Search
  • Follow NativePlanet
Share
» »అల్మోర దృశ్యాలు - మరుపురాని అనుభూతులు !

అల్మోర దృశ్యాలు - మరుపురాని అనుభూతులు !

By Mohammad

అల్మోర ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఒక హిల్ స్టేషన్. కుమావోన్ ప్రాంతంలో ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 1651 మీ. ఎత్తున ఉంటుంది. దీని చుట్టూ ఉన్న ప్రకృతి సంభంధిత అడవులు ఈ ప్రదేశ అందాలకు మరింత వన్నె తెచ్చాయి. అల్మోర టౌన్ డెహ్రాడూన్ నుండి 342 కిలోమీటర్ల దూరంలో కలదు.

అల్మోర కొండల నుండి చూస్తే మంచుతో కప్పబడిన శిఖరాలు అందంగా కనిపిస్తాయి. ఈ ప్రదేశం ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తున్నది. ఇక్కడి మంచుకొండల్లోని అద్భుత సూర్యోదాయ, సూర్యాస్తమ దృశ్యాలను చూడటానికి రెండుకళ్లు చాలవనుకోండి ..! అల్మోర కు సమీపాన 36 కిలోమీటర్ల దూరంలో ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం జగేశ్వర్ కలదు.

ఇది కూడా చదవండి : జగేశ్వర్ - ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం !

చూడదగ్గ ప్రదేశాలు !

సిమ్టోల, మర్టోల ప్రదేశాలకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్ళటానికి బాగుంటాయి. అల్మోర ప్రదేశానికి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జింకల పార్క్ కూడా ప్రసిద్ధి చెందినదే. ఇంకా మ్యూజియం, వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ లు ... ఇలా ఇంకొన్ని చూడవలసినవి ఉన్నాయి. ఇక్కడి వెళితే పర్వతారోహణ, మౌంటైన్ బైకింగ్, ట్రెక్కింగ్, స్కై విహారాలు వంటి సాహస క్రీడలలో పాల్గొని ఆనందించవచ్చు.

నందా దేవి ఆలయం

నందా దేవి ఆలయం

అల్మోర లో మొదట చూడవలసినది ప్రాచీన ఆలయమైన నందా దేవి గుడి. ఈ గుడి కుమావొనీ శిల్ప శైలి లో నిర్మించబడింది. ఆలయం లోని దేవతను చాంద్ వంశ రాజులు కొలిచినట్లు ఆనవాళ్ళు లభించాయి. ప్రతి ఏటా వేలాది మంది భక్తులు నందా దేవిని దర్శించుకోవటానికి వస్తుంటారు.

చిత్ర కృప : From Uttarakhand With Love

కాసర్ దేవి ఆలయం

కాసర్ దేవి ఆలయం

క్రీ.శ. 2 వ శతాబ్ధంలో నిర్మించిన కాసర్ దేవి ఆలయం అల్మోర పట్టణానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రదేశం ప్రశాంతంగా ఉంటుంది. అందుకేనేమో ..! స్వామి వివేకానందుడు ఈ ప్రదేశంలో కొంత కాలం పాటు ధ్యానం చేశాడు. టౌన్ నుండి ఇక్కడికి చేరుకోవటానికి బస్సులు, ఆటో రిక్షాల సదుపాయం కలదు.

చిత్ర కృప : kfiramitai

చితాయి ఆలయం

చితాయి ఆలయం

అల్మోర టౌన్ కు కేవలం 6 కి. మీ. దూరంలో ఉన్న చితాయి ఆలయం క్రీ.శ. 12 వ శతాబ్ధంలో నిర్మించారు. కొండ పై ఉన్న ఈ ఆలయం చుట్టూ దట్టమైన అడవులు అలుముకొని ఉంటాయి. గుడి లోని ప్రధాన దైవం శివుని అవతారంలో పూజలందుకొంటుంది. కోరికలను తీర్చమని భక్తులు మేక బలి ఇస్తారు. అల్మోర నుండి ట్యాక్సీ, ప్రవేట్ వాహనాల్లో చేరుకోవచ్చు.

చిత్ర కృప : Manish sanga

కాటార్మాల్ సూర్య దేవాలయం

కాటార్మాల్ సూర్య దేవాలయం

కాటార్మాల్ సూర్య దేవాలయం అల్మోర పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇందులోని ప్రధాన ఆకర్షణ శివుడు, పార్వతి, నారాయణ స్వామి విగ్రహాలు. సముద్ర మట్టానికి 2116 మీ. ఎత్తున, సూర్య కిరణాలు సరిగ్గా శివలింగం పై పడే రీతిలో క్రీ.శ. 9 వ శతాబ్ధంలో ఈ ఆలయాన్ని కత్యూరి రాజు నిర్మించారు.

చిత్ర కృప : Suhas Dutta

సూర్యోదయం & సూర్యాస్తమం

సూర్యోదయం & సూర్యాస్తమం

అల్మోర లో పర్యాటకులు అద్భుత సూర్యోదాయ మరియు సూర్యాస్తమ దృశ్యాలను వీక్షించటానికి బ్రైట్ ఎండ్ కార్నర్ అనుకూలంగా ఉంటుంది. పిక్నిక్ లకైతే సిమ్టో ల, మర్టోల స్థలాలు ముచ్చటగా ఉంటాయి.

చిత్ర కృప : Aveek Basu

బ్రైట్ ఎండ్ కార్నర్

బ్రైట్ ఎండ్ కార్నర్

బ్రైట్ ఎండ్ కార్నర్ అల్మోర టౌన్ కు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడి నుంచి మంచు పర్వత శిఖరాలలో జరిగే సూర్యోదాయ, సూర్యాస్తమ సన్నివేశాలను తిలకించవచ్చు. సమయం ఉంటే పక్కనే ఉన్న రామకృష్ణ కుటీర ఆశ్రమం లో వెళ్ళి ధ్యానం, యోగా చేసుకోవచ్చు.

చిత్ర కృప : Gautam Dhar

సిమ్టోల , మర్టోల

సిమ్టోల , మర్టోల

సిమ్టోల : సిమ్టోల పిక్నిక్ ప్రదేశం అల్మోర కు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి సుందరమైన పైన్ మరియు దేవదారు వృక్షాలతో కూడిన పర్వత శ్రేణులను చూడవచ్చు.

మర్టోల : మర్టోల పిక్నిక్ స్పాట్ అల్మోర కు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది అందమైన తోటలకు, పచ్చని అడవులకు ప్రసిద్ధి.

చిత్ర కృప : babyshyren

డీర్ పార్క్ లేదా జింకల పార్కు

డీర్ పార్క్ లేదా జింకల పార్కు

డీర్ పార్క్ అల్మోర టౌన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని చుట్టూ పైన్ చెట్లు అధికంగా విస్తరించి ఉంటాయి. డీర్ పార్క్ అంటే కేవలం జింకలే ఉంటాయని భ్రమపడకండి ..! జింకలతో పాటు చిరుత, హిమాలయ బ్లాక్ బేర్ జంతువులు చూడవచ్చు. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ లు చేసుకోవచ్చు.

చిత్ర కృప : danish danish

బిన్సార్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

బిన్సార్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ

బిన్సార్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురీ సముద్ర మట్టానికి 900 నుండి 2500 మీ. ఎత్తున ఉండి, అల్మోర పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారు 46 చ.కి.మీ ల విస్తీర్ణాన్ని ఆక్రమించిన ఈ స్యాంక్చురీలో వివిధ రకాల జంతువులు, 200 జాతుల పక్షులు మరియు ఇతర వన్య ప్రాణులు నివాసంగా ఉన్నాయి.

చిత్ర కృప : Allan Hopkins

స్టేట్ మ్యూజియం

స్టేట్ మ్యూజియం

స్టేట్ మ్యూజియాన్నే గోవింద్ వల్లభ పంత్ పబ్లిక్ మ్యూజియం గా పిలుస్తారు. అల్మోర లోని మాల్ రోడ్ లో కలదు. చరిత్ర, పురావస్తు, సంస్కృతి కి సంభందించిన వస్తువులను మ్యూజియంలో ప్రదర్శిస్తారు. పురాతన పెయింటింగ్, విలువైన వస్తువులను కూడా చూడవచ్చు. ఉదయం 10 : 30 నుండి సాయంత్రం 4 : 30 వరకు మ్యూజియం తెరిచే ఉంటుంది.

చిత్ర కృప : Tsangpo

బిన్సార్

బిన్సార్

బిన్సార్ చాంద్ వంశ రాజుల వేసవి విడిది ప్రదేశం. ఈ ప్రదేశానికి వెనక భాగంలో హిమాలయ పర్వత శ్రేణులు కనపడతాయి. సముద్ర మట్టానికి 2400 మీ. ఎత్తున ఉన్న బిన్సార్ కుమావోన్ ప్రాంతంలో కెల్లా ఎత్తైనది. సమీపంలోనే ఒక చిన్న శివాలయం కూడా ఉన్నది.

చిత్ర కృప : Shailendra Goyal

మౌంటెన్ బైకింగ్

మౌంటెన్ బైకింగ్

సాహసికులు అల్మోర కొండల్లో మౌంటెన్ బైకింగ్ క్రీడ ఆచరించవచ్చు. సైకిళ్లు అద్దెకు తీసుకొని అల్మోర కొండల్లోని అనేక రూట్ లలో తిరుగుతూ ఆనందించవచ్చు. బైకింగ్ టూర్ లు నిర్వహించేవారు అల్మోర, దాని చుట్టుప్రక్కల ఉంటారు.

చిత్ర కృప : Nadia D'Agaro

ట్రెక్కింగ్

ట్రెక్కింగ్

సాహసాలు ఇష్టపడేవారికి పిండారీ ట్రెక్ సూచించదగినది. ఈ మార్గం అడవులు, లోయల గుండా వెళుతుంది. పిండారీ గ్లేసియర్ నందా దేవి మరియు నందా కోట్ పర్వతాల మధ్య కలదు.

చిత్ర కృప : Gautam

షాపింగ్

షాపింగ్

షాపింగ్ ప్రియులకు అల్మోర లోని లాల్ బజార్ సూచించదగినది. రుచికరమైన స్వీట్ లు, అలంకరణ వస్తువులు మరియు కుందేలు చర్మంతో తయారు చేసిన దుస్తులు ఇక్కడ సరసమైన ధరకే లభిస్తాయి.

చిత్ర కృప : Anil Sharma

అల్మోర ఎలా చేరుకోవాలి ?

అల్మోర ఎలా చేరుకోవాలి ?

అల్మోర చేరుకోవటానికి రైలు, రోడ్డు మరియు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

విమాన మార్గం

అల్మోర కు సమేపాన ఎయిర్ బేస్ ప్యాంటు నగర్ ఎయిర్ పోర్ట్ కలదు. ఇది 125 కి. మీ. ల దూరం లో కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నేరుగా ఢిల్లీ లోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు రెగ్యులర్ విమాన సేవలతో కలుపబడింది. ఎయిర్ పోర్ట్ నుండి టాక్సీలలో అల్మోర చేరవచ్చు.

రైలు మార్గం

అల్మోర కు సమీపాన కత్గోడం రైల్వే స్టేషన్ కలదు. ఇది 75 కి. మీ. దూరంలో ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ నుండి తరచూ దేశంలోని ఇతర ప్రాంతాలకు రైళ్లు వెళుతుంటాయి.

రోడ్డు మార్గం

న్యూ ఢిల్లీ నుండి అల్మోర టౌన్ కు లగ్జరీ బస్సు సదుపాయం ఉన్నది. ఢిల్లీ - అల్మోర మధ్య దూరం 350 కిలోమీటర్లు. సమీప పట్టణాల నుండి కూడా అల్మోర కు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు నడుస్తుంటాయి.

చిత్ర కృప : Vivek Sheel Singh

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X