Search
  • Follow NativePlanet
Share
» »హైద‌రాబాద్‌లో ఉన్నారా.. ఈ వీకెండ్ రాచకొండ కోట‌కు ప్లాన్ చేయండి!

హైద‌రాబాద్‌లో ఉన్నారా.. ఈ వీకెండ్ రాచకొండ కోట‌కు ప్లాన్ చేయండి!

హైద‌రాబాద్‌లో ఉన్నారా.. ఈ వీకెండ్ రాచకొండ కోట‌కు ప్లాన్ చేయండి!

వీకెండ్ వ‌చ్చేస్తోంది. ఈ వీకెండ్‌లో గ‌జిబిజి మ‌హాన‌గ‌రం నుంచి కాస్త రిలీఫ్ అయ్యేలా ప్ర‌శాంత‌మైన ప్ర‌దేశానికి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నారా. అయితే, మీ కోస‌మే రాచ‌కొండ ఎదురు చూస్తోంది. అదేనండి.. ఒక‌ప్ప‌టి తెలంగాణ‌కు రాజ‌ధానిగా విరాజిల్లిన చారిత్ర‌క నేల‌. ఎత్తైన కొండలు, ఎంతో చూడచక్కని కట్టడాలు, కళాకృతులతో నిండి ఉన్న ఆ ప్రాంతం హైద‌రాబాద్‌ న‌గ‌రవాసుల‌కు మంచి వీకెండ్ స్పాట్‌.

గోల్కొండ కోట‌ను మైమ‌రిపించే రాజ‌కొండ కోటలో అడుగుపెట్టేందుకు ఎక్కువ స‌మ‌యం జ‌ర్నీ చేయాల్సిన ప‌నిలేదు. సిటీ ట్రాఫిక్‌ను చేధించుకుంటూ కేవ‌లం గంట‌న్న‌ర ప్ర‌యాణం చేస్తే స‌రిపోతుంది.

రాచ‌కొండ గ్రామాన్ని చేరుకునేందుకు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం నుంచి రోడ్డు మార్గంలో ఇబ్ర‌హీంప‌ట్నం, మంచాల్ మీదుగా 55 నుంచి 60 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. చాలామంది ఔత్సాహిక ప‌ర్యాట‌కులు ఇక్క‌డికి ట్రెక్కింగ్ కోసం వ‌స్తూ ఉంటారు.

ఈ చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు శీతాకాలం వ‌చ్చిందంటే ప‌చ్చ‌ద‌నం క‌మ్మేసిన ప్ర‌కృతి శిల్పంలా ద‌ర్శ‌న‌మిస్తాయి. రాచ‌కొండ గ్రామం నుంచి కొద్దిదూరం ముందుకు వెళితే అస‌లైన ప‌ర్యాట‌క ఆహ్లాదం చేరువ అవుతుంది. క‌నుచూపుమేర‌లో రాతిగుట్ట‌లు.. గుహలు.. గోపురాలు, అబ్బురపరిచే శిల్పాలతో పాటు కోనసీమ అందాలను మైమరిపించే విధంగా రాచకొండ గుట్టలు దర్శనమిస్తాయి.

Rachakonda Fort

కోట‌లో ట్రెక్కింగ్ ఏంట‌ని కొట్టిపారేయ‌కండి..

రాతి కట్టడాలు, కోట గోడలు, గోల్కొండను మైమరిపించే విధంగా ఉన్న రాచకొండ కోట అందాలు సిటీకి అంత ద‌గ్గ‌ర‌గా ఉన్నాయంటే చాలామందికి ఆశ్చ‌ర్యంగానే ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా ట్రెక్క‌ర్ల‌కు ప్ర‌త్యేక విహార కేంద్రంగా గుర్తింపు పొందింది రాచ‌కొండ కోట‌. కోట‌లో ట్రెక్కింగ్ ఏముంటుంది అని కొట్టిపారేయ‌కండి. సుమారు ఆరు వేల ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించిన రాచకొండ కోట గుట్ట‌ల‌పై నుంచి ఎటు చూసినా ప‌చ్చ‌ని ప్ర‌కృతి గీసిన అద్భుత దృశ్యాలు క‌నువిందు చేస్తాయి.

గడి కోటలు శత్రుదుర్బేధ్యానికి తావు లేకుండా నిర్మించారు. శత్రువుల క‌న్ను ప‌డ‌కుండా, అంటే.. బ‌య‌ట‌నుంచి కనీసం చూసేందుకు కూడా అవ‌కాశం లేకుండా ఆరువంద‌ల అడుగులు ఎత్తులో దీని నిర్మాణం ఉంటుంది. కొండ చుట్టూ బలిష్టమైన ప్రాకారం, మధ్య మధ్యన ఎత్తయిన బురుజులు వాటిపై పేల్చడానికి సిద్ధంగా ఉన్న ఫిరంగుల అమరికలు కనిపిస్తాయి. వాటి చుట్టూ ఆరు సింహద్వారాలు దాటితే కొండపైకి చేరవచ్చు. రాచకొండ కోట ప్రవేశ ద్వారం ఏకశిలా స్తంభాలకు అత్యుత్తమ ఉదాహరణ. ఈ కోట యొక్క ప్రత్యేకత దాని నిర్మాణంలో ఉంది. ఇది సైక్లోపియన్ రాతిలో ఎలాంటి మోర్టార్‌ను ఉపయోగించకుండా నిర్మించబడింది.

rachakondafort3

మాన‌సిక ప్ర‌శాంత‌తకు కేరాఫ్ అడ్ర‌స్‌..

కాలిన‌డ‌క‌ను కొండపైకి చేరుకుంటే మండపాలు, రాజప్రాసాదాలు, తటాకాలు, జలాశయాలు కనువిందు చేస్తాయి. రెండు పెద్ద బండరాళ్ల చీలిక మధ్య సంకెళ్లబావి ఉంది. అందులో అన్ని కాలాల్లో నీళ్లు ఉండటం విశేషం. కాకతీయ రాజ్య పతనానంతరం రేచర్ల పద్మనాయకుల పాలన రాచకొండ కేంద్రంగా సుమారు 110 సంవత్సరాలు కొనసాగింది.

నేటికి ఆనాటి రాచరిక అవశేషాలు, విధ్వంసపు చిహ్నాలు రాచకొండను దర్శించే పర్యాటకులను సాక్షాత్కరిస్తాయి. రాచకొండలోని శివాలయం, ప్రాచీన దర్గాలాంటి రాచరికపు కట్టడాలను మ‌న‌సారా ఆస్వాదించేందుకు న‌గ‌రవాసులు కుటుంబ‌స‌మేతంగా ఇక్క‌డికి వ‌స్తూ ఉంటారు. చారిత్ర‌క ఆస‌క్తి ఉన్న‌వారితోపాటు ప‌ని ఒత్తిడితో స‌త‌మ‌త‌మ‌య్యేవారు మాన‌సిక ప్ర‌శాంత‌త కోసం రాచ‌కొండ విహారానికి మొగ్గు చూపుతారు. మ‌రెందుకు ఆల‌స్యం ఈ వీకెండ్‌లో రాచ‌కొండ కోట‌ను అస్స‌లు మిస్స‌వ్వొద్దు.

Read more about: hyderabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X