» »పెళ్లిళ్లు నిర్ణయించే ప్రసిద్ధ ఇడగుంజి వినాయకస్వామి గురించి మీకు తెలుసా !

పెళ్లిళ్లు నిర్ణయించే ప్రసిద్ధ ఇడగుంజి వినాయకస్వామి గురించి మీకు తెలుసా !

Posted By: Venkata Karunasri Nalluru

ఇడగుంజి లేదా ఇడన్ గుంజి అనేది హిందువులకు ఎంతో ప్రధానమైన ప్రార్ధనా స్ధలం. ఈ ప్రాంతంలో వినాయకుడు ప్రధాన ఆకర్షణ. ఈ దేవాలయంలో రెండు చేతుల గణపతి ఒక చేతిలో పద్మం మరో చేతిలో లడ్డూతో కనపడతాడు. ఇక్కడ అన్నదానం జరుగుతుంది. భక్తులు తాము కోరుకున్నది జరుగుతుందని భావిస్తూంటారు. ఏటా సుమారు పది లక్షల మంది భక్తులు ఈ దేవాలయ సందర్శన చేస్తారని తెలుస్తోంది. భక్తుల నమ్మకం మేరకు భగవంతుడు గణేష్ ఆ ప్రాంతాన్ని కుంజారణ్యగా పిలువబడినపుడు అక్కడ ఉండేవాడని చెపుతారు. ప్రాచీన కాలంలో ఋషులు ఈ ప్రదేశంలో తపస్సు చేసుకొనేవారు.

ఇడగుంజి గణపతి ఆలయం ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నావర తాలూకాలో ఉంది. ఇక్కడ వినాయకుడుపెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడుగా ప్రసిద్ధి. వినాయకుడు బ్రహ్మచారి. కానీ ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్నాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించరు.

మనదేశంలో వెలసిన గణపతి ఆలయాలలో ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని ఆలయం ప్రముఖమైనది. ఈ గ్రామం ప్రముఖ శైవక్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఉంది. శరావతి నది ఇడగుంజికి అతి సమీపంలో ఉన్న హోన్నవర్‌ వద్దనే అరేబియా సముద్రంలో కలుస్తుంది.

స్థల పురాణం

పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు !

Photo Courtesy:Deepak Patil

కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా శరావతినదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతంలో వాలఖిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు రాక్షస సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకున్నారు. కానీ యజ్ఞయాగాలు మొదలుపెట్టిన ప్రతిసారి ఆటంకాలు రావడం మొదలుపెట్టాయి. ఏం చేయాలో తెలియక ఋషులు నారదుని శరణు వేడారు. అంతట నారదుడు గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలూ లేకుండానే యజ్ఞం పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తోడ్కొని వచ్చాడు.

ఇడగుంజి ఆలయంలోని వినాయకుడు

పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు !

Photo Courtesy:Deepak Patil

ఇక్కడ వినాయకుడు ఒక చేత మోదకాన్నీ, మరో చేత కలువమొగ్గనీ ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం.

ఇడగుంజిలోని ఆచారం

పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు !

Photo Courtesy:Deepak Patil

కర్నాటకలోని బంధి అనే జాతివారు ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లికూతురు, పెళ్లికొడుకుకి చెందిన కుటుంబాలవారు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని రెండు పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని శుభసూచకంగా భావించి భావించి వినాయకుని అనుగ్రహంగా పెళ్లి ఏర్పాట్లను చూసుకుంటారు. అలా కాకుండా ఎడమ కాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఈ విధమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా పదిలక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు. ఇడగుంజి భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఆరు వినాయకుడు ఆలయాలో ఒకటి. అవి కాసర్గోడ్, మంగుళూరు, అనెగుడ్డే, కుండపుర, ఇడగుంజి మరియు గోకర్ణ.

విష్ణుమూర్తి ఆలయం

పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు !

Photo Courtesy: Brunda Nagaraj

దీనికి దగ్గరగా 1000 సంవత్సరాల కాలం నాటి చరిత్ర కలిగిన విష్ణుమూర్తి ఆలయం కూడా చూడవచ్చును. శ్రీ విష్ణుమూర్తి ఆలయం కర్నాటకలోని ఆలయాల్లో ఒకటి. ఇక్కడ చాలా ప్రశాంతంగా వుంటుంది. ఇడగుంజి సమీపంలోని బల్కుర్ విష్ణుమూర్తి ఆలయానికి అడవి దారుల్లో నడుస్తూ వెళ్ళవచ్చును. ఈ ఆలయం ఇడగుంజి వినాయక ఆలయం నుండి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంది.

పెళ్లిళ్లు నిర్ణయించే ఇడగుంజి వినాయకుడు !

Photo Courtesy: Brunda Nagaraj

విష్ణుమూర్తి ఆలయం ప్రాంగణంలో ప్రకృతిదృశ్యాలు చాలా వర్ణనాత్మకంగా వుంటాయి. ఇక్కడ ఎటువంటి కాలుష్యం లేని వాతావరణంలో మీ సమయాన్ని గదపవచ్చును. వినాయకుని ఆలయాన్ని సందర్శించినప్పుడు అలాగే విష్ణుమూర్తి ఆలయాన్ని కూడా సందర్శించి దీవెనలు తీసుకోవచ్చును.