Search
  • Follow NativePlanet
Share
» »మంచు తెర‌ల‌ను చీల్చుకుంటూ.. అనంత‌గిరి కొండ‌ల‌కు పోదాం!

మంచు తెర‌ల‌ను చీల్చుకుంటూ.. అనంత‌గిరి కొండ‌ల‌కు పోదాం!

మంచు తెర‌ల‌ను చీల్చుకుంటూ.. అనంత‌గిరి కొండ‌ల‌కు పోదాం!

శీతాకాల‌పు వేళ‌.. మంచు తెర‌ల‌ను చీల్చుకుంటూ సాగే ప్ర‌యాణం జీవితంలో మ‌ర్చిపోలేని అనుభూతుల‌ను చేరువ‌చేస్తుంది. అలాంటి అనుభ‌వాల‌ను సొంతం చేసుకునేందుకు అనంత‌గిరి గుట్ట‌కు ట్రావెల్ చేయాల్సిందే. వికారాబాద్‌ జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో అనంతగిరి అటవీ ప్రాంతం ఒకటి. హైదరాబాద్‌కు తాగునీటిని అందించే ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్‌లకు ఇక్క‌డి కొండలే ప్రధాన నీటి వనరు. హైదరాబాద్ గుండా ప్రవహించే మూసీ నది జన్మస్థలం అనంతగిరి కొండ.

చిన్న జలాశయం, దట్టమైన వృక్షసంపదను జోడించి, అందమైన ప్రవాహాలతో కప్పబడిన అనంత‌గిరి హైదరాబాదీలకు వారాంతపు విడిదిగా పేరుగాంచింది. శీతకాలం వ‌చ్చిందంటే చాలు ఉదయాన్నే ఇక్క‌డ మంచుతెరలు పలకరిస్తాయి. విష్ణుమూర్తికి అంకితం చేయబడిన అనంత పద్మనాభ స్వామి ఆలయం అనంతగిరి కొండలలోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఈ దేవాలయం పేరు మీదుగా ఈ కొండలకు అనంతగిరి కొండలు అని పేరు వచ్చింది. ఇది 400 సంవత్సరాల క్రితం నిజాం నవాబులచే నిర్మించబడింది.

ఈ ఆల‌యానికి పెద్ద చారిత్రక ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం, మార్కండేయ మహర్షి విష్ణువు దర్శనం కోసం తపస్సు చేసాడట‌. అప్పుడు విష్ణువు ఆయనకు ఒక గుహలో అనంత పద్మనాభ స్వామిగా దర్శనమిచ్చారని చెబుతారు. ప్రధాన ఆలయం గుహ చుట్టూ నిర్మించబడింది. ఆలయ ఆవ‌ర‌ణ‌లో పుష్కరిణితోపాటు శిధిలమైన నిర్మాణాలు, ఒక చిన్న శివాలయం, కొండ ప్రాంతానికి దారితీసే కొన్ని మెట్లు సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ర్షిస్తాయి. ఆలయానికి సమీపంలో హనుమంతుని విగ్రహం ఉంది.

Ananthagiri Hills

క్యాంపింగ్ పాయింట్‌లు

కొండపై ఉన్న విశాలమైన ఉద్యానవనం, తెలంగాణ పర్యాటక శాఖ రిసార్ట్స్‌, ఈత కొలను ఇవన్నీ ఆటవిడుపు కేంద్రాలే! అనంతగిరి ట్రెక్కింగ్‌కు కూడా ప్రసిద్ధి చెందింది. ఇక్క‌డ‌ అనేక ట్రెక్కింగ్, క్యాంపింగ్ పాయింట్‌లు ప‌ర్యాట‌కుల‌కు ఆహ్లాదాన్ని పంచుతాయి. ప్ర‌ధానంగా ఇక్క‌డి అడ‌విలో రెండు ట్రెక్కింగ్ మార్గాలు ఉన్నాయి. ఒకటి అనంత పద్మనాభ స్వామి దేవాలయం నుండి మొదలవుతుంది.

మరొకటి ఆలయం నుండి 0.5 కిలోమీట‌ర్ల‌ దూరంలో కెరెల్లి వైపు ప్రారంభమవుతుంది. దేవాలయం నుండి చేరుకోవడానికి కొండపైన ఒక వ్యూపాయింట్ ఉంటుంది. ఈ ప్ర‌యాణంలో లేత చలిగాలులు పరవశింపజేస్తాయి. దీనికి తోడు పచ్చని చెట్లు, నెమళ్ల నాట్యాలు, పక్షుల కిలకిలలు.. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు అనంతమైన ఆనందాన్ని పంచుతాయి.

Ananthagiri Hills

మౌంటైన్‌ బైక్స్‌ మరో ఆకర్షణ

ఇక్కడికి 17 కిలోమీటర్ల దూరంలో కోట్‌పల్లి జలాశయంలో బోటింగ్ చేసేందుకు అవకాశం ఉంది. కోట్‌పల్లి రిజర్వాయర్ అని కూడా పిలువబడే ఈ నాగసముద్రం సరస్సు సుందరమైన ప్రదేశం. అనంతగిరిని సందర్శించే పర్యాటకు ఇక్క‌డ‌కు త‌ప్ప‌క చేరుకుంటారు. ధరూర్ జంక్షన్ (వికారాబాద్ మరియు తాండూరు మధ్య) మీదుగా సరస్సు చేరుకోవచ్చు. జలాశయానికి ఆనుకుని ఉన్న ధారూర్‌ మండలం రుద్రారం గ్రామంలో నైట్‌ క్యాంపెయిన్‌లు నిర్వహిస్తుంటారు. అనంతగిరి నుంచి తాండూరు వైపు రహదారిలో కొండ దిగుతున్నపుడు మౌంటైన్‌ బైక్స్‌ (సెలవు రోజుల్లో) మరో ఆకర్షణ.

ఉదయం 6 గంటల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన సైకిళ్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్నందున ఈ ప్ర‌దేశం కుటుంబ‌స‌మేతంగా పర్యటనకు అనువుగా ఉంటుంది. అందుకే, ఇది హైదరాబాద్ నుండి ప్రముఖ వారాంతపు విహార ప్రదేశంగా పేరు పొందింది. అనంతగిరి వికారాబాద్‌ శివారులో ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి వికారాబాద్‌కు 70 కిలోమీట‌ర్లు. బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి అనంతగిరి కొండపైకి సులభంగా చేరుకోవచ్చు.

Read more about: ananthagiri hills vikarabad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X