• Follow NativePlanet
Share
» »ఇది భీముడు ఘుమఘుమలాడే వంటలు చేసిన గుహ !

ఇది భీముడు ఘుమఘుమలాడే వంటలు చేసిన గుహ !

పాండవుల మెట్ట చేరుకోవాలంటే ముందుగా పెద్దాపురం చేరుకోవాలి. ఈ ప్రదేశం చుట్టూప్రక్కల ఉన్న మరొక ప్రధాన ఆకర్షణ ఆంజనేయ స్వామి విగ్రహం. ఈ విగ్రహం ఆసియా ఖండంలోనే అతి పెద్దది. ఇక్కడ పాండవులు రాళ్ళను తొలిచి గుహలుగా ఏర్పరుచుకొని నివాసయోగ్యంగా మలుచుకున్నారు. ఇక్కడ ఉన్న గుహలలో ఒకటేమో భీముడు వంట చేసే వంటశాలగా, మరొకటేమో నివాసానికి అనుకూలంగా చేసుకున్నారు. ఇక్కడున్న గుహలను చూస్తుంటే పాండవులు ఎలా వీటిని తొలిచి అందంగా తీర్చిదిద్దారో తెలుస్తుంది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని పాండవుల మెట్ట అనే ప్రదేశం ఉంది. ఈ ప్రదేశం రాజమండ్రి నగరానికి అటు ఇటు సుమారుగా 40 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ పాండవులు అరణ్య వాసం చేసేటప్పుడు కొన్ని రోజుల పాటు నివసించారు. ఇది ఒక ఎత్తైన కొండ మీద ఉంది. చుట్టూ ప్రకృతి ఆస్వాదించదగినదిగా, చాలా ఆహ్లాదంగా ఉంటుంది.

భీముని పాద ముద్రికలు

భీముని పాద ముద్రికలు

పాండవ వనవాస సమయంలో భీముడు తొలిసారిగా ఈ ప్రదేశాన్ని సందర్శించి కొండ అగ్రభాగాన్ని చేరి ప్రకృతి పరికించిన సమయంలో ఆ ప్రదేశం భీముని పాదాల ఒత్తిడికి కొంత కృంగిందని చెబుతారు. సుమారు 15 అంగుళాల పొడవున్న భీముడి ఒక్కొక్క పాదాన్ని చూస్తే ఆయనెంత ధృఢకాయడో తెలుస్తోంది. తన గద తాలూకు గుర్తు కూడా ఇక్కడ ఉండటం విశేషం.

Photo Courtesy: Kumar3031

భీముని పాద ముద్రికలు

భీముని పాద ముద్రికలు

మెట్ట ప్రాంతమంతా రాతితో వుండడంవలన పాద ముద్రికలు రాతిపై చాలా స్పష్టంగా ముద్రితమై సందర్శకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పాండవుల మెట్ట దర్శించే వారిలో ఎక్కువ భాగం భీముని పాదాలను చూడాలనుకునేవారే ఉండడం విశేషం!

Photo Courtesy: Adityamadhav83

ద్రౌపది రజస్వల చాప

ద్రౌపది రజస్వల చాప

చతురస్రాకారంలో చాప మాదిరి రాతి నిర్మాణం మనకు ఇక్కడ కనిపిస్తుంది. వనవాస సమయంలో ద్రౌపది రజస్వల అయినప్పుడు ఈ ప్రాంతంలోనే కూర్చున్నదని చెబుతారు. సాధారణ వయసులో సంభవించే రజస్వల సంభవించని ఆడపిల్లలను పాండవుల మెట్ట ఈ ద్రౌపది రజస్వల చాప వద్దకు తీసుకువచ్చి దాని పై కూర్చుండబెడితే వారు రజస్వల అవుతారన్న నమ్మకం ఇప్పటికీ కొనసాగుతోంది.


Photo Courtesy: Adityamadhav83

నివాసము

నివాసము

పాండవుల మెట్టపైనున్న ఈ గుహకు సంబంధించి అనేక కథనాలు ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉన్నాయి. వనవాస సమయంలో పాండవులు ఈ గుహలో జీవించుటయే కాక గుహ మధ్యభాగాన గల జల ప్రాంతంలో స్నానాలు ఆచరించేవారని చెబుతారు. ఈ జల ప్రాంతం దాటి పదుల కిలోమీటర్లు ప్రయాణిస్తే రాజమండ్రి చేరకునేవారని అంటారు.

Photo Courtesy: Adityamadhav83

నలభీమపాకాల వంటశాల

నలభీమపాకాల వంటశాల

గుహకు అతి దగ్గరగా గుహ మాదిరిగా రాతిని వొలిచిన ప్రాంతం కనిపిస్తుంది. ఇక్కడ పాండవులు భోజనాల తయారీకి వాడుకున్నారని చెబుతారు. ఈ ప్రాంతంలో కనిపించే డొప్ప వంటి భాగాన్ని ‘గంజి వార్చే భాగము' గా వర్ణిస్తారు. నల భీములు అత్యంత రుచికరమైన వంటలు వండి వార్చేవారని చారిత్రక కథనం.

