Search
  • Follow NativePlanet
Share
» »వేయి స్తంభాల గుడి, హన్మకొండ !!

వేయి స్తంభాల గుడి, హన్మకొండ !!

కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలొ నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు.

By Mohammad

11 వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య కళాపిపాసకు, విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావితరాలకు వారసత్వంగా మిగిలిన వేయి స్తంభాల గుడి వరంగల్ నుండి సుమారు 5 కి.మీ. దూరంలోనూ హనుమకొండ నగరం నడిబొడ్డున కలదు.

కాకతీయుల శిల్పకళా శైలితో అలరారే ఈ త్రికూటాలయంలొ నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగ రూపంలో భక్తుల పాలిట కొంగుబంగారమై కొలువైనాడు. ప్రధానాలయం తూర్పుకు అభిముఖంగా అధ్భుతమైన వాస్తుకళతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖమైయున్న నందీశ్వని విగ్రహం నల్లరాతితో మలచబడినదై కళ్యణ మంటపానికి మరియు ప్రధానాలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తుంది.

వేయిస్తంభాల గుడి

వేయిస్తంభాల గుడి

చిత్రకృప : Devadaskrishnan

ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశించగానే నిలువెత్తు పానవట్టం లేని లింగాలపై కరవీర వృక్షం పుష్పార్చన చేస్తున్నట్టుగా గాలికి రాలే పూవులు సువాసనలు వెదజల్లుతూ లింగాలపై పడే దృశ్యం చూసిన పిమ్మట ఈశాన్య దిశలో అలనాటి కోనేటిని దర్శించవచ్చు. ప్రధానాలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా మూడు ఆలయాలు ఏక పీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడినవి.

ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపరులను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపం మరియు ప్రధానాలయాన్ని కలిపి మొత్తం వేయి స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి వేయి స్తంభాల దేవాలయమనే పేరు ప్రసిద్ధి.

మెట్ల బావి

మెట్ల బావి

చిత్రకృప : NAGA3019

ఆలయ ప్రాంగణంలో మరేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి, నాగ ప్రతిమలు కొలువైనవి. ఆనాటి రహస్య సైనిక కార్య కలాపాలకొరకై ఓరుగల్లు కోట మరియు ఇతర నిగూఢ కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుండి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. ఇటీవల పురావస్తు శాఖ వారి త్రవ్వకాల్లో కల్యాణ మంటపం క్రింద ఒక బావి వెలువడింది.

మాఘ, శ్రావణ మరియు కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేశ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహా శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వెస్తే రాలనంతగా భక్త జన సందోహం రుద్రేశ్వరున్ని దర్షిస్తారు.

హనుమకొండ లో ఇతర దర్శనీయ ప్రదేశాలు

పద్మాక్షి ఆలయం

హనుమకొండ లోని పద్మాక్షి ఆలయం క్రీ.శ. 12 వ శతాబ్దం కాలం నాటిది. దీనిని ఒక కొండపై నిర్మించారు. సంవత్సరంలో కొన్ని రోజులు బతుకమ్మ ఉత్సవాలలో స్త్రీలతో ఈ కొండ ప్రాంతం కిటకిటలాడుతుంది. ఏటా లక్ష మందికి పైగా దేవాలయాన్ని దర్శిస్తుంటారని అంచనా. గుడిలో ప్రధాన దేవత పద్మాక్షి అమ్మవారు.

భద్రకాళి ఆలయం

భద్రకాళి ఆలయం

చిత్రకృప : Warangalite

భద్రకాళి ఆలయం

భద్రకాళి ఆలయం హనుమకొండ, వరంగల్ మధ్య కలదు. దీనిని కూడా కొండ పై కట్టించారు. చాళుక్య వంశీయుడు రెండవ పులకేశి క్రీ.శ. 625 వ సంవత్సరంలో భద్రకాళి దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. గుడిలో ధ్వజస్తంభం, బలిపీఠం, భద్రకాళి అమ్మవారి వాహనం - సింహం వంటివి చూడవచ్చు.

హైదరాబాద్ కు 50 KM దూరంలో మొసళ్ళ శాంక్చురి చూసొద్దామా !!హైదరాబాద్ కు 50 KM దూరంలో మొసళ్ళ శాంక్చురి చూసొద్దామా !!

హనుమకొండ ఎలా చేరుకోవాలి ?

హనుమకొండ చేరుకోవటానికి వ్యయప్రయాసలు పడవలసిన అవసరం లేదు. హైదరాబాద్ నుండి చక్కటి రోడ్డు వ్యవస్థ ను కలిగి ఉన్నది. ఎం జి బి ఎస్ బస్ స్టాండ్ నుండి హనుమకొండ వరకు డైరెక్ట్ గా బస్సు సౌకర్యం కలదు. ఒకేవేళ మీరు వరంగల్ చేరుకున్నాకూడా అక్కడి నుండి హనుమకొండ కు పల్లె వెలుగు బస్సులు నడుస్తుంటాయి. అలాగే జీపులు, ఆటోలు కూడా వరంగల్ నగరం నుండి హనుమకొండ కు వెళుతుంటాయి.

వరంగల్ హోటళ్ళ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఒకవేళ మీరు రైలులో వచ్చేవారైతే, వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగి, అక్కడి నుండి 5 కి. మీ ల దూరంలో ఉన్న హనుమకొండ వరకు ఆటోలో ప్రయాణించవచ్చు. హనుమకొండ సమీపాన ఉన్న విమానాశర్యం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X