» »ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 20 బెస్ట్ హెరిటేజ్ ప్రదేశాలు !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 20 బెస్ట్ హెరిటేజ్ ప్రదేశాలు !

Posted By: Staff

వారసత్వ ప్రదేశాలు ... వాటిని కాపాడుకోవడం మన విధి. ప్రపంచం మొత్తం మీద ఎన్నో వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి, వాటిలో చరిత్రక ప్రదేశాలుగా, ఆలయాలుగా చెప్పబడుతున్నవి లేకపోలేదు. ఈ వారసత్వ ప్రదేశాలను యునెస్కో సంస్థ ప్రతినిధులు వచ్చి, సందర్శించి ఆ తరువాత వాటిని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటిస్తుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే.

ఇది కూడా చదవండి : ఇండియాలోని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు !

మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వారసత్వ సంపద దాగి ఉంది. కాకపోతే వీటిని యునెస్కో వారు ప్రకటించరు. రాష్ట్ర సంపదను పరిరక్షించడం కొరకు, పర్యాటక రంగాన్ని అబివృద్ధి పరచడం కొరకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటిస్తుంది. అలా మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర వారసత్వ సంపదను ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 20 బెస్ట్ హెరిటేజ్ ప్రదేశాలు విషయానికి వస్తే .. కొన్నేమో గిన్నీస్ రికార్డ్ కు ఎక్కగా, మరికొన్ని చరిత్ర ప్రసిద్ధిగాంచినవిగా ఉన్నాయి. మరి ఒక్కొకటిగా ఆ హేరిటేజ్ సంపదను సందర్శిస్తూ, అవి ఎక్కడున్నాయో తెలుసుకుంటూ ప్రయాణిద్దాం పదండి ..

లేపాక్షి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

లేపాక్షి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

లేపాక్షి ఒక ప్రముఖ చారిత్రక మరియు హెరిటేజ్ ప్రదేశం గా గుర్తించబడింది. ఈ ప్రదేశం అనంతపురం నుండి 125 కిలోమీటర్లు, బెంగళూరు జంక్షన్ నుండి 124 కిలోమీటర్లు, తిరుపతి నుండి 225 కిలోమీటర్లు, హైదరాబాద్ నుండి 478 కిలోమీటర్లు మరియు నవ్యాంధ్ర తాత్కాలిక రాజధాని విజయవాడ నుండి 569 కిలోమీటర్ల దూరంలో, హిందూపూర్ కి తూర్పు వైపున 14 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ వీరభద్ర ఆలయం.

చిత్ర కృప : Navaneeth KN

బొర్రా గుహలు, అరకు వాలీ, వైజాగ్, ఆంధ్ర ప్రదేశ్

బొర్రా గుహలు, అరకు వాలీ, వైజాగ్, ఆంధ్ర ప్రదేశ్

బొర్రా గుహలు అరకు వాలీ నుండి 36 కిలోమీటర్ల దూరంలో, వైజాగ్ నుండి 88 కిలోమీటర్ల దూరంలో మరియు హైదరాబాద్ నుండి 662 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ గుహలు సుమారుగా 10 లక్షల ఏళ్ల క్రితమే సహజంగా ఏర్పడ్డాయి. తూర్పు కనుమల్లో వెలసిన ఈ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్ లో వారసత్వ ప్రదేశం గా గుర్తించబడింది. ఈ ప్రదేశం నిజంగా చూసి తీరాల్సిన అద్భుత ప్రదేశం. ఈ గుహలలో ప్రయాణం ఒక మంచి అనుభూతిని ప్రసాదిస్తుంది. ఈ గుహాల్లో ఎన్నో తెలుగు సినిమా షూటింగ్లు జరిగాయి. అందులో మచ్చుకి కొన్ని - జగదేక వీరుడు - అతిలోక సుందరి, శివ, జంబలకిడి పంబ.

చిత్ర కృప : Abhijith Rao

బుగ్గ రామలింగేశ్వర ఆలయం, తాడిపత్రి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

బుగ్గ రామలింగేశ్వర ఆలయం, తాడిపత్రి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తాడిపత్రి పట్టణం లో బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఉన్నది. తాడిపత్రి రైల్వే స్టేషన్ కి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుగ్గ రామలింగేశ్వర ఆలయం పెన్నా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. విజయనగర కాలంలో నిర్మించబడ్డ రామలింగేశ్వర ఆలయం అద్భుతమైన శిల్ప సంపద తో తలతూగుతూ, చూపరులను మంతముగ్ధులను చేస్తూ, భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. ఈ ఆలయం కూడా హెరిటేజ్ సంపదగా గుర్తించబడింది.

