Search
  • Follow NativePlanet
Share
» »నల్లమల్ల అడవుల్లో బోటు షికారు !

నల్లమల్ల అడవుల్లో బోటు షికారు !

By Venkatakarunasri

హైదరాబాద్ శ్రీశైలం రెండు రోజుల టూర్ లో భాగంగా , ముందుగా నాగార్జునసాగర్ వరకు వెళ్ళేందుకు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ లోని అమీర్ పేట్ వద్ద ట్రావెలర్ ఎక్కాం. సుమారు మూడున్నర గంటల ప్రయాణం తర్వాత నాగార్జునసాగర్ చేరుకున్నాం. హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ కు 170 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి చేరుకోగానే మొదటగా మాకు సాగర్ డ్యాం కనిపించింది. డ్యాంకు ఎదురుగా ఉన్న బ్రిడ్జిపై ట్రావెలర్ ఆగింది. అక్కడి నుంచి మా అసలు విహారయాత్ర మొదలయింది. ఇక ఇక్కడి నుండి దాదాపు ఏడు గంటల పాటు క్రూయిజ్ టూర్ మొదలౌతుంది. అంటే అసలు అడ్వంచర్ జర్నీ ఇక్కడి నుండి ప్రారంభం అవుతుందన్నమాట.

రోజువారీ పనుల్లో ఫుల్ బిజీ. అందులోనూ నగర వాసులైతే ఇక చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సరదాగా వీకెండ్ ఎంజాయ్ చేయడం కోసం ఎక్కడికెళ్లాలా అని చాలా మంది తెగ ఆలోచిస్తుంటారు. అయితే ఓ ప్లాన్ వేసుకొని అది కాస్తా అమలుచేసే సరికి వీకెండ్ అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని పర్యాటక ప్రదేశాలుండి ఏం లాభం? ఏమీ చూడలేకపోయాం అని దిగులుపడుతుంటారు. ఇలాంటి వారి కోసమే శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ ట్రిప్. మొన్న ఈ మధ్యలో ఫ్రెండ్స్ ని కలుద్దాం కదా అని హైదరాబాద్ వెళ్ళాను అదికూడా వీకెండ్ టైమ్ లో. ఇక ఎవ్వరికైనా వీకెండ్ అంటే భూమి మీద కాళ్ళు నిలబడవు. మాది కూడా అదే తంతు. హైదరాబాద్ పొద్దుమూకుల చూసిందే కదా అని చెప్పి, రొటీన్ కి భిన్నంగా ఆలోచించి ట్రిప్ ప్లాన్ చేశాం.

నాగార్జున సాగర్ డ్యాం

నాగార్జున సాగర్ డ్యాం

మొదట మేము వెల్లగానే చూసింది నాగార్జున సాగర్ డ్యాం. ఇక డ్యామ్ గురించి మీకు చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ఈ డ్యాం ప్రపంచంలోనే ఇటుక, రాతితో నిర్మించబడ్డ అతి పెద్ద కట్టడం మరియు దేశంలోని పొడవైన డ్యాంలలో మొదటిది. ఈ డ్యాం పేరు మీదనే ఈ ప్రాంతానికి నాగార్జునసాగర్ అన్న పేరు వచ్చింది.దీనిని కృష్ణానది పై నిర్మించినారు. మేము చూస్తున్నప్పుడు గైడ్ స్కూల్ పిల్లలకి దీని గురించి చెబుతుంటే విన్నది ఏంటంటే ఈ కట్టడం 490 అడుగుల ఎత్తుకలిగి 1.6 కిలోమీటర్ల పొడవుతో 26 గేట్లతో, ప్రతి గేటు 42 అడుగుల వెడల్పు కలిగి 45 అడుగులు ఎత్తు కలిగి ఉంటుందట.

Photo Courtesy: Sumanthk

టిఫిన్

టిఫిన్

ఇక్కడ చుట్టుపక్కల చాలానే హోటళ్లు ఉన్నాయి. పూరీ తినాలని ఆశతో అక్కడే ఆరు బయట పూరీలు వేస్తున్న అతని వద్దకి వెళ్ళి తిన్నాము. ఆ పూరీలోకి కుచ్ఛ ( కుర్మా) , చట్నీ ఎంత బాగుందో ...మీకు అన్ని రకాల టిఫిన్ లు ఇక్కడ లభిస్తాయి. ఇడ్లీ, వడ, దోశె, పొంగనాలు ఇలా అన్ని కూడా దొరుకుతాయి.

Photo Courtesy: Ben Snooks / santhosh

లాంచీలో ప్రయాణం

లాంచీలో ప్రయాణం

డ్యాం నుంచి నాగార్జున కొండ కు లాంచీ లో వెళ్ళాల్సి ఉంటుంది. నీళ్లలో అదీ లాంచీలో ప్రయాణమంటే వేరే చెప్పాలా? వినిడానికే చాలా బాగుంది. ఇక స్వయంగా ప్రయాణం చేస్తే ఇంకెంత బావుంటుందని అనుకుంటున్నారా? అయితే చూడండి మరి. పరవళ్ళు తొక్కుతున్న కృష్ణమ్మపై పకృతిని ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఎంతో బాగుంది కదా అని అనుకున్నాం మేము! లాంచీ ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, చుట్టూ పక్కల ఎత్తైన కొండలు, పచ్చ పచ్చని చెట్ల మధ్య నీటిలో సాగే ప్రయాణం ...అనుభవిస్తే ఆ అనుభూతే వేరు. ఇలా సాగుతున్న ప్రయాణంలో రిజర్వాయిర్ మధ్యలో ఓ చిన్నపాటి ద్వీపకల్పంలా మాకు నాగార్జున కొండ కనిపించింది.

Photo Courtesy : anaxila

నాగార్జునకొండ

నాగార్జునకొండ

నాగార్జునకొండ పైనే ఆచార్య నాగార్జునుడి విశేషాలు తెలిపేలా ఏర్పాటు చేసిన మ్యూజియం ఉంది. నాగార్జున మ్యూజియంలో బుద్ధుడికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. ఇక్కడి శిల్ప కళ, శాతవాహనులు, ఇక్ష్వాకుల రాజవైభవానికి నిదర్శనంగా నిలుస్తుంది. మూడు, నాలుగు శతాబ్దాలకు సంబంధించిన శిల్పకళలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మీకు ఒక విషయం తెలుసా ?? ఈ ద్వీపంలోని మ్యూజియం ప్రపంచంలోని పురావస్తు ప్రదర్శనశాలలన్నిటిలోనూ అతిపెద్ద ద్వీప ప్రదర్శనశాల (Island Museum) అట. బుద్ధునివిగా చెప్పబడుతున్న దంతావశేషం, కర్ణాభరణం ఇందులో చూడదగ్గవి.

Photo Courtesy: Saravanan A

టికెట్

టికెట్

బోట్ ట్రిప్ మరియు మ్యూజియం లోకి వెళ్ళడానికి రూ.90 ధర చెల్లించి టికెట్ తీసుకోవాలి. ఇదే టికెట్టు మరళా బోట్ లో తిరిగిరావటానికి ఉపయోగపడుతుంది కాబట్టి పోగొట్టుకోకండి. మీకు మ్యూజియం చూడటానికి ఇష్టం లేకపోతే కేవలం బోట్ రైడ్ కి మాత్రమే టికెట్ తీసుకోవచ్చు అదికూడా పోవడానికి, రావడానికి . కొండ కి పోవడానికి మాకు 45 నిమిషాల సమయం పట్టింది. మరళా తిరిగివచ్చేటప్పుడేమో 30 - 40 నిమిషాలే పట్టింది. మరిచిపోయాను దీంట్లో కూల్ డ్రింక్ లు కూడా అమ్ముతారండోయ్.

Photo Courtesy: Saravanan A

బోట్ టైమింగ్స్

బోట్ టైమింగ్స్

ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మొదటి బోట్ వెళుతుంది. ఇందులో మీరు ప్రయాణించలేరు ఎందుకంటే నాగార్జున కొండ మీద పనిచేసే వర్కర్స్ , ఉద్యోగులకి సీట్లన్ని రిజర్వ్‌డ్ అయి ఉంటాయి. ఆ తరువాత ప్రతి గంటకి నాగార్జున సాగర్ బోట్ లాంచ్ పాయింట్ నుండి బోట్ లు వెళుతుంటాయి. లాస్ట్ బోట్ వచ్చి మధ్యాహ్నం మూడున్నర గంటలకి నాగార్జున సాగర్ లాంచ్ పాయింట్ నుండి , చివరగా కొండ నుంచి రిటర్న్ వచ్చి సాయంత్రం ఐదున్నార గంటలకి ఉంటుంది.

Photo Courtesy: yogodolphin

సాగరమాత దేవాలయం

సాగరమాత దేవాలయం

నాగార్జున సాగర్ లో ఉన్న సాగరమాత ఆలయం హిందూ ఆలయ శైలిలో నిర్మించిన కాథలిక్ చర్చి. ఈ ఆలయము నిర్మాణ శైలిలోనే కాక కొన్ని పూజా పద్ధతులలో కూడా హిందూమత పద్ధతులను అవలంబించడం ఇక్కడి విశేషం. ఈ గుడిలో మేరీమాతకు భక్తులు టెంకాయలు కొట్టి అగరువత్తులు సమర్పిస్తుంటారు. అక్కడ టెంకాయలు అమ్మే తాత ద్వారా మాకు తెలిసింది ఏమిటంటే ప్రతియేటా ఇక్కడ మూడురోజుల పాటు సాగరమాత ఆలయ జాతరలు జరుగుతుంటాయని, ఈ తిరునాళ్ళకు చుట్టుపక్కల ప్రాంతాలనుంచే కాక తెలంగాణ నుండి అనేకమంది భక్తులు వస్తుంటారని చెప్పాడు.

Photo Courtesy: Dr.P. Murali Krishna

ఎత్తిపోతల జలపాతాలు

ఎత్తిపోతల జలపాతాలు

ఇక ఎత్తిపోతల వాటర్ ఫాల్ కి బయలుదేరాం. ఇది నాగార్జునసాగర్ నుండి 11 కి. మీ. దూరలో ఉంది. చంద్రవంక కొండల నుంచి ప్రవహించే ఈ జలపాతం 22 మీటర్ల ఎత్తు నుంచి కిందకు పడి కృష్ణా నదిలో కలుస్తుంది. అంతే కాకుండా సూర్యాస్తమయం తర్వాత ఈ జలపాతం కొత్త కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. అన్నిటికన్నా నాగార్జునకొండపై నుంచి చూస్తే కనిపించే మనోహర దృశ్యాలు మనసును పులకింపచేస్తాయి.

Photo Courtesy: krishna gopal / ponchomorales

కొండల మధ్య

కొండల మధ్య

ఇలాంటి ఉల్లాసవంతమైన వాతావరణంలో సాగే జర్నీని ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. అందులోనూ బోటులో ప్రయాణం అంటే ప్రతిఒక్కరూ ఎగిరి గంతేస్తారు. ప్రకృతి పచ్చదనంతో కప్పేసిన ఎత్తైన కొండల మధ్య సాగే జర్నీ భలే గా ఉంటుంది.

Photo Courtesy: Saravanan A

ఇక్కడ నుంచే మొదలు

ఇక్కడ నుంచే మొదలు

కొండల మధ్య బోటులో ప్రయాణం అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పర్యాటక ప్రాంతం పాపికొండలు. అయితే ఇప్పుడు శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్-కు కూడా బోటు ప్రయాణం చేయొచ్చు. ఈ ప్రయాణం తక్కువ సమయంలో అతి తక్కువ ఖర్చుతో అంతులేని ఆనందాన్ని అందిస్తోంది. ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు ఆధ్యాత్మికమైన వాతావరణం మధ్య ప్రయాణం హాయిగా సాగిపోతుంది. కూసింత కళా పోషణ ఉన్న వారినే కాదు చలనం లేని మనషులను సైతం గిలిగింతలు పెడుతుంది ఈ టూర్. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను మిగులుస్తుందంటున్నారు అక్కడ మాతో కలిసిన తోటి ప్రయాణీకులు.

Photo Courtesy: desi Traveler

లాహిరి .. లాహిరి .. లాహిరిలో

లాహిరి .. లాహిరి .. లాహిరిలో

సాగర్ నుండి మొదలై శ్రీశైలం వరకు సాగే ఈ ప్రయాణంలో మనకు తెలియని ఎన్నో కొత్త, వింతైన విషయాలను తెలిపేందుకు ఇక్కడ ఓ గైడ్ కూడా ఉంటాడు. అతను ప్రతీ ప్రదేశం ప్రత్యేకతను పర్యాటకులకు వివరిస్తుంటాడు. ఇక కృష్ణా నదిలో బోటు ప్రయాణం చేసినంత సేపూ మనకు ఇంకేం గుర్తుండదు. ఏ టెన్షన్స్ కూడా మన దరిచేరవు. అలా ఉంటుంది వాతావరణం. ఆ మనోహరమైన, ఆహ్లాదకరమైన వాతావరణానికి మనసు ఆనందతాండవం చేస్తుంది. కృష్ణా నదిలో దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణం తర్వాత శ్రీశైలానికి బోటు చేరుకుంది.

Photo Courtesy: desi Traveler

పక్షుల కుహు .. కుహు ..

పక్షుల కుహు .. కుహు ..

కృష్ణానదిపై ఈ ప్రయాణం దాదాపు నూట పది కిలోమీటర్ల పొడవున సాగుతుంది. సుమారు ఏడు గంటల పాటు సాగే ఈ జర్నీలో పక్షుల కిలకిలారావాలతో నీటి సవ్వడుల మధ్య ఆద్యంతం ఆసక్తిగా సాగుతూ పచ్చటి కొండల చుట్టూ తిరుగుతు రసవత్తరంగా ఉంటుంది. ఇక్కడ మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ ప్రయాణం ఒకేసారి దాదాపు ఐదు జిల్లాల పరిధిలో సాగుతుంది.

Photo Courtesy: Rakesh Reddy Ponnala

శంభో.. శంకర

శంభో.. శంకర

సాగర్లో ప్రయాణించినంత సేపూ ఆహ్లాదంతో నిండిపోయిన మనసు కాస్తా శ్రీశైలంలో అడుగు మోపగానే ఒక్కసారిగా ఆధ్యాత్మికతతో నిండిపోతుంది. అడుగు పెట్టగానే విఘ్నాలకు అధిపతి అయిన ఆ గణనాథుడు సాక్షి గణపతిగా దర్శనమిస్తాడు. అక్కడి నుండి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక్కటైన శ్రీశైలమల్లికార్జున స్వామి దర్శనంతో పాటు శిఖర దర్శనంతో మనసు దైవచింతనలోకి వెళ్ళిపోతుంది. మనసారా ఆ బోళా శంకరుణ్ని స్మరిస్తే కోరిన కోర్కెలు ఇట్టే తీరుస్తాడని భక్తుల విశ్వాసం.

Photo Courtesy: Rakesh Reddy Ponnala

మల్లికార్జున స్వామి

మల్లికార్జున స్వామి

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులు అక్కడి నుంచి కైలాస శిఖరానికి చేరుకుంటారు. అక్కడ వెలసిన నందిపై నవధాన్యాలు వేస్తే సకల పాపాలూ తొలగుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ శిఖరం పైనుండి చూస్తే ప్రకృతి అందాలకు ఎలాంటి వారైనా ముగ్ధులు కావలసిందే.

Photo Courtesy: kishoremadugula

టైగర్ వ్యాలి

టైగర్ వ్యాలి

శ్రీశైలం పుణ్యక్షేత్రంలో చూడదగిన ప్రదేశాలలో ఫరహబాద్ అటవీ ప్రాంతం ఒకటి. ఈ అటవీ ప్రాంతంలో టైగర్ వ్యాలి ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ అడవిలో పులులతో పాటు మరెన్నో వన్య ప్రాణులు ఉంటాయి. పక్షుల కిలకిలారావాలతో పాటు, అడవితల్లి అందాలను దగ్గరగా చూడొచ్చు. టైగర్ వ్యాలీ పులులకు నిలయం. ఇక్కడకి వచ్చిన పర్యాటకులు జంగల్ సఫారీ చేస్తుంటారు. ఇక దీనికి తోడు అటవీ అందాలు, పచ్చని ప్రకృతి సోయగాలు ఆహ్లాదకర వాతావరణంలోకి తీసుకెళ్తుంది. అటవీ ప్రాంతం చివరికి చేరుకున్నాక అక్కడి వ్యూ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రకృతి అందాలను చూడడానికి రెండు కళ్ళూ చాలవంటే అతిశయోక్తి కాదు.

Photo Courtesy: Nori Syamsunder Rao

మల్లెల తీర్థం

మల్లెల తీర్థం

మల్లెల తీర్థం అనేది ఒక జలపాతం. ఈ నీరు ఎంతో పవిత్రమైనది అందుకే భక్తులు ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో వచ్చి ఈ జలపాతం వద్ద స్నానాలు చేసి మోక్షం పొందుతారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తించుకోవాలి అదేమిటంటే ఈ నీటిలోకి వెళ్ళాలంటే సుమారుగా 250 మెట్లు దిగి వెళ్ళాలి కనుక చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లేకుంటే జారి పడతారు. అందుకే ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకొని నిదానంగా మెట్లు దిగి వెళ్ళాలి. ఈ జలపాతాలు దట్టమైన అడవుల మధ్యన ఉన్నప్పటికీ రోడ్ మార్గం లో తేలికగా ప్రయాణించవచ్చు. వర్షాకాలం లో మాత్రం రోడ్ సరిగ్గా ఉండదండోయ్.

Photo Courtesy: Vivek Sheel Singh

అక్క మహా దేవి గుహలు

అక్క మహా దేవి గుహలు

అక్క మహాదేవి గుహలు నల్లమలై శ్రేణులలోని కొండలపై శ్రీశైలం కు సుమారు 10 కి. మీ. ల దూరం లో సహజంగా ఏర్పడిన గుహలు. ఈ గుహలకు 12 వ శతాబ్దపు వేదాంతి మరియు కర్ణాటక గాయని అయిన అక్కమహాదేవి అక్కడ గుహల లోపలి భాగాలలో కల సహజ శివలింగం కు తపము , పూజలు చేయుట వలన ఆమె పేరు పెట్టారు. గుహల లో కల రాళ్ళు ఎపుడో భూమి పుట్టిన నాటివి, పురాతనమైనవి ఈ గుహలకు కృష్ణా నది గుండా వెళ్ళడం ఒక మంచి అనుభవం. సుమారు 150 అడుగుల పొడవు వుండే ఈ గుహల సందర్శన మరింత మంచి అనుభవం గా కూడా వుంటుంది.

Photo Courtesy: Anupam Bhattacharyya

రోప్-వే

రోప్-వే

అక్కడి నుండి నేరుగా పాతాళగంగకు బయలుదేరాం. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంటుంది. అదేంటనుకుంటున్నారా? అక్కడి నుండి పాతాళగంగను చేరుకోవడానికి గాల్లో తేలుకుంటు వెళ్ళాల్సి ఉంటుంది. అదెలా అనుకుంటున్నారా? అక్కడి రోప్-వే ఉందిలెండి. మామూలుగా అయితే పాతాళగంగకు వెళ్ళాలంటే 721 మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది. అలా వెళ్ళలేని వారి కోసం టూరిజం శాఖ రోప్-వే ఏర్పాటు చేసింది. రోప్-వేలో ఎక్కి నదీ జలాలను దగ్గరగా తాకుతూ, పచ్చని చెట్ల సోయగాలను ఆస్వాదిస్తూ పాతాళగంగకు చేరుకోవడం జీవితంలో మరిచిపోలేరెవ్వరు. కొద్దిపాటి భయంతో, కాస్త ఎగ్జయిట్-మెంట్-తో కూడిన ఈ రోప్ జర్నీ పర్యాటకులకు మరిచిపోలేని అనుభూతినిస్తుంది. అలా రోప్-వే ద్వారా పాతాళగంగ కు చేరుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక బోటులో పాతాళగంగలో సరదాగా బోటింగ్ చేసినాము.

Photo Courtesy: Shishirdasika

ట్రైబల్ మ్యూజియం

ట్రైబల్ మ్యూజియం

బోటింగ్ చేసి అక్కడి నుండి పక్కనే ఉన్న ట్రైబల్ మ్యూజియం కి చేరుకున్నాము. అలా మ్యూజియంలో కి వెళ్ళగానే శ్రీశైల పుణ్యక్షేత్ర విశిష్టతకు కారణమైన అనేక నిజాలు ఇక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయా అనిపించింది మాకు. ట్రైబల్ మ్యూజియంలో నల్లమల్ల అడవుల్లో స్వామిని నెలకొల్పి నిత్యం పూజలు చేసిన మొదటి శ్రీశైల పూజారి అయిన మల్లన ప్రతిమ, అడవి జాతి అనవాళ్లను కాపాడే గిరిజనుల ప్రతిమలు సహజత్వానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటాయి. వాటన్నింటినీ చూస్తుంటే మాకు స్వచ్ఛమైన అచ్చమైన పల్లెటూరి వాతావరణం కనిపించింది.

Photo Courtesy: Rajdip Mukherjee

శివాజీ స్ఫూర్తి కేంద్ర

శివాజీ స్ఫూర్తి కేంద్ర

శివాజీ స్ఫూర్తి కేంద్ర శ్రీశైలం లో ఒక క్రీడల కేంద్రం గా వుంది. ఈ సెంటర్ చేరాలంటే, సుమారు 30 మెట్లు ఎక్కవలసి వుంటుంది. క్రికెట్, ఫుట్ బాల్ , టెన్నిస్ , బాడ్మింటన్ వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. సెంటర్ యొక్క భవనం ఆకర్షణీయంగా వుండి దానిలో శివాజీ విగ్రహం ఒక సింహాసనం పై కూర్చుని వుంటుంది. ఈ సెంటర్ చుట్టూ అన్నివైపులా సంరక్షణ చేయబడి అక్కడ నుండి లోయ లోని ప్రకృతి దృశ్యాలు మరియు దూరంగా వుండే శ్రీ శైలం డాం ని చూసి ఆనందించేలా వుంటుంది.

Photo Courtesy: shivajikendra

శ్రీశైలం డ్యాం

శ్రీశైలం డ్యాం

శ్రీశైలం డ్యాం నల్లమల కొండలలో ఒక లోతైన మలుపు లో నిర్మించారు. ఈ డ్యాం లోతు మన రాష్ట్రం లోని మిగితా డ్యాం లతో పోలిస్తే చాలా ఎక్కువ. ఈ డ్యాం రాత్రి పూట విద్యుత్ కాంతులతో ధగధగ మెరుస్తూ చూడటానికి వీనులవిందుగా ఉంటుంది. ఈ డ్యాం మీద సాయంత్రం 5 - 6 గంటలైతే నడవనివ్వరు. ఇక చేసేది ఏమీలేక ఆనకట్ట పక్కన కూర్చొని బజ్జీలు తింటూ డ్యాం అందాలను తిలకిస్తూ ఉండిపోతిమి. కారం చుట్టలు, బురుగులు, బజ్జీలు ఇలా అన్ని చిరుతిండ్లు ఇక్కడ లభిస్తాయి.

Photo Courtesy: Sridar

మీరూ ప్లాన్ చేయండి

మీరూ ప్లాన్ చేయండి

ఎన్నో, ఇంకెన్నో ఆసక్తికర విషయాలు, మనసును దోచుకునే అందాల మేళవింపైన ఈ టూర్ మీకు బాగా నచ్చింది కదూ. ఎప్పుడూ వీకెండ్-లో పార్కులకు వెళ్ళీ వెళ్ళీ బోర్ కొట్టిందా? అయితే ప్లాన్ చేసుకొని ఓ రెండు రోజుల పాటు కాంక్రిట్ జంగల్-ను వదిలి ఇలా ప్రకృతి అందాలను ఆస్వాదించండి. అది మీ టెన్షన్స్-ను దూరం చేసి మిమ్మల్ని మీకే కొత్తగా చూపిస్తుంది. ఈ టూర్-కి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువే.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా హైదరాబాద్ టు శ్రీశైలం టూర్ ప్లాన్ చెయ్యండి ప్రకృతి అందాలను ఆస్వాదించండి. ఈ మరుపురాని గుర్తులకి మీ జీవితంలో కూడా చోటు కల్పించండి.

Photo Courtesy: Yug_and_her

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more