటి బుగ్గలు, సరస్సులతో ప్రకృతి ఒడిలో సేదదీరుతోంది. అంతేకాదు, ఎటుచూసినా మెగాలిథిక్ నిర్మాణాలు, రాతితో చెక్కబడిన పురాతన దేవాలయాలను ఇక్కడ చూడొచ్చు.
తమిళనాడు మదురై జిల్లాలోని అరిట్టపట్టితోపాటు మీనాక్షిపురం గ్రామాలను రాష్ట్రంలోనే తొలి జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటిస్తూ తమిళనాడు ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అరిట్టపట్టి గ్రామంలో (మేలూర్ బ్లాక్) 139.63 హెక్టార్లు, మీనాక్షిపురం గ్రామంలో (మదురై తూర్పు తాలూకా) 53.8 హెక్టార్లతో కలిపి మొత్తంగా 193 హెక్టార్ల స్థలాన్ని అరిట్టపట్టి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. ఈ ప్రాంతం చుట్టూ ఏడు కొండలను పేర్చినట్లు తారసపడే సుందర దృశ్యం సందర్శకులకు ఆదనపు ఆకర్షణగా నిలుస్తోంది. వీటి చుట్టూ మొత్తంగా 72 సరస్సులు, 200 సహజ నీటి బుగ్గలతోపాటు మూడు చెక్ డ్యామ్‌లు దర్శనమిస్తాయి. జీవవైవిధ్యం కోల్పోకుండా నిరోధించడంతోపాటు గత కాలపు సాంస్కృతిక మరియు నిర్మాణ వారసత్వాన్ని కాపాడటానికి తమిళనాడు బయోడైవర్సిటీ బోర్డ్ సిఫారసు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అరిట్టపట్టిని జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.

పర్యావరణ, చారిత్రిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి
16వ శతాబ్దంలో పాండియన్ రాజుల కాలంలో నిర్మించిన అనైకొండన్ ట్యాంక్ వాటిలో ఒకటి.
అనేక మెగాలిథిక్ నిర్మాణాలు, రాతి దేవాలయాలు, తమిళ బ్రాహ్మీ శాసనాలు, జైన ఆకృతులు ఈ ప్రాంతం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను మరింత పెంచుతాయి. అందుకే, అరిట్టపట్టి గ్రామం పర్యావరణ, చారిత్రిక ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది. మూడు ముఖ్యమైన రాప్టర్లతో సహా దాదాపు 250 రకాల పక్షులతో వేటాడే పక్షలుగా పేరుపొంది అరుదైన లగ్గర్ ఫాల్కన్, షాహీన్ ఫాల్కన్ మరియు బోనెల్లిస్ ఈగిల్ ఇక్కడ కనిపిస్తాయి. ఇది ఇండియన్ పాంగోలిన్, స్లెండర్ లోరిస్ మరియు కొండచిలువలు వంటి వన్యప్రాణులకు ఆవాసంగా పేరుగాంచింది.

బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్ (BHS) అంటే ఏమిటి?
పర్యావరణం, అడవులు మరియు వాతావరణ మార్పుల అదనపు ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు జారీ చేసిన ఒక ఉత్తర్వు ప్రకారం, జీవ వైవిధ్య చట్టం, 2002లోని సెక్షన్ 37 ప్రకారం ఈ ప్రదేశాన్ని బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్‌గా గుర్తించారు. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్స్(BHS) అనేది ప్రత్యేకమైనగా చెప్పొచ్చు. పర్యావరణపరంగా అరుదైనదిగా, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించే ప్రదేశంగా దీనిని గుర్తించవచ్చు. ఇక్కడి పర్యావరణ వ్యవస్థలతోపాటు భూసంబంధమైన, తీర మరియు లోతట్టు జలాలతోపాటు జాతుల సమృద్ధి, వాటి ఉనికిని కాపాడేందుకు రక్షణ చర్యల్లో భాగంగా వీటిని గుర్తించి, పరిరక్షిస్తారు.

అరుదైన జీవజాతులతోపాటు సాంస్కృతిక నేపథ్యాన్ని పదిలపరచేందుకు బయోడైవర్సిటీ హెరిటేజ్ ప్రాంతాలు దోహదపడతాయి. ఒక ప్రాంతాన్ని జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం దాని చారిత్రకనేపథ్యంతోపాటు ప్రత్యేకమైన పర్యావరణ వ్యవస్థను రక్షించడంలో సహాయపడుతుందనే చెప్పాలి. దీని ద్వారా జీవవైవిధ్యానికి హాని కలిగించే చర్యలను అటవీశాఖ అరికట్టేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంతోపాటు వారసత్వ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యతగా చెప్పొచ్చు.