చిత్ర కృప : Srivathsa Rao U

చింతల వెంకటరమణ స్వామి ఆలయం, తాడిపత్రి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

చింతల వెంకటరమణ స్వామి ఆలయం, తాడిపత్రి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

అనంతపురం నగరానికి 57 కిలోమీటర్ల దూరంలో, తాడిపత్రి రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్ల దూరంలో చింతల వెంకటరమణ స్వామి ఆలయం ఉన్నది. దీనిని క్రీ.శ. 1460 - 1525 సంవత్సరాల మధ్యలో, విజయనగర కాలంలో నిర్మించినారు. ఈ ఆలయంలోని ప్రధాన దైవం విష్ణువు. ఈ ఆలయం అద్భుతమైన శిల్ప సంపదతో చూపరులను సైతం ఆకట్టుకుంటున్నది. ఇది కూడా వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.

చిత్ర కృప : Suhas Dutta

గుత్తి కోట, గుత్తి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

గుత్తి కోట, గుత్తి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

గుత్తి కోట రాయలసీమ ప్రాంతంలో చరిత్ర ప్రసిద్ధి గాంచిన దుర్గం. రాయలవారి కాలంలో ఈ దుర్గానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. గుత్తి రైల్వే స్టేషన్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం పట్టణానికి 52 కిలోమీటర్ల దూరంలో గుత్తి దుర్గం ఉన్నది. దీనిని ఎత్తైన కొండమీద హిందూ - ఇస్లామిక్ నిర్మాణ శైలిలో నిర్మించినారు. ఈ కొండ మీది కోటలో ఎన్నో ఆలయాలు సైతం ఉన్నాయి. దీనిని కూడా వారసత్వ ప్రదేశం గా గుర్తించింది.

చిత్ర కృప : Lakshman Thodla

సిద్ధేశ్వర ఆలయం, హేమావతి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

సిద్ధేశ్వర ఆలయం, హేమావతి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

హేమావతి అనంతపురం జిల్లా కి చెందిన మండలం. మడకశిర కి 36 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నగరానికి 157 కిలోమీటర్ల దూరంలో హేమావతి ఉన్నది. ఇక్కడ సిద్ధేశ్వర ఆలయం, దొడ్డేశ్వర ఆలయం, విరూపాక్షేశ్వర ఆలయం మరియు మల్లేశ్వర ఆలయం లు ప్రధానమైనవి. క్రీ.శ.8 -10 వ శతాబ్ధం వరకు పల్లవుల రాజధానిగా ఉన్న హేమావతిలో ఆలయాల శిల్పకళ చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడి ప్రధాన దైవం శివుడు. ఇక్కడ ఉన్న చారిత్రక సంపదతో హేమావతి చోటు సంపాదించుకుంది.

చిత్ర కృప : wikicommons

లక్ష్మి నరసింహ స్వామి ఆలయ, కదిరి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

లక్ష్మి నరసింహ స్వామి ఆలయ, కదిరి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

కదిరి అనంతపురం జిల్లా లోని ఒక రెవిన్యూ డివిజన్. ఇక్కడి ప్రధాన హెరిటేజ్ సంపద శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం. ఈ ఆలయం కదిరి రైల్వే స్టేషన్ నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ క్షేత్రం నవ నరసింహ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ మరే నరసింహ క్షేత్రాలలో లేని విధంగా స్వామి వారు ప్రహ్లాదుని సమేతంగా దర్శనం ఇస్తాడు. ఆలయం బ్రహ్మోత్సవాల సమయంలో జనసంద్రాన్ని తలపిస్తుంది.

చిత్ర కృప : రహ్మానుద్దీన్

పెనుకొండ కోట, పెనుకొండ, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

పెనుకొండ కోట, పెనుకొండ, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

పెనుకొండ ఒక ప్రముఖ హేరిటేజ్ ప్రదేశం. ఇక్కడ రాయల వారి కట్టడాలు, ఆలయాలు అనేకం దర్శనం ఇస్తాయి. రాయల వారు ఈ పెనుకొండ ని రెండవ రాజధానిని చేసుకొని పరిపాలన చేస్తుండేవాడు. హిందూ - ముస్లిం అనే తేడా లేకుండా ఇక్కడ అన్ని మతాల వారు సుఖంగా జీవనం సాగిస్తుంటారు. ఇక్కడి ప్రధాన హేరిటేజ్ కట్టడం గుత్తి కోట. ఇది పెనుకొండ రైల్వే జంక్షన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నుండి 79 కిలోమీటర్ల దూరంలో ఉంది.

చిత్ర కృప : Sujith Nair

రాయదుర్గం కోట, రాయదుర్గం, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

రాయదుర్గం కోట, రాయదుర్గం, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్

రాయదుర్గం కోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గుర్తించబడిన వారసత్వ సంపద. ఈ కోట అనంతపురం నుండి 99 కిలోమీటర్ల దూరంలో, బళ్ళారి కి 53 కిలోమీటర్ల దూరంలో, గుంతకల్ కు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కోట కు చేరుకొనే మార్గంలో అనేక దేవాలయాలు కనిపిస్తాయి. వాటిలో భైరవుని ఆలయం, ఆంజనేయస్వామి ఆలయం, ఎల్లమ్మ ఆలయాలు కొన్ని. ఆలాగే కోట పై భాగానికి చేరుకోగానే మరొక ప్రధాన ఆలయమైన పట్టాభి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయం వెనుక ఉన్న కోనేరు ఇక్కడి ప్రధాన ఆకర్షణ.

చిత్ర కృప : wikicommons

చెన్నకేశవ ఆలయం, సోంపల్లె, చిత్తూరు

చెన్నకేశవ ఆలయం, సోంపల్లె, చిత్తూరు

శ్రీ మహా విష్ణువు, లక్ష్మి సమేతంగా ఆవిర్భవించిన క్షేత్రం సోంపల్లె. ఇది చిత్తూరు జిల్లాలోని మదనపల్లె రెవిన్యూ డివిజన్ పరిధిలో ఉన్నది. మదనపల్లె నుండి 47 కిలోమీటర్ల దూరంలో, హార్సిలీ హిల్స్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో చెన్నకేశవ ఆలయం ఉన్నది. ఈ క్షేత్రంలోని ప్రధాన ఆకర్షణ హేరిటేజ్ సంపదగా గుర్తించబడింది. ఇక్కడున్న ఏకశిలా స్తంభం చక్కని శిల్పశైలితో విరాజిల్లుతుంది. విజయనగర కాలంలో నిర్మించబడ్డ ఈ ఆలయంలోని కళ్యాణ మండపం లోని శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.

చిత్ర కృప : wikicommons

ఆదోని ఫోర్ట్, ఆదోని, కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్

ఆదోని ఫోర్ట్, ఆదోని, కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదోని ఒక రెవెన్యూ డివిజన్. ఒకప్పుడు ఆదోని పట్టణాన్ని నవాబులు పరిపాలించేవారు. ఇది ఎందుకు హేరిటేజ్ ప్రదేశం గా గుర్తించబడింది అంటే ఇక్కడున్న కోట అనే చెప్పాలి. ఈ కోట ముస్లిం ల కాలంలో ప్రభుత్వ కేంద్రంగా ఉండేది. కోట ను వశపర్చుకోవడానికి ఎందరో సామంత రాజులు, చక్రవర్తులు ప్రయత్నించారు. వారిలో కొందరు విజయం సాధించగా, మరికొందరు పరాజితులయ్యారు. మొదట ఈ కోట విజయనగర రాజుల పరిపాలనలో ఉండేది. ఆ తరువాత జరిగిన ఎన్నో మలుపుల నుండి ఆంగ్లేయుల ఆధీనంలో కి వచ్చి చివరికి భారత భూభాగంలో కలిసిపోతుంది.

చిత్ర కృప : S. Praveen Bharadhwaj

కొండారెడ్డి బురుజు, కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్

కొండారెడ్డి బురుజు, కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు నగరం నడి బొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు ఒక స్మారక చిహ్నం. ఇది హైదరాబాద్ నగరానికి 210 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నగరానికి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కర్నూలు నగరంలో ఎక్కడి నుంచైనా చేరుకొనే విధంగా ఈ కట్టడం ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో హేరిటేజ్ సంపదగా గుర్తించబడ్డ కొండారెడ్డి బురుజు ఇప్పటికీ ధృడమైన కోటగా, బలంగా ఉన్నది. ఈ కోటను అచ్యుతదేవరాయల వారు నిర్మించినారు. ఈ కోటలో దుర్భేధ్యమైన కారాగారం సైతం ఉన్నది.

చిత్ర కృప : Prasad Addagatla

ఓర్వకల్ రాక్ గార్డెన్, ఓర్వకల్లు, కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్

ఓర్వకల్ రాక్ గార్డెన్, ఓర్వకల్లు, కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్

కర్నూలు లోని ఓర్వకల్ రాక్ గార్డెన్ గురించి 2000 -2002 సంవత్సరాలకు ముందు ఎవ్వరికీ తెలీదు. ఏపి టూరిజం వారు దీనిని వెలుగులోకి తీసుకొని వచ్చి బాహ్య ప్రపంచానికి తెలియజేశారు. ఇది సహజ సిద్ధంగా ఏర్పడ్డ రాతి ప్రదేశం. ఎప్పుడైతే ఈ ప్రదేశం గురించి సమాచారం బయటికి వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకూ సినిమా షూటింగ్ లు జరుగుతూనే ఉన్నాయి. దీనిని కూడా ఆంధ్ర ప్రదేశ్ లో ఒక హేరిటేజ్ సంపదగా గుర్తించవచ్చు.

చిత్ర కృప : shesh murthy

చంద్రగిరి కోట, చంద్రగిరి, తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్

చంద్రగిరి కోట, చంద్రగిరి, తిరుపతి, ఆంధ్ర ప్రదేశ్

చంద్రగిరికోట చిత్తూరు జిల్లాలోని తిరుపతికి సమీపంలో ఉన్నది. తిరుపతికి, చంద్రగిరికి అవినాభావ సంబంధం ఉంది. పూర్వం కృష్ణదేవరాయలవారు తిరుపతికి వస్తే ఈ కోటనే విడిదిగా వాడేవారు. చంద్రగిరికోట వైభోగం చూడాలంటే అక్కడ రాత్రి పూట జరిగే లైట్ అండ్ సౌండ్ షో తప్పక చూడాలి. మూడంతస్తులుగా ఉన్న ఈ కోటలో మొదటి అంతస్తు మ్యూజియంగా, రెండవ అంతస్తు దర్బారు హాలు గా మరియు మూడవ అంతస్తు కోట నమూనా ను కలిగి ఉండి ప్రజల సందర్శన కొరకు ఉంచారు.

చిత్ర కృప : Manoj Kurup

అమరావతి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

అమరావతి, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధానైన అమరావతి, విజయవాడ కి 40 కిలోమీటర్ల దూరంలో, గుంటూరు కి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పట్టణం. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ పట్టణం ఎన్నో వేల సంవత్సరాల ప్రాచీన చరిత్రను కలిగి ఉంది. అమరావతిని గౌతామి పుత్రశాతకర్ణి క్రీ.శ.ఒకటవ శతాబ్ధంలో వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇక్కడున్న బౌద్ధ స్థూపాలు, పంచరామాల్లో ఒకటైన అమరేశ్వర స్వామి ఆలయం మరియు మ్యూజియం లు ఆంధ్ర ప్రదేశ్ హేరిటేజ్ సంపదగా గుర్తించబడ్డాయి.

చిత్ర కృప : Nandign

కొండపల్లి కోట, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్

కొండపల్లి కోట, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్

కొండపల్లి కోట విజయవాడ రైల్వే స్టేషన్ కి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపల్లి గ్రామంలో ఉన్నది. ఈ కోటని ప్రోలయ వేమారెడ్డి క్రీ.శ.14వ శతాబ్దంలో నిర్మించినాడు. ఈ కోట తో పాటు, సమీపంలోని విరూపాక్ష దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ హెరిటేజ్ సంపదగా ఉన్నది. కొండ చుట్టూ శుత్రుదుర్భేద్యమైన ప్రాకారం, మహల్ గోడలపై ఉన్న కళాఖండాలు, రాజమహల్, రాణిమహల్, అబ్బురపరిచే నర్తనశాల నిర్మాణం, కారాగారం, ఆయుధాగారం, ప్రజలు స్నానం చేయడానికి వీలుగా పెద్ద కొలను, రాజ కుటుంబీకుల కోసం మరో కొలను, గుంపులుగా తరలివెళ్లడానికి, ఏనుగులు, గుర్రాలు వెళ్లడానికి వీలుగా రహదారుల నిర్మాణం... ఇదంతా ఒక కొండపైనే ఉన్నాయి.

చిత్ర కృప : Srini vas

ఉండవల్లి గుహలు, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్

ఉండవల్లి గుహలు, విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఈ గుహలు క్రీ.శ. 4 - 5 వ శతాబ్ధానికి చెందినవి. నాలుగు అంతస్తులుగా ఉండే ఈ గుహ హేరిటేజ్ ప్రదేశం గా గుర్తించబడింది. ఇక్కడి ప్రధాన ఆకర్షణ నల్లని గ్రానైట్ రాయితో చేసిన పడుకున్న భంగిమలో ఉన్న అనంతశయన విష్ణువు ఏక శిలా విగ్రహం. ఈ కొండ మీద నుండి కృష్ణా నది దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది.

చిత్ర కృప : Manfred Sommer

బావికొండ, విశాఖపట్టణం, ఆంధ్ర ప్రదేశ్

బావికొండ, విశాఖపట్టణం, ఆంధ్ర ప్రదేశ్

బావికొండ అనేది ఒక బౌద్ధ సముదాయం. ఇది విశాఖపట్నం నుండి 16 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 130 మీటర్ల ఎత్తుగల కొండపై ఉన్నది. ఇక్కడ జరిగిన తవ్వకాల్లో ఒక మట్టి కలశంలో ఒక ఎముక ముక్క కూడా దొరికింది. ఇది బుద్ధుని భౌతిక అవశేషమని భావిస్తారు. ఇంకా అనేక శాసనాలు, మట్టి పాత్రలు, ఫలకాలు, ఇటుకలు, నాణేలను కూడా దొరికినాయి. ఇది ఆంధ్ర ప్రదేశ్ వారసత్వ సంపదగా ఖ్యాతి గడించింది.

చిత్ర కృప : Rohit Sarma

తోట్లకొండ, విశాఖ పట్టణం, ఆంధ్ర ప్రదేశ్

తోట్లకొండ, విశాఖ పట్టణం, ఆంధ్ర ప్రదేశ్

తొట్లకొండ అనే బౌద్ధ సముదాయం విశాఖపట్నం నుండి 15 కిలోమీటర్ల దూరంలో భీమిలి వెళ్లే దారిలో 128 మీటర్ల ఎత్తున్న ఒక కొండపై ఉన్నది. తొట్లకొండ ప్రాచీన కళింగ రాజ్యంలో ఉండి, బౌద్ధ సంస్కృతి ని శ్రీలంక మరియు ఆగ్నేయాసియా దేశాలలో వ్యాపించేందుకు ప్రధాన కేంద్రంగా ఉండేది. తోట్లకొండ ను ఆంధ్ర ప్రదేశ్ వారసత్వ సంపదగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.

చిత్ర కృప : Juan Andres Gutierrez Quezada

బెలుం గుహలు, కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్

బెలుం గుహలు, కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్

బెలుం గుహలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్నాయి. ఈ గుహలు దేశంలోనే అతి పురాతన గుహలుగా ప్రసిద్ధి చెందినాయి. సుమారు 10 లక్షల సంవత్సరాల క్రితం ఈ గుహలు ఏర్పడినవని పురాతత్వ శాస్త్రవేత్తల అభిప్రాయం. పొడవైన సొరంగ మార్గాలు, రకరకాల శిలాకృతులు, జాలువారే స్పటికాలు ఈ బెలుం గుహల సొంతం. ఇవి కూడా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వారసత్వ సంపదగా గుర్తించబడ్డాయి.

చిత్ర కృప : surendra katta

గండి కోట, కడప, ఆంధ్ర ప్రదేశ్

గండి కోట, కడప, ఆంధ్ర ప్రదేశ్

గండికోట, కడప జిల్లా జమ్మలమడుగు తాలూకా లో పెన్నా నది ఒడ్డున ఎర్రమల పర్వత శ్రేణుల్లో ఉన్నది. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం మాటల్లో వివరించలేనిది. కోట లోపల రెండు ఆలయాలు ఉన్నాయి. అవి మాధవరాయ, రంగనాథ ఆలయాలుగా దర్శనమిస్తాయి. అలాగే కోట లోపల కట్టడాలు, చెరువులు, బావులు ఇంకా ఎన్నో దర్శనమిస్తాయి. ఇది కూడా ఒక ఆంధ్ర ప్రదేశ్ వారసత్వ సంపదగా గుర్తించబడింది.

చిత్ర కృప : Lalithamba