• Follow NativePlanet
Share
» »గిన్నిస్ బుక్ లో అనంతపురం ! ఎందుకు ?

గిన్నిస్ బుక్ లో అనంతపురం ! ఎందుకు ?

అనంతపూర్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా. రాయలసీమలో అంతర్భాగం గా ఉన్న ఈ జిల్లా ఆసక్తి రేకెత్తించే చారిత్రక ప్రదేశాల నిలయం. అనంతపురం జిల్లాలోని ప్రతి ఊరు ప్రతి రాయి దేనిని కదల్చినా రాయలవారి కాలంలోని రతనాల కథలెన్నో చెప్తాయి ఎందుకంటే, ఇది ఒకప్పుడు విజయనగర రాజుల సంస్థానంలో ఒక వెలుగు వెలిగిన ప్రాంతం కాబట్టి!!. ఇప్పటికీ ఆ వైభొగం కళ్ళకు కనిపిస్తుంది. కోటలు ఈ ప్రాంతానికి ఉన్న ఆకర్షణ అయితే 550 సంవత్సరాల తిమ్మమ్మ మర్రిమాను మరో ప్రధాన ఆకర్షణ. పరిమాణ రీత్యా ప్రపంచ గిన్నిస్‌ బుక్‌ రికార్డులో చేరింది. అనంతపూర్ కంటూ ఒక ప్రత్యేకత ఉంది లేకుంటే ఊరికనే గిన్నిస్ బుక్ లో చోటురాదు కదా?? అందుకనే ఇక్కడున్న ప్రాంతాలను ఒక రౌండ్ వేసొద్దాం పదండి!!

అనంతపూర్ .... ఈ పేరు చెప్పగానే మొదట నోట్లోనుంచి వచ్చేది ఫ్యాక్సనిజం. రామ్‌గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర పార్ట్ 1, పార్ట్ 2 రెండూ గుర్తుకోస్తాయి. ఫ్యాక్సనిజంతో పాటుగానే ఈ జిల్లా రాజకీయంగా దేశ స్థాయిలో పేరు సంపాదించింది. అంతెందుకండి నీలం సంజీవ రెడ్డి ఈయన సర్పంచ్ నుండి రాష్ట్రపతి గా ఎదగలేదా??

ధర్మవరం

ధర్మవరం

ధర్మవరం అనంతపూర్ కి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఎన్నో ప్రాచీన కట్టడాలున్నాయి. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర దేవాలయ శిల్ప కళానైపుణ్యం అందరిని అబ్బురపరుస్తుంది. ఇందులోని స్థంభాలను మీటినప్పుడు ఏడు రకాల సంగీత స్వరాలు వినిపిస్తాయి. నిరంతరం ఎడతెగకుండా పారే జలపాతాలు కనువిందు చేస్తాయి. ధర్మవరం నూలు పరిశ్రమ, పట్టు చీరలు ప్రపంచ ఖ్యాతి గడించాయి. తోలుబొమ్మల తయారీలో నైపుణ్యానికి పేరున్న ప్రదేశం ఇది.

Photo Courtesy: Vasanthkundula

పెనుకొండ

పెనుకొండ

బెంగళూరు జాతీయ రహదారిపై అనంతపూర్ కి 70 కిలోమీటర్ల దూరంలో పెనుకొండ ఉంది. విజయనగరం సామ్రాజ్యానికి ఒకప్పుడు రాజధానిగా ఉన్న పెనుకొండ కోట, ఆ రోజుల్లో దానిమీద దాడిచేయడానికి అభేద్యమైనదిగా ఉండేది. ఈ కోటలో చూడదగ్గ రెండు సుందర ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి గగన్‌ మహల్‌. ఇది రాజుల వేసవి విడిది. మరోటి బాబయ్యదర్గ. ఇది మత సామరస్యానికి ప్రతీకగా ఉంది.

Photo Courtesy: Chittichanu

పెనుకొండ

పెనుకొండ

పెనుకొండకు సమీపాన ఉన్న కుంభకర్ణ గార్డెన్‌ను చూసి తీరాల్చిందే. దీన్ని 5 ఎకరాల్లో తీర్చిదిద్దారు. ఇందులో నిద్రావస్తలో ఉన్న కుంభకర్ణుని అతి పెద్ద విగ్రహం ఉంది. దీని పొడవు 142 అడుగులు, ఎత్తు 32 అడుగులు. సొరంగంలా ఉండే ఆయన పొట్టలోకి నడిచి వెళ్లొచ్చు కూడా. పలువురు రాక్షసులు నిద్రపోతున్న కుంభకర్ణుణ్ణి లేపడానికి ప్రయత్నించే దృశ్యం ఆకర్షిస్తుంది. ఇది అనంతపురానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Photo Courtesy: kumar_08

హేమవతి

హేమవతి

హేమవతి దేవాలయ పట్టణం. అనంతపూర్ కి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందుపూర్ దీనికి సమీప రైల్‌హెడ్‌. హేమవతి పల్లవుల రాజ్యపాలన కాలంలో దొడ్డేశ్వర స్వామి ఆలయం ప్రఖ్యాతి గాంచింది. విగ్రహానికి ఉపయోగించిన రాతిని తట్టితే లోహం నుండి వచ్చే శబ్ధం వస్తుంది. నంది, నల్లటి బాసల్ట్‌ గ్రానైట్‌తో చేయబడింది. 8 అడుగుల పొడవు, 4 అడుగుల ఎత్తులో ఉండి ప్రవేశ ద్వారం వద్ద కూర్చుని ఉంటుంది. గర్భాలయం లోపల 6 అడుగుల ఎత్తుగల శివలింగం ఉంది. ఈ దేవాలయంలోనే సిద్ధేశ్వర స్వామి దేవాలయం, మల్లికార్జున స్వామిదేవాలయం ఉన్నాయి. లోపల మ్యూజియం కూడా ఉంది. ఇందులో అరుదైన చారిత్రక ప్రాధాన్యత గల ప్రతిమలున్నాయి.

Photo Courtesy: andhrapradesh tourism

రాయదుర్గం

రాయదుర్గం

రాయదుర్గ కోట అనంతపూర్ కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటను విజయనగర రాజులు నిర్మించారని గోడల మీది శిలా శాసనాల వల్ల తెలుస్తోంది. ఈ దేవాలయం జైన్‌ గురువులు, వారి శిష్యులు చిత్రించిన అతి చక్కటి శిల్పకళతో సమ్మోహనపరుస్తుంది.

Photo Courtesy: Andhrapradesh Tourism

గుత్తి

గుత్తి

కర్నూలు - బెంగళూరు జాతీయ రహదారిలో అనంతపూర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తికోటకి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఈ కోట 300 మీటర్ల ఎత్తులో కొండమీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లో అతి ప్రాచీన కొండకోటల్లో ఒకటి. విజయనగర రాజుల యుగంలో నిర్మించిన ఈ కోటను గుల్ల ఆకారంలో కట్టారు. ఇందులో 15 ప్రధాన ద్వారాలు ఉంటాయి. అంత ఎత్తులో నీటి వనరులు లభించడం విశేషం.

Photo Courtesy: Imrx100

ఆలూరు

ఆలూరు

అనంతపుర్ కి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలూరు ఎన్నో ఎత్తైన కొండలతో ఉంటుంది. ఇక్కడి జలపాతాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సుందర దృశ్యాలతో ఉన్న ఈ గ్రామం పిక్నిక్‌కు అనువైనది. రంగనాథ దేవాలయం చుట్టుపక్కల ఉన్న సుందర పరిసర ప్రాంతాలు తన్మయత్వానికి గురిచేస్తాయి. ఏటా మార్చి- ఏప్రిల్‌ నెలల్లో పౌర్ణమి రోజున రథోత్సవం గొప్పగా జరుగుతుంది.

Photo Courtesy: Andhrapradesh Tourism

తాడిపత్రి

తాడిపత్రి

అనంతపూర్ కి 57 కిలోమీటర్ల దూరంలో ఉంది. చింతాల వెంకట రమణ దేవాలయం నగరం నడిబొడ్డున సమున్నతమైన గోపురంతో ఉంది. పట్టణానికి ఒక కిలోమీటరు దూరంలో పెన్నానది చూటముచ్చటగా ఉంటుంది. అక్కడే రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. చిన్నమార్గం ద్వారా వచ్చే నీటితో స్థిరంగా నింపిన పీఠం మీద చెక్కించిన లింగం గురించి స్థానికులు విశేషంగా చెప్పుకుంటారు.

Photo Courtesy: Jayanthnaidu

ఇస్కాన్‌ టెంపుల్‌

ఇస్కాన్‌ టెంపుల్‌

పెనుకొండ కొండపై ఇస్కాన్‌ టెంపుల్‌ సంస్థ ఆధ్వర్యంలో రూ.100కోట్ల వ్యయంతో బంగారు ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఈ ఆలయం సుమారుగా 150 ఎకరాల పైనే కడుతున్నారు. బెంగళూరుకు చెందిన అరోరా ఇంటిగ్రేటెడ్‌ సిస్టమ్‌ కంపెనీ వారు దీని నిర్మాణానికి నడుంబిగించారు. ఇది గనక పూర్తయితే ఆ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంవైపు పరుగులు పెడుతుంది. అంతే కాకా ఆ ప్రాంతమూ అభివృద్ది చెందుతుంది.

Photo Courtesy: Maheshrig

లేపాక్షి

లేపాక్షి

వీరభద్ర టెంపుల్అనంతపురం నుండి 15 కిలో మీటర్ల దూరం లో ఉన్న లేపాక్షి గ్రామంలో ఉంది. దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రసిద్ది చెందిన ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుండి అనేకమైన భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో కొలువై ఉన్న దేవుడు వీరభద్ర స్వామి. విజయనగర సామ్రాజ్యాధిపతుల చేత ఈ ఆలయం 16 వ శతాబ్దం లో నిర్మింపబడింది. విజయనగర సామ్రాజ్యాధిపతుల నిర్మాణ శైలి లో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అతి పెద్ద రాతి నంది విగ్రహం ఇక్కడ ఉంది. ఇంత అద్భుతంగా ఆలయం ప్రతి సంవత్సరం భక్తులని విశేషంగా ఆకర్షించడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.

Photo Courtesy:Sriharsha95

పుట్టపర్తి

పుట్టపర్తి

సత్య సాయి బాబా యొక్క పవిత్ర నివాసంను ప్రశాంతి నిలయం అని అంటారు. ప్రశాంతి నిలయంలో పేరుకు తగ్గట్టు శాంతి, మనస్సు మరియు ఆత్మ యొక్క శాంతి ఉంటాయి. ప్రతి సంవత్సరం ఆశ్రమానికి భక్తులు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఆశ్రమం 1950 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఆశ్రమంలో ఉన్న విద్యా సంస్థలు, స్టేడియాలు మొదలైనవి సందర్శకులను ఖచ్చితంగా ఆకర్షిస్తాయి.

Photo Courtesy: Mefodiy Zhukov

అనంతపూర్ కి ఎలా వెళ్ళాలి??

అనంతపూర్ కి ఎలా వెళ్ళాలి??

వాయు మార్గం

అనంతపూర్ కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం పుట్టపర్తిలో కలదు. ఇది సుమారుగా 80 కి. మీ. దూరంలో ఉన్నది. ఇది ఒక దేశీయ విమానాశ్రయం. ఒకవేళ ఇది కుదరకపోతే బెంగళూరు దగ్గరలో మరొక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి దేశంలోనే కాక విదేశాల నుంచి కూడా విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

రైలు మార్గం

అనంతపూర్ లో రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, ఢిల్లీ, ముంబై, కలకత్తా మొదలగు నగరాలకు ప్రయాణించవచ్చు.

రోడ్డు మార్గం

ఇక రోడ్డు మార్గం విషయానికొస్తే, అనంతపూర్ గుండా జాతీయ రహదారి వెళుతుంది. అంతే కాక బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి బస్సులు వస్తుంటాయి. అంతేకాదు ప్రైవేట్ వాహనాలు కూడా దర్శనమిస్తుంటాయి.

Photo Courtesy: Chittichanu

సైంటిస్టులకు కూడా కనిపించిన దేవుడు - 12 దేవాలయాల మిస్టరీ !

భూమిని తవ్వుతుంటే వందల్లో బయటకొస్తున్న అస్థిపంజరాలు..ఎవరివో తెలుసుకున్న సైంటిస్ట్ కు

గుహలో దాగి వున్న కైలాసం - శివుని మహాద్బుతలింగం

చరిత్రలో ఊహించని సంఘటనలు : కౌరవుల పక్షాన యుద్ధం చేసిన పురాతన ఆంధ్ర ప్రజలు !

మన దేశంలోని మిస్టీరియస్ జలాశయం !

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి