» »తెలంగాణ ఎత్తైన జలపాతం !

తెలంగాణ ఎత్తైన జలపాతం !

దట్టమైన అడవులు, గలగలా పారే సెలయేళ్ళు, అమాయకపు ముఖాలతో కనిపించే అడవితల్లి బిడ్డలు... ఇలా చెప్పుకుంటూపోతే చటుకున్న గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్‌లోని అదిలాబాద్‌ జిల్లాయే..! ఓ వైపు సహ్యాద్రి పర్వతాలను ఆనుకుని పరవళ్ళెత్తే కూటాల జలపాతం... మరోవైపు ఈ పర్వతాలకు దిగువన ఉండే కెరమెరి పర్వత పంక్తుల అందాలతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక్కడ ఏవేవి అందాలు ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం...

ఒత్తిడి నుంచి బయటపడాలనుకున్నప్పుడు... మనసు ప్రశాంతతను కోరుకున్నప్పుడు.. బాధపెట్టే సంఘటనలు ఎదురైనప్పుడు.. లైఫ్‌ రొటీన్‌ గా అనిపించినప్పుడు.. మనసును తేలిక పర్చుకోవడానికి చాలా మంది 'ఏం చేయాలా' అని శోచయిస్తుంటారు. కొందరు సినిమాకో.. షికారుకో..అదే డబ్బున్నోడైతే పబ్బుకో.. వెళ్లాలనుకుంటారు. కానీ ప్రకృతి ఒడిలో సేద తీరితే కలిగే ఆహ్లాదమే వేరు.. పచ్చపచ్చని ప్రకృతిని చూసినప్పుడు.. మనసు పులకరిస్తుంది. బాధలు, ఇబ్బందులన్నీ మరిచిపోయి సరికొత్త లోకంలోకి వెళ్లినట్లనిపిస్తుంది. ఆ అందమైన ప్రకృతి ఇచ్చిన ప్రశాంతతో తిరిగొచ్చి హుషారుగా పనిలో నిమగమైపోతాం. అవన్నీ సర్లేగాని ఇలాంటి రమణీయమైన అందాలు ఎక్కడున్నాయని అనుకుంటున్నారా? అంతగా ఆలోచించకండి. తెలంగాణ చిత్రపటంలో ఓసారి పైకి చూడండి. ఏడా కనిపించిందా?? పైన స్టార్టింగ్ లో ఉంటుంది. కనిపిస్తుంది కదూ? అదే అదిలాబాద్‌ జిల్లా. ఇక్కడ ప్రకృతి అందాలకు కొదవే లేదు. ఎత్తైన కొండలు, గలగలపారే జలపాతాలు... అడవుల సంగతైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీటితో పాటు దర్శనీయ స్థలాలు చాలానే ఉన్నాయి.

తెలంగాణ ఎత్తైన జలపాతం !

తెలంగాణ ఎత్తైన జలపాతం !

బాసర

దక్షిణ భారతదేశంలోనే ఏకైక సరస్వతీ పుణ్యక్షేత్రం బాసర. ఇక్కడికి రాష్ట్రం, దేశం నుండే కాదు, విదేశీ యాత్రికులూ వస్తుంటారు. పండుగ రోజుల్లో యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గురుపౌర్ణమి రోజైతే ఆలయ ఆవరణంతా సందర్శకులతో కిక్కిరిసిపోతుంది. గంటల తరబడి లైన్లో నిలబడాల్సిందే. ఆలయ పరిసరాలు పచ్చగా యాత్రికులను కట్టిపడేస్తాయి. ఆలయ సమీపంలో పరవళ్లు తొక్కుతూ వయ్యారంగా పారే గోదావరి చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ బోటింగ్‌ చేయకుండా ఉండలేం. పడవమీద ఎన్ని చక్కర్లు కొట్టినా తనివి తీరదు. పిల్లలైతే మళ్లీమళ్లీ వెళ్దామని ఒకటే మారాం చేస్తారు. పెద్దవాళ్లు సైతం 'అయ్యో ఇన్ని రోజులు ఇంత అందమైన ప్రదేశాన్ని చూడలేకపోయామే' అనుకోకుండా వుండలేరు. నాలుగేళ్ల క్రితం బాసరలో ఏర్పాటైన ట్రిపుల్‌ ఐటి ప్రత్యేక ఆకర్షణ. వసతులు బాసరలో ఇటీవల కాలంలో యాత్రికుల సౌకర్యార్థం అతిథి గృహాలు, హోటళ్లు చాలా ఏర్పాటయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, ఎకో టూరిజం శాఖ కూడా యాత్రికులకు ప్రత్యేకమైన వసతులు కల్పించింది.

Photo Courtesy: RameshSharma

తెలంగాణ ఎత్తైన జలపాతం !

తెలంగాణ ఎత్తైన జలపాతం !

కవ్వాల్‌

అభయారణ్యం కనువిందు చేసే కీకారణ్యం 'కవ్వాల్‌' అభయారణ్యం. ఇది జన్నారం మండల కేంద్రానికి సమీపంలో ఉంది. ఇక్కడికి రావాలంటే ముందుగా అటవీ శాఖ అనుమతి తీసుకోవలసిందే. మనతో పాటుగా అటవీ సిబ్బందిని పంపిస్తారు. పచ్చని ప్రకృతిలో నడుస్తుంటే ఆ అనుభూతి వేరు. మధ్య మధ్యలో నవ్వుతూ, కేరింతలు కొడుతూ..ఆ ప్రకృతిని అశ్వాదిస్తూ ఉంటే అడవిలో ఎంత దూరం నడిచినా అలసట తెలీదు. అడవంటే కేవలం టేకు చెట్లే ఉంటాయనుకునే వారికి అడవి లోపలికి వెళ్తే తెలుస్తుంది, ఎన్ని రకాల చెట్లుంటాయో. ఇక్కడ లైవ్ గా అడవి జంతువులను చూడవచ్చు.

Photo Courtesy: Telangana Tourism

తెలంగాణ ఎత్తైన జలపాతం !

తెలంగాణ ఎత్తైన జలపాతం !

పొచ్చెర జలపాతం

బోథ్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న కుంటాల జలపాతం..దీంతో పాటే పొచ్చెర జలపాతం కూడా ప్రసిద్ధి చెందింది. చూడముచ్చటగా ఉన్న పొచ్చెర జలపాతం పక్కనే పార్కు ఉంది. కొండకోనల మధ్య నుండి నీళ్లు వయ్యారంగా వంపులు తిరుగుతూ, పైనుండి కిందకు పడుతున్న నీటిని చూస్తుంటే భలేగా ఉంటుంది. ఆ జలపాతాన్ని చూస్తూ తడవకుండా ఉండడం సాధ్యం కాదేమో!?

Photo Courtesy: Rajib Ghosh

తెలంగాణ ఎత్తైన జలపాతం !

తెలంగాణ ఎత్తైన జలపాతం !

కుంటాల జలపాతం

బోథ్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందింది. కుంటాల పేరు వెనుక చరిత్ర చూస్తే....శకుంతలా దుష్యంతులు ఈ ప్రాంతంలో సంచరించారని, అందుకే దీనికి కుంతల జలపాతం అని పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. కుంతల రానురాను కుంటాలగా మారింది. జలపాతం చేరాలంటే మెట్లు దిగి వెళ్లాలి. దగ్గరికెళ్తున్న కొద్దీ పరుగులు తీస్తున్న నీళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. ఆ దృశ్యం అద్భుతంగా అనిపిస్తుంది. 45 అడుగుల ఎత్తు నుండి కిందికి పడే నీళ్లు వినసొంపైన శబ్దం చేస్తుంటాయి. జలపాతం కిందికి చేరుకొని జలకాలాటలలో..కిలకిల పాటలలో కొద్దిసేపు ఎంజాయ్ చెయ్యొచ్చు. వర్షా, శీతాకాలాల్లో ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. అయితే జలపాతం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. జలకన్య అందాలను దూరం నుంచే ఆస్వాదించాలి. మరీ సమీపంలోకి వెళ్లకూడదు. హెచ్చరికలను బేఖాతరు చేస్తే ప్రాణాలకే ప్రమాదం. అందాలను తిలకించడానికి వచ్చి హెచ్చరికలు పాటించకుండా మృతి చెందిన సంఘటనలూ ఉన్నాయి. జలపాతం పక్కనే ఏడు అడుగుల గుహ ఉంది. దీని గుండా మనిషి మాత్రమే ప్రవేశించే వీలుంది. పక్కనే నీటి సుడిగుండం, సోమేశ్వరాలయం, కాకతీయుల కాలంనాటి రాతి నంది విగ్రహాలున్నాయి.

Photo Courtesy: Ppavan1

తెలంగాణ ఎత్తైన జలపాతం !

తెలంగాణ ఎత్తైన జలపాతం !

లక్ష్మీనారాయణ దేవాలయం

చారిత్రక కట్టడాలకు, ప్రాచీన శిల్పకళకు జైనథ్‌ మండల కేంద్రంలో ఉన్న లక్ష్మీనారాయణ ఆలయాన్ని సజీవ సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. శాతవాహనుల కాలంలో నిర్మితమైన ఈ దేవాలయం భారతదేశ సంస్కృతి, కళలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. జిల్లా కేంద్రం నుండి 20 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. జైనులకు కేంద్రంగా ఉండడంతో ఈ గ్రామానికి 'జైనథ్‌' అని పేరు వచ్చింది. దాదాపు 15 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు గల నల్లటి రాళ్లతో ఈ ఆలయాన్ని నిర్మించడం చెప్పుకోదగ్గ విషయం. గుడిలో దాదాపు 40 అడుగుల లక్ష్మీనారాయణ విగ్రహం ఉంది. దీనిపై మార్చి, ఏప్రిల్‌, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో సూర్యకిరణాలు నేరుగా ప్రసరించడం మరో విశేషం. ఆలయాన్ని దాదాపు 2500 సంవత్సరాల క్రితం నిర్మించి ఉండొచ్చని స్థానికులు చెబుతుంటారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది ఆలయం కొద్దికొద్దిగా భూమిలోకి కుంగిపోతోందట.

Photo Courtesy: talangana Tourism

తెలంగాణ ఎత్తైన జలపాతం !

తెలంగాణ ఎత్తైన జలపాతం !

కెరమెరి

కెరమెరి, నిర్మల్‌ ఘాట్లు జిల్లాకే తలమానికంగా ఉన్నాయి. ఈ రోడ్లపై ప్రయాణం ఆహ్లాదకరమైన విహారం. సినిమాల్లో సుందర దృశ్యాలను చూపించడానికి సినీ దర్శక, నిర్మాతలు కాశ్మీర్‌, లండన్‌ తదితర సుదూర ప్రాంతాలకు వెళ్తుంటారు. కానీ వారికి తెలియని ప్రకృతి అందాలు ఆదిలాబాద్‌ జిల్లాలో అనేకం ఉన్నాయి. గతంలో కొన్ని చలనచిత్రాలు, అనేక టీవీ సీరియళ్లను ఇక్కడే చిత్రీకరించేవారు. కానీ ఇప్పుడు ఆ దాఖలాలు లేవు. అప్పట్లో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడి పర్వత అందాలను, సజీవంగా ప్రవహించే సెలయేళ్లను, కనువిందు చేసే వన్యప్రాణులను తిలకించేందుకు పర్యాటకులు వెల్లువలా తరలివచ్చేవారని చెబుతుంటారు. వర్షాకాలంలో కెరమెరి పర్వతాల పై నుంచి ప్రకృతిని చూసినట్లయితే.. చుట్టుప్రక్కల ప్రవహించే సెలయేళ్లు, పచ్చని అటవీ శ్రేణులు ఊటీని తలదన్నే విధంగా ఉంటాయంటే అతిశయోక్తి కాదు.

Photo Courtesy: Telangana Tourism

తెలంగాణ ఎత్తైన జలపాతం !

తెలంగాణ ఎత్తైన జలపాతం !

ఎలా చేరుకోవాలి

వాయు మార్గం

అదిలాబాద్ కు 182 కి. మీ. దూరంలో నాగ్‌పూర్ లో అంబెద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్నా 327 కి. మీ. దూరంలో హైదరాబాదు లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరింత ఉపయోగకరమైనది.

రైలు మార్గం

అదిలాబాద్ రైల్వే స్టేషన్ ని కలిగి ఉంది. ఇక్కడి నుండి హైదరాబాదు, నిజామాబాదు, నాందేడు, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, పాట్నా, నాగపూరు, నాసిక్, ముంబాయి, వరంగల్, ఖమ్మం, తెనాలి, ఒంగోలు, ఔరంగాబాదు, మన్మద్, గుల్బర్గా, బీదర్, బీజపుర్, షోలాపూరు మొదలైన ఊర్లకు హైదరాబాదు ద్వారా నేరు రైళ్ళు ఉన్నాయి. క్రిష్ణా ఎక్స్ ప్రెస్ అదిలాబాదు కు ఒక ప్రధాన రైలు.

రోడ్డు మార్గం

దేశంలోనే అతి పొడవైన జాతీయ రహదారి 7 అదిలాబాదు జిల్లా వాసుల రహదారి ప్రయాణాలను సులభతరం చేస్తూ ఉంది. ఇది మిగిలిన మిగిలిన భారతదేశాన్ని అనేక రహదారి మార్గాలతో కలుపుతూ జిల్లావాసుల రహదారి ప్రయాణాలకు సహకరిస్తుంది.

Photo Courtesy: Vamshi Krishna