Photo Courtesy: Adityamadhav83

సూర్యనారాయణమూర్తి ఆలయం

సూర్యనారాయణమూర్తి ఆలయం

ఈ మెట్టపైన ముఖ్యమైనది శ్రీ సూర్యనారాయణమూర్తి దేవాలయం. ఈ ఆలయం పక్కనే పంచముఖి గాయత్రి ఆలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, వినాయకుడు, వెంకటేశ్వరస్వామి, చంద్ర, నవగ్రహాల ఆలయాలు నిర్మించారు. ఉత్సవాల దినాల్లో ఈ మెట్ట జనంతో కళకళలాడుతూ వుంటుంది.

Photo Courtesy: Vinay Datta

వరదపాసం

వరదపాసం

సకాలంలో వర్షాలు కురవకపోతే పట్టణంలోని అన్ని వీధులకు చెందిన రైతులు పాండవుల మెట్ట పై వరదపాసం నిర్వహిస్తారు. పట్టణంలోని రైతులు, వ్యవసాయ కూలీలు, అధికంగా నివసించే ప్రాంతాలవారు కోడెగిత్తలను, ఆంబోతులను అలకరించి భజనలు చేస్తూ, పాటలు పాడుకుటూ పాండవుల మెట్టపైకి ఊరేగింపుగా వెళ్లి మెట్టపై పాలు పొంగించి పరమాన్నం వండి వరుణ దేవుడికి నైవేద్యం పెడతారు.

Photo Courtesy: Adityamadhav83

జీవ వైవిధ్యం

జీవ వైవిధ్యం

ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా భాసిల్లిన పాండవుల మెట్ట ప్రాంతంలో రకరకాల కీటకాలు, పక్షులు, జంతువులు కనిపించేవి. ప్రస్తుతం నేడు పాము, ముంగిస వంటివి అడపా దడపా కనిపిస్తూనే వుంటాయి.

Photo Courtesy: Adityamadhav83

మరిడమ్మ ఆలయం

మరిడమ్మ ఆలయం

పర్యాటకులు ఇక్కడికి రావడానికి ఒక చిన్న ట్రిప్ వేసుకొని రావచ్చు. ఇక్కడికి రావడానికి పెద్ద ఖర్చు వేసుకోవలసిన అవసరం లేదు. పెద్దాపురం నుంచి 100 - 150 రూపాయల ఖర్చుతో మెట్టతో పాటుగా దగ్గరలోని పురాతన ఆలయాలను సందర్శించవచ్చు వాటిలో మరిడమ్మవారి ఆలయం, శ్రీ శివాలయం/ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ( పెద్దాపురం నుంచి 1 కి. మీ. దూరంలో), శ్రీ నూకాళమ్మ వారి ఆలయం( కంద్రకోట గ్రామం, పెద్దాపురం మండలం 8 కి. మీ ) , శ్రీ శృంగార వల్లభ స్వామి వారి ఆలయం (తిరుపతి గ్రామం, పెద్దాపురం మండలం. 11 కి. మీ. పెద్దాపురం, 3 కి. మీ. కంద్రకోట) ఉన్నాయి.

Photo Courtesy: peddapuram temples

ఆంజనేయస్వామి విగ్రహం

ఆంజనేయస్వామి విగ్రహం

ఆంజనేయ స్వామి వారి ఆలయం సామర్లకోట - పెద్దాపురం మధ్యలో సుమారు 4 కి. మీ. దూరంలో ఉన్నది. ఇక్కడ ఆసియా ఖండంలోనే పెద్దదైన ఆంజనేయస్వామి విగ్రహం ఉన్నది. 52 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం కంచి శృంగేరి పీఠం చేత పరిరక్షించబడుతున్నది.

Photo Courtesy: peddapuram temples

పాండవుల మెట్ట చేరుకోవడం ఎలా

పాండవుల మెట్ట చేరుకోవడం ఎలా

విమాన మార్గం

పెద్దాపురంలో విమానాశ్రయం లేదు. కనుక సమీపంలోని రాజమండ్రి దేశీయ ఏర్ పోర్ట్ లో దిగాలి అక్కడి నుంచి 37 కి. మీ. దూరంలో ఉన్న పెద్దాపురానికి సులభంగా చేరుకోవచ్చు. వైజాగ్ విమానాశ్రయం కూడా పెద్దాపురానికి సమీపంలో ఉన్న మరొక ఏర్ పోర్ట్. ఈ ఏర్ పోర్ట్ 127 కి. మీ దూరంలో ఉన్నది.

రైలు మార్గం

పెద్దాపురం కంటే సమీపంలోని సామర్లకోట జంక్షన్ అన్నివిధాలా అనువైనది. ఇక్కడ ప్రతీరోజు దేశం నలుమూలల నుంచి రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. సామర్లకోట రైల్వే స్టేషన్ నుంచి పెద్దాపురానికి 5 కి. మీ. దూరం ఉంది. మీకి ఇది కుదరకపోతే, గుడపర్తి రైల్వే స్టేషన్ సమీపంలో గల మరొక రైల్వే స్టేషన్. ఇది పెద్దాపురానికి 6 కి. మీ. దూరంలో ఉన్నది.

రోడ్డు మార్గం

పాండవుల మెట్ట కు చేరుకోవడానికి రోడ్డు మార్గం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పెద్దాపురంకి ఆ. ప్ర.రో.ర.స వారి బస్సులు ప్రతీ రోజు రాజమండ్రి, కాకినాడ నుంచి బస్సులు తిరుగుతుంటాయి. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ మొదలగు నగరాల నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సేవల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు.

Photo Courtesy: Kumar3031

